మీరు ఏసీల్లో కూర్చుంటే మేం పనిచేసిపెట్టాలా?- సుప్రీంకోర్టు
posted on Feb 22, 2016 4:05PM
.jpg)
గత వారంరోజులుగా హర్యానాలో జాట్ వర్గానికి సంబంధించిన ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే! జాట్ వర్గంవారు తమ ఆందోళనలో భాగంగా యమునా నది నుంచి దిల్లీకి వెళ్లే మునక్ కాలువని బంధించారు. అక్కడి నీటి యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ విషయంలో దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం హర్యానాతో చర్చించాల్సింది పోయి సుప్రీం కోర్టు తలుపు తట్టింది. దాంతో ఉన్నత న్యాయస్థానానికి ఒళ్లు మండిపోయింది.... అంతే!
‘ప్రభుత్వాలు రెండూ కూర్చుని తేల్చుకోవాల్సిన చోట, మా ఆదేశాల కోసం ఎందుకు వస్తారు. మీకు అన్నీ పళ్లెంలో అందించాలా’ అంటూ మండిపడింది. అంతేకాదు- కోర్టులో కూర్చుని ఉన్న దిల్లీ మంత్రి కపిల్ మిశ్రాను చూసి ‘మీరు చక్కగా పని చేసుకోకుండా కోర్టుల్లో కాలక్షేపం చేస్తారెందుకు? మీరు ఏసీ గదుల్లో కూర్చుని ఉంటే మీ కోసం కోర్టులు ఆదేశాలు జారీ చేస్తూ ఉండాలా?’ అని చిరాకు పడిపోయింది. ఈ సందర్భంగా హర్యానా తరఫు న్యాయవాది, మునక్ కాలువ జాట్ వర్గం చేతుల్లో ఉందనీ, దానిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న వెంటనే నీటిని పునరుద్ధరిస్తామనీ హామీ ఇచ్చారు. ఈ మాటలేవో బయట చెప్పుకుంటే, కోర్టు చేతిలో అక్షింతలు తప్పేవి కదా!