వంటలక్క దెబ్బకు మోనితలో వణుకు!

  డాక్టర్ బాబు, వంటలక్క కుటుంబంలో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా... డాక్టర్ బాబు చేత తన మెడలో మూడు ముడులు వేయించుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మోనిత, మరో ఘాతుకానికి ఒడి కట్టింది. డాక్టర్ బాబు తండ్రి ఆనందరావుతో 'మీ అబ్బాయి వల్ల నేను గర్భవతి అయ్యాను' అని చెబుతుంది. దాంతో పెద్దాయనకు గుండెపోటు వస్తుంది. అంతకు ముందు రిజిస్టర్ ఆఫీసులో కలుద్దామని పిలుస్తుంది. తనకు వాళ్ల‌బ్బాయితో పెళ్లి చేయమంటుంది. ఆయన అంగీకరించడు.  'ఈ 25వ తేదీన మీ అబ్బాయి నా మేడలో తాళి కట్టకపోతే మీ పరువు ప్రతిష్టలు రోడ్డున పడతాయి' అని ఆనందరావును మోనిత బెదిరిస్తుంది. అప్పుడు గర్భవతి అయిన విషయం చెబుతుంది. తన కడుపులో బిడ్డకు తండ్రి మీ అబ్బాయేనంటూ ఆనందరావుకు చెప్పడంతో ఆయనకు గుండెపోటు వస్తుంది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ బాబు, వంటలక్క రిజస్టర్ ఆఫీసుకు చేరుకుంటారు. కోడలికు ఆనందరావు క్షమాపణ చెబుతాడు. తర్వాత ఆయన్ను ఆసుపత్రిలో చేరుస్తారు. కొడుకు చేత ట్రీట్మెంట్ చేయించుకోవడం తనకు ఇష్టం లేదని ఆనందరావు చెబుతారు. స్నేహితుడు గోవర్థన్ చేత తండ్రికి ట్రీట్మెంట్ చేయిస్తాడు డాక్టర్ బాబు. తర్వాత అక్కడ నుండి భార్యతో కలిసి బయటకు వెళ్లాలని బయలుదేరతాడు. ఈలోపు వాళ్ళను మోనిత ఆపుతుంది.  'అర్జెంట్ పని ఉంది. అరగంటలో వచ్చేద్దాం పదా' అని డాక్టర్ బాబు భుజం మీద మోనిత చేయి వేస్తుంది. అతడు తిడతాడు. అయినా పట్టించుకోకుండా కౌగిలించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వంటలక్క 'వెళ్ళండి డాక్టర్ బాబు. అది మిమ్మల్ని పెళ్లి పనులకు పిలుస్తుంది. నేను దాని పెళ్లి పెటాకులు చేసే పనులకు తీసుకువెళ్లాలని అనుకున్నాను. నేను వెళ్తాను గానీ మీరు దాంతో వెళ్ళండి. ఇప్పుడు అంజి ఉన్నట్టయితే బావుండేది' అని అంటుంది. దాంతో మోనితలో వణుకు మొదలవుతుంది. తర్వాత ఏమైందనేది తరువాయి ఎపిసోడ్‌లో చూడాలి.  

'ఆహా'కు కాదు... 'జీ5'కు మరో మెగా డాటర్ వెబ్ సిరీస్!

  అల్లు అరవింద్ భాగస్వామిగా అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ ఆహా మొదలైంది. అల్లు అరవింద్ తనయుడు, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అల్లు, కొణిదెల కుటుంబాలకు చెందిన మెగా ఫ్యామిలీ స్టార్స్ అందరూ 'ఆహా' కోసం పని చేసే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు ఆశించారు. కానీ, వాస్తవం వేరుగా ఉంది. ఆహా కోసం కాకుండా మరో ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ జీ కోసం మెగా డాటర్స్ వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు'తో నిర్మాతగా మారారు. ఆ వెబ్ సిరీస్‌ను 'జీ 5'కు ఇచ్చారు. ఇప్పుడు మరో మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారికా కొణిదెల ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇదీ 'జీ 5' కోసమే.  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించిన నిహారిక గతంలో వెబ్ సిరీస్ లు నిర్మించారు అందులో రెండు 'ముద్దపప్పు ఆవకాయ్', 'మ్యాడ్ హౌస్' యూట్యూబ్‌లో విడుదలైతే... మరొకటి 'నాన్న కూచి' జీ5లో విడుదలైంది. ఇప్పుడీ కొత్త వెబ్ సిరీస్‌నూ 'జీ 5' కోసం నిర్మిస్తున్నారు. #OCFS టైటిల్ తో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. గురువారం ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.

శ్రీముఖీ... ఇంతున్నావ్, నువ్ తగ్గు ముందు!

  కామెడీలో బాడీ షేమింగ్ కూడా ఓ భాగమైంది. ముఖ్యంగా టీవీ షోల్లో కామెడీ కోసం ఎదుటివ్యక్తి బాడీని విమర్శించడం పరిపాటిగా మారింది. రీసెంట్‌గా 'జబర్దస్త్'లో వర్ష బ్లౌజ్ మీద ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశాడు. ఇక, 'హైపర్' ఆది స్కిట్స్‌లో బాడీ షేమింగ్‌ను జనాలు పట్టించుకోవడం మానేసి నవ్వడం మొదలు పెట్టారని అనుకోవాలేమో. ఇప్పుడు టీవీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సద్దాం వంతు వచ్చింది. శ్రీముఖి బరువును ఉద్దేశిస్తూ అతడు పంచ్ వేశాడు.  'స్టార్ మా' ఛానల్‌లో సీరియల్ ఆర్టిస్టులు అందరిచేత ఒక ప్రోగ్రామ్ చేశారు. అదే 'స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్'. ప్రేక్షకులు మెచ్చిన బుల్లితెర ఆర్టిస్టులు అందరూ ఒక్కచోట సందడి చేయనున్నారు. ఆ షో సండే ఆరు గంటలకు టెలికాస్ట్ కానుంది. ప్రేక్షకులకు ఎంజాయిమెంట్ మామూలుగా ఉండదని చెప్పే క్రమంలో 'తగ్గేదే లే' అని శ్రీముఖి చెప్పింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'ఇంత ఉన్నావ్. నువ్ తగ్గు ఫస్టు' అని సద్దాం పంచ్ వేశాడు. టీవీ షోల్లో ఇవన్నీ కామన్ కాబట్టి శ్రీముఖి లైట్ తీసుకున్నట్టు ఉంది.  రీసెంట్ గా రిలీజైన ప్రోమోలో హైలైట్ ఏంటంటే... 'డాక్టర్ బాబు మీరు తగ్గాలి. పెళ్లిళ్ల విషయంలో తగ్గాలి' అని శ్రీముఖి చెప్పింది. 'కార్తీక దీపం' సీరియల్ లో సంగతులను గుర్తు చేస్తూ! అందుకు 'తగ్గేదే లే' అని నిరుపమ్ పరిటాల జవాబు ఇచ్చాడు. 'తెలుసు తెలుసు... ఎన్ని అయినా తగ్గవ్' అని మరో ఆర్టిస్ట్ అనడం కొసమెరుపు.   

ఓంకార్ దెబ్బ‌కు గుండెపోటు! కాళ్ల‌కు దండంపెట్టిన పోసాని!!

  నటనలో, డైలాగ్ డెలివరీలో పోసాని కృష్ణమురళిది టిపికల్ స్టయిల్. ఆయనలా మరొకరు చేయలేరు. సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈమధ్య టీవీల్లోనూ కనిపిస్తున్నారు. కొన్ని కామెడీ షోలకు గెస్టుగా వస్తున్నారు. వినోదం అందిస్తున్నారు. కమింగ్ వీకెండ్ 'సిక్త్స్ సెన్స్' ఎపిసోడ్‌కు వచ్చిన ఆయన తనదైన శైలిలో కామెడీ చేయనున్నారని ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.  ఒకసారి 'సిక్త్స్ సెన్స్' హోస్ట్ ఓంకార్ కాళ్లు పట్టుకోవడానికి పోసాని వెళ్లారు. 'వన్ సెకండ్' అంటూ గేమ్ షోలో టెన్షన్ బిల్డ్ చేయడం ఓంకార్ స్టయిల్. అందుకు పోసాని వేసిన పంచ్ డైలాగులు, చేసిన పనులు నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. శివశంకర్ మాస్టారుతో 'నీకు ఆల్రెడీ ఒకసారి బైపాస్ జరిగింది. ఆయన దెబ్బకు నాకు బైపాస్ రెడీగా ఉంది' అని పోసాని అన్నారు. పోసాని డైలాగ్స్‌కు, చేష్ట‌ల‌కు ఓంకార్ సైతం తెగ న‌వ్వేశాడు. 'నాకు రెండోసారి వస్తుంది ఏమో అని డౌట్ గా ఉంది' అని శివశంకర్ అంటే... 'నీకు రెండోసారి రాదు ఇంక. అవుటే' అన్నారు. షో షూటింగ్ జరిగే దగ్గర అంబులెన్స్ రెడీగా ఉంటుందని పోసాని అంటే... 'అది కరెక్ట్' అని శివశంకర్ మాట కలిపారు. ఇప్పటివరకు షోకు వచ్చిన గెస్టులు ఒక ఎత్తు... పోసాని, శివశంకర్ కాంబినేషన్ మరో ఎత్తు.  

అషు అక్కా... వాడు నీపక్కన బాలేడు!

  'కామెడీ స్టార్స్'లో హరి, అషురెడ్డి మధ్య లవ్ ట్రాక్స్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ సెట్ అయినట్టే కనబడుతోంది. హరి తన గుండెలపై అషురెడ్డి పేరును టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. అది రియల్ టాటూ అని తెలిసి, షోలో అతడిని అషురెడ్డి చాచిపెట్టి కొట్టింది. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అది రియల్ టాటూ అని చెప్పుకొచ్చింది. ప్రోగ్రామ్ లో మాత్రమే కాదు, రియల్ గానూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సెట్ అయినట్టు ఉంది.  హరి, అషురెడ్డి కెమిస్ట్రీ రీల్స్‌కు ఎక్కింది. రీసెంట్‌గా ఇద్దరూ కలిసి ఒక రీల్ చేశారు. అందులో కూడా హరిని అషురెడ్డి చాచిపెట్టి కొట్టడం విశేషం. పైకి గట్టిగా కొట్టినట్టు కనిపించినా... ప్రేమతో కొట్టిందని అది చూస్తుంటే తెలుస్తుంది. రీల్ కాన్సెప్ట్ అటువంటిది మరి. అయితే, సోషల్ మీడియాలో కామెంట్స్ మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి.  'మీరిద్దరూ నిజంగా లవర్సా?' అని ఒకరు ప్రశ్నించారు. ఇంకొకరు వీళ్ళిద్దరిదీ పబ్లిసిటీ స్టంట్ కింద కొట్టి పారేశారు. అషురెడ్డి, హరి ప్రేమలో ఉన్నారని ఇద్దరు ముగ్గురు కామెంట్లు చేశారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అన్నారొకరు. ఒక్కరు మాత్రం 'అక్కా.. వాడు నీ పక్కన బాలేడు' అని కామెంట్ చేయడం గమనార్హం.  

"ఛాటింగ్స్‌లో రొమాన్స్ ఉంటుంది, స్టేజి మీద లేదు".. ఓపెన్ అయిన నైనిక‌!

  'ఢీ' షో ప్రతిభావంతులైన, ఔత్సాహిక డాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు గొప్ప వేదికగా నిలవడం మాత్రమే కాదు, కొంతమంది ప్రేమికులకు అడ్డాగా కూడా మారుతోంది. గతంలో కంటెస్టెంట్లు ఐశ్వర్య, బాబీ ప్రేమలో పడ్డారు. మరి ఇప్పుడు ప్రేమలో ఉన్నారో లేదో తెలియదు. అలాగే, కాస్ట్యూమ్ డిజైనర్ తో పండు ప్రేమ కొనసాగుతోంది. లేటెస్ట్ 'ఢీ' సీజన్ విషయానికి వస్తే... సాయి, నైనిక ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది. లేటెస్టుగా రిలీజైన ప్రోమోలో అది బయటపడింది. నెక్స్ట్ వీక్, జూలై 28న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా 'ఆచార్య'లోని 'లాహే లాహే...' పాటకు నైనిక పెర్ఫామ్‌ చేసింది. తర్వాత సాయితో కలిసి 'సామజ వరగమన' పాటకు ఆమెతో డాన్స్ చేయించారు. బహుశా... వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని 'ఢీ' టీమ్ దగ్గర ముందే సమాచారం ఉన్నట్టు ఉంది.  డాన్స్ చేశాక... 'మీరిద్దరూ భయపడుతున్నారు. ఫ్రీగా ఉండటం లేదు' అని ప్రదీప్ అన్నాడు. 'నేను ఓకే. వాడే నెర్వస్ గా ఉన్నాడు. కాల్స్‌లో, ఛాట్స్‌లో చాలా రొమాన్స్ ఉంటుంది. ఇక్కడ లేదు' అని నైనిక చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ప్రియమణి సహా స్టేజి మీదున్న కంటెస్టెంట్లు సైతం నోరెళ్ళబెట్టి చూశారు. ఈ ఒక్క సందర్భం చాలదూ... వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పడానికి. 

'హిట్లర్ గారి పెళ్ళాం' టైమింగ్ మార్చడం నిరుప‌మ్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు!

  'అమ్మ చేసిన త్యాగం కూతురికి అర్హతగా దక్కుతుందా?' - కొన్ని రోజులుగా ఒక్క హుక్ డైలాగ్, ప్రోమో 'జీ తెలుగు' ఛానల్‌లో ప్రతి సీరియల్ మధ్య వినపడుతోంది. జూలై 26 నుండి టెలికాస్ట్ కానున్న 'స్వర్ణ ప్యాలెస్'కు విపరీతమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది.  అయితే, మరి ఆ సమయంలో వస్తున్న 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ సంగతేంటి? అంటే.... దాని టైమింగ్‌ను మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మార్చారు. 'రామ చక్కని సీత'ను పన్నెండింటికి ప్రసారం చేయనున్నారు. 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ అభిమానులకు టైమింగ్ మార్చడం ఎంతమాత్రం ఇష్టం లేదు. సోషల్ మీడియాలో సీరియల్స్ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నట్టు 'జీ తెలుగు' పేర్కొంది. కొంతమంది అభిమానుల నుండి వెంటనే నిరసన వ్యక్తం అయింది. కామెంట్స్ సెక్షన్ లో 'హిట్లర్ గారి పెళ్ళాం' టైమింగ్ చేంజ్ చేయవద్దని చాలామంది చెప్పారు.  మరి, వాళ్ళ అభ్యర్థనను ఛానల్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. 'స్వర్ణ ప్యాలెస్'తో కొంత విరామం తర్వాత చందన శేగు మళ్ళీ తెలుగు టీవీకి వస్తున్నారు.   

త‌మిళ బుల్లితెర‌పై దూసుకుపోతున్న తెలుగ‌మ్మాయి!

  త‌మిళ కొత్త సీరియ‌ల్ 'అభి టైల‌ర్‌'తో ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు రెడీ అయ్యింది తెలుగ‌మ్మాయి రేష్మ ప‌సుపులేటి. త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా త‌న ఉద్వేగాన్ని అభిమానుల‌తో పంచుకుంది. 'అభి టైల‌ర్‌' సీరియ‌ల్‌లో ఆమె మ‌ద‌న్ పాండ్య‌న్ పోషిస్తోన్న హీరో అశోక్‌కు సోద‌రిగా న‌టిస్తోంది. జూలై 19న ప్ర‌సార‌మైన ఎపిసోడ్ నుంచే అనామిక పాత్ర‌తో రేష్మ వీక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సీరియ‌లో న‌టిస్తోన్న తోటి న‌టుల‌తో క‌లిసున్న ఫొటోను షేర్ చేసిన ఆమె, “My squad my favorites #abhitailor so glad to be a part of this awesome project do watch #abhitailor at 10 pm mon to sat (sic)” అని రాసుకొచ్చింది.  రేష్మ తండ్రి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ అయిన ప‌సుపులేటి ప్ర‌సాద్‌. ఆమె కంప్యూట‌ర్ సైన్స్‌లో ఇంజ‌నీరింగ్ చేసింది. మొద‌ట మా టీవీలో ప్ర‌సార‌మైన 'ల‌వ్' సీరియ‌ల్‌లో డాక్ట‌ర్ దివ్య పాత్ర‌తో బుల్లితెర‌పై అడుగుపెట్టింది. ఆ సీరియ‌ల్ చేస్తున్న టైమ్‌లోనే జెమిని టీవీలో 'వంటింట్లో వండ‌ర్స్' ప్రోగ్రామ్‌తో యాంక‌ర్‌గా మారింది. టీవీ 5లో ఇంగ్లిష్ న్యూస్ ప్రెజెంటర్‌గా ప‌నిచేసింది.  2013లో స‌న్ టీవీ సీరియ‌ల్ 'వాణి రాణి'తో త‌మిళ బుల్లితెర‌పై అడుగుపెట్టింది రేష్మ‌. ఆ సీరియ‌ల్‌తో మంచి పేరు రావ‌డంతో, వ‌రుస‌గా త‌మిళ సీరియ‌ల్స్‌లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇంత‌దాకా ప‌ద‌మూడు సీరియ‌ళ్ల‌లో కీల‌క పాత్ర‌లు చేసింది. ఓ వైపు సీరియ‌ల్స్ చేస్తూ, ఇంకోవైపు త‌మిళ సినిమాల్లోనూ న‌టించింది రేష్మ‌. 2015లో వ‌చ్చిన 'మ‌సాలా ప‌డ‌మ్' ఆమె తొలి త‌మిళ చిత్రం. బిగ్ బాస్ త‌మిళ్ 3లో పాల్గొన్నాక ఆమె పాపులారిటీ మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం ఆమె 'వేల‌మ్మ‌ల్' సీరియ‌ల్‌లో నాగ‌వ‌ల్లిగా, 'బాగ్య‌ల‌క్ష్మి'లో రాధిక‌గా, 'అన్బే వా'లో వంద‌న‌గా న‌టిస్తోంది. 

రష్మీ నోట 'మెరిసింది మేఘం'... ఆశ్చర్యంలో ప్రేక్షకలోకం!

రష్మీ గౌతమ్ యాంకరింగ్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లు దాటుతోంది. అయినా తెలుగులో డైలాగులు చెప్పడానికి ఆమె తడబడుతూ ఉంటుంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... హైపర్ ఆది స్కిట్‌లో పెళ్లి కుమార్తె గెటప్ వేసింది చెప్పుకోవచ్చు. 'సుధీర్.. బుల్లితెరలో దూసుకువెళ్ళే నన్ను' అని డైలాగ్ చెప్పాలి. అందులో బుల్లితెరను బల్లితెర చేసేసింది. 'అమ్మా నీకు దణ్ణం పెడతా. అది బల్లితెర కాదు. బుల్లితెర' అన్నాడు ఆది. అప్పుడు 'నన్ను ఇక్కడికి పిలిచి కించపరుస్తారా?' అనబోయి 'కిందపరుస్తున్నారు' అన్నది రష్మీ. చెప్పుకొంటూ వెళితే తెలుగు డైలాగులకు రష్మీ తెగులు పట్టించిన సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి రష్మీ ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  ఆషాడం సందర్భంగా 'జీ తెలుగు' ఛానల్ 'ఆషాడంలో అత్తాకోడళ్లు' అని ఒక ఈవెంట్ చేసింది. అందులో సంగీత, రష్మీ గౌతమ్ సందడి చేయనున్నారు. ఇద్దరూ పాటలకు స్టెప్పులు వేశారు. అంతే కాదు, రష్మీ ఓ అడుగు ముందుకు వేసి 'మెరిసింది మేఘం...' సాంగ్ పాడింది. లేటెస్ట్ గా రిలీజైన ఈ ప్రోమో చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. సంగీత అయితే 'అబ్బబబ్బబా... ఇలాంటి మంచి సింగింగ్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్' అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రోమో కింద కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. రష్మీ సింగింగ్ బావుందని కొందరు, చాలాబాగా పాడిందని ఇంకొందరు ప్రశంసించారు. ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఫుల్ సాంగ్ ఎలా పాడిందో వినొచ్చు, చూడొచ్చు. 

భర్త అరెస్ట్... టీవీ షూటింగ్‌కు శిల్పాశెట్టి గైర్హాజరు

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ హీరోయిన్ శిలాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ ఓ టీవీ షో షూటింగ్ మీద కూడా ప్రభావం చూపింది. అప్పటికప్పుడు డాన్స్ రియాలిటీ షో నిర్వాహకులు శిల్పాశెట్టికి బదులు, ఆమె స్థానంలో ఎవర్ని కూర్చోబెట్టాలా? ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు? అని వెతుక్కోవాల్సి వచ్చింది. అసలు, వివరాల్లోకి వెళితే... డాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్స్ చాప్టర్ 4'లో శిల్పాశెట్టి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం షో షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే, సోమవారం రాత్రి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంతో శిల్పాశెట్టి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టలేదు. ఆమె పరిస్థితి అందరూ అర్థం చేసుకోదగినదే. ఏ మహిళ అయినా సరే భర్తను అరెస్ట్ చేస్తే ఆనందంగా సెట్స్ కు వచ్చి షూటింగ్ ఎలా చేస్తారు. పైగా, అరెస్ట్ చేసినది పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో. దాంతో షూటింగ్ కు రాలేనని శిల్పాశెట్టి చెప్పారట. గైర్హాజరు అయ్యారు.  శిల్పాశెట్టి స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ కరీష్మా కపూర్ ను గెస్ట్ జడ్జ్ గా తీసుకొచ్చి షూటింగ్ కంప్లీట్ చేశారు 'సూపర్ డాన్స్ చాప్టర్ 4' నిర్వాహకులు. ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ కు శిల్పాశెట్టి అందుబాటులో ఉండరు? కరీష్మా కపూర్ తో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

పాతికేళ్ల క్రితమే నాగార్జున పాన్ ఇండియా సినిమా... ఎందుకు ఆగింది?

'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన హీరోలు, దర్శక నిర్మాతల సంఖ్య చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. 'హరిహర వీరమల్లు', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'లైగర్' వంటివన్నీ పాన్ ఇండియా సినిమాలు. అయితే, పాతికేళ్ల క్రితమే నాగార్జున హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లానింగ్ జరిగింది. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. కానీ, చివర్లో సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు ఆగింది. పాతికేళ్ల క్రితమే నాగార్జున కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి. సినిమాటోగ్రాఫర్ అయిన గోపాల్ రెడ్డి నిర్మాత కూడా! 'హలో బ్రదర్' తర్వాత నాగార్జునతో పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నారు. 'అంతం' హిందీలో 'ద్రోహి' పేరుతో విడుదల కావడంతో ఉత్తరాది ప్రేక్షకులకు నాగార్జున పరిచయమే. అంతకు ముందు 'ఖుదా గావా' సినిమాలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవితో కలిసి నటించారు.  సో, నాగార్జునతో పాన్ ఇండియా సినిమా లాభసాటి వ్యాపారమే. అయితే, 'హలో బ్రదర్' విడుదల తర్వాత హీరోకు ఒక ఇమేజ్ వచ్చింది. అందుకు తగ్గట్టు  స్క్రిప్ట్ లో చివరి ఎపిసోడ్స్ మార్చమని అడిగితే... దర్శకుడు ఒక్క ముక్క కూడా మార్చనని, అలాగ అయితేనే సినిమా చేస్తానని చెప్పడంతో పక్కన పెట్టేశామని ఎస్. గోపాల్ రెడ్డి చెప్పారు. ఆ దర్శకుడు ఎవరనేది తెలియాలంటే ఈ వారం ప్రసారమయ్యే 'అలీతో సరదాగా' చూడాలి.   ఎస్. గోపాల్ రెడ్డి అతిథిగా వచ్చిన 'అలీతో సరదాగా' ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. అందులో రాఘవేంద్రరావుగారు తప్ప తనతో పనిచేసిన దర్శకులు అందరూ తిట్లు తిన్నవాళ్ళేనని గోపాల్ రెడ్డి చెప్పారు.

'అంతఃపురం'లో పాటొస్తే సాయికుమార్ భార్యకు కోపం ఎందుకంటే?

'అసలేం గుర్తుకు రాదు... నా కన్నుల ముందు నువ్వు ఉండగా' - కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'అంతఃపురం' సినిమాలో ఈ పాట సూపర్ హిట్. దానిని సాయికుమార్, సౌందర్యపై తెరకెక్కించారు. టీవీల్లో ఈ పాట వచ్చినప్పుడల్లా సాయికుమార్ భార్య సురేఖకు కోపం వస్తుంది. ఇదే విషయం డైలాగ్ కింగ్ ఎప్పుడూ కుటుంబ సభ్యులతో చెబుతుంటారట. ఎందుకు అంటే? 'అసలేం గుర్తుకు రాదు' పాట వచ్చిన ప్రతిసారీ తనను డాన్స్ చేయమని సాయికుమార్ అడుగుతుండటంతో కోపం వస్తుందని సురేఖ చెప్పారు. సాయికుమార్ 60వ పుట్టినరోజు సందర్భంగా 'వావ్' షోకు ఫ్యామిలీ మెంబర్స్ గెస్టులుగా వచ్చారు. అప్పుడు ఈ సంగతి సురేఖ బయటపెట్టారు.  సాయికుమార్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను 'బొమ్మాళీ' రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తల్లి వేడినీళ్లు పోయడంతో సాయికుమార్ చెయ్యి పక్షవాతం వచ్చిన వ్యక్తి చేతిలా అయ్యిందట. అప్పుడు ఒక డాక్టర్ క్రికెట్ ఆడమని చెప్పడంతో ఆడారట. బౌలింగ్ చేయడంతో మళ్ళీ సరి అయ్యిందట. ఇంకా సాయికుమార్ ఫ్యామిలీలో పలు సంగతులను 'వావ్' షోలో ఆయన కుటుంబ సభ్యులు పంచుకున్నారు. తమ్ముళ్లు, చెల్లెళ్లు, పిల్లలు అందరూ షోకు వచ్చారు. ఆది సాయికుమార్ భార్య అరుణతో 'కోడలు అయిన తర్వాత భయం అన్నది పోవాలి' అని సాయికుమార్ అనడంతో ఆమె నవ్వేసింది.

మ‌ల్లెమాల ఆస్థాన యాంక‌ర్ రష్మీ వేరే ఛానల్ షో చేస్తే ప్రాబ్లమ్ లేదా?

  యాంకర్ కాకముందు రష్మీ గౌతమ్ సినిమాల్లో నటించారు. యాంకర్ అయిన తర్వాత బోల్డ్ సినిమాలతో హాట్ టాపిక్ అయ్యారు. అయితే, ఆమెకు క్రేజ్ వచ్చింది మాత్రం 'జబర్దస్త్' కామెడీ షో వల్లే అనేది ఎవరూ కాదనలేరు. ప్రతి శుక్రవారం షోలో కనిపించడం వల్ల ఆమెకు అంత క్రేజ్. దాని తర్వాత 'ఢీ'లో ఆమెకు మల్లెమాల టీమ్ ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు రష్మీ అంటే  'జబర్దస్త్', 'ఢీ' యాంకర్ అన్నంతలా ముద్ర పడింది. మల్లెమాల ఆస్థాన యాంకర్ అనిపించుకున్న రష్మీ, జీతెలుగుకు వస్తే ప్రాబ్లమ్ లేదా? అని టీవీ కమెడియన్లు కొందరు ఆఫ్ ది రికార్డ్ కామెంట్లు చేస్తున్నారట.  'ఆషాడంలో అత్తాకోడళ్ళు' అని జీతెలుగు ఛానల్ ఒక ఈవెంట్ చేసింది. జూలై 25న ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. అందులో రష్మీ, సీనియర్ హీరోయిన్ సంగీత సందడి చేశారు. హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రష్మీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దాన్ని ప్రోమోలో హైలైట్ చేశారు. ప్రజెంట్ ఈటీవీ, జీతెలుగు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరి, రష్మీ ఆ ఛానల్ షో చేస్తే ప్రాబ్లమ్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.  నాగబాబు సహా కొంతమంది జబర్దస్త్ కంటెస్టెంట్లు, అప్పటి 'జబర్దస్త్' డైరెక్టర్లు జీతెలుగుకు వెళ్లి 'అదిరింది' చేయడంతో వివాదం మొదలైంది. అప్పటి నుండి తమ దగ్గర చేసేవాళ్ళ నుండి 'జబర్దస్త్' ప్రొడ్యూసర్లు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. యాంకర్లకు మాత్రం  లేవు. అప్పట్లో అనసూయ 'జబర్దస్త్'తో పాటు జీతెలుగు షోలు చేసింది. దానిపై హైపర్ ఆది ఒక స్కిట్ లో కౌంటర్లు కూడా వేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు జీతెలుగులో అనసూయ కనిపించలేదు. 'ఢీ'లో జడ్జ్ అయినటువంటి శేఖర్ మాస్టర్ వేరే ఛానల్ షోలు చేస్తుండటం వల్ల 'ఢీ' నుంచి తప్పించారన్నది ఒక టాక్.

రాకేష్ ముద్దుతో రోహిణి షాక్! రిహార్స‌ల్స్‌లో లేని సీన్ స్టేజ్ మీద‌!!

  'జబర్దస్త్'లో అబ్బాయిలు లేడీ గెటప్స్ వేసినన్ని రోజులు ఎటువంటి విచిత్రాలు చోటు చేసుకోలేదు. లేడీ గెటప్స్ కాకుండా డైరెక్టుగా అమ్మాయిలతో యాక్ట్ చేయించడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఛాన్స్ దొరికిందని అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దులు పెట్టేస్తున్నారు.  రీసెంట్‌గా ఒక స్కిట్‌లో వర్ష చేతిని భాస్కర్ ముద్దాడాడు. వెనుక ఉన్న ఇమ్మాన్యుయేల్ 'ఇందుకేనా భాస్కర్? గొడవ పడి మరీ టీమ్‌ను మార్చింది?' అని అడిగాడు. స్కిట్‌ ప్రాక్టీసులో ముద్దు పెట్టుకోవడం లేదని, స్టేజి మీదకు వచ్చాక చేశాడని ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాకింగ్‌ రాకేష్ వంతు వచ్చింది. తన టీమ్‌లో రోహిణికి సడన్‌గా ముద్దు పెట్టేశాడు. దాంతో షాక్ అవ్వడం రోహిణి వంతు అయ్యింది.  నెక్స్ట్ 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్‌లో ఉద్యోగం కోసం భార్యభర్తలు కాపోయినా భార్యాభర్తలుగా నటించే జంటగా రోహిణి, రాకేష్ నటించారు. భార్యాభ‌ర్త‌లైన వాళ్ల‌కు త‌న ఆఫీసులో ఉద్యోగ‌మిస్తాన‌ని రాజ‌మౌళి చెప్తే.. ఆ ఇద్ద‌రూ అక్క‌డ‌కు వ‌స్తారు. 'మీరు ఇద్దరు భార్యాభర్తలుగా లేరు' అన్నట్టు రాజ‌మౌళి సందేహంగా చూడ‌టంతో.. రోహిణిని దగ్గరకు తీసుకుని, బుగ్గ‌మీద బుగ్గ‌పెట్టి ముద్దు పెట్టేశాడు. దాంతో రోహిణి అవాక్క‌యిపోయింది. ఆమె ఎక్స్‌ప్రెషన్ చూస్తే స్కిట్ ప్రాక్టీసులో అది లేదని క్లియర్ గా తెలుస్తోంది. కమింగ్ వీక్ ఎపిసోడ్ లో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ హీరో హీరోయిన్లు చైతన్య, అనన్య స్పెషల్ స్కిట్ చేశారు.  

వర్షకు ఇమ్మాన్యుయేల్ బినామీ అయితే... లవ్ సునామీ వేరొక‌రా?

  ప్రతివారం హైపర్ ఆది స్కిట్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ మాత్రమే కాదు,  ఒక్కోసారి 'జబర్దస్త్'లో జడ్జిలు రోజా, మనోతో పాటు యాంకర్ అనసూయ పగలబడి నవ్వుతుంటారు. ఈసారి పగలబడి నవ్వడం కాదు, తన సీటులోంచి ఎగిరి ఎగిరి మరీ అనసూయ నవ్వింది. ఆమె అంతలా నవ్వింతలా ఆది ఏం చేశాడు? అంటే... ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ మీద  చేశాడు. టీవీలో లేటెస్ట్ హాట్ ఫేవరెట్ జోడీ ఇమ్మాన్యుయేల్, వర్షలదే. వర్ష వేరొకరితో సన్నిహితంగా మెలిగితే తట్టుకోలేని ప్రేమికుడిగా... లేదంటే వర్షకు వేరొకరితో పెళ్ళైతే తట్టుకోలేనివాడిగా ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్లు అన్నీ హిట్టు. ముఖ్యంగా మొన్నామధ్య ఇమ్మాన్యుయేల్ కి వేరొకరితో పెళ్ళైతే తట్టుకోలేని అమ్మాయిగా వర్షను పెట్టి చేసిన ఒక స్కిట్ తర్వాత 'నిజజీవితంలో ఇమ్మాన్యుయేల్ కి వేరొకరితో పెళ్ళైతే ఏం చేస్తావు?' అని రోజా అడిగారు. అప్పుడు వర్ష చాలా ఎమోషనల్ అయ్యింది. 'కష్టం మేడమ్' అని చెప్పింది. దీనికి హైపర్ ఆది పిచ్చ కామెడీ చేసి పడేశాడు. తన నెక్స్ట్ స్కిట్ లో అందరికీ టీ-కాఫీలు ఇచ్చే ప్రొడక్షన్ బాయ్ క్యారెక్టర్ ఇమ్మాన్యుయేల్ కు ఇచ్చాడు హైపర్ ఆది. ఇమ్మాన్యుయేల్ స్టేజి మీద‌కు రాగానే 'ఇతను ఇమ్మాన్యుయేల్ కదా! వర్ష వెనుక తిరిగేవాడు' అని రీతు చౌద‌రి అంటే... 'దాని వెనుక తిరిగే ఇప్పుడు టీ టీ అని తిరుగుతున్నాడు' అని ఆది చెప్పాడు. 'ఇతడిని వర్ష డీప్ గా లవ్ చేసిందే' అని మళ్ళీ రీతు చౌద‌రి అంది. 'వీడు బినామీ... అసలు సునామీ ఎవరో తెలియాలి' అని ఆది పంచ్ పేల్చాడు. వర్షకు వేరొక లవర్ ఉన్నాడని ఇన్‌డైరెక్టుగా చెప్పినట్టు అయ్యింది. ఇక, 'కష్టం మేడమ్' స్పూఫ్ వచ్చేసరికి అనసూయ సీటులోంచి లేచి మరీ నవ్వింది. ఫుల్ స్కిట్ టెలికాస్ట్ అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి.

నిరుప‌మ్ ప‌ర్ఫార్మెన్స్ చూసి ఉమాదేవికి క‌న్నీళ్లు ఆగ‌లేదు!

  'కార్తీక దీపం' క‌థానాయ‌కుడు నిరుప‌మ్ ప‌రిటాల.. అందులో త‌న ఇద్ద‌రు కూతుళ్లుగా న‌టిస్తోన్న కృతిక (శౌర్య‌), స‌హృద (హిమ‌)ల‌తో క‌లిసి ప‌రివార్ చాంపియ‌న్‌షిప్ స్పెష‌ల్ షో కోసం చేసిన ప‌ర్ఫార్మెన్స్ ఆ సీరియ‌ల్ న‌టి ఉమాదేవి (భాగ్యం)ను ఎమోష‌న‌ల్‌కు గురిచేసి, ఏడిపించేసింది.  లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఆ షో ప్రోమోలో 'కార్తీక దీపం' సీరియ‌ల్ ప్లాట్ నేప‌థ్యంలో నిరుప‌మ్ ఓ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందులో బ్యాగ్రౌండ్‌లో, "డాక్ట‌ర్‌గారూ మీరు నాకు న్యాయం చెయ్యాల‌నుకుంటే మోనిత క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌కు అన్యాయం జ‌రుగుతుంది. మోనిత‌కు న్యాయం చేస్తే నా బిడ్డ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంది." అంటూ దీప వాయిస్ వినిపిస్తుంది. ఆ త‌ర్వాత డాన్స‌ర్స్‌తో నిరుప‌మ్ చేసిన యాక్ట్ అంద‌ర్నీ క‌దిలించి వేసింద‌నీ, వాళ్లంతా భావోద్వేగానికి గుర‌య్యార‌నీ అర్థ‌మ‌వుతోంది.  ఈ ప‌ర్ఫార్మెన్స్‌పై ఉమాదేవి మాట్లాడుతూ, "అమ్మాయిలు ఫాద‌ర్ కోసం త‌పిస్తున్నారు.. ఎప్పుడు మా పేరెంట్స్ క‌లిస్తే మేం స‌ర‌దాగా ఉంటాం అని. ఆ పెయిన్‌ను నిజం జీవితంలో నేను అనుభ‌విస్తున్నాను." అని దుఃఖం ఆపుకోలేక‌పోయింది. ఆమెను ప‌క్క‌నే కూర్చొనివున్న కార్తీక‌దీపం మోనిత ఓదార్చ‌డం గ‌మ‌నార్హం. ప్రోమోలో ఉమాదేవి చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తే రియ‌ల్ లైఫ్‌లో ఆమె చాలా వేద‌న‌ను అనుభ‌విస్తోంద‌ని తెలుస్తోంది. 'ప‌రివార్ చాంపియ‌న్‌సిప్‌' వ‌చ్చే ఆదివారం (జూలై 25న)న సాయంత్రం 6 గంట‌ల‌కు స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సారం కానున్న‌ది. సుమ‌, శ్రీ‌ముఖి హోస్టులుగా వ్య‌వ‌హ‌రించే ఈ షోలో కార్తీక దీపం, వ‌దిన‌మ్మ‌, దేవ‌త‌, జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, గుప్పెడు మ‌న‌సు త‌దిత‌ర సీరియ‌ల్స్‌లో న‌టించే 50 మందికి పైగా టీవీ తార‌లు 18 సూప‌ర్బ్ ప‌ర్ఫార్మెన్సుల‌తో ఆక‌ట్టుకోనున్నారు. అలాగే జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్, హ‌రి లాంటి క‌మెడియ‌న్లు త‌మ స్కిట్ల‌తో న‌వ్వించ‌నున్నారు.

అక్కడ... దీప్తీ సునైనా టాటూ!

  ఈతరం యువతీయువకులు టాటూలు వేయించుకోవడం కామన్. అఫ్‌కోర్స్, ఈమధ్య పెద్దవాళ్ళు కూడా టాటూలు వేయించుకున్నారు అనుకోండి. మొన్నటికి మొన్న 'కామెడీ స్టార్స్' షోలో అషురెడ్డి పేరును గుండెలపై టాటూగా వేయించుకున్నాడు హరి. అషురెడ్డి మదర్ కూడా చేయిపై కుమార్తె పేరు పచ్చబొట్టుగా పడింది. ఇవి రీసెంట్ మెమరీస్.  లిస్టు తీస్తే టాటూలు వేయించుకున్న టీవీ సెలబ్రిటీలు బోలెడుమంది కనిపిస్తారు. అందులో డబ్ స్మాష్ లతో ఫేమస్ అయిన అమ్మాయి, 'బిగ్ బాస్' ఫేమ్ దీప్తీ సునైనా కూడా ఉంది. ఆల్రెడీ ఆమె ఒంటిపై చాలా టాటూలు ఉన్నాయి. షణ్ముఖ్ జస్వంత్ చేతిపై, ఆమె చేతిపై ఒకే విధమైన టాటూలు కనిపిస్తాయి. లేటెస్టుగా మరో టాటూను వేయించుకుంది.  దీప్తి సునైనా తన ఎడమ చేతి భుజం మీద టాటూ వేయించుకుంది. తనను తాను కౌగిలించుకుని ఉన్నట్టు కనిపించే అమ్మాయి రూపం స్కెచ్ టాటూగా వేయించుకుంది. దీనర్థం ఏమిటో? దీప్తి సునైనాకు అందరికి కంటే తనంటేనే ఎక్కువ‌ ఇష్టమనా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సదాను వదలని ఆది! అలా అయిపోయిందేమిటి?!

  బుల్లితెర మీదకు మూడేళ్ళ తర్వాత సదా రీఎంట్రీ ఇస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో సదాను బుల్లితెర మీదకు తీసుకొచ్చిన ఈటీవీ, మల్లెమాల సంస్థ మరోసారి ఆమెను టీవీకి తీసుకొచ్చారు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి సదా అతిథిగా వచ్చారు. ఆ షోలో రెగ్యులర్ గా ఇంద్రజ కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంద్రజతో పాటు సదా కూడా సందడి చేయనున్నారు.  వర్ష, భాను చేసిన మాస్ డాన్స్ చూసిన తర్వాత 'పిల్లలు ఢీలో ఎందుకు లేరు' అని సదా అంటే... 'సదాగారు వచ్చి చాలాసేపు అయింది. ఏంటి? ఇంతవరకు జోకులు వేయలేదు అనుకుంటున్నా. ఈ ఎపిసోడ్ కి హీలేరియస్ జోక్ ఇది' అని హైపర్ ఆది అనడంతో అందరూ నవ్వేశారు. సదా మాత్రం ఒక్కసారిగా ఆది అలా అనేసరికి షాక్ అయ్యారు. పాపం... ఆమె నిజాయతీగా వర్ష, భాను డాన్స్ గురించి చెప్పినట్టు ఉన్నారు.  అతిథిగా రావడమే కాదు... 'జయం'లో హిట్ సాంగ్ 'రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో' పాటకు సదా డాన్స్ చేసి అలరించారు. ఆమెతో పాటు 'ఢీ'లో కంటెస్టెంట్లుగా చేసిన అక్సా ఖాన్, ఐశ్వర్య తదితరులు కాలు కదిపారు. అసలు, ఈ ప్రోమోలో హైలైట్ అంటే... సదాను వదలకుండా హైపర్ ఆది చేసిన హంగామా.  'ఆదిగారు అయినా... ఆదిగారి నవ్వు అయినా చాలు' అని సదా అనడమే ఆలస్యం... 'ప్రియతమా తెలుసునా? నా మనసు నీదేనని' సాంగ్ ప్లే చేశారు. వెంటనే ఆది పెర్ఫార్మన్స్ మొదలుపెట్టాడు. మోకాలి మీద కూర్చుని మరీ ఆమె చెయ్యి అందుకున్నాడు. 'ఢీ'లో కూడా ప్రియమణి విషయంలో ఇదే విధంగా అప్పుడప్పుడూ ఆది  చేస్తుంటాడు. అయితే ప్రోమోలో స‌దాను చూసిన‌వాళ్లంతా 'ఈమె స‌దేయేనా? ఇలా అయిపోయిందేమిటి?' అని అనుకుంటున్నారు. మునుప‌టి గ్లామ‌ర్ ఆమెలో క‌నిపించ‌డం లేద‌నేది వారి అభిప్రాయం.

'గోరింటాకు'లో ఏడుపు సీన్ల హీరోయిన్‌ శ్రీవల్లి బ్యాగ్రౌండ్ తెలుసా?

  'పెళ్లి ఎప్పుడు?' - ప్రతి అమ్మాయి ఏదొక సమయంలో ఈ ప్రశ్న ఎదుర్కొంటుంది. కావ్యశ్రీకీ ఎదురైంది. ఇంట్లో వాళ్ళ నుండి. "నాకు పాతికేళ్ళు వచ్చేవరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావొద్దని మా ఇంట్లోవాళ్ళకు చెప్పాను. అప్పటివరకూ కెరీర్ మీద దృష్టి పెడతానని చెప్పా. వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళతా. అలాగని, నాకు పెద్ద లక్ష్యాలు ఏమీ లేవు" అని కావ్యశ్రీ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త మంచివాడు అయితే చాలు అని, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదని అంటోంది.  స్టార్ మా సీరియల్ 'గోరింటాకు'తో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న కావ్యశ్రీ తెలుగు అమ్మాయి కాదు. బెంగళూరు ముద్దుగుమ్మ. కావ్యశ్రీ బ్యాగ్రౌండ్ ఏంటంటే... ○ కావ్యశ్రీకి డాన్స్ అంటే ఎంతోఇష్టం. స్కూల్, కాలేజ్...  ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగితే కావ్యశ్రీ గ్రూప్ డాన్స్ కంపల్సరీ. అమ్మాయి డాన్స్ చూసిన తల్లితండ్రులు సీరియళ్ళలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అప్పటివరకు నటన గురించి ఆలోచించని కావ్యశ్రీకి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.   ○ ఇంటర్ సెకండియర్ చదివే సమయం నుండి ప్రయత్నాలు ప్రారంభించింది. నాలుగేళ్ళ తర్వాత, బీఎస్సీ పూర్తి చేశాక అవకాశం వచ్చింది. కన్నడ సీరియల్ 'నీలి'లో సెకండ్ హీరోయిన్ రోల్ దక్కింది. అందులో 200 ఎపిసోడ్లు చేసింది.  ○ కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో తెలుగు ఛానల్ 'స్టార్ మా' నుండి పిలుపు రావడంతో  హైదరాబాద్ వచ్చింది. 'గోరింటాకు'లో శ్రీవల్లి పాత్ర చేసే అవకాశం దక్కింది. అందులో ఆమెవి ఎప్పుడూ ఏడుపు సీన్లే. దాంతో మీమ్ పేజీల్లో పాపులర్ అయ్యింది.  ○ 'గోరింటాకు' తర్వాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ' సీరియల్ చేసే అవకాశం అందుకుంది. సోమవారం (జూలై 19) నుండి ఈ సీరియల్ ప్రసారం అవుతుంది.  ○ సీరియళ్ళు చేస్తూనే సినిమాల్లో ప్రయత్నించింది కావ్యశ్రీ. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన 'అంజనీపుత్ర'లో ఇంపార్టెంట్ రోల్ చేసింది. సీరియళ్ళతో పోలిస్తే సినిమా వాతావరణం భిన్నంగా ఉందని, అది తనకు నచ్చలేదని చెప్పింది.