ఖాళీ ఖజానాతో లక్ష కోట్ల బడ్జెట్ సాధ్యమేనా?
posted on Aug 20, 2014 @ 11:58AM
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సుమారు రూ. 1.10 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదని చెపుతున్నపుడు, మరి ఇంత భారీ బడ్జెటు రూపొందించడమేమిటనే ధర్మసందేహం చాలా మందికి కలగవచ్చును. నిజమే! ఖజానా కాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వివిధ పద్దుల క్రింద వివిధ పనులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం వేల కోట్లు కేటాయింపులు ఏవిధంగా చేస్తుందనే సందేహం కలగవచ్చును.
ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెటుకు సరిపడేంత ఆదాయం వస్తుందనే అంచనాలు, నమ్మకం ప్రభుత్వానికి ఉన్నందునే అంత భారీ బడ్జెట్ ప్రకటించడానికి సాహసించేలా చేసాయని చెప్పవచ్చును. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర పరిస్థితి ఏమిటని అందరూ చాలా ఆందోళన చెందినప్పటికీ, పరిస్థితులు ఊహించినంత దారుణంగా మాత్రం లేకపోవడం ఆంద్రప్రదేశ్ ప్రజల అదృష్టం.
ఇన్నేళ్ళుగా హైదరాబాద్ ప్రధానకేంద్రంగా చేసుకొని వ్యాపారలావాదేవీలు నిర్వహించిన అనేక వ్యాపార సంస్థలు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తరలివచ్చి, రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖకే తమ వ్యాపారలావదేవీలపై పన్నులు చెల్లిస్తుండటంతో, విభజన తరువాత 13 జిల్లాల్లో ఆ శాఖ ఆదాయం సుమారు రూ.40వేల కోట్లు పైబడే ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు అంచనావేశారు.
ఇక వాణిజ్యపన్నుల తరువాత, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు సమకూర్చేవి ఎక్సైజ్, స్టాంపులు మరియు రిజిస్ర్టేషన్ల శాఖలే. ప్రభుత్వ విధానాలు ఏవిధంగా ఉన్నప్పటికీ, నిత్యం బంగారు గుడ్లు పెట్టే బాతుల వంటివి ఈ రెండు శాఖలు. ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ మధ్యప్రియులు మందు ముట్టకుండా ఉండలేరు. అలాగే ఇళ్ళు, స్థలాల క్రయ విక్రయాలు ఎన్నడూ ఆగేవీ కావు. కనుక ఈ రెండు శాఖల నుండి నిత్యం డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడుతూనే ఉంటుంది. ఎక్సైజ్ శాఖ నుండి కనీసం రూ.10వేల కోట్లు, రిజిస్ర్టేషన్ల శాఖ నుండి మరో రూ.10-15,000 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రాష్ట్ర రాజధాని నిర్మాణం, వివిధ జిల్లాలు, నగరాలు, పట్టణాలలో పరిశ్రమలు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది గనుక ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో భూముల ధరలు భారీగా పెరగవచ్చును. ఇది సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా కష్టం కలిగిస్తున్నప్పటికీ, దాని వలన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా ఇకపై రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది గనుక కొత్తగా అనేక వ్యాపార సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది గనుక వాటి ద్వారా కూడా ప్రభుత్వానికి భారీ ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రవాణా వంటి అనేక ఇతర శాఖల నుండి కూడా ప్రభుత్వానికి ఆదాయం బాగానే ఉంటుంది. ఈ అంచానాల ఆధారంగానే ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్ రూపొందించే సాహసం చేస్తోందని భావించవచ్చును.
షరా మామూలుగానే దానిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించవచ్చు గాక. కానీ ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇటువంటి భారీ బడ్జెటును ప్రవేశపెట్టడం మున్ముందు పరిస్థితులు చాలా ఆశాజనకంగా ఉంటాయని చాటి చెపుతున్నట్లుంది. ఇది చాలా మంచి పరిణామమని చెప్పక తప్పదు. ఎందువలన అంటే లోటు బడ్జెటును చూపిస్తూ ప్రభుత్వం చేతులెత్తేయకుండా, పూర్తి సానుకూల దృక్పధంతో, భవిష్యత్ పట్ల రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చాలా దైర్యంగా భారీ బడ్జెటును ప్రవేశపెడుతోంది. అది చాలా అభినందనీయం. అయితే ప్రభుత్వం దానిని అంతే ఆత్మవిశ్వాసంతో, నిబద్దతతో ఆచరణలో పెట్టి చూపినప్పుడే దానికి విలువ ఉంటుంది.