ఈ రంగుల పండుగ మన సొంతం!
posted on Mar 23, 2016 @ 10:37AM
మార్చి 22, 23, 24.... వీటిలో హోళీ ఏ రోజు అన్న సందిగ్ధం తీరిపోయింది. దేశవ్యాప్తంగా నేడు హోళీని జరుపుకొనేందుకు సిద్ధపడిపోయారు. ఈపాటికే జనం పాత బట్టలు బయటకు తీసి, గులాల్ పాట్లాలతో రంగుల యుద్ధంలో మునిగిపోయి ఉంటారు. ఈ హడావుడిలో హోళీ భారతీయులకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అన్న విషయం చాలామంది పట్టించుకోరు.
హోళీ అంటే ప్రపంచాన్ని రంగులకలగా మార్చివేసే ఓ పండుగ. కులాలుగా, మతాలుగా... ఆఖరికి వర్ణాలుగా చీలిపోయిన భారతీయ సమాజంలో, ఈ హోళీని మించిన సమైక్య గీతం మరేముంటుంది. ఏ బేధమూ లేకుండా... తమలోని ప్రాణం ఒక్కటే అనేంతగా సంబరాలు జరుపుకొనే ఉత్సవం మరేముంటుంది. హోళిక తగలబడిపోయిందనో, రాధాకృష్ణులు రంగులాడుకున్నారనో, కామదహనం జరిగిందనో... కారణాలు ఏవైనాగానీ... రంగుల ఉత్సవాన్ని చేసుకోవడానికి అవన్నీ ఓ ప్రేరణ కలిగించేవే! బహుశా అందుకే హోళీవంటి పండుగ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందులోనూ ధార్మికమైన కారణం ఉన్న పండుగలు అసలు కనిపించవు! కావాలంటే మీరే చూడండి...
- స్పెయిన్‌లోని వలన్‌సియాన్ నగరంలో ఏటా టమోటాల పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం నాడు జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుని సంబరపడిపోతారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది.
- స్పెయిన్‌లోనే ‘హారో వైన్ ఫెస్టివల్’ పేరుతో, ఒకరి మీద ఒకరు, ద్రాక్షసారాయిని ఒంపుకునే ఉత్సవం జరుగుతుంది. ఏటా జూన్‌లో జరిగే ఈ పండుగ వెనుక 700 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు.
- ఇటలీలోని ఇవియా పట్టణంలో నారింజలను విసురుకునే పండుగ ఫిబ్రవరిలో జరుగుతుంది. 13వ శతాబ్దంలో జరిగిన ఓ ప్రజా విప్లవాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
పైన పేర్కొన్నవన్నీ కూడా స్థానికంగా జరిగే ఉత్సవాలు. ఇలాంటి పండుగలు అక్కడక్కడా అడపాదడపా కనిపించేవే. కానీ ఇవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో, సవాలక్ష నిబంధనలతో జరిగేవి. పర్యాటకులను ఆకర్షించడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ హోళీ పంథానే వేరు. అందుకే ఇప్పుడు హోళీని వేరే దేశాలవాళ్లు కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ‘ఫెస్టివల్ ఆఫ్ కలర్స్’ పేరట ఒక బృందం దీన్ని ఖండాంతరాలుగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బృందం ఆధ్వర్యంలో నాలుగు ఖండాల్లో హోళీని ఓ ఉత్సవంలా జరుపుకొంటున్నారు. అంటే హోళీలాంటి పండుగ ఏదుందా అని వెతకడం మానేసి, ప్రపంచమే ఇప్పడు హోళీని ఆచరిస్తోందన్నమాట. ఈ పండుగలో ఉన్న ఆకర్షణ గురించి ఇంతకంటే ఏం చెప్పగలం.
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హోళీని అంత విస్తృతంగా జరుపుకొనేవారు కాదు. ఇదేదో ఉత్తరాది పండుగ అన్న భావం ఇక్కడి ప్రజలకు ఉండేది. అసలు హోళీని కాముడి పున్నమిగానే తెలుగునాట పిలుస్తారు. శివుడు, మన్మథుని భస్మం చేసిన రోజు ఇది అన్నది ప్రజల నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే భోగిమంటల్లాగా మంటల వేసే సంప్రదాయం ఒకటి ఉంది. కానీ ఇప్పుడు హోళీని తెలుగు పండుగలలో ముఖ్యమైన పండుగా భావించడం మొదలైపోయింది. బహుశా ఇదే మన దేశ విశిష్టత! ఒకే పండుగను దేశంలోని లక్షలాది కిలోమీటర్ల కొద్దీ ఎలాంటి అరమరికలూ లేకుండా చేసుకోగలం. ఈ సంప్రదాయం మనది అనుకున్నప్పుడు దాన్ని వేల సంవత్సరాలుగా ఆచరించగలం!