ఒబామా క్యూబా పర్యటన విఫలం!
posted on Mar 24, 2016 @ 10:04AM
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుని క్యూబా పర్యటన ముగిసింది. కానీ ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్యా సంబంధాలు మెరుగుపడ్డాయా అంటే మొహమొహాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒబామా క్యూబాలో అడుగుపెట్టిన క్షణం నుంచీ ఈ పర్యటన ఏమంత అద్భుతాలు సాధించలేదని తేలిపోయింది...
అమెరికా, క్యూబాల మధ్య వైరం ఈనాటిది కాదు. ఈ రెండు దేశాల మధ్యా నిండా 90 మైళ్ల దూరం కూడా లేకపోవచ్చు. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు క్యూబాలో అడుగుపెట్టడానికి దాదాపు 90 ఏళ్లు పట్టింది. 1959లో ఫల్గెన్సియో బటిస్టా అనే నియంతని గద్దె దింపుతూ, క్యూబా నేతృత్వంలోని విప్లవకారులు ఆ దేశంలో తమ అధికారాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచీ అమెరికా, క్యూబా దేశాల మధ్య సంబంధాలు నిదానంగా దెబ్బతింటూ వచ్చాయి. అమెరికన్లకి చెందిన వ్యాపారసంస్థలను క్యూబా జాతీయం చేయడం, క్యూబాకు రష్యా వంత పాడటం వంటి ఘట్టాలతో, ఇరుదేశాల మధ్య సంబంధాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి.
అమెరికా అంటేనే మండిపడిపోయే ఫిడేల్ క్యాస్ట్రో అధికారం నుంచి తప్పుకోవడంతో, క్యూబాతో దౌత్యం నెరిపే అవకాశం ఉందని అమెరికా సంబరపడిపోయింది. పక్కలో బల్లెంలా ఉన్న క్యూబాను ఎప్పటికైనా మంచిచేసుకోవడం అవసరమని ఆ దేశానికి తెలుసు. దీనివల్ల సామరస్యమైన వాతావరణమే కాదు, వ్యాపార లావాదేవీలను కూడా నెలకొల్పవచ్చు. క్యూబాలో తాజాగా చమురు క్షేత్రాలు కూడా బయటపడటం కూడా అమెరికా ‘సదుద్దేశాలకు’ కారణం అయి ఉంటాయి.
క్యూబాతో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా, అమెరికా ఒకో చర్యా చేపట్టడం మొదలుపెట్టింది. సుదీర్ఘకాలంగా మూసుకున్న రాయబార కార్యాలయాలు తెరుచుకున్నాయి. క్యూబాను తీవ్రవాద దేశాల జాబితా నుంచి తొలగించింది. ఆఖరికి ఆ దేశ అధ్యక్షుడు క్యూబాలో పర్యటించేందుకు సిద్ధపడ్డారు. ‘నేను ఇప్పుడే ఈ నేల మీద అడుగుపెట్టాను, క్యూబా ప్రజలను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను’ అంటూ క్యూబా నేలను తాకిన ఒబామా ట్వీట్ చేశారు. కానీ ఆయనకు స్వాగతం చెప్పేందుకు అక్కడి అధ్యక్షులవారు సిద్ధంగా లేరు. తమ అధ్యక్షుడు ఒక దేశానికి వెళ్తే, అక్కడి దేశాధినేత
ఆయనను స్వాగతించేందుకు లేకపోవడం, బహుశా అమెరికా చరిత్రలోనే చాలా అరుదుగా జరిగి ఉంటుంది.
సాధారణంగా ఎవరన్నా అతిథులు తమ దేశానికి వస్తే, క్యూబా వాసులు వారికి ఘన స్వాగతం పలుకుతారు. కానీ క్యూబా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక ఒబామా దురదృష్టమో ఏమీగానీ, ఆయన క్యూబాలో పాల్గొన్న బేస్‌బాల్ ఆట కూడా వివాదాస్పదం అయ్యింది. బెల్టియంలో ఉగ్రవాదుల దాడి జరుగుతున్న సమయంలో, ఒబామా ఓ బేస్‌బాల్ ఆటని ఆస్వాదిస్తూ గడపడంతో అమెరికన్ ప్రజలు విస్తుపోయారు. యూరప్ ఖండంలోనే అతి కీలకమైన బెల్జియం మీద ఉగ్రవాదులు దాడి చేయడం అంటే... ISIS మీద అమెరికా జరుపుతున్న పోరు విఫలం అయ్యిందని చెప్పడమే. ఇలాంటప్పుడు ఒబామా ఓ శత్రుదేశాన్ని మంచి చేసుకునేందుకు, బేస్‌బాల్ ఆటలో మునిగిపోవడం ఏంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
ఇక ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్‌క్యాస్ట్రోలు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశం కూడా రసాభాసగా ముగిసింది. క్యూబాలో మానవహక్కులను మెరుగుపర్చాలంటూ ఒబామా సూచించగా, ప్రపంచంలో ఏ దేశమూ మానవహక్కులను అమలుచేయడం లేదంటూ రౌల్ ఘాటుగా స్పందించారు. క్యూబా ఆధీనంలో ఉన్న రాజకీయ ఖైదీల విషయంలో కూడా రౌల్ ఇంతే పదునుగా బదులిచ్చారు. రాజకీయ ఖైదీలు ఎవ్వరూ తమ ఆధీనంలో లేరని తేల్చిపారేశారు. ఇక ఒబామా వైపు నుంచి కూడా క్యూబాతో ఉన్న వివాదాల గురించి ఎలాంటి స్పష్టమైన సంకేతాలూ వెలువడలేదు. క్యూబాకి చెందిన గ్వాంటనామో ద్వీపాన్ని తిరిగి ఇచ్చే విషయమై ఆయన మాట దాటవేశారు. ఈ సమావేశం ఎంత నిస్సారంగా ముగిసిందంటే, రౌల్‌తో కలిసి విజయ సంకేతాన్ని చూపేందుకు కూడా ఒబామా సుముఖత వ్యక్తం చేయలేదు.
ఇటు అమెరికా వాసులలో కూడా క్యూబా పట్ల అంత సదభిప్రాయం లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను పాటిస్తూ, నియంతృత్వ వ్యవస్థలో ఉన్న క్యూబా నుంచి ఎప్పటికీ స్నేహాన్ని ఆశించలేమన్నది వారి భావన. క్యూబా మీద పై చేయి సాధించలేకపోయిన అమెరికా, చివరికి ఆ దేశ నియంతతో స్నేహానికి బయల్దేరడమేంటని వారు మండిపడుతున్నారు. అమెరికాకు కొరకరాని కొయ్యగా మిగిలిపోయిన ఫిడేల్ క్యాస్ట్రో వ్యక్తిత్వాన్నీ, ఆయన పాలననూ ఇప్పటికీ అమెరికన్ ప్రజలు మర్చిపోలేదు. మరి ఒబామా క్యూబా పర్యటన విజయవంతం అయ్యిందని భావించగలమా!