కశ్మీర్ ప్రజల ప్రేమని చూరగొన్న మెహబూబా
posted on Mar 26, 2016 @ 10:12AM
మెహబూబా కశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా ఎంపికకానున్న విషయం ఖరారైపోయింది. రాజకీయంగానూ, భౌగోళికంగానూ కీలకమైన కశ్మీరానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను చేపట్టనున్నారు. గత జనవరి 7న మెహబూబా తండ్రి ఆకస్మిక మరణంతో ఆ పదవి ఖాళీగా ఉండిపోయింది. కానీ తండ్రి రాజకీయాలకు ఆది నుంచీ వారసురాలిగా వస్తున్న మెహబూబా, ఆ పదవిని అందుకునేందుకు తొందరపడలేదు. బీజేపీతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తరువాత కానీ తన నిర్ణయాన్ని తెలియచేయలేదు.
56 ఏళ్ల మెహబూబాకి రాజకీయాలు కొత్తేమీ కాదు. మెహబూబా తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ 1998లో జాతీయ కాంగ్రెస్ నుంచి వేరుపడి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీని (పీడీపీ) స్థాపించినప్పటి నుంచి తండ్రితోనే సాగారు మెహబూబా. కశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రడాటిక్ పయనం ఏమంత సాఫీగా సాగలేదు. అటు నేషనల్ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్ రెండింటికీ కూడా కశ్మీర్ ఓటర్ల మీద బలమైన పట్టు ఉంది. వారిద్దరినీ కాదని స్వంతంగా అధికారాన్ని చేపట్టేందుకు పీడీపీకి పదిహేనేళ్లు పట్టింది. తీరా ముఖ్యమంత్రి పదవి చేపట్టాక, పదవీకాలం పూర్తవకుండానే ముఫ్తీ కన్నుమూశారు.
మెహబూబాకు రాష్ట్ర రాజకీయాల మీదే కాదు, దేశ రాజకీయాల మీద కూడా మంచి పట్టు ఉంది. ఆది నుంచీ నేషనల్ కాన్ఫరెన్స్‌కు పెట్టని కోటగా ఉన్న అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి మెహబూబా 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. న్యాయవాదంలో పట్టా పొందిన మెహబూబాకు చట్టం మీదా, కశ్మీర్ పరిస్థితుల మీద కూడా కావల్సినంత అవగాహన ఉంది. స్వీయ పరిపాలనే లక్ష్యంగా స్థాపించిన పీడీపీ పార్టీతోనే అటు వేర్పాటువాదులకీ, ఇటు జాతీయవాదులకీ మధ్యేమార్గంగా పాలనను కొనసాగిస్తుందని ఆశించవచ్చు.
పాలన విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పరిస్థితులు ఎలా ఉంటాయో ముఫ్తీకి తెలియనిది కాదు. తీవ్రవాదం తమ వ్యక్తిగత జీవితంలోకి ఏ స్థాయిలోకి చొచ్చుకుపోగలదో ఆమెకు 1989లోనే అనుభవమైపోయింది. అప్పట్లో మెహబూబా చెల్లెలు, రుబియా సయీద్‌ను కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు, ఆమెను అడ్డం పెట్టుకుని అయిదుగురు ఉగ్రవాదులను హాయిగా విడిపించుకున్నారు. ఇప్పటికీ కశ్మీర్‌లోని పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, మరింతగా దిగజారుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడి సైన్యం ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడల్లా, స్థానిక ప్రజలు నుంచి అనూహ్య స్థాయిలో ఉగ్రవాదులకు మద్దతు లభిస్తుండటమే తాజా తార్కాణం. మరోపక్క హిందూ పార్టీగా పేరొందిన బీజేపీతో మెహబూబా దోస్తీ పట్ల కూడా కశ్మీర్ సంప్రదాయవాదులు గుర్రుగా ఉన్నారు. వారి భావాలను, భయాలను కూడా గమనించుకోవలసి ఉంటుంది. బహుశా అందుకే మెహబూబా ముఖ్యమంత్రి పదవి తన చేతి దగ్గరకి రాగానే ఎగిరి గంతేయలేదు. కశ్మీర్ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న భరోసాను తనకి కల్పించాలంటూ పట్టుపట్టారు. అప్పుడే పదవిని చేపట్టేందుకు సిద్ధపడ్డారు. ఇంతకీ ఆమె ఆ పదవికి ఏ మేరకు వన్నె తెస్తారో రాబోయే కాలమే చెబుతుంది.