దిల్లీకి దాహం వేస్తోంది!

 

సాక్షాత్తూ రాజధాని దిల్లీలోనే నీళ్లకి కరువొచ్చిపడింది. నీళ్లు లేక ఇవాళ అక్కడ స్కూళ్లని కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది. హర్యానాలో జరుగుతున్న జాట్‌ వర్గపు గొడవల వల్ల తలెత్తిన పరిణామమిది. తమకి రిజర్వేషన్లను కల్పించాలంటూ జాట్‌వర్గం వారు తలపెట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా వారు దిల్లీకి మంచినీటిని అందించే మునక్‌ అనే కాలువ వద్ద ఉన్న యంత్రాలను కూడా ధ్వంసం చేసి పారేశారు.

 

దీంతో యమునానది నుంచి మునక్‌ కాలువ ద్వారా దిల్లీకి చేరుకునే కోట్ల గ్యాలన్ల కొద్దీ నీటి సరఫరా కాస్తా నిలిచిపోయింది. దిల్లీలో ఉండే ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి కొందరు పెద్దల నివాసాలకు తప్ప మిగతా నగరమంతటికీ కూడా నీటి సరఫరాలో కోతని విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతానికి మునక్‌ కాలువని ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో రేపు ఉదయానికల్లా దిల్లీకి తగినంత నీరు అందే అవకాశం ఉంది. మొత్తానికి జాట్‌ ఆందోళన వల్ల దిల్లీకి కూడా దాహం తప్పడం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu