పండుగల తీరు మారుతోందా!
posted on Mar 25, 2016 @ 10:34AM
హోలీని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొని ఉండవచ్చు. కానీ ఈ రోజున ఏ ప్రమాదం జరుగుతుందా అని నిఘా వర్గాలు భయంభయంగా గడిపాయి. ఉగ్రదాడులకు సంబంధించి ఎక్కడి నుంచీ ఏ వార్తా వినిపించకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాయి. కేవలం ఉగ్రదాడులే కాదు... సంబరంలా జరుపుకోవాల్సిన పండుగను విషాదాంతం చేసేందుకు చాలానే ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి.
పర్యావరణం: ఒకప్పుడు పండుగలకి వాడే సరంజామా అంతా ప్రకృతిసిద్ధంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా కృత్రిమమైపోయింది. దీపావళి బాణాసంచాలో వాడే మెర్క్యురీ, మెగ్నీషియం, బేరియం… వంటి రసాయనాలన్నీ కూడా పర్యావరణానికి హానికలిగించేవే! హోలీ రంగుల్లో వాడే క్రోమియం, లెడ్ ఆక్సైడ్ వంటి రసాయనాలూ ఏమంత అమాయకమైనవి కావు. ఈ రసాయనాలను ఉపయోగించి పండుగను జరుపుకోవడం వల్ల, ఆ ధూళి వాతావరణంలో కొద్ది రోజుల పాటు ఉండిపోతుంది. ఈ తరహా కాలుష్యాన్ని RSPM (Respirable Suspended Particulate Material) అంటారు. ఒకోసారి ఈ RSPM ఉండతగిన పరిమితి కంటే 20 రెట్లు అధికంగా ఉంటోంది! ఇక వినాయకచవితి రోజున అడుగుల కొద్దీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు.
వాణిజ్యం: మన దేశంలో పండుగ వస్తోందంటే ఇప్పుడు చైనా సంస్థలు సంబరపడుతున్నాయి. ఎందుకంటే, సదరు పండుగకు సంబంధించి ఇబ్బడిముబ్బడిగా సరుకులు ఇక్కడికి తరలించవచ్చని వారి ఆశ. కారు చవకగా దొరికే ఆ సరుకులు దళారుల దగ్గర్నుంచీ వినియోగదారుల వరకూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. చైనా పటాసులు మరింత బాగా వెలుగునిస్తాయి. చెవులు చిల్లులుపడేలా పేల్తాయి. హోలీకి వాడే చైనా గులాల్, వాటర్‌గన్స్... కారుచవకగా దొరుకుతాయి. ఈ సరుకులో నాణ్యత ఉందా? పర్యావరణానికి సురక్షితమేనా? ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా? అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. తక్కువ ధరకు వస్తుందా లేదా అన్నదే ఇక్కడి ప్రాధాన్యత! ఒకప్పుడు పండుగ వస్తోందంటే సమాజంలోని అన్ని వర్గాల వారూ సంతోషంగా ఉండేవారు. అమ్మకం దారులకి కావల్సిన అవకాశం ఉండేది. కేవలం దీపావళి, హోలీ, వినాయకచవితి వంటి పండుగలను ఆసరాగా చేసుకుని నడిచే కుటీర పరిశ్రమలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది దేశీయంగా ఉత్పత్తి చేసిన హోలీ సరుకులో నాలుగో వంతు కూడా అమ్ముడుపోలేదనీ అసోచామ్ చెబుతోంది.
ఆరోగ్యం: పండుగలకి వాడుతున్న రసాయనాలు పర్యావరణాన్నే కాదు, ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నయి. పరిస్థితి ఎంత చిత్రంగా ఉందంటే చైనా నుంచి దిగుమతి అయిన వాటర్‌గన్స్‌ని వాడినా కూడా చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బాణాసంచాకి వాడే పటాసుల వల్ల ఊపిరితిత్తులు (సల్ఫర్ డయాక్సైడ్) మొదల్కొని కిడ్నీల (కాడ్మియం) వరకూ దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక హోలీ రంగుల్లో వాడే కాపర్ సట్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్ వంటివి కంట్లో పడినప్పుడు కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. దిల్లీలోని ‘శ్రీగంగారామ్ ఆసుపత్రి’కి హోలీనాడు, వేయి మందికి పైగా రోగులు నేత్ర సమస్యలతో వస్తూ ఉంటారని చెబుతున్నారు. ఈ సంఖ్య ఒక్కటీ చాలు, మనం పండుగలను ఎంత జాగ్రత్తగా జరుపుకోవాలో హెచ్చరించడానికి!
తీరు మారుతున్న పండుగల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. సందిట్లో సడేమియాలా పండుగనాడు విధ్వంసం సృష్టించాలనుకునే ఉగ్రవాదులు, పండుగనాడు వినియోగదారులతో ఎలాగైనా కొనుగోలు చేయాలని చూస్తున్న ఆన్‌లైన్ అమ్మకందారులు, అప్పు చేసైనా పండుగ జరుపుకోవాలనుకుంటున్న మధ్య తరగతి మానవులు... ఇలా సామాజికంగా, సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగలను ఒక ప్రహసనంగా మార్చివేస్తున్నారు.
పండుగల మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగమని గర్వంగా చెప్పుకునే మనకి, ఆ సంప్రదాయపు మూలాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పర్యావరణానికి అనుకూలంగా, ఆడంబరాలకు పోకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు ఆలోచనని మర్చిపోయి కేవలం ఆచరణ మీదే ధ్యాస ఉంచితే... మిగిలేది ఆర్భాటమే!