టాక్సీ డ్రైవర్‌- చిరాకేసి ఏడుగురిని చంపేశాడు

 

జేసన్‌ బ్రియాన్‌ డాల్టన్... అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓ టాక్సీ డ్రైవర్‌. ప్రతిష్టాత్మక ఉబర్‌ టాక్సీ సంస్థ తరఫున టాక్సీని నడుపుతున్నాడు. శనివారం సాయంత్రం ఎప్పటిలాగే కలమజూ అనే పట్టణంలో టాక్సీని నడుపుతున్నాడు జేసన్‌. ఇంతలో అతనికి ఓ ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌లో విషయం విన్న తరువాత జేసన్‌కి పిచ్చెత్తిపోయింది. ఎర్రలైటు, పచ్చలైటు అని ట్రాఫిక్ సిగ్నెళ్లని పట్టించుకోకుండా కారుని పరుగులెత్తించాడు. తన దగ్గర ఉన్న గన్‌ తీసుకుని దారిన పోయేవారందరినీ కాల్చిపారేయడం మొదలుపెట్టాడు. మొత్తం ఎనిమిది మంది మీద జేసన్‌ కాల్పులు జరపగా వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా ఇద్దరిలో ఒకరు ఆసుపత్రిలో చనిపోయారు.

 

మరొకరు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. చనిపోయినవారిలో ఒక తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. జేసన్‌ శనివారం తెల్లవార్లూ ఇలా కాల్పులు జరుపుతూనే తిరిగాడు. ఎట్టకేళకు అతణ్ని పట్టుకున్న పోలీసులకి ఇదంతా ఎందుకు జరిగిందో మాత్రం అంతుపట్టడం లేదు. ఆ ఫోన్లో జేసన్‌ ఏం విన్నాడో అంతకంటే తెలియడం లేదు. అయితే జేసన్‌కి గతంలో ఎలాంటి నేరప్రవృత్తీ లేదనీ, పోనీ ఇదో తీవ్రవాద చర్య అనుకోవడానికి కూడా ఆధారాలు లేవనీ అంటున్నారు పోలీసులు. అమెరికాలో తుపాకీ సంస్కృతిని అదుపుచేయాలంటూ, ఆ దేశ అధ్యక్షుడు ఒబామా కంటనీరు పెట్టుకున్నా కానీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu