సర్వే సమగ్రంగానే జరిగిందనుకోవచ్చా?
posted on Aug 20, 2014 @ 6:46PM
తెలంగాణా ప్రభుత్వం నిన్న నిర్వహించిన సర్వే పట్ల ప్రజలు చాలా సానుకూలంగా స్పందించిన మాట వాస్తవం. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా సంతోషించారు. ప్రజల సహకారంతో సర్వే విజయవంతం అయిందని ఆయన ప్రకటించారు కూడా. కానీ హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు సర్వే అధికారులు రాలేదని, వచ్చినా పూర్తి వివరాలు నమోదు చేసుకోకుండా ‘మమ’ అనిపించేసారని పిర్యాదులు వినబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఈ సర్వేలో నమోదు చేయించుకొంటే, ప్రభుత్వం నుండి తమకు ఏదో ఒకవిధంగా సహాయం లభిస్తుందనే ఆశతో పనులకు వెళ్ళకుండా రోజంతా సర్వే అధికారుల కోసం పడిగాపులు కాసినా ఫలితం లేకుండాపోయింది. రాజధాని నగరంలో నిరుపేదలు నివాసముండే అడ్డగుట్ట, రసూల్ పుర, బోలక్ పూర్, బంజారా బస్తీ, బీ.జే.ఆర్. నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలకు సర్వే అధికారులు రాకపోవడంతో, అక్కడి ప్రజలు తమ గోడు ఎవరితో మొర పెట్టుకొవాలో తెలియని పరిస్థితి.
ఇక మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే సైనిక్ పురి, రామంతాపూర్, ఉప్పల్, హిమాయత్ నగర్, హైదర్ గూడ, యల్.బీ. నగర్, మల్కజ్ గిరి, శేరిలింగంపల్లి, మెట్టుగూడ, కుకట్ పల్లి, బోయిన్ పల్లి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి.
ఇక ఈ సర్వే కోసం రాష్ట్రా వ్యాప్తంగా శలవు ప్రకటించడంతో ఆర్.టీ.సీ. బస్సులు, ఆటోలు, మినీ వ్యానులు కూడా తిరగకపోవడంతో, అత్యవసర పనుల మీద నగరానికి వచ్చిన వారు, తీవ్ర అనారోగ్యానికి గురయి ఆసుపత్రులకు వెళ్ళవలసిన వారు, విదేశాలతో నిత్యం లావాదేవీలు జరిపే బీపీఓ సంస్థల ఉద్యోగులు నానా ఇక్కట్లు పడ్డారు. కరీంనగర్ జిల్లా మాదవ్ పూర్ మండలానికి చెందిన వెంకటేష్ దంపతులు, నిన్న సర్వే కారణంగా నగరంలో బస్సులు, ఆటోలు తిరగక పోవడంతో నీలోఫర్ ఆసుపత్రిలో మరణించిన తమ చిన్నారి పసిపాప శవాన్ని ఒళ్ళో పెట్టుకొని, అంత బాధలోనూ రోజంతా ఆసుపత్రి గేటు వద్దే కూర్చోక తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఎవరికీ తెలియదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ “ఇంతవరకు హైదరాబాదులో కేవలం 15.12 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయనే భ్రమలో ఉన్నాము. కానీ ఈ సర్వే తరువాత 20 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తెలుసుకోగలిగాము,” అని అన్నారు. అయితే సర్వే అధికారులు చాలా ప్రాంతాలకు వెళ్లనందున కేసీఆర్ చెపుతున్నదాని కంటే ఇంకా చాలా ఎక్కువ కుటుంబాలే హైదరాబాదులో నివసిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఈ సమగ్ర సర్వే ద్వారా తెలంగాణాలో నివసిస్తున్న ప్రజలందరి వివరాలు పూర్తిగా సేకరించాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇంత భారీ సర్వే నిర్వహించడానికి ముందు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు, కసరత్తు చేయకపోవడం వలన అది ఆశించిన ఫలితం పూర్తిగా దక్కలేదనే చెప్పవచ్చును. కానీ లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ప్రభుత్వం ఒక్కరోజులోనే సర్వే నిర్వహించడం వలన దాని ప్రయోజనం పూర్తిగా నెరవేరలేదు.
కానీ దీనివలన వాస్తవానికి-ప్రభుత్వ లెక్కలకీ మధ్య చాలా తేడా ఉందనే సంగతి మాత్రం ప్రభుత్వానికి అర్ధమయింది. కనుక ఇకపై తదనుగుణంగా ప్రణాళికలు రచించుకోగలదు. కానీ అంతకంటే ముందు ప్రభుత్వం మరోమారు తన లెక్కలను సరి చూసుకోవలసి ఉంటుంది.