ఆచార్య ఎస్.వి.రామారావు కన్నుమూత

ప్రముఖ సాహితీ విమర్శకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మాజీ ప్రొఫెసర్ ఆచార్యులు, ఆర్ట్స్ మాజీ  డీన్ ఆచార్య ఎస్.వి.రామారావు ఇక లేరు. తీవ్ర  అస్వస్థతతో బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం హైదరాబాదులో కన్నుమూశారు.

 1941 జూన్ 5న వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లో జన్మించిన ఆచార్య ఎస్వీ రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యాపకుడిగా 1966  చేరారు. 

ఆచార్యుడిగా, శాఖ అధ్యక్షుడిగా పాఠ్యాంశ నిర్ణాయక మండలి అధ్యక్షుడిగా,ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ గా సేవలందించి 2001లో పదవీ విరమణ చేశారు.

 డాక్టర్ సి నారాయణ రెడ్డి పర్యవేక్షణలో తెలుగులో సాహిత్య విమర్శ-అవతరణ వికాసాలు అనే అంశంపై పరిశోధన చేసి 1973లో డాక్టరేట్ పొందారు. 23 గ్రంథాలు వెలువరించారు.

 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య విమర్శ పురస్కారాన్ని, శ్రీకృష్ణదేవరాయ భాషనిలయం నుంచి దాశరథి పురస్కారాన్ని, జీవీఎస్ సాహిత్య పీఠం నుంచి విమర్శ పురస్కారాన్ని ,బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారాన్ని, బి.ఎన్.శాస్త్రి పురస్కారం,సారస్వత పరిషత్తు పురస్కారం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం వంటి అనేక గౌరవాలు అందుకున్నారు.  ఆయన పర్యవేక్షణలో 19  మంది పిహెచ్డీ పరిశోధన, 15 మంది ఎంఫిల్ పరిశోధన పూర్తి చేశారు.

 తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యునిగా, ట్రస్టు సభ్యునిగా, కేంద్ర సాహిత్యకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎస్.వి.రామారావు సేవలందించారు.

 ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమెరికా నుంచి గురువారం (సెప్టెంబర్ 18) రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ఎస్వీ రామారావు అంత్యక్రియలు శుక్రవారం (సెప్టెంబర్ 19) న జరుగుతాయి. 

ఆచార్య ఎస్వీరామారావు మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి, డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు, ట్రస్టు సభ్యుడు చింతపల్లి వసుంధరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సారస్వత పరిషత్కు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu