వామ్మో యాడ్స్! భయపెడుతున్న టీవీ షోస్!!
కమర్షియల్ యాడ్స్‌లేని టీవీ ప్రోగ్రాములుంటే! అరే వాహ్!! ఈ ఊహే చాలా అందంగా ఉంది కదూ! ఎంత అందమైన కల! ఇలా ఇలలో ఎన్నటికైనా జరిగేనా!! టీవీ ఆన్ చేస్తే యాడ్స్ మధ్యలో ప్రోగ్రామ్స్ చూడాల్సిన దౌర్భాగ్యం వచ్చిందని సగటు ప్రేక్షకులంతా లబోదిబోమంటుంటూ అసలు ఒక్కో యాడ్‌ను రోజుకు ఎన్ని చానల్స్, ఎన్నిమార్లు చూపి చంపుతాయా అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ విరామం, వాణిజ్య ప్రకటనలు.. ఇదంతా షరా మామూలే. పాటలు, ఆటలు, సినిమాలు, సీరియళ్లు.. ఏం చూద్దామన్నా పానకంలో పుడకల్లా ఈ ప్రకటనలు వచ్చి చేరుతున్నాయి.
అత్యధికంగా వ్యూయర్‌షిప్ పొందిన టీవీ యాడ్‌గా మింత్రా స్టూడియో యాడ్ చరిత్ర సృష్టించింది. అత్యధిక చానళ్లలో, అత్యధికసార్లు ప్రసారమైనట్టు మింత్రా యాడ్ అన్ని టీవీల్లో మారుమోగిపోయింది. ఈ యాడ్‌లో కియారా అద్వానీ నటించింది. కేవలం ఈ ఏడాది మే నెలలో 83,946,193 వ్యూస్ లభించాయి ఈ యాడ్‌కు. అన్ని వ్యూస్ వచ్చాయంటే ఎంతసేపు ఈ యాడ్ టీవీలో కనిపించిందో ఊహించుకోవాల్సిందే.
యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన యాడ్ అనే మారో జాబితా కూడా ఉంది. 2021 జనవరిలో సైఫ్ అలీఖాన్ నటించిన అమెజాన్ ఒరిజినల్స్ మూవీ 'తాండవ్' యాడ్ టాప్ పొజిషన్‌లో నిలవగా, శ్యామ్‌సంగ్స్ ఎపిక్ ఇన్ ఎవరి వే యాడ్ సెకండ్ పొజిషనల్‌లో నిలిచింది. పుంఖానుపుంఖాలుగా ఉన్న యూట్యూబ్ వీడియోల్లోనూ యాడ్స్‌ను జొప్పించడంతో ఇంటర్నెట్‌లో ప్రకటనలు జోరందుకున్నాయి. ఏ విషయాన్ని సర్ఫ్ చేసినా యాడ్స్ మాత్రం తప్పనిసరిగా దర్శనం ఇస్తున్నాయి.
వామ్మో.. టీవీలో అవార్డు ఫంక్షన్లు చూడాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి. లేదంటే ఈ ప్రోగ్రామ్ జోలికి వెళ్లనే కూడదు. పట్టుమని 10 నిమిషాలు కూడా అవార్డు వేడుక టీవీలో ప్రసారం కాదు కానీ నిమిషాల తరబడి ప్రకటనలు మాత్రం పదేపదే ప్రసారమవుతుంటాయి. అవన్నీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ కాబట్టి పవర్డ్ బై, అఫిషియల్ స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్, ప్రమోటెడ్ బై, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై.. ఇలాంటి మాటలు పదేపదే వినిపించకుండా ఈ ఫంక్షన్లకు సంబంధించిన ప్రోగ్రామ్ అస్సలు కనిపించదు. గంటసేపు ప్రసారం కావాల్సిన కార్యక్రమాన్ని లాగి లాగి కనీసం 3 గంటలపాటు ప్రసారం చేసేసి ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తారు. అసలు ప్రోగ్రాంలో ఉండే మజానే ఆవిరైపోయి బీపీ తెప్పించేలా ఈ కార్యక్రమాలుండటంతో క్రమంగా వీటికి కూడా ఆదరణ తగ్గుతూ వస్తోంది.
ప్రేక్షకుల విసుగును గమనించిన టీవీ చానళ్లు వన్ బ్రేక్, నో బ్రేక్ పేరుతో వీకెండ్ స్పెషల్ ప్రోగ్రాములు ప్రసారం చేస్తున్నాయి. మూవీ ఫ్లిక్స్, రొమెడీ నౌ, హెచ్‌బీవో చానళ్లలో ఈ విధానం మోస్ట్ ట్రెండింగ్‌గా ఆకట్టుకుంటోంది. వీరి బాటలోనే పయనిస్తూ మహా మూవీ వంటి పేర్లతో హిందీ టీవీ చానళ్లు తక్కువ యాడ్స్ లేదా యాడ్స్ లేకుండానే కొన్ని గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. హ్యాపీగా టీవీని ఎంజాయ్ చేసే చాన్స్ లభిస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఈ చానళ్లకు అతుక్కుపోతున్నారు. దీంతో వీటి రేటింగులు అమాంతం పరుగులు పెడుతున్నాయి.
ఇలాంటి వన్ బ్రేక్ మూవీలకున్న ఆదరణను గుర్తించిన కంపెనీలు తమ ప్రకటనలు వీటిలో జొప్పించేందుకు ఎన్ని రెట్లు ఎక్కువైనా ఈ స్లాట్‌లలోనే తమ ప్రకటనలు ప్రసారం చేసేందుకు సై అంటున్నాయి. అంటే అటు కంపెనీలకు, ఇటు చానల్ యాజమాన్యానికి, మధ్యలో వీక్షకులకు లాభదాయకంగా ఉంటుందన్న మాట.!