‘సర్వే’ జనాః సుఖినోభవంతు
posted on Aug 18, 2014 @ 10:02PM
ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా సర్వే జరుగబోతోంది. దానిపై ప్రజలలో, రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఈ సర్వేతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సర్వే కేవలం బోగస్ లబ్దిదారులను ఏరివేసి, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను చేరవేయడానికేనని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా చెపుతున్నప్పటికీ, తెదేపా నేత రేవంత్ రెడ్డి బయటపెట్టిన కేసీఆర్ ఇటీవల అధికారుల సమావేశంలో మాట్లాడిన ఒక సంభాషణల ఆడియో టేపు ఆంధ్రప్రజలలో కలకలం సృష్టిస్తోంది. వారిలో మరింత అభద్రతాభావం కలిగిస్తోంది.
తెలంగాణా ప్రజలకు మేలు చేయడానికి నిర్వహిస్తున్న ఈ సర్వే పట్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ దానిలో స్థానికత అంశం గురించి ఉన్న ప్రశ్నలు తమనే లక్ష్యంగా చేసుకొన్నవని ఆంద్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈరోజు కాకపోతే రేపయినా ఈ సర్వే కారణంగా తాము ఏదో రూపంగా వివక్ష ఎదుర్కోక తప్పదని, తెలంగాణాలో స్థిరపడినందుకు గాను భారీ మూల్యం చెల్లించకతప్పదని వారు గట్టిగా నమ్ముతున్నందునే వారు ఈ సర్వేపట్ల విముఖత చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రా నుండి వచ్చి తెలంగాణాలో పరిశ్రమలు, ఉన్నత విద్యాసంస్థలు వగైరా నెలకొల్పినవారు, ప్రైవేట్ సంస్థలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న ఉన్నత వర్గాల వారు తాము ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులు, వృధాప్య పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు వంటివేవీ కోరకపోయినా తమపై బలవంతంగా ఈ సర్వేను ఎందుకు రుద్దుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ సర్వే భవిష్యత్తులో తమపై, తమ సంస్థలపై ప్రభావం చూపబోతోందనే ఆందోళన ఉన్నత వర్గాలలో సైతం వ్యక్తం అవుతున్నట్లు అర్ధమవుతోంది. తెలంగాణా ప్రభుత్వం మీడియా ద్వారా వారి సందేహాలను తీర్చేందుకు చాలా కృషి చేసినా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తమపట్ల ప్రదర్శిస్తున్న విద్వేష వైఖరి కారణంగా ఆంద్ర ప్రజలలో ఆయన సర్వే గురించి చెపుతున్న మాటలను నమ్మడం లేదు. అందువలన ఈ సర్వేపై వారిలో అనుమానాలు పోలేదు.
కానీ వారి వాదనలను, భయాలను, అనుమానాలను అర్ధం లేనివని కొట్టిపారేస్తున్నారు తెలంగాణాకు చెందిన రాజకీయ నేతలు, విశ్లేషకులు. తెలంగాణా ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను అనుభవిస్తూ, వాటిని అందిస్తున్న ప్రభుత్వానికి సహకరించబోమని చెప్పడం ఏవిధంగా సమర్ధనీయమని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడినప్పటికీ వారందరూ నేటికీ తాము తెలంగాణాకు చెందినవారముకామనే భావన వారిలో ఉన్నందునే ఈ సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచి ఆలోచన కాదని, అందువల్ల తెలంగాణాలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు జరిగే సర్వేలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణాకు చెందిన రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. అప్పుడే ప్రభుత్వం కూడా ప్రజావసరాలకు, వారి సామాజిక స్థితిగతులకు అనువయిన ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించగలదని సూచిస్తున్నారు.
ఇక తెలంగాణా ప్రజలు, రాజకీయ నేతలు ఈ సర్వేను పూర్తిగా సమర్ధిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన అనేక హామీలను, సంక్షేమ పధకాలను ఒకటొకటిగా అమలుచేస్తుండటంతో, వారికి ప్రభుత్వంపై దానిని నడిపిస్తున్న కేసీఆర్ పై క్రమంగా నమ్మకం ఏర్పడుతోంది. ఈ సర్వేలో తమ పేరు నమోదు చేయించుకొనగలిగితే ప్రభుత్వం నుండి ఏదో ఒక రూపంలో తమకు లబ్ది చేకూరుతుందని వారు దృడంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ప్రకటించిన ఈ సర్వేలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తెలంగాణా ప్రజలు స్వస్థలాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఈ విధంగా చివరికి సర్వేపై కూడా పూర్తి విరుద్దమయిన ఆలోచనలు, అభిప్రాయలు అందరిలో నెలకొని ఉన్నాయి. అందువల్ల ఈ సర్వేలో ఎంతమంది పాల్గొంటారు? ఈ సర్వే విజయవంతం అవుతుందా లేదా? అయితే అది ఆంద్ర, తెలంగాణా ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపబోతోంది? దీనివలన ఎవరు లబ్ది పొందబోతున్నారు? ఎవరు నష్టపోబోతున్నారు? వంటి ధర్మ సందేహాలన్నిటికీ త్వరలోనే జవాబులు దొరకవచ్చును.