మంత్రి కావడానికి అర్హత అక్కర్లేదా!

  అనగనగా ఓ ఆరోగ్యశాఖా మంత్రి. ఆయనగారు ఆసుపత్రిని చూసేందుకు వెళ్లారు. ఆసుపత్రిలోపల అడుగుపెట్టేసరికి అక్కడ ‘మెటర్నటీ వార్డు’ కనిపించింది. అది ఏమిటని అడిగారు- ‘అది స్త్రీల కోసం నిర్మించిన వార్డు’ అని జవాబు వచ్చింది. ‘మరి పురుషులకి మెటర్నిటీ వార్డు’ ఎందుకు లేదని ఎదురు ప్రశ్నించారు మంత్రివర్యులు. ఇది నిజంగా జరిగిందని కొందరూ, ఏదో సరదాకి సృష్టించబడిందని కొందరూ చెబుతుంటారు. కానీ ఇందులో అమాయకత్వం మాత్రమే ఉంది. విషయం తెలిస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంది. కానీ మూఢత్వం ఉంటే ఏంటి పరిస్థితి! ఇప్పుడు దేశం అంతా ఇదే చర్చ నడుస్తోంది! మంత్రులుగా ఉన్నవారికి మన సంస్కృతి మీద గౌరవం ఉండటం తప్పేమీ కాదు. పైగా అది అదనపు అర్హత కూడా! దేశం పట్ల మరింత శ్రద్ధగా పనిచేసేందుకు ఆ గౌరవం తోడ్పడుతుంది. కానీ ప్రతిదీ మన దేశంలోనే ఉద్భవించిందనీ, పాశ్చాత్యులు కనుగొన్నదంతా ట్రాష్‌ అనీ చేసే వాదన పిడివాదానికి దారితీస్తుంది. జ్ఞానం ఏ ఒక్క దేశం సత్తు కాదు. అది ప్రపంచ హక్కు! కాబట్టే ఈ రోజు మనం ఇంత సౌకర్యంగా జీవించగలుగుతున్నాం. ఇంత తెలివిగా మసులుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా జ్ఞానం అంతా భారతీయుల సొత్తు అని నిరూపించే ప్రయత్నం చేయడం, ప్రతి అంశాన్నీ భారతదేశ పురాణాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయడం అంటే... కాళ్లు వెనక్కి తిప్పి నడవడమే! ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ డార్విన్‌ సిద్ధాంతాన్ని ఆమోదించేశాయి. రామాయణంలో కోతుల ప్రస్తావన, వామనుడి అవతారం ఈ సిద్ధాంతాన్ని బలపరిచేవే అని వాదించేవాళ్లూ లేకపోలేదు. కానీ ఒక పెద్దాయనకి ఆ సిద్ధాంతం నచ్చలేదు. కోతి మనిషిగా మారడాన్ని ఎవడన్నా అడవికి వెళ్లి చూశాడా అంటూ గయ్‌ మన్నాడు. అంతేకాదు! మంత్రాలన్నీ laws of motionని నిరూపించే సిద్ధాంతాలు అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ అన్న మనిషి ఎవరో సామాన్యుడు కాదు. కేంద్ర మానవవనరుల, ఉన్నతవిద్య శాఖా మంత్రి ‘సత్యపాల్‌ సింగ్‌’గారు. తన ఆలోచనల ప్రకారం పాఠ్యపుస్తకాలు మార్చేయాలని కూడా చెబుతున్నారు! విద్యాశాఖామంత్రే ఇలా మాట్లాడితే ఇక చెప్పేదేముంది. ఇదే దారుణం అనుకుంటే ఇంతకంటే చిత్రమైన ఉపమానాలు పలు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. ఉదాహరణకు అసోంలో మంత్రిగా పనిచేస్తున్న ‘హిమాంత విశ్వ వర్మ’నే తీసుకోండి. మనం చేసే పాపాల వల్లే కేన్సర్‌, ప్రమాదాలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని కర్మసిద్ధాంతాన్ని వెలువరించారు. ఇంతకీ ఈయన ఏ శాఖ మంత్రో చెప్పలేదు కదా... ఆరోగ్యశాఖ మంత్రి!!! తవ్వుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు తట్టెడు కనిపిస్తాయి. మంత్రులేం ఖర్మ, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ వంటి వ్యక్తే, తనకేది తోస్తే అది చెప్పుకొంటూ వివాదాలు పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ పోటీలో తామేం తక్కువ తినలేదంటూ సాక్షిమహరాజ్ వంటి పార్లమెంట్‌ సభ్యులు సైతం నోటిని ఎడాపెడా ఆడించేస్తున్నారు. దాంతో పుష్పక విమానాల నుంచే విమానాలు వచ్చాయనీ, సీతాదేవి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అనీ రకరకాల కబుర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏదన్నా శాఖకి మంత్రిగా నియమించేందుకు సదరు వ్యక్తి అర్హతలను, అనుభవాన్నీ పరిగణలోకి తీసుకునేవారు. కానీ పరిస్థితి మారిపోయింది. బాగా మాట్లాడతారనో, నమ్మకస్తులనో, అనుకూలంగా పనిచేస్తారనో, అసమ్మతితో ఉన్నాడనో, మిత్రపక్షం వాడనో... ఇలా నానా కారణాలతో మంత్రులుగా నియమిస్తున్నారు. ఆ కారణాల మధ్య ప్రతిభ అన్న కారణం మాత్రం కాగడా పెట్టినా కనిపించడం లేదు. పైన చెప్పుకొన్న ఉదాహరణలలో ఎక్కువ బీజేపీ వ్యక్తులవి ఉన్నంత మాత్రాన, మిగతా పార్టీలు నిష్కళంకంగా ఉన్న అపోహ పడటం మంచిది కాదు. నిన్నటికి నిన్న కర్నాటకలో ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ‘నాకు విద్యాఖాఖ వద్దు మొర్రో, నాకు ఆసక్తి లేదు’ అని చెప్పినా వినకుండా... కుమారస్వామి ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇష్టమూ, అర్హతా లేని పదవిని ఆ వ్యక్తి ఎలా నిర్వహిస్తారో అన్న ఆలోచన కూడా లేకపోయింది. దీని వల్ల చివరికి నష్టపోయేది ఎవరయ్యా అంటే....

ప్రణబ్‌ వ్యూహం అదిరిపోయిందిగా!

  ఎప్పుడెప్పుడా అని దేశం అంతా ఎదురుచూస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ నాగ్‌పూర్‌ యాత్ర ముగిసింది. అనుకున్నట్లుగానే ప్రణబ్ ముఖర్జీ నొప్పించక తానొవ్వక అన్న రీతిలో ప్రసంగాన్ని లాక్కువచ్చారు. అరెస్సెస్‌ను పొగిడితే కాంగ్రెస్‌కు ఎక్కడ కాలుతుందో అనీ, తిడితే ఎక్కడ బీజేపీ భగ్గుమంటుందో అనీ గాల్లో తాడు మీద నడిచినంత సుతారంగా ప్రసంగాన్ని సాగించారు. అదే సమయంలో పటేల్‌ను పొగిడి ఆరెస్సెస్‌, పరమత సహనం గురించి మాట్లాడి కాంగ్రెస్‌ చంకలు గుద్దుకునేలా చేశారు. ప్రణబ్‌ ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా... ఆయన సమావేశానికి హాజరు కావడం వల్ల ఆరెస్సెస్‌ వైపే లాభం మొగ్గు చూపుతోంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌వాదులు వెలివేసీ, వెక్కిరించిన ఆరెస్సెస్‌ ప్రాంగణంలో అడుగుపెట్టడం అంటేనే ఆ సంస్థ ప్రాముఖ్యతని ఆయన గుర్తించినట్లు. పైగా హెగ్డేవార్‌ని భారతదేశపు ముద్దుబిడ్డగా అభివర్ణించడంతో, ఆరెస్సెస్‌ సంబరానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పటివరకూ కాంగ్రెస్, గాంధీని చంపిన సంస్థగా ఆరెస్సెస్‌ను దుమనమాడేది. అలాంటి సంస్థనీ, దాని వ్యవస్థాపకుడినీ పొగిడిన ప్రణబ్‌ చర్య మింగుడుపడటం కష్టమే! ప్రణబ్‌ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఆయన మాటల్ని అంతా మర్చిపోతారనీ... ఆయన ప్రసగించిన దృశ్యాలని మాత్రం ఆరెస్సెస్, బీజేపీ అవాస్తవాలని జోడించి తమకు అనుకూలంగా మార్చేసుకుంటాయని సాక్షాత్తు ఆయన కూతురు శర్మిష్ఠ హెచ్చరించారు. నిజంగానే సమావేశం ముగిసిన తర్వాత హిందుత్వవాదులు, తమకు అనుకూలమైన వార్తల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రణబ్‌ తల మీద ఆరెస్సెస్‌ టోపీ పెట్టుకొని, వారి తరహాలోనే అభివాదం చేస్తున్నట్లు మార్ఫ్ చేసిన ఫొటోలను వదిలారు. ఇదంతా పక్కన పెడితే... అసలింతకీ ప్రణబ్‌ దా తగుదునమ్మా అంటూ ఆరెస్సెస్ సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు. పెద్ద మనిషిగా నాలుగు మంచి మాటలు చెప్పడానికా అంటే కాదు, పాత వైరాలన్నీ మర్చిపోయి కలిసిపోవడానికా అంటే అదీ కాదు... మరెందుకు! ప్రణబ్ పైకి కాంగ్రెస్‌కు వీరవిధేయుడిలాగానే కనిపిస్తారు. ఆయనను రాష్ట్రపతిని చేయడం ద్వారా కాంగ్రెస్ అందుకు తగిన గుర్తింపుని కూడా అందించింది. కానీ ప్రణబ్‌ మనసులో ఇంకా ఏదో లోటు ఉన్నట్లు కనిపిస్తుంది. పైకి చెప్పుకోకపోయినా మొదటి నుంచీ ప్రణబ్‌కు ప్రధాని పీఠం మీద ఆసక్తి ఉంది. ఇందిరాగాంధీ మరణం తర్వాత తనకు తప్పకుండా ఆ పీఠం దక్కుతుందని ఆశించారు ప్రణబ్‌. కానీ రాజీవ్‌ రంగప్రవేశంతో హతాశుడయ్యాడు. అందుకే కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ నుంచి దూరమై సొంత కుంపటి పెట్టుకున్నారు. రాజీవ్ మరణం తర్వాత పీ.వీ నరసింహరావు, ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్‌లు ప్రధాని పదవిని సాధించారు కానీ ప్రణబ్‌కు మాత్రం మొండిచెయ్యే మిగిలింది. తనకి హిందీ రాకపోవడం వల్లే ప్రధానిని కాలేకపోయానని సరదాగా అన్నా, తనతటి మేధావికి ప్రధాని పదవి దక్కకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని అంటారు. ఇంతకీ అసలు విషయానికి వస్తే... ఈమధ్యకాలంలో మోదీ-షాల ప్రభ కొడిగడుతున్నట్లు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్‌ను చూస్తేనేమో పూర్తిస్థాయి మెజారటీ దక్కించుకునేట్లు లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా... రాహుల్‌గాంధీనే వారి ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలుస్తాడు. అదే ప్రతిపక్షాలన్నింటికీ దగ్గరగా ఉండి మూడోకూటమిని గెలిపించుకుంటే! కాంగ్రెస్ లేదా బీజేపీల మద్దతుతో అధికారంలోకి వస్తే! ఇదంతా జరగాలంటే మూడో కూటమికి ఓ పెద్దమనిషి ప్రధాని అభ్యర్థిగా ఉండాలి. అతను అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి కూడా ఆమోదయోగ్యం అయి ఉండాలి. ప్రస్తుత వాతావరణంలో అలాంటి వ్యక్తి ఎవరా అని పరిశీలిస్తే... బహుశా ప్రణబ్‌ పేరే ముందు వినిపిస్తుందేమో! ప్రణబ్‌ ఆలోచన కూడా ఇదే అయితే... ఆయన వ్యూహం అదిరిపోయిందిగా!!!

40మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన కేసీఆర్

  ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెరాస పార్టీని స్థాపించిన కెసిఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో, ప్రజల నమ్మకంతో సీఎం అయ్యారు.. కెసిఆర్ కూడా ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునే దిశగా పరిపాలన చేస్తున్నారు.. చేస్తూనే వున్నారు. దానితో పాటే పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు.. 2014 ఎన్నికల్లో 63 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న తెరాస.. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరికొన్ని స్థానాలు గెలిచింది.. అలానే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేల చేరికతో.. తెరాస ఎమ్మెల్యేల సంఖ్య 90 కి చేరింది. రోజురోజుకి పార్టీ బలోపేతం అవ్వడం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడంతో వచ్చే ఎన్నికల్లో తెరాస కి తిరుగులేదనుకున్నారు.. కానీ ఒక నివేదిక కెసిఆర్ కే కాదు, ఆ పార్టీ సీనియర్ నాయకులకి కూడా షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఆ నివేదిక ఏంటంటే.. 90 మంది తెరాస ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందా? అని కెసిఆర్ ఒక నివేదిక తయారు చేయించారట. ఆ నివేదికే కెసిఆర్, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడానికి కారణం అయ్యిందంట.. ఆ నివేదికలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని తెలిసిందట..వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరీ 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడం.. దానికితోడు వారిలో మంత్రులు కూడా ఉండటంతో.. కెసిఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందుకే కెసిఆర్, 'వీలైనంత త్వరగా పద్ధతి మార్చుకొని ఎన్నికలలోపు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి.. లేదంటే మీ స్థానాల్లో వేరేవాళ్లు పోటీకి దిగుతారు' అంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారంట.. అయితే ఈ నివేదికలో కెసిఆర్ ఆనందపడే విషయం కూడా ఒకటుంది.. అదేంటంటే.. తెరాస పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారంట.. అందుకే కెసిఆర్, అవసరమైతే పనితీరు సరిగ్గాలేని ఎమ్మెల్యేల స్థానాల్లో వేరే వాళ్ళని పోటీకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. చూద్దాం ఆ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకుంటారో లేక పదవులు పోగొట్టుకుంటారో.

ఓలా ఉబర్‌లలో ప్రయాణం క్షేమమేనా!

  మనలో ఆనుమానం పాళ్లు కాస్త ఎక్కువ. అందుకే ఏదన్నా టెక్నాలజీని అంగీకరించేందుకు పదిసార్లు ముందూవెనకా ఆలోచిస్తాం. అదే సమయంలో వ్యసనం పాళ్లు ఎక్కువే! అందుకే ఏదన్నా అంగీకరించిన తర్వాత, దాన్నే పట్టుకు వేళ్లాడతాం. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు, సెల్ఫీలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌... ఇలా అన్నింటా భారతీయులే ముందు ఉండటానికి బహుశా కారణం ఇదే! ఇప్పుడు ఈ జాబితాలోకి ఆన్‌లైన్ టాక్సీలు కూడా చేరాయి. ఒకప్పుడు పదికీ పరకకీ... ఇంకా మాట్లాడితే ఉచితంగా కూడా ఎక్కించుకుంటాం అని చెప్పి ఓలా, ఉబర్‌ లాంటి ఆన్‌లైన్ టాక్సీ ప్రొవైడర్స్ వినియోగదారులని ఆకట్టుకున్నాయి. నిదానంగా డైనమిక్‌ ప్రైసింగ్‌ పేరుతో ట్రాఫిక్‌ని, వాతావరణాన్ని బట్టి ఎడాపెడా ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి. ఏదో వాళ్ల వ్యాపారం వాళ్లది కదా... అని పంటిబిగువున ఓపిక పట్టారు ప్రజలు. కానీ ఇప్పుడు ఏకంగా వినియోగదారుల రక్షణే ప్రశ్నార్థకంగా మారిపోతోంది. 2014లో ఉబర్‌లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి మీద, డ్రైవర్‌ అత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో ఉబర్‌ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఒక పాత నేరస్తుడిని, కనీసం డ్రైవింగ్‌ లైసన్స్‌ కూడా లేనివాడిని పనిలో పెట్టుకుంది ఉబర్. పైగా ఆ కారుకి జీపీఎస్ ట్రాకింగ్‌ సిస్టం కూడా లేకపోయింది. ఈ సంఘటనతో దిల్లీ ప్రభుత్వం ఏకంగా ఉబర్‌ మీద కొన్నాళ్లపాటు నిషేదమే విధించింది. అయితే ఇది మొదలు మాత్రమే! గూగుల్‌లో ఇప్పుడు ఓలా లేదా ఉబర్‌ అని టైప్‌ చేస్తే ఏదో ఒక నేరం గురించి కనిపిస్తోంది. ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించారనో, అత్యాచార యత్నం చేశారనో, దురుసుగా ఉన్నారనో... ఏదో ఒక వార్త కనిపిస్తుంది. ఇక వెలుగులోని రాని వార్తల సంగతి దేవుడికెరుక. ఎప్పటిలాగే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఓలా, ఉబర్‌లు విచారాన్ని వ్యక్తం చేస్తాయి. ప్రయాణికులే తమ దేవుళ్లని ప్రకటనలు గుప్పిస్తాయి. కానీ మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో ఎవరూ చెప్పరు! ఒక వ్యక్తిని డ్రైవరుగా అంగీకరించి మనం టాక్సీ ఎక్కుతున్నాం అంటే... అతని మీద నమ్మకం ఉండబట్టే! మరి ఆ వ్యక్తి నమ్మకస్తుడని నిర్ధారించేందుకు కంపెనీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అతని మీద ఎలాంటి కేసులూ లేకుండా ఉండాలి; అతని డ్రైవింగ్‌ని స్వయంగా కంపెనీ ప్రతినిధులు పరిశీలించి చూడాలి; అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలి; ఎప్పటికప్పుడు అతని మానసిక స్థితిని అంచనా వేసే కౌన్సలర్లు ఉండాలి; ప్రయాణీకుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా సర్వీసు నుంచి తొలగించేంత కఠినంగా ఉండాలి; డ్రైవింగ్‌లో మెలకువలకు, ప్రయాణీకులతో ప్రవర్తించల్సిన తీరు మీద ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌మెంట్‌ కోర్సులు నిర్వహించాలి.... వీటిలో ఎన్నింటిని ఓలా, ఉబర్ సంస్థలు పాటిస్తున్నాయి అన్నదే మన సందేహం! మన దేశంలో నేరాలు వ్యక్తిగతం నష్టం కలిగించనంతవరకూ ఎవరూ పట్టించుకోరు. ప్రభుత్వాలూ అంతే ఉదాసీనంగా ఉంటాయి. అందుకే ఏ రంగంలో అయినా సరే... ప్రైవేట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటారు. ఓలా, ఉబర్‌ల మీద ఇన్ని ఆరోపణలు ఏ ఐరోపా దేశంలోనో వచ్చుంటే వాటి పరిస్థితి ఏంటో వేరే చెప్పనవసరం లేదు!!!

బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన ప్రజలు- మోదీ మేలుకొంటారా?

  నిన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇంచుమించుగా వచ్చేశాయి. వీటిని చూసి బీజేపీ శ్రేణులు బావురుమంటున్నాయి. నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ ఏకంగా మూడు స్థానాలలో బొక్కబోర్లాపడింది. వీటిలో రెండు బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు ఉన్న స్థానాలు కావడం గమనార్హం. ఒకప్పుడు అచ్ఛేదిన్‌ నినాదంతో దేశాన్ని ఊపేసిన బీజేపీకే ఇప్పుడు రోజులు గడ్డుగా కనిపిస్తున్నాయి. మోదీ- అమిత్‌షాల ప్రభ కొడిగడుతూ ప్రమాదఘంటికలను మోగిస్తోంది.   బీజేపీకి అన్నింటికంటే అవమానకరమైన ఓటమి ‘కైరానా’లో జరిగింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఇప్పటికే అక్కడి గోరఖ్‌పూర్‌ స్థానాన్ని కోల్పోయిన పార్టీ శ్రేణులు పుట్టెడు భారంతో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప్పు నిప్పులా ఉండే ప్రతిపక్షాలన్నీ ఏకమై కైరానాలో గెలుపుని కైవలం చేసుకున్నాయి. పార్టీలకు కావల్సింది విజయమే కాబట్టి, వచ్చే ఎన్నికలలో కూడా ఇలాంటి పొత్తులే జరుగుతాయన్న హెచ్చరికలను అధికార పార్టీకి పంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో నూపుర్‌ అసెంబ్లీ ఎన్నికలను కూడా బీజేపీ చేజార్చుకుంది. దాంతో యూపీలో యోగిరాజ్‌ పాలన పట్ల ప్రజలు ఏమంత తృప్తిగా లేరని తెలిసిపోతోంది.   మహారాష్ట్ర భాంద్రా, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానాలను కూడా బీజేపీ చేజార్చుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీ పట్ల ఎలాంటి కనికరాన్నీ చూపలేదు. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన పది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కేవలం రెండే స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల వీస్తున్న వ్యతిరేక పవనాలకు ఈ ఫలితాలను ఓ నమూనాగా భావించడంలో తప్పులేదు. వీటిలో మణిపూర్‌ పరిస్థితి బీజేపీకి సంకటమే! మణిపూర్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌, నేషనల్‌ పీపుల్స్ పార్టీ చెరో ఇరవై స్థానాల్లో ఉన్నాయి. తాజా విజయంతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దాంతో గవర్నర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ను మరోసారి బలనిరూపణకు ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది.   ఇంతకీ మోదీ పాలన మీద ప్రజలు ఎందుకిలాంటి తీర్పునిచ్చారు? ఈ దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రధానమంత్రిగా పేర్కొన్న వ్యక్తిని ఎందుకిలా తిరస్కరించారు? అనే ప్రశ్నలకు చాలా తేలికగానే జవాబులు కనిపిస్తాయి. మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగాలు, ట్విట్టర్‌ సందేశాలలో తప్ప దేశంలో అభివృద్ధి జరిగినట్లు ఎక్కడా కనిపించడం లేదు. అంతర్జాతీయ ర్యాంకులలో దేశం అన్ని విధాలా వెనకబడుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం, బ్యాంక్ కుంభకోణాలు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, స్వచ్ఛ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా... లాంటి పథకాలన్నీ విజయానికి దూరంగానే నిలిచిపోయాయి. వీటికి తోడు రోజు తర్వాత రోజు పెరుగుతున్న పెట్రోలు మంటలు సరేసరి! ఈ మంటలు ఏకంగా ఓటర్ల గుండెల్లోనే మండినట్లు తాజా ఫలితాలు తెలియచేస్తున్నాయి.   ఇప్పటికైనా మోదీ మేలుకొంటారా? తన పాలనలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని ఒప్పుకొంటారా? సరిదిద్దుకునేంత ఉదారత చూపిస్తారా? అనుమానమే!

ముందే అద్వానం.. మళ్లీ అధికారం కష్టమే...!

  ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు...బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కొన్ని సంఘటనలు అన్నీ కలిసి బీజేపీపై వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఇప్పుడు దానికితోడు మధ్యప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ వ్యతిరేకతను ఇంకా మూటగట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఏకంగా ఓ 80 ఏళ్ల రైతుకు నోటీసులు జారీ చేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. అసలు సంగతేంటంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు నిరసనగా జూన్ 1 తేదీన నీముచ్ తాలుకా ఆఫీస్ ముందు భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఒకటి నిర్వహించనున్నారు. దీనికి భారీ ఎత్తున రైతులు హాజరు కానున్నారని.. ప్రభుత్వ తీరుపై తమకున్న అసంతృప్తిని ప్రదర్శించనున్నారని చెబుతున్నారు. అంతే ఇప్పుడు వారిని ధర్నాని అడ్డుకునే పనిలో పడ్డారు స్థానిక అధికారులు. దీనిలో భాగంగానే..  రైతులకు నోటీసులు ఇస్తూ.. తమ వద్దకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే 80 ఏళ్ల వృద్ధ రైతు గణేశ్రమ్ పాటిదార్ కు నోటీసులు జారీ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అధికారులు పప్పులో కాలేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే అధికారులు నోటీసులుజారీ చేసినట్టు తెలుస్తోంది.   ఎందుకంటే.. అధికారులు నోటీసులు అందుకున్న పాటిదార్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడట. అలాంటి వ్యక్తికి వెంటనే అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో జనం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో అసలే ఎంపీలో ప్రభుత్వం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ప్రజలకు ఇంకా మంట పుట్టేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఎఫెక్ట్ వచ్చే ఎంపీ ఎన్నికలపై పడుతుందని.. బీజేపీ డౌన్ ఫాల్ కు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు స్పష్టం చేస్తాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వేలకు వేల కోట్లు కాజేసి వెళ్లిన వాళ్లకి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వడం చేతకాదు కానీ ఈ ప్రభుత్వాలకి.. చిన్న చిన్న రైతులకు, సామాన్యులపై మాత్రం తమ పైశాచికం చూపిస్తాయి. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పే రోజులు ముందు ముందు ఉన్నాయి.

బీజేపీకి ఇవాళ అగ్నిపరీక్ష

  ఇవాళ దేశవ్యాప్తంగా 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి ఎన్నికలు సాధారణమే అనుకోండి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జరుగుతున్న 4 లోక్‌సభ ఎన్నికల విషయంలో మాత్రం దేశం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకు కారణాలు తెలియనివి కావు... కానీ ఓసారి గుర్తు చేసుకోవడంలో తప్పూ లేదు.   నాలుగు లోక్‌సభ స్థానాల్లో ముందుగా కైరానా గురించి చెప్పుకోవాలి. ఇక్కడి బీజేపీ లోక్‌సభ సభ్యుడు హుకుం సింగ్ మృతితో ఎన్నిక అనివార్యమైంది. హుకుం సింగ్‌కు హిందూ అతివాదిగా పేరుంది. పైగా అక్కడ జరుగుతున్న ఎన్నికలకి ప్రతిపక్షాలన్నీ కలిసి మరీ అభ్యర్థిని నిలబెట్టాయి. అసలే గోరఖ్‌పూర్‌లో జరిగిన ఉప ఎన్నిక ఓటమితో దిమ్మ తిరిగిపోయి ఉన్న యోగి ఆదిత్యనాధ్‌కు ఈ స్థానంలో గెలుపు చావోరేవోగా మారింది. ఇక్కడ కూడా ఓడిపోతే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆయన ప్రభ కొడిగడుతున్నట్లుగానే భావించాలి.   మహారాష్ట్రలోని పల్గర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న లోక్‌సభ ఉప ఎన్నిక కూడా ఆసక్తికరంగానే ఉంది. పైకి మిత్రపక్షంలా కనిపిస్తున్నా... బీజేపీ మీద ఘాటైన విమర్శలు చేయడంలో ఈమధ్య శివసేన జంకడం లేదు. అందుకే పల్గర్‌లో బీజేపీ అభ్యర్థి మృతి వల్ల ఖాళీ ఏర్పడినప్పటికీ ఉప ఎన్నికలలో, మొహమాటం లేకుండా తన అభ్యర్థిని కూడా నిలబెట్టింది. ఈ స్థానంలో గెలవడం బీజేపీకి మాత్రమే కాదు... కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన పార్టీలకు కూడా అవసరమే!   మహారాష్ట్రలోనే ఉన్న భాంద్రా-గోడియా లోక్‌సభ ఎన్నిక కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ స్థానం కూడా ఒకప్పుడు బీజేపీదే. కానీ నానా పటోలే అనే లోక్‌సభ సభ్యుడు తన సొంత పార్టీ విధానాల మీదే తిరుగుబాటు బావుటా ఎగరేసి, తన స్థానానికి రాజినామా చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరం పడింది. ఇలా ఖాళీ అయిన స్థానాన్ని దక్కించుకునేందుకు ఎన్సీపీ మంచి పట్టుదలతో పావులు కదుపుతోంది.   నాగాలండ్‌లో ఉన్న ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి కూడా ఈరోజు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఈ పోరులో ఏదో ఒక స్థానిక పార్టీ మాత్రమే గెలిచే అవకాశం ఉంది.   అంటే బీజేపీ మూడు స్థానాలలో తన అభ్యర్థిని తిరిగి గెలిపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పటికే పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూడు సీట్లు కూడా చేజారిపోతే బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ప్రతిపక్షాలు ఒత్తిడి చేయవచ్చు. అలాంటి సందర్భాన్ని నివారించేందుకు బీజేపీ ముందస్తు ఎన్నికలకూ వెళ్లవచ్చు. పైగా ఉన్న స్థానాలను పోగొట్టుకోవడం అంటే ప్రజలు స్థానిక బీజేపీ పాలనలో తృప్తిగా లేరన్న సూచనను కూడా అందిస్తాయి. రాబోయే ఎన్నికల మీద ఈ ఫలితాలు తప్పకుండా ప్రభావం చూపుతాయి. ఇప్పటికే బీజేపా ఉప ఎన్నికలలో వరుసగా ఓడిపోతూ వస్తోంది. అలా ఓటములతో మూలుగుతున్న పార్టీ మీద కర్ణాటక తాటిపండు పడనే పడింది. ఇలాంటి పరిస్థితులలో మరో ఓటమి అంటే... అమిత్‌షా వ్యూహానికి అడ్డుపడినట్లే!

తిరుపతి మీద అంత రచ్చెందుకు రమణా!

  తెలుగువాడికి, ఆ మాటకి వస్తే దక్షిణాదికి ఇలవేల్పు వెంకన్న దేవుడే! అందుకే తిరుమలలో ఏం జరిగినా సంచలనమే! ఒక పూట భక్తులు రాకపోయినా వార్తే, ఒక పూట భక్తులు కిటకిటలాడినా వార్తే! వెంకన్న దర్శనం కోసం ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయో కూడా ఓ వార్తే! అందుకే వెంకన్నని ప్రత్యక్షంగా సేవ చేసుకునే పూజారులకి కూడా సెలబ్రెటీ స్టేటస్‌ ఉంటుంది. కానీ ఆ పదవికి వన్నె తేవడం పోయి, వివాదాలు సృష్టించడం మొదలైపోయింది. ఈ సంప్రదాయానికి ముందుగా డాలర్‌ శేషాద్రి నాంది పలికారని చెప్పుకోవచ్చు. కాస్త పేరున్నవ్యక్తులు తిరుమలకు రాగానే పరుగుపరుగున వారికి స్వాగతాలు పలకడం, దగ్గరుండి వారికి దర్శనం చేయించడం, ప్రైవేటుగా పూజలు నిర్వహించడం లాంటి పనులతో శేషాద్రివారు తరచూ వార్తల్లోకి ఎక్కేవారు. అందుకే తిరుమల ఊరేగింపుల్లో పాల్గొనే భక్తులు, స్వామివారి ఉత్సవ విగ్రహం తర్వాత శేషాద్రినే ఆసక్తిగా గమనించేవారు.   ఇక శేషాద్రి పరపంరని కొనసాగిస్తూ రమణ దీక్షితులు కూడా నిత్యం వార్తల్లో నిలవడం మొదలుపెట్టారు. మనవడిని గర్భగుడిలోకి తీసుకువెళ్లడం, కొడుకులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వామి సేవలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి సంచలనాలకు తెరతీశారు. చివరికి ప్రభుత్వం తనని తొలగించడంతో ఏకంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. పదేళ్లకు ముందు జరిగిన సంఘటలన్నీ ఏకరవు పెట్టి, తిరుమలలో ఘోరమైన అపచారాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రజల్లో రేకెత్తించారు.   రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో స్వామివారికి చెందిన ఓ వజ్రం మాయమైందనీ, వెయ్యి కాళ్ల మండపాన్ని అన్యాయంగా కూల్చేశారని చెప్పిన విషయాలు ముఖ్యమైనవి. విచిత్రంగా ఇవన్నీ ఆయన ప్రధానార్చకునిగా ఉన్న సమయంలోనే జరిగాయి. వీటికి సంబంధించిన దర్యాప్తులలో ఆయన మాటలని స్వయంగా రికార్డు చేయడం జరిగింది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు వ్యక్తం కావడం ఓ విచిత్రం. ఈ ఆరోపణలు చేసే ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసిరావడం, రమణ దీక్షితులకి బీజేపీ పార్టీ వంత పలకడం కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ఇక ఇలాంటి అదను కోసమే కాచుకున్న వైకాపా సంగతి చెప్పనే అక్కర్లేదు. తిరుమల విజ్రాలు సాక్షాత్తు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నాయనీ, వాటిని విదేశాలను మళ్లించేస్తున్నారనీ విజయసాయిరెడ్డి రకరకాల ఆరోపణలతో చెలరేగిపోయారు.   జరుగుతున్న పరిణామాలతో వెంకన్న మీద భక్తుల నమ్మకం ఇసుమంతైనా తగ్గదు. కానీ అక్కడి పరిపాలనతో ఏదో లోటు జరుగుతోందనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరుమల మీద సరైన పట్టు లేదనీ ప్రజలలో దురభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు. రమణ దీక్షితుల మీద క్రిమినల్‌ కేసు పెట్టినంత మాత్రాన ఈ సమస్య తీరదు. తితిదే నివేదికలు, దర్యాప్తులు, ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పాలన పారదర్శకంగా ఉన్నప్పుడే ప్రజల మనసులో అనుమానాలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు రమణ దీక్షితులు, రేపు మరొకరు తమ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకునేందుకు వెంకన్న ప్రతిష్టనే దిగజార్చేయగలరు.

చంద్రబాబు ఇమేజ్ తగ్గుతోందా!

  నిన్న కర్ణాటకలో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారం ప్రాంతీయ పార్టీలన్నింటికీ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి హాజరై అంతా లాభపడినట్లే కనిపించారు. కానీ చంద్రబాబు మాత్రమే కాస్త చిక్కుల్లో పడ్డారేమో అన్నది విశ్లేషకుల అంచనా. రాహుల్‌గాంధితో కలిసి చంద్రబాబు నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడిన ఫొటోలని ప్రతిపక్షాలు బాగానే ఉపయోగించుకుంటున్నాయి. మొన్నటివరకూ బీజేపీతో జతపట్టి రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌తో కలిసి అదే తప్పు చేస్తున్నారని దుయ్యపడుతున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయనే కేసీఆర్‌ తెలివిగా ఓ రోజు ముందే వెళ్లి కుమారస్వామిని కలిసివచ్చారు. కాంగ్రెస్ మీద కసితోనే ఆవిర్భవించిన తెదెపా కూడా ఇలాంటి వ్యూహమేదో పాటిస్తే బాగుండేది. కానీ వేదిక మీద చంద్రబాబు బాడీలాంగ్వేజ్‌ కోరి విమర్శలు తెచ్చుకొంది.   మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కూడా తన దూకుడిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు మేధావి, అనుభవజ్ఞుడు అంటూ కితాబిచ్చిన నోటితోనే చంద్రబాబుని ఏకేస్తున్నారు. ఆయన మాట మీద నిలబడటం లేదనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేశారనినేరుగానే విమర్శిస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితల సమస్యలని కనుక తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్నారు. పవన్‌ హెచ్చరికలు ఎప్పుడెలా ఉంటాయో, ఎంత దూరం వెళ్తాయో అంచనా వేయడం కష్టం. ఇది ఖచ్చితంగా చంద్రబాబుని చికాకుపెట్టి తీరుతాయి.   ఇక వైసీపీ ఈసారి తెలివిగా వెంకన్నబాబుని రాజకీయంలోకి లాగింది. ఏకంగా రమణదీక్షితులులాంటి సెలబ్రెటీ స్టేటస్‌ ఉన్న అర్చకుడిని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పింది. వెంకటేశ్వరుని ఆభరణాలు చంద్రబాబే దొంగిలించారంటూ ప్రచారం చేస్తోంది. ఈ విషయాలను ప్రజలు నమ్మకపోయినప్పటికీ, ఎక్కడో ఏదో మతలబు జరుగుతోందనే అనుమానాన్ని కలిగించడంతో మాత్రం విజయం సాధించింది. అసలే ప్రత్యేక హోదాని రప్పించలేక, నూతన రాజధానిని నిర్మించలేక కష్టాల్లో ఉన్న చంద్రబాబు మీద ఇవన్నీ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి రాజకీయ చతురతలో ఆరితేరిపోయిన బాబు వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి!

కేంద్రానికి టీటీడీ వివాదం.. చంద్రబాబు ప్రభుత్వానికి కష్టమేనా...!

  తిరుమల తిరుపతి దేవస్థానం పై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెద్ద తుఫానుగా మారేలా కనిపిస్తోంది. అంతేకాదు.. చూడబోతే ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వం కూడా ఇరుకునపడే పరిస్థితి వస్తుందేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకే కుదిస్తూ టిటిడి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రమణదీక్షితులు పింక్ డైమండ్ తో పాటు టిటిడిలో చోటు చేసుకొంటున్న విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికితోడు... పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి టిటిడి ఆభరణాలు కొన్ని కన్పించకుండా పోయాయని ఆరోపించారు. 2011లో తాము ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. శ్రీకృష్ణ దేవరాలయాల కాలం నుండి శాసనంలో ఉన్న ఆభరణాలు ,ఇతర వస్తువులు లేవని ఆయన చెప్పారు.అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు టిటిడి ఆభరణాలను భద్రపర్చేందుకు కమిటీని ఏర్పాటు చేసి జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఇక మొత్తంగా టిటిడిలో పరిణామాలు టిటిడి పాలకవర్గంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు ఈవో సింఘాల్ తో సమీక్ష నిర్వహించారు.   ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై రమణదీక్షితులు ఎలా విమర్శలు గుప్పిస్తారని చంద్రబాబునాయుడు రమణదీక్షితులు వ్యవహరంపై ప్రశ్నించారని సమాచారం. ఇక సమీక్ష ముగిసిన తరువాత సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. టిటిడిలో శ్రీవారి నగలన్నీ సురక్షితంగానే ఉన్నాయని.. టిటిడి నిధులు ఎక్కడ కూడ దుర్వినియోగం కాలేదని ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయడు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. ఆగమశాస్త్రం ఒప్పుకొంటే శ్రీవారి నగలను ప్రదర్శిస్తామని... నగలను ప్రదర్శించేందుకు తాము సిద్దంగా ఉన్నామని... 1952 నుండి కూడ స్వామివారికి ఉన్న నగల జాబితాకు సంబంధించిన రికార్డులున్నాయని ఆయన చెప్పారు. 2011లో రిటైర్డ్ జడ్జిల కమిటీ ప్రకారంగా నగలు ఉన్నాయని... అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏ నగలు ఇచ్చారనే విషయాన్ని రిటైర్డ్ జడ్జిల కమిటీ తేల్చలేదన్నారు.     మొత్తానికి ఈ వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక కేంద్రం వరకూ ఈ వ్యవహారం వెళ్లడంతో ఏం జరుగుతుందా అని  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే కేంద్రానికి.. చంద్రబాబు చెడింది... ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

బీజేపీపై రజనీ కామెంట్లు.. అందుకేనా..!

  గత కొద్దికాలంగా బీజేపీ పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సందు దొరికినప్పుడల్లా బీజేపీపై మోడీపై తెగ విమర్సలు చేసేశారు ప్రకాశ్ రాజ్. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ డ్రామాపై స్పందిస్తూ బీజేపీ పై కామెంట్లు విసిరారు. అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇక జేడీఎస్ మద్దతు కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్,బీజేపీ బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేజీఎస్ కాంగ్రెస్ కు మద్దతిచ్చి బీజేపీకి షాకిచ్చింది. దీంతో బీజేపీ ఎలాగైనా తమకు కావాల్సిన ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక గవర్నర్ ను అడ్డుపెట్టుకొని కూడా అధికారం చేపట్టాలని చూసింది. కానీ ఆ పప్పులేమి ఉడకలేదు. సుప్రీంకోర్టు బీజేపీ అడిగిన వారం రోజులు గడువు ఇవ్వకుండా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చి బలపరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలతో బేరసారాలు కూడా చేశారు బీజేపీ నేతలు. ఇక బలపరీక్ష కొద్దిసేపట్లో జరుగుతుంది అన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు చాలా తెలివిగా ఈ ఆడియో టేపులను కాస్త బయటపెట్టింది. ఈ ఆడియో టేపుల్లో స్వయంగా యడ్యూరప్ప పేరే బయటకు రావడంతో బీజేపీకి అసలు సమస్య వచ్చిపడింది. ఇలా చేసినందుకు మోడీ, షా ద్వయం యడ్యూరప్పపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసేది లేక రాజీనామా చేయమని ఆదేశించడంతో.. బలపరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా చేశారు. ఇక యెడ్డీ రాజీనామాతో బలపరీక్ష చేసే పని తప్పింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   ఇక గత వారంరోజులుగా జరిగిన కర్ణాటక రాజకీయాలపై రజనీకాంత్ మాట్లాడుతూ... కర్ణాటకలో జరిగిన అన్యూహ్య సంఘటనను చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నా.. బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్ 15 రోజులు సమయం ఇవ్వడం, అందుకు భాజపా మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టుగా ఉంది.. బల నిరూపణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు.. ఆతీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది అని అన్నారు. ఇక రజనీ చేసిన వ్యాఖ్యలను బట్టి తాను కూడా బీజేపీకి వ్యతిరేకమని చెప్పకనే చెప్పారని అంటున్నారు పలువురు. అంతేకాదు రజనీ బీజేపీ పై కోపంగా ఉండటానికి వేరే కారణం ఉందని కూడా అంటున్నారు. అది ఏంటంటే.. ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న వ్యాఖ్యలే రజనీ బీజేపీ అంటే మండిపడటానికి కారణం అంటున్నారు. స్వామిగారు రజనీపై మామూలు కామెంట్లు వేయలేదు మరి. రజనీకి చదువు లేదని.. ఆయన రాజకీయాలకు పనికిరాడని... అతనితో పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద నష్టం ఇంకేం లేదు... సినీ తారలకు రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ రోజులు ఎప్పుడో పోయాయని.. సినిమా తారలతో అలయెన్స్ అంటే అది అతిపెద్ద వైఫల్యమే అని తెగ విమర్శలు గుప్పించారు. ఈ కారణం కూడా బీజేపీపై రజనీ కోపంగా ఉండటానికి ఒక రీజన్ అంటున్నారు విశ్లేషకులు. దానికితోడు ఈ మధ్య కాలంలో బీజేపీ పై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ కారణాలవల్లే రజనీ కూడా ఇప్పుడు ఓపెన్ గానే బీజేపీ పై కామెంట్లు చేశారని... దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోను అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...

బీజేపీ సామూహిక రాజీనామాలు... బీజేపీ తప్పు చేస్తుందా..!

  మూడు రోజులుగా జరుగుతున్న కర్ణాటక రాజకీయ డ్రామాలకు తెరపడింది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంకోసం చేసిన పోరులో ఎట్టకేలకు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 104 సీట్లు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో అధికారం చేపట్టే అవకాశం చేజార్చుకుంది. అసెంబ్లీ బలపరీక్షలో ఎలాగైనా గెలవాలని బీజేపీ విశ్వప్రయత్నాలే చేసింది. దీనిలో భాగంగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపుకు లాగడానికి బేరసారాలకు సైతం దిగింది. కానీ బీజేపీ ప్రయత్నాలు మాత్రం వర్కవుట్ కాలేదు. ఇక ఈరోజు ఇంకొద్ది సేపట్లో బలపరీక్ష జరుగుతుంది.. ఎవరు అధికారం చేపడతారో అని అందరూ ఎదురచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా యడ్యూరప్ప తమ పార్టీ నేతలతో చేసిన బేరసారాల వీడియో బయటపెట్టారు. దీంతో విషయం బయటపడటంతో మోడీ, అమిత్ షా యడ్యూరప్ప మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆఖరికి రాజీనామా కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పరీక్ష ముందే తమ ఓటమిని అంగీకరించి..ఉద్వేగంతో ప్రసంగం చేసిన యెడ్డీ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.   అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే... కర్ణాటకలో అన్ని పార్టీల కంటే అధికంగా 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అధికారంలో రాలేకపోయామని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఇక ఇప్పటికే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో... 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ వాజుబాయ్ వాలాకు సామూహిక రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరగాలంటే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారట. మరి ఇప్పుడు సామూహిక రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలని మొదలుపెడితే ప్రజలు ఆదరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న.. మరి ఇప్పటికే  బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. దానికితోడు కర్ణాటకలో బీజేపీ చేసిన రాజకీయాలవల్ల ఉన్న ఇమేజ్ కూడా పోయింది. దానికి  తోడు ఆడియో టేపులు బయటపడటం. అన్నీ బీజేపీకి ఎదురుదెబ్బలే తగిలాయి. అందుకే  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజల ఆగ్రహం చవిచూడటం కంటే ప్రతిపక్షంగా ఉండటమే మంచిదని బీజేపీ పెద్దలు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత మళ్లీ సామూహిక రాజీనామాలు అంటూ డ్రామాలు మొదలుపెడితే వర్కవుట్ అవుతుందా.. బీజేపీ మళ్లీ పప్పులో కాలేస్తుందని అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

కన్నాకి పదవి.. అజ్ఞాతంలోకి సోము..వాట్ నెక్ట్స్

  గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షపదవిలో ఎవరిని నియమించాలో బీజేపీ పెద్దలు చర్చలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ రేసులో మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారి ముగ్గురిలో మాణిక్యాలరావువైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ముందు సోమువీర్రాజు నే అనుకున్నా.. ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని.. అందుకే దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అయితే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ... మళ్లీ బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పురుంధరేశ్వరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలా చర్చించిన కొన్ని రోజుల తరువాత మళ్లీ సోము వీర్రాజుకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకున్నారు. ఇక కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత అసంతృప్తి చెందిన కన్నా లక్షీ నారాయణ వైసీపీ చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక రేపో మాపో కన్నా వైసీపీలో చేరుతారు అనుకునే లోపు.. అమిత్ షా నుండి ఫోన్ రావడం... ఆ తరువాత అనారోగ్యం అని ఏదో సాకు చెప్పి పార్టీ మార్పుకు బ్రేక్ చెప్పారు. ఇక ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్‌గా చేశారు. నాడు పార్టీ చీఫ్‌గా చేయనందుకే ఆయన వైసీపీలోకి వెళ్లాలని భావించారని, కానీ అధిష్టానం నుంచి హామీ వచ్చాక ఆగిపోయారని, ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.   ఇక ఇప్పుడు బీజేపీ అధిష్టానం కన్నాకు ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఓ మనిషి అలక పూనినట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు...సోము వీర్రాజు. ఆ పదవి తనకు దక్కుతుందనుకున్న సోము వీర్రాజు పాపం నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.  పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న తనను కాదని, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెందారట... ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఎనిమిది గంటల సమయం నుంచి ఆయన అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. మరోవైపు కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు... సోము వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. తమ నేత వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. రాజీనామా పత్రాలను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు పంపినట్టు తెలిపారు. మరి దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో.. సోము వీర్రాజును ఎలా బుజ్జగిస్తారో చూడాలి..

ఎవరికి వాళ్లే సీఎంలు...

  నేను ఎప్పటికైనా సీఎం అవుతా... నాకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం..ఇంత ధైర్యంగా ఈ మాటలు చెబుతున్నది ఎవరబ్బా అనుకుంటున్నారా... ఎవరో కాదు రేవంత్ రెడ్డి. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజానికి టీడీపీ లో ఉన్నప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి..కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి చాలా తేడానే ఉందని చెప్పొచ్చు. టీడీపీలో ఉన్న రోజుల్లో రేవంత్ రెడ్డి  మీడియా ముందుకు వచ్చారంటే  సెన్సేషనే. కేసీఆర్ పై ఆయన చేసినట్టుగా  ఇంకెవరూ విమర్శలు గుప్పించేవారు కారు... అంత ధైర్యంగా కేసీఆర్ పై మాటల యుద్దం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కింది. అంతేకాదు ఎవరికి భయపడని కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కాస్త భయపడినట్టే చెప్పొచ్చు. అందుకే పక్కా ప్లాన్ చేసి ఓటుకు నోటు కేసులో ఇరికించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆతరువాత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడం.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొత్తలో ఉన్నంత ఊపుగా రేవంత్ ఇప్పుడు లేరని చెప్పొచ్చు. వారంలో నాలుగైదు ప్రెస్‌మీట్లు పెట్టే రేవంత్.. ఇప్పుడు నెలకొకటి రెండింటికే పరిమితమవుతున్నాడు.   ఇదిలా ఉండగా..ఉన్నట్టుంది ఇప్పుడు ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడంతో రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎప్పటిలాగే కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. మోదీ-కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఏసీబీ కేసుల సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రసార సాధనాల్లో, పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాయించి కేసు జరిగిన రోజు కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించి మమ్మల్ని భయపెట్టో.. బెదిరించో, లొంగదీసుకునో.. తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడు కోవడానికి అటు మోదీ-ఇటు కేడీ ఆడుతున్న నాటకంలో భాగమే.. కేసీఆర్ రివ్యూ వ్యవహారం" అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం చేశారు. అంతేకాదు ఇంకా పలు సంచలన వ్యాఖ్యలే చేసారు. " పార్టీ నాయకత్వం నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. నా స్థాయికి తగిన పదవి ఇవ్వాలని పలుమార్లు అధిష్టానాన్ని డిమాండ్ చేశాను. నాకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం. ఇప్పుడు కాకున్నా, కొన్నేళ్ల తర్వాతనైనా సీఎం అవుతాను. కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది నేతలు తన మాటను వింటారు. నా సలహా మేరకే వేటుపడిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌లు దీక్ష చేశారు" అని రేవంత్ రెడ్డి తన మనసులోని కొన్ని మాటలను బయటపెట్టారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ లో ఉన్న వారందరూ తలలు పండిన నేతలే. దీంతో ఎవరికి వారు తమే ముఖ్యమంత్రి అవుతామని  ఎవరి స్టేట్మెంట్స్ వాళ్లు ఇచ్చేస్తుంటారు. ఇటీవల ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన సీనియర్ నేత జానారెడ్డి తాను అన్ని విధాలా ముఖ్యమంత్రి పదవికి అర్హుడునని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు వాళ్లందరూ రేవంత్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూద్దాం..  

ఓటుకు నోటు కేసును కేసీఆర్ అందుకే బయటకుతీశాడా...?

  ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. సాక్ష్యాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దీనిలో ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఈకేసు సంచలనం రేకెత్తించింది. అయితే కొన్ని రోజులు ఈకేసులో హడావుడి జరిగినా ఆ తరువాత సైలెంట్ అయిపోయింది. కానీ ఇన్నిరోజులు ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ డి.జి.పి., ఎ.సి.పి. డి.జి., రిటైర్డ్ ఐ.పి.ఎస్‌. అధికారి ఎ.కె.ఖాన్‌, కొంత‌మంది కీల‌క అధికారులు, న్యాయ‌వాదులు ఈ స‌మీక్ష స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఉన్నట్టుండి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఈ కేసుపై మళ్లీ ఇంట్రస్ట్ చూపించడంపై అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.   ఈ చర్చల నేపథ్యంలోనే ఓ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం కేసీఆర్  ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ... కేసీఆర్ మాత్రం బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరితో ముచ్చటిస్తున్నారు.  కాంగ్రెసేత‌ర‌, భాజ‌పాయేత‌ర కూట‌మి ఏర్పాటు అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ, దేవెగౌడ‌, అఖిలేష్ యాద‌వ్‌, స్టాలిన్ వంటి నేత‌ల్ని క‌లిసొచ్చారు. కానీ ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటు చేసి త‌ద్వారా దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. అయితే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత‌… సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అదే స‌మ‌యంలో, 11 పార్టీల‌తో చంద్ర‌బాబు కూట‌మి క‌ట్ట‌బోతున్నారంటూ జాతీయ మీడియాలో కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు అమ‌రావ‌తిలో 11 రాష్ట్రాల ఆర్థిక‌ మంత్రుల స‌మావేశం నిర్వ‌హించారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధి విధానాల‌ను మార్చాలంటూ త్వ‌ర‌లోనే అంతా క‌లిసి రాష్ట్రప‌తిని క‌లుద్దామ‌న్నారు. అయితే, జాతీయ స్థాయిలో రాజ‌కీయ‌ కూట‌మి క‌ట్టాల‌న్న ల‌క్ష్యంతో ఇవ‌న్నీ చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ఎక్కడా చెప్ప‌క‌పోయినా… భవిష్యత్తులో తాను పిలిస్తే ఢిల్లీ వేదిక‌గా క‌లిసి ప‌నిచేసేందుకు వ‌చ్చేవారి సంఖ్య‌ను నెమ్మ‌దిగా పెంచుకుంటున్న‌ట్టుగానే అర్థం చేసుకోవాలి. ఇక ఇవన్నీ గమనిస్తున్న కేసీఆర్... టీడీపీకి..చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే దానికి ఓటుకు నోటు కేసు ఒక్కటే దారి అని.. అందుకే ఈ కేసును మరోసారి తెరపైకి తీసుకొచ్చి త‌న ఫ్రెంట్ వ్యూహానికి స‌మాంత‌ర ఆలోచ‌న‌తో మొద‌లైన ప్ర‌య‌త్నాలు ఏవైనా ఉంటే, వాటికి చెక్ పెట్టాల‌నే సంకేతాలు ఇవ్వ‌డ‌మే కేసీఆర్ తాజా ఎత్తుగ‌డ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.   ఇదిలా ఉండగా.. ఈ కేసులో చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రాగా  కేసీఆర్ ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఆడియో టేపుల్లో వినిపిస్తున్న గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందగా, కేసును కొలిక్కి తెచ్చేందుకు గత నాలుగు రోజులుగా ఏసీబీ అధికారులు కసరత్తు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్, పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని, కేసు విచారణలో ముందుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో.. దీనిపై చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతాడో....

క్లాసులు పీకుతున్నా, వార్నింగ్ లు ఇస్తున్నా నో యూజ్...

  మోడీ ఎంత చెప్పినా బీజేపీ నేతలు ఒకళ్ల తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్కవుతూనే ఉన్నారు. ఒకరి తరువాత ఒకరు నోరు జారి మోడీకి తలనొప్పిగా తయారవుతున్నారు. నోరు జారిన మంత్రులను మోడీ పిలిపించుకొని క్లాసులు పీకుతున్నా, వార్నింగ్ లు ఇస్తున్నా బీజేపీ నేతల నోరు మాత్రం కంట్రోల్ లో ఉండటం లేదు. ఎవరు ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఏమేం మాట్లాడుతారో.. ఎక్కడ మాట తూలుతారో, ఏమేం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు మరో నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ నేత ఎవరో కాదు  కేంద్ర మంత్రి ఉమాభారతి. దళితులపై ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.    మాములుగా బీజేపీపై హిందుత్వపార్టీ అని ముద్ర ఉంది. దళితులపై దాడులు కూడా బీజేపీ హయాంలోనే ఎక్కువ జరిగాయి. దీంతో దళితులకు కూడా బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు ఉమాభారతి దళితులను ఉద్దేశించి అనుతిచవ్యాఖ్యలు చేయడంతో..  ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఛత్తర్ పూర్ లో ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తాను శ్రీరామచంద్రుడిని కాదని, పక్కన కూర్చొని భోజనాలు చేసినంత మాత్రాన దళితులను శుద్ధి చేయలేనని ఆమె వ్యాఖ్యానించారు. శబరి ఇంటికి వెళ్లిన రాముడు... అక్కడున్న దళితులను శుద్ధి చేశాడని, తనకు అంత శక్తి లేదని అన్నారు. కానీ దళితులు తన ఇంటికి వస్తే, భోజనం పెడతానని చెప్పారు. అంతేకాదు.... తన ఇంట్లోని డైనింగ్ టేబుల్ మీద దళితులకు భోజనం పెడితే, తన వంటపాత్రలు శుద్ధి అవుతాయని.. ఢిల్లీలో ఉన్న తన మేనల్లుడి ఇంటికి వస్తే... ఆయన భార్య మీకు వంటకాలను వడ్డిస్తుందని, భోజనాల తర్వాత తన మేనల్లుడు మీ ప్లేట్లను తీసి, శుభ్రం చేస్తాడని తెలిపారు. ఈ ఘటన కాస్తా వివాదాస్పదం కావడంతో, ఆ తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చారు. తికమ్ ఘర్ జిల్లాలోని పపోడాకు వెళ్లి విద్యాసాగర్ మహరాజ్ ను తాను కలవాల్సి ఉందని... దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉందని... అందుకే భోజనం చేయలేకపోయానని ఉమ తెలిపారు. భోజనం చేయనందుకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పుకొచ్చారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ఎంత కవర్ చేసినా ఏం ఉపయోగం. మరి దీనిపై మోడీ ఏం సమాధానం చెబుతారో చూద్దాం...

మోడీ నిజమా.. చంద్రబాబు నిజమా.. వెంకన్నకే తెలియాలి...!

  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అన్యాయం చేసిందని... ఒకపక్క టీడీపీ నేతలు పోరాటం చేస్తూ ఉంటే... మరోపక్క బీజేపీ నేతలు మాత్రం టీడీపీ నేతలపై మాటల యుద్దం చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీల మధ్య  పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆ వార్ ఇంకా కొనసాగుతూనే ఉందనుకోండి. ఇక ఇప్పుడు కొత్తగా మరో విషయంపై రెండు పార్టీలు మాటల యుద్దాలు మొదలుపెట్టారు.   రాష్టం విడిపోయిన తరువాత... మిత్రపక్షంగా ఉన్న సమయంలో రెండు పార్టీలు తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారని టీడీపీ నేతలు మొత్తుకుంటున్నారు. ఇక దీనిపై స్పందించిన బీజేపీ నేతలు ఊరుకుంటారా...? అందరికంటే ముందు సోము వీర్రాజు గారు ముందుంటారు కదా... ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని.. ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని నాడు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అయితే తిరుపతి ఎన్నికలసభలో ప్రత్యేక హోదా ఇస్తామని నాడు నరేంద్రమోదీ ప్రకటన చేయలేదని అయితే వెంకన్న సాక్షిగా ప్రకటన చేసినట్లుగా సీ ఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారని.. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని రాజు గారు అన్నారు. అంతేకాదు ఏడుకొండలవాని సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చేయని ప్రకటనను తిరుపతిలో చేసినట్లు ఆమాటలకు వెంకన్న సాక్షి అన్నపదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోడించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని... ఇకనైనా చంద్రబాబు వెంకన్న సాక్షి అనే పదాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం...   మరి రాజకీయనాయకుల మాటలకు అర్ధాలే వేరు... కాలికెస్తే మెడకు మెడకేస్తే కాలికి వెయ్యటం వారికి అలవాటే. ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో .. టీడీపీ నాయకులు రైట్ చెబుతున్నారా..? లేక బీజేపీ నేతలు రైటా అన్నది ఆ వెంకన్న కే తెలియాలి మరీ...!

పాపం జగన్ కు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదుగా...

  ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతమంది వైసీపీ నేతలు టీడీపీ పార్టీలోకి జంప్ అవుతున్నా... జగన్ మాత్రం వారిని ఆపలేదు. ఇక ఎలాగూ వస్తున్నారు కదా అని టీడీపీ కూడా అందరినీ ఆహ్వానించేసింది. అప్పుడు జగన్ చంద్రబాబుకి ఫోన్ చేసింది లేదు...మా వాళ్లను మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పింది లేదు. అయితే పాపం ఇప్పుడు జగన్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే.   ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నియామకంపై కేంద్రం యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ఏపీ అధ్యక్ష నియామకం పై చర్చలు జరుగుతుండగా.. ఆఖరికి సోము వీర్రాజు ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ పునరాలోచనలో పడ్డారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి చెందారు. దీంతో ఆయన బీజేపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కన్నాతో పాటు ఇప్పుడు పలు నేతలు కూడా వైసీపీలోకి రావడానికి చూస్తున్నట్టు. అందులో కావూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని తెలుస్తుండగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.   అయితే ఇక్కడే జగన్ కు ఓ షాక్ తగిలింది. ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు అమిత్ షాకు ఫోన్ చేసినట్టు సమాచారం. తమ పార్టీ నుండి నేతలు వైసీపీలోకి వస్తే వారిని చేర్చుకోవద్దని అమిత్ షా జగన్ కు చెప్పినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు... కన్నాకి కూడా షా ఫోన్ చేశారంట. కన్నా లక్ష్మీనారాయణకు అమిత్ షా ఫోన్ చేసి పార్టీలోనే ఉండాలని కోరారట. ఇక అమిత్ షానే కోరడంతో కన్నా కూడా తన మనసును మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందుకనే.. ఆరోగ్యం బాలేదని.. ఏదో సాకు చెప్పి వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. పాపం జగన్ కు ఈ అవకాశం కూడా లేకుండా పోయింది.

పవన్ ట్వీట్స్... టీడీపీ అలర్ట్...

  శ్రీరెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామా తెరపైకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన వ్యవహారం ఆఖరికి రాజకీయాల వరకూ వచ్చింది. శ్రీరెడ్డి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అసలు ఎక్కడ మొదలైంది... ఎక్కడివరకూ వెళ్లింది ఈ వ్యవహారం అని అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే పవన్ ను అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగారు అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. పవన్ అభిమానులు, సినీ ప్రముఖులు సామాన్య ప్రజలు సైతం శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై చర్చలు జరుగుతుండగానే ఆడియో లీక్స్ ఒకటి బయటకు వచ్చాయి. దీని సూత్రధారి రామ్ గోపాల్ వర్మ అని బయటపడింది. అంతేకాదు దీని వెనుక వైసీపీ కుట్ర కూడా ఉందని బయటకు రావడంతో అసలు ఇష్య్చూ మొత్తం ఒక్కసారిగా రాజకీయాలవైపు మళ్లింది.   ఇక ఏ విషయంపైనా పెద్దగా స్పందించని పవన్ ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మధ్యరాత్రి ట్విట్టర్ వేదికగా చాలా భావోద్వేగంగా కొన్ని ట్వీట్లు కూడా పెట్టారు. అయితే ఆ ట్వీట్లలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. ‘నా తల్లిపై ప్రయోగించిన అభ్యంతరకర భాషని పదేపదే ప్రసారం చేసిన వార్తను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లేదా ప్రతిపక్షనేతల తల్లిపై కూడా వాడి ఉంటే మీ మీడియా సంస్థలు ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని సూటిగా ప్రశ్నించారు. కేవలం పవన్ కల్యాణ్ తల్లి, ఎవరికీ, ఏనాడూ అపకారం తలపెట్టని పవన్ కల్యాణ్ తల్లిపై వాడిన అసభ్యకరమైన భాషను మాత్రం పదేపదే టెలీకాస్ట్ చేసి, దానిపై విశ్లేషణలు, చర్చలు చేపడతారు... అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చెప్పండి శక్తిమంతమైన, ధనిక మీడియా శక్తులారా? పవన్ కల్యాణ్ కే ఈ ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఎందుకు?’ అని ఆయన నిలదీశారు. అంతేకాదు దీనిపై ఆయన లీగల్ కూడా యాక్షన్ తీసుకోనున్నట్టు సమాచారం.   ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ ట్వీట్ వ్యాఖ్యలపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని టీడీపీ వారి నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఈరోజు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష పక్క దారిపడుతుందని...చంద్రబాబు దీక్షా సమయంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని.. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టిన దీక్షకు తగిన ప్రాధాన్యత లభించకపోవచ్చనే టీడీపీ అధిష్టానం ఈ మేరకు అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు ఇంకెన్నిఈ వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయో... పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. దానికి టీడీపీ ఎలా స్పందిస్తుందో.. చూద్దాం..