జగన్ పాతిక.. పవన్ ఓపిక

  ఏపీలో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నాయి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడమే లక్ష్యంగా వైసీపీ, జనసేన మరియు బీజేపీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలు మొదలుపెట్టాయి.. ఈ మూడు పార్టీలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అంటూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.. టీడీపీ మాత్రం ఈ మూడు పార్టీలు కుమ్మక్కై కావాలనే టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాకు అధికారం ఇస్తేనా? అంటూ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉంటున్నాయి.. చంద్రబాబు 'మళ్ళీ అధికారం ఇవ్వండి, గొప్ప రాజధాని నిర్మిస్తాం.. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి, ప్రత్యేకహోదా సాధిస్తాం' అంటున్నారు.. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ' ఒక్కసారి అవకాశం ఇస్తే, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాం.. మరో పాతికేళ్ళు తామే అధికారంలో ఉండేలా పాలన అందిస్తాం' అని గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి చెప్తున్నారు.. అసలే జగన్ కి 'మాట తప్పని.. మడమ తిప్పని' నేతగా పేరుంది.. అందుకేనేమో ఆయన ఇప్పటికీ ' ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మరో పాతికేళ్ళు మేమే అధికారంలో ఉండేలా పాలన అందిస్తాం' అనే చెప్తున్నారు. ఇక ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చారు.. తర్వాత టీడీపీని విభేదించి, విమర్శించి.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచి పాలిస్తానంటూ, ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. జగన్ 'ఒక్క అవకాశం ఇవ్వండి.. పాతికేళ్ళు అధికారంలో ఉంటాం' అంటుంటే.. పవన్ ఇంకో అడుగు ముందుకేసి ' ఒక్కసారి మాకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి.. ఎప్పటికీ మమ్మల్నే కోరుకునే విధంగా పాలన అందిస్తాం' అని చెప్తున్నారు.. దీని బట్టి చూస్తుంటే జగన్ ఒక్కసారి అధికారంలోకి వస్తే పాతికేళ్ళు, పవన్ ఒక్కసారి అధికారంలోకి వస్తే ఓపిక ఉన్నంత కాలం పాలించేలా ఉన్నారుగా అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్న చంద్రబాబు?

  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎంపీగా పోటీ చేయబోతున్నారట.. ఇది వింటే నమ్మడం ఏమో కానీ నవ్వొస్తుంది అంటారా.. మీరు నమ్ముతారో, నవ్వుతారో మీ ఇష్టం.. కానీ చంద్రబాబు ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. ఈ వార్త పూర్తిగా కొట్టిపడేయలేం అని, చంద్రబాబు ఎంపీగా పోటీచేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం కుప్పం నుండి ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తూనే, ఏదైనా లోక్ సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014 లో బీజేపీ తో కలిసి పని చేసారు.. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్నా.. ఏపీకి ప్రత్యేకహోదా రాలేదు, విభజన హామీలు కూడా నెరవేరలేదు.. దీంతో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటికి వచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నారు.. ఈ పోరాటం నుండే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలనే ఆలోచనకు పునాది పడినట్టు తెలుస్తుంది.. ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం బాధ్యతలు అవసరమైతే ఎవరికైనా అప్పగించి..  టీడీపీ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ.. జాతీయ రాజకీయాల మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారట.. దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని చంద్రబాబు ఆలోచనట.. అయితే ఈ విషయంపై కొందరి భావన వేరేలా ఉంది.. రాష్ట్రాన్ని చంద్రబాబులా సమర్థంగా పాలించే నాయకుడు ఎవరున్నారు?.. ఆయన అలా రాష్ట్రాన్ని వేరొకరికి అప్పగించి జాతీయ రాజకీయాలకి వెళ్లినంత మాత్రాన ప్రయోజనం జరుగుతుందా?.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏం చేస్తారు? అంటూ ఇలా ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నారు. నిజమో కాదో తెలియని వార్తకే ఇన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. ఒకవేళ నిజమైతే ప్రశ్నల వర్షం కురుస్తుందేమో.. అయితే ఈ విషయంపై విశ్లేషకులు వేరేలా స్పందిస్తున్నారు.. చంద్రబాబు అనుభవం, తెలివితేటలతో పాటు ముందు చూపున్న నేత.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనికి ఎప్పుడేం చేయాలో తెల్సు.. ప్రస్తుతానికి ఇలాంటి వార్తలన్నీ ఊహాగానాలే అంటున్నారు.. చూద్దాం భవిష్యత్తులో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో.  

ఉక్కు పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది..!

  కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 20 న ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఎంపీ రమేష్ పదకొండవ రోజు దీక్ష విరమించారు.. ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మరియు విపక్షాల తీరుపై మండిపడ్డారు.. ‘ప్రాణం పోయినా పర్వాలేదని ఉక్కు సంకల్పంతో దీక్ష చేపట్టి కొనసాగించిన రమేష్ కు అభినందనలు.. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఏడు రోజులు బీటెక్‌ రవి దీక్ష చేశారు..  ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బతినే పరిస్థితి వచ్చింది.. పవిత్రమైన భావం, చిత్తశుద్ధితో రమేశ్‌ దీక్ష కొనసాగించారు.. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు సీఎం రమేష్‌ను విమర్శిస్తున్నారని.. ఈ దీక్షలపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని బాబు మండిపడ్డారు.. 'విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉంది.. ఏపీకి అన్యాయం చేస్తే వదిలే ప్రసక్తే లేదు.. 5 కోట్ల ఏపీ ప్రజల తరపున డిమాండ్‌ చేస్తున్నా.. రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి..  ఉక్కు పరిశ్రమ పెడితే పూర్తిగా మేం సహకరిస్తాం.. ఆర్థిక భారమని మీనమేషాలు లెక్కిస్తే 50శాతం ఖర్చు మీరు పెట్టండి, మరో 50శాతం మేం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని' బాబు అన్నారు.. 'విభజన చట్టంలో ఉన్న హామీలను ఎందుకు నెరవేర్చరని కేంద్రాన్ని అడుగుతున్నా.. మా హక్కులను పోగొట్టుకొనేందుకు సిద్ధంగా లేం.. ఏదేమైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఓ కమిటీ వేస్తాం.. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతాం.. పోరాటం కొనసాగిస్తాం.. పార్లమెంట్‌లో నిలదీస్తాం.. అప్పుడూ కాకపోతే ఈ ఉక్కు పరిశ్రమని  రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రజల రుణం తీర్చుకుంటుంది' అని బాబు అన్నారు.. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి బాటలో సాగుతాం అని చంద్రబాబు స్పష్టం చేసారు.  

కొత్త ఇంట్లో పవన్ కి కష్టాలు తప్పవా?

  ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్, ప్రస్తుతం ప్రశ్నలు ఆపేసి ఎన్నికలు వైపు అడుగులు వేస్తున్నారు.. రాజధాని కేంద్రంగా రాజకీయాలు చేద్దామని డిసైడ్ అయిన పవన్.. ఇల్లు, పార్టీ ఆఫీస్ కోసం చౌక ధరకి స్థలం కూడా కొన్నారు.. అయితే నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో, పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది కాకుండా అప్పటి వరకు విజయవాడలో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నారు.. ఇక నుండి పవన్ ఆ అద్దె ఇంటి నుండే పార్టీ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు.. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ ఇంటి గతమే, పవన్ కి భవిష్యత్తులో కష్టాలు తప్పవని చెప్తుంది.  ఆ ఇల్లు చూడటానికి బాగానే ఉంది కానీ వాస్తే బాలేదంట.. ఆ వాస్తు మూలంగా ఇంటి ఓనర్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడట.. వ్యాపారంలో భారీ నష్టం, కుటుంబంలో సమస్యలు ఇలా కష్టాలన్నీ చుట్టుముట్టాయట.. ఇంటికి దూరమైతే కానీ కష్టాలు దూరం అవ్వవని తెలుసుకున్న ఇంటి ఓనర్ వెంటనే ఇల్లు ఖాళీ చేసాడట.. ఇప్పుడిప్పుడే కష్టాలకు దూరంగా ప్రశాంతతకు దగ్గరగా బ్రతుకుతున్నాడు.. ఆ ఇంటి నుండి బయటపడిన ఓనర్ బానే ఉంటాడు మరి అద్దె ఇచ్చి ఇంట్లో దిగిన పవన్ పరిస్థితి ఏంటి? కష్టాలు తప్పవా?.. ఎవరైనా కష్టాలను కొని తెచ్చుకుంటారు.. పవన్ ఏంటి వెరైటీగా అద్దె కట్టి తెచ్చుకున్నాడు అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా అద్దె ఇంటి వాస్తు గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు.. ఓనర్ లాగా మా నాయకుడిగా కూడా కష్టాలు తప్పవా అంటూ బాధపడుతూన్నారట.. మరి పవన్ వరకు ఈ ఇంటి వాస్తు అంశం వెళ్లిందో లేదో.. పవన్ కి ఎవరైనా చెప్తే బాగుండు అనుకుంటున్నారు ఫ్యాన్స్.. చూద్దాం మరి పవన్ ఈ విషయం తెలిసి ఇల్లు ఖాళీ చేస్తారో? లేక ఇలాంటివి నమ్మను అంటూ ఆత్మ విశ్వాసంతో అలానే ఉంటారో.

మోదీ సర్కారుకి పరీక్ష- అమర్‌నాథ్‌ యాత్ర

  ఈసారి అమర్‌నాథ్‌ యాత్ర ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా ఉంది. అందుకు కారణం లేకపోలేదు! కశ్మీర్‌లోయలో ఈమధ్యకాలం మిలిటెంట్ల దాడులు పెరిగిపోతున్నాయి. వాటికి తోడు స్థానికులలోనూ అసహనం పెచ్చరిల్లిపోతోంది. తమ ఉనికిని నిరూపించుకోవాలని ఉగ్రవాదులు, వాటిని నిలువరించి పరువు కాపాడుకోవాలని మోదీ సర్కారు పట్టుదలతో ఉన్నాయి. ఈ రెండు వర్గాలూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు అమర్‌నాథ్‌ యాత్ర వేదిక కానుంది. అమర్‌నాథ్‌కు వచ్చే యాత్రికుల మీద దాడులు కొత్తేమీ కాదు. అయితే 2002 తర్వాత చాలావరకు ఇది తగ్గుముఖం పట్టాయి. తిరిగి 2017.. అంటే క్రితం ఏడాది ఒక బస్సు మీద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు యాత్రికులు చనిపోయారు. కాకపోతే అప్పట్లో కశ్మీరులో పీడీపీ ప్రభుత్వం ఉండటంతో, నింద అంతా ఆ ప్రభుత్వం మీదకే వెళ్లిపోయింది. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు- బీజేపీ, పీడీపీల మధ్య విబేధాలు రావడంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇప్పుడు అక్కడ గవర్నర్ పాలన నడుస్తోంది. కాబట్టి ఏం జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది. పరిస్థితులు ఇంత సున్నితంగా ఉన్నా కూడా, అమర్‌నాథ్‌ గుహలోని మంచులింగాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు కొదవ లేకపోవడం విశేషం. ఈసారి రెండు లక్షలమందికి పైగా భక్తులు, మంచులింగాన్ని చూసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇంతమంది జీవితాలకు భద్రత కల్పించడం అంటే ఏమంత తేలికైన విషయం కాదు. అందుకే వివిధ రక్షణ దళాలకు చెందిన 40 వేల మందిని ప్రభుత్వం నియమించింది. దీనికి తోడు అమర్‌నాథ్‌కు వెళ్లే ప్రతి వాహనం కదలికలనీ పసిగట్టేందుకు జీపీఎస్ ట్రాకింగ్‌ను ఉపయోగిస్తోంది. యాత్రికులకు తోడుగా పోలీసులు కూడా మోటర్‌సైకిళ్ల మీద అనుసరిస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్ర దాదాపు రెండు నెలల పాటు కొనసాగనుంది. ఈ సమయం నిజంగా మోదీ ప్రభుత్వానికి పరీక్షా కాలమే! అసలే సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని ఊదరగొట్టేస్తోంది. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అది ప్రభుత్వానికి ఓ మచ్చగా మిగిలిపోతుంది. పైగా ఈ ఏడాది చివరికల్లా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అమర్‌నాథ్‌లో ఏం జరిగినా కూడా ఆ ప్రభావం సదరు ఎన్నికల మీద పడే అవకాశమూ ఉంది. మరి ఏం జరగనుందో ఆ శివుడికే ఎరుక!

ఫ్యాన్స్ పవన్ మాట కూడా వినట్లేదు

పవన్ కళ్యాణ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్.. 2014 లో జనసేన పార్టీ స్థాపించిన పవన్, ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టారు.. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొందరు పవన్ ఫ్యాన్స్ తోనే అసలు చిక్కు.. మొదటినుండి పవన్ ఫ్యాన్స్ గురించి 'మితిమీరిన అభిమానం, ఆవేశం' అనే అభిప్రాయం ఉంది.. చాలా సందర్భాల్లో ఇది నిజమని రుజువైంది కూడా.. పవన్ ని ఎవరైనా ఏదైనా అంటే వారిని బెదిరించడం చూసాం.. సినిమా హీరోని, రాజకీయ నాయకుడిని విభేదించే వాళ్ళు ఉంటారు అది కామన్.. అది తెలుసుకోకుండా మా దేవుడిని అంటే ఊరుకోము అని బెదిరించడం తప్పని చాలామంది చెప్పారు.. అయినా కొందరు ఫ్యాన్స్ వినలేదు.. ఇక కొందరైతే పవన్ చెప్తే తప్ప ఈ ఫ్యాన్స్ వినరేమో అనుకున్నారు. కానీ కొందరు ఫ్యాన్స్ పవన్ చెప్పినా వినట్లేదు.. దానికి ఉదాహరణే రేణూ దేశాయ్ రెండో పెళ్లి అంశం.. పవన్ మాజీ భార్య రేణూ, రెండో పెళ్లి చేసుకుంటున్నారు.. రేణూ, తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.. ఈ విషయం మీద చాలామంది పవన్ ఫ్యాన్స్ పాజిటివ్ గానే స్పదించారు.. కానీ కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.. దీంతో పవన్ రంగంలోకి దిగి 'రేణూ దేశాయ్ గారికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేసారు.. దీంతో రేణూకి బెదిరింపులు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు.. అయినా ఆ కొందరు ఆగలేదు.. రేణూని అలానే బెదిరించారు.. దీంతో ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నే తీసేసారు.. అభిమానించే వ్యక్తి పేరుని నిలబెట్టాల్సింది పోయి ఇలా అభిమానం పేరుతో ఆయన పేరుకి మచ్చ తెస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక కొందరైతే పవన్, అభిమానుల్ని నమ్ముకొని ప్రజలకి సేవ చేస్తానంటూ జనసేన పెట్టారు, కానీ అభిమానులు ఆయన మాటే వినకపోతే ఇక ఆయన్ని ప్రజలెలా నమ్ముతారు అంటున్నారు.. అయితే ఈ విషయంపై పవన్ అభిమానులు వేరేలా స్పందిస్తున్నారు.. పవన్ ని నిజంగా అభిమానించే వాళ్ళు అలా చేయరు, కావాలనే కొందరు పవన్ పేరుని చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారు అంటున్నారు.. పాపం కొందరి మూలంగా పవన్ కి, పవన్ ని నిజంగా అభిమానించే వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది.

పవన్‌కు మద్దతుగా ఎన్టీఆర్, మహేష్ బాబు

  పవన్ సినిమాలకు బ్రేకిచ్చి పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టారు.. పవన్ జనసేనకు కుటుంబ సభ్యులు, కొందరు ఆర్టిస్టులు మద్దతు తెలిపారు కానీ స్టార్ హీరోలు ఇంకా మద్దతు తెలపలేదు.. అయితే స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్ పవన్ కు రాజకీయంగా మద్దతు తెలిపినట్టు ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది.. అదేంటి మహేష్ రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటారు.. ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు టీడీపీ తరుపున ప్రచారం చేసారు, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. అదీకాక తాత స్థాపించిన టీడీపీని కాదని పవన్ పార్టీకి మద్దతు ఎలా తెలుపుతారు? అంటారా.. అసలు విషయం ఏంటంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్, తరువాత టీడీపీని విభేదించి బయటికొచ్చారు.. ఇప్పుడు విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, వైసీపీకి మద్దతిస్తుందని ఆరోపణలు వచ్చాయి.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తారు, ఈ విషయం పవనే స్వయంగా తనతో చెప్పారని అన్నారు.. దీంతో జనసేన, వైసీపీ కలిసిపోయాయంటూ విమర్శలు మొదలయ్యాయి.. ఈ విమర్శలకు సమాధానంగా పవన్ ట్విట్టర్లో స్పందించారు.. 'పరస్పర బాగోగులు తెలుసుకున్నంత మాత్రాన, వాటిని మీకు నచ్చినట్టు అన్వయించుకోవద్దు' అని పవన్ ట్వీట్ చేసారు. ఇక్కడే పవన్ కు ఎన్టీఆర్, మహేష్ బాబు మద్దతు అంటూ రచ్చ మొదలైంది.. పవన్ చేసిన ట్వీట్ కి రెప్లైగా మహేష్ బాబు 'i support pawan kalyan' అని, ఎన్టీఆర్ 'me too' అని చెప్పినట్టు ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది.. నిజానికి అవి ఫేక్ ఎకౌంటులు.. మహేష్, ఎన్టీఆర్ పేర్లతో ఉన్న ఫేక్ ఎకౌంటులు నుండి పవన్ కళ్యాణ్ ట్వీట్ కి రిప్లై వచ్చాయి.. సెలబ్రిటీల ఖాతాలకు ‘టిక్’ మార్క్ ఉంటుందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఇలా ప్రచురించడంతో నెటిజనులు ఆ పత్రికపై మండిపడుతున్నారు.. వార్త తెలియగానే ప్రచురించడం కాదు వాస్తవం తెలుసుకొని ప్రచురించాలని సూచిస్తున్నారు.

ప్రధానిని మనమే నిర్ణయిస్తాం.. ప్రత్యేకహోదా సాధిస్తాం

  రాష్ట్ర ప్రయోజనాల కోసం 2014 లో బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదని బీజేపీని విభేదించి ఎన్డీయే నుండి బయటికొచ్చారు.. అయినా దైర్యం కోల్పోని బాబు, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారు.. రీసెంట్ గా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశమైన బాబు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు, అలానే కేంద్ర ప్రభుత్వం తీరుని ఎండగట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు చుట్టుముట్టాయని తెలిపారు.. ‘రాజధాని లేదు.. ఆదాయం లేదు.. పేదవాళ్లకు రేషన్‌, వృద్ధులకు పింఛను రాదని భయపడ్డారు. ఈ కష్టాలన్నిటినీ ఓర్చుకుంటూ ధైర్యంతో నిలబడ్డాం.. నాలుగేళ్లలో కేంద్రం సహకరించలేదు.. విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనలో మొండిచెయ్యి చూపారు.. పోలవరం నిర్మాణానికి అనేక ఆంక్షలు,నిబంధనలతో ఆటంకం కలిగిస్తున్నారు.. అయినా మనమే సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మాణం ఆగకుండా పట్టుదలతో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం.. రాష్ట్రంలో కరువు నివారణకు, నీటి భద్రతకు పోలవరం నిర్మాణమే శరణ్యం’ అని బాబు తెలిపారు. కేంద్రం సహకరించిక పోయినా, పోరాటం చేయాల్సిన అవసరం లేకుండానే.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల బాధలను తొలగించేందుకు వారి జీతాలను పెంచామని గుర్తుచేశారు.. రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం ఉన్న సంతృప్తి 90 శాతానికి పెంచాలన్నదే తమ లక్ష్యమని చెప్పిన బాబు, ‘రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీ అందరూ అండగా నిలవాలని కోరారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే 25 ఎంపీ సీట్లు సాధిస్తాం.. అప్పుడు ప్రధాని ఎవరో మనమే నిర్ణయిస్తాం.. ఫలితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు కేంద్రాన్ని దబాయించి సాధిస్తాం అన్నారు.. టీడీపీ రెండోసారి కూడా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి కొనసాగుతుందన్న బాబు, అమలుకాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని హెచ్చరించారు. నల్లడబ్బు వెలికితీసి ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ.. దానిని నెరవేర్చలేదని బాబు అన్నారు.. మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించిన బాబు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దుతో దేశ ప్రజలందరికీ కష్టాలొచ్చాయని తెలిపారు.. చూద్దాం మరి బాబు కోరుకున్నట్టు టీడీపీ 25 ఎంపీ స్థానాలు గెలిచి, కేంద్రాన్ని దబాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు సాధిస్తుందేమో.

అమిత్ షాకు కంగ్రాట్స్ చెప్పిన రాహుల్

  నోట్లరద్దు.. ఈ పదం వింటే ఇప్పటికీ చాలామందిలో వణుకు పుడుతుందేమో.. 2016 నవంబర్ 8 న ఐదొందలు,  వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. పాత నోట్లను మార్చుకోటానికి 50 రోజులు సమయం ఇచ్చింది.. ప్రజలు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లకు క్యూ కట్టారు.. జిల్లా సహకార బ్యాంకుల్లో మాత్రం నోట్లు మార్చుకోడానికి ఐదు రోజులే సమయం ఇచ్చారు.. ఈ నోట్లరద్దు వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు అంటే, బ్లాక్ మనీ కంట్రోల్ అవుతుంది సామాన్యులకు మంచి జరుగుతుందని ప్రభుత్వం సమర్ధించుకుంది.. తీరా చుస్తే 99 శాతం రద్దైన నోట్లు బ్యాంకులకు చేరాయి.. దీంతో నోట్లరద్దు విఫలం అయిందంటూ విపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేయటం.. ప్రభుత్వం సమర్ధించుకోవడం ఇలా రోజులు గడిచిపోయాయి.. ప్రజలు కూడా ఇక నోట్ల రద్దు ముగిసిన అంశం అనుకున్నారు.. కానీ నోట్లరద్దు మళ్ళీ తెరమీదకి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో ఎక్కువ నోట్లు జమ అయినట్టు తెలుస్తుంది.. అంతేకాదు అహ్మదాబాద్ సహకార బ్యాంకులో కేవలం ఐదు రోజుల్లో 750 కోట్ల రద్దైన నోట్లు జమ అయ్యి టాప్ ప్లేస్ లో ఉంది.. ఇంకో కొసమెరుపు ఏంటంటే ఈ బ్యాంకుకి అమిత్ షా డైరెక్టర్.. ఇంకేముంది విపక్షాలు మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు మొదలు పెట్టాయి.. ఇదే విషయంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. కేవలం ఐదు రోజుల్లోనే 750 కోట్ల రద్దైన నోట్లను మార్చి ఫస్ట్ ప్రైజ్ సాధించిన అహ్మదాబాద్ సహకార బ్యాంకు డైరెక్టర్ అమిత్ షా గారికి కంగ్రాట్స్ అంటూ రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.. అంతేకాదు నోట్లరద్దు వల్ల దేశమంతా ఇబ్బంది పడితే, అమిత్ షా మాత్రం లాభపడ్డారు అని రాహుల్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి జనసేన మద్దతు.. ఇది ఫిక్స్

  గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన, తర్వాత టీడీపీని విభేదించి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరుకు సిద్ధమైంది.. టీడీపీ మీద విమర్శలు చేస్తుంది.. అయితే వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయని టీడీపీ ఆరోపణలు చేస్తుంది.. తాజాగా వైసీపీ నేత మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో పవన్, వైసీపీకి మద్దతిస్తారని చెప్పిన వరప్రసాద్, ఈ విషయాన్నీ తనకి స్వయంగా పవనే చెప్పారని బాంబు పేల్చారు.. 'చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి, అవినీతి చేయరన్న ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో మద్దతిచ్చాను.. కానీ ఈ నాలుగేళ్లలో అవినీతి పెరిగిపోయింది, ప్రత్యేకహోదా కూడా సాధించలేదు.. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకి మద్దతు తెలపనని' పవన్ అన్నట్టు వరప్రసాద్ తెలిపారు.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మద్దతంటూ ఇస్తే జగన్ కే ఇస్తానని పవన్ స్పష్టం చేసినట్టు వరప్రసాద్ చెప్పారు.. పవన్ అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేసానని, ఇదంతా వాస్తవమని వరప్రసాద్ స్పష్టం చేసారు.. సాక్ష్యాత్తు వైసీపీ నేత వరప్రసాదే మాకు వచ్చే ఎన్నికల్లో పవన్ మద్దతిస్తాడని చెప్పడంతో.. ఇన్నిరోజులు టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజమని తేలిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.. మరి ఒంటరిగా పోరుకి సిద్ధమన్న పవన్, వచ్చే ఎన్నికల్లో నిజంగా వైసీపీతో జత కడతాడా? లేక ఒంటరిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని, ఫలితాల తరువాత పొత్తుల గురించి ఆలోచిస్తాడా? లేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అన్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ప్రశ్నిస్తూ ఉంటాడా? అమ్మో ఇన్ని ప్రశ్నలా!! వీటన్నింటికి సమాధానం తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.  

యోగా ఎంత తేలికో మీరే చూడండి!

  యోగా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. టకటకా యోగాసనాలు వేసేసి అందాన్నీ, ఆరోగ్యాన్నీ, మానసిక ప్రశాంతతనీ పొందాలని ఎవరికి అనిపించదు. కానీ యోగా చేయడం ఎలా? అన్న ప్రశ్న దగ్గరే అందరూ ఆగిపోతూ ఉంటారు. కష్టమైన ఆసనాలు వేయడానికి ఎవరో ఒక గురువు దగ్గరకి వెళ్లడం తప్పనిసరే! కానీ అంతవరకు కొన్ని తేలికైనా ఆసనాలు వేసి కావల్సినంత ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. ఆ ఆసనాలు ఏంటో మీరే చూడండి... వృక్షాసనం ఈ ఆసనంలో ముందుగా రెండు చేతులనీ నమస్కార భంగిమలో పైకి ఎత్తండి. మీ వెన్ను నిటారుగా ఉండేటా గమనిస్తూ, మీ కుడిపాదాన్ని, ఎడమ మోకాలి పైన ఉంచండి. ఇలా చేసే సమయంలో ఊపిరిని లోపలకి పీలుస్తూ ఉండాలి. ఆ తర్వాత ఊపిరిని నిదానంగా వదులుతూ, కాలుని కిందకి దించండి. ఇదే పద్ధతిలో మీ రెండో కాలుని కూడా వృక్షాసనంలో నిలపండి. త్రికోణాసనం ఇది మనం స్కూల్స్‌లో చూసే ఎక్సర్‌సైజ్‌లాగానే ఉంటుంది. దీనికోసం మీ రెండు కాళ్లనూ కాస్త వెడంగా ఉంచాలి. మీ శరీర బరువు మొత్తం మీ రెండు కాళ్ల మీదా సమానంగా ఉండేలా గమనించుకోవాలి. ముందు మీ కుడి చేతిని నేలమీద నిటారుగా తాకించాలి. ఆ సమయంలో మీ చూపు, ఎడమచేయి ఆకాశం వైపు నేరుగా చూస్తుంటాయి. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఎడమచేతితోనూ కొనసాగించాలి. తాడాసనం ఈ ఆసనంలో ముందుగా రెండు అరచేతులూ బయటకు కనిపించేలా పెనవేయాలి. ఆపై వాటిని నిదానంగా తలమీదకు తీసుకువెళ్లాలి. చేతులని పైకి ఉంచాక, మునివేళ్లతో కాళ్లని పైకి ఎత్తాలి. ఈ ఆసనం వేసేటప్పుడు వెన్ను, కాళ్లు నిటారుగా ఉండాలి; ఏకాగ్రత తొడ కండరాల మీద ఉండాలి; చూపు కూడా నేరుగా ఉంచాలి. నౌకాసనం ఒక పడవలాంటి ఆకారంలో ఉండటమే ఈ నౌకాసనం. దీనికోసం నేల మీద వెల్లికిలా పడుకోవాలి. ఆపై నిదానంగా ఇటు చేతులనీ, అటు కాళ్లనీ కూడా కాస్త దగ్గరకి తీసుకురావాలి. అంటే మీ నడుము బేస్‌గా చేసుకుని, శరీరం ఒక V షేప్‌లోకి రావాలన్నమాట. పొట్ట కరగాలన్నా, డైజషన్‌కి సంబంధించిన సమస్యలు తీరిపోవాలన్నా, ఆడవాళ్లకి సంబంధించిన ఇబ్బందులు పోవాలన్నా... ఈ నౌకాసనం గొప్ప ప్రభావం చూపుతుంది. భుజంగాసనం ఇది నౌకాసనానికి పూర్తిగా వ్యతిరేకం అనుకోవచ్చు. ఇందులో బొక్కబోర్లా నేల మీద పడుకుని, తల నుంచి నడుము వరకు వీలైనంతవరకు పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనం వల్ల ఛాతీకి, పొట్టకి సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయి. వెన్నెముకకి మంచి flexibility వస్తుంది. యోగా చేసే ఓపిక, సంకల్పం ఉండాలే కానీ... ఇలాంటి తేలికైనా ఆసనాలు చాలానే కనిపిస్తాయి. మరెందుకాలస్యం... యోగా మన వల్ల కాని పని అన్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి, ముందు ఇలాంటి చిన్నచిన్న ఆసనాలతో మీకు కావల్సినంత ఆరోగ్యాన్ని సంపాదించేయండి.   International Yoga Day 2018 Special Videos

కశ్మీరుతో బీజేపీ వ్యూహం ఇదే!

అంతా ఊహించినట్లే జరిగింది. కశ్మీర్‌లో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో గవర్నరు పాలననే కొనసాగించనున్నారు. ఇంతకీ బీజేపీ అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోసింది. దాని వల్ల ఎవరికి లాభం అన్న ప్రశ్నలు చాలా ఆసక్తికరమైన జవాబులకి దారితీస్తున్నాయి. నిజానికి పీడీపీ, బీజేపీ పార్టీలు ఉప్పునిప్పులాంటి సిద్ధాంతాలతో నడుస్తున్నాయి. పీడీపీ వేర్పాటువాదం పట్ల కాస్త సానుకూలంగా ఉంటే, బీజేపీ పూర్తిగా జాతీయవాదం వైపే మొగ్గుచూపుతుంటుంది. కానీ 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం కోసం ఆ రెండు పార్టీలు కలవక తప్పలేదు. అధికారం కోసం సిద్ధాంతాన్ని పక్కనపెట్టేశాయి. ఫలితం! దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఓ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. సహజంగానే పీడీపీ, బీజేపీల మధ్య ఈ మూడేళ్లలో ఏవో ఒక విబేధాలు పొడచూపుతూనే వచ్చాయి. కానీ ఇరు పార్టీలు కాస్త ఓర్చుకున్నాయి. అయితే కటువా ఉదంతంతో రెండు పార్టీల మధ్యా దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. కటువాలో ఓ ముస్లిం బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తుతుంటే, కశ్మీర్‌ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులు మాత్రం నిందితుల పక్షాన ర్యాలీ నిర్వహించారు. వాళ్ల పట్ల ముఖ్యమంత్రి కటువుతో ప్రవర్తించడంతో, బీజేపీ మొహం ఎర్రబడింది. ఇహ ఇంచుమించుగా అప్పటినుంచే బయటకి రావడం కోసం కాచుకుని కూర్చుంది. రంజాన్‌ సందర్భంలో ముఖ్యమంత్రి కశ్మీర్‌లోయలో కాల్పుల విరమణను ప్రకటించారు. దీని వల్ల శాంతి నెలకొనలేదు సరికదా... ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రైజింగ్‌ కశ్మీర్‌ పత్రిక ఎడిటర్ బుఖారీని, ఔరంగజేబు అనే సైనికుడినీ కాల్చి చంపారు. ఈ సంఘటనలని బీజేపీ గొప్ప అవకాశంగా భావించింది. ముఫ్తీ సర్కారులో శాంతిభద్రతలు విఫలం అయ్యాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు సాదించింది. ఒకటి- ప్రభుత్వం నుంచి బయటకి వచ్చేసి, తను చెప్పినట్లు సాగే గవర్నరు పాలనని విదించడం; రెండు- కశ్మీరులో అశాంతికి కారణం ముఫ్తీ వైఫల్యమే అని ఆరోపించడం. కశ్మీరు ప్రభుత్వం నుంచి బయటకు రావడం వచ్చేందుకు బీజేపీ మనసులో మరో ఎత్తుగడ కూడా ఉందని భావిస్తున్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్ తర్వాత ఒక్కసారిగా వెలిగిన మోదీ ప్రభ ఇప్పుడు కొడిగడుతోంది. దాన్ని మళ్లీ ఎగదోయాలంటే ఉగ్రవాదుల మీదో, పాకిస్థాన్‌ మీదో దాడులు చేసి... దేశభక్తిని రాజేయాలి. ఇలాంటి చర్యలకు ముఫ్తీ అడ్డు తగుల్తుంది కాబట్టి తనకు అనుకూలమైన గవర్నరు పాలనని విధించాలి. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది కాబట్టి, ‘ఉగ్రవాదుల అణచివేత’ కార్యక్రమాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు. వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోనూవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ముఫ్తీ బలిపశువుగా కనిపించవచ్చు. కానీ అధికారం కోసం తనకు విరుద్ధమైన బీజేపీతో చేతులు కలిపి ఆ పార్టీ భస్మాసుర హస్తాన్నే వరించింది. అందుకని ఇప్పుడు ప్రజలకు కానీ విపక్షాలకు కానీ ఆమె మీద పెద్దగా జాలి కూడా లేదు. పీడీపీని శుభ్రంగా వాడేసుకున్న బీజేపీ... తాను ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నానని కూడా ఆమెకి చెప్పలేదంటే, అక్కడ సంకీర్ణాల సంస్కారం ఎంత ఉన్నతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీలన్నింటి మధ్యా కశ్మీర్‌ పౌరుడి బతుకు ఎలా ఉంటుందా అని అడక్కండి! అలాంటి విషయాల గురించి ఆలోచించేదెవరు.

టాలీవుడ్‌ పరువు పోతోందో

  భారతదేశంలో తెలుగు పరిశ్రమ ప్రత్యేకత గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదేంటో, ఎన్ని వందల సినిమాలు తీసినా తెలుగు చిత్రాన్ని ‘సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌’గానే చూసేవారు. తమిళ, మలయాళ సినిమాలకి ఉన్నంత గుర్తింపు తెలుగు చిత్రాలకి వచ్చేది కాదు. బాహుబలి పుణ్యమా అని ఒక్కసారిగా టాలీవుడ్‌ వైపు దేశం చూపు తిప్పింది. జక్కన్న ప్రతిభ ప్రపంచాన్నే తలతిప్పేలా చేసింది. మరి ఆ దిష్టి తగిలిందో ఏమో కానీ... గత కొద్ది నెలలుగా టాలీవుడ్‌ లేనిపోని అపవాదులతో తలంటుకుంటోంది. ముందు శ్రీరెడ్డి రూపంలో తెలుగు పరిశ్రమకి భారీ షాక్‌ తగిలింది. నిజమో, అబద్ధమో... తెలుగునాట క్యాస్టింగ్ కౌచ్‌ ఉందంటూ శ్రీరెడ్డి చిన్నచిన్న ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అవకాశాలిస్తామని తనని వాడుకున్నారంటూ దుమ్మెత్తిపోసింది. తాను మోసపోయానన్న భావనలో ఉన్న శ్రీరెడ్డి ఎలాగైనా పరిశ్రమ మీద పగ తీర్చుకోవాలనే తలపుతో ఉన్నట్లు అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో పరిశ్రమ పెద్దలు ఎవ్వరూ ఆమె మాటల్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇలాంటివి అసలు జరగనేలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించడం మానేసి... ఆమెతో నటించేవాళ్లని సైతం వెలి వేస్తాం అంటూ ఓ చిత్రమైన నిబంధన పెట్టారు. శ్రీరెడ్డి నడిరోడ్డు మీద నగ్నంగా నిలబడేందుకు, ఈ నిర్ణయం ఎగదోసినట్లయ్యింది. శ్రీరెడ్డి చర్యతో ఏకంగా టాలీవుడ్ పరువే నగ్నంగా నిలబడిపోయింది. న్యూస్‌ కోసం నోరు తెరుచుకుని ఉండే మీడియాకు శ్రీరెడ్డి వార్త విందు భోజనంలా మారిపోయింది. దాన్ని వడ్డించి, వర్ణించి వాళ్లు టాలీవుడ్‌ మొఖానికే మసిపూసే ప్రయత్నం చేశారు. ఏకంగా మెగా కుటుంబమే ఫిల్మ్‌ ఛాంబర్ల దగ్గర గొల్లుమనేలా చేశారు. ఇప్పటికీ శ్రీరెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఒకరి తర్వాత ఒకరిని ఆమె టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరి పేరు చెబుతుందోనని గింజుకోవడం తప్ప, టాలీవుడ్‌ పెద్దలు చేస్తోందేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరెడ్డి విషయంలో ఎలా వ్యవహరించాలో ‘మా’ అసోసియేషన్ దగ్గర ఒక ప్రణాళికే లేదు. ఆ తుపాను తగ్గిపోయేదాకా తలవంచుకుని ఉండాలనే వాళ్లు నిర్ణయించుకున్నట్లున్నారు. అలాంటప్పుడు ఇక అసోసియేషన్ ఎందుకో! శ్రీరెడ్డి వ్యవహారంలో తలమునకలైన టాలీవుడ్‌కి ఈసారి ఏకంగా అమెరికాలోనే అవమానం ఎదురుచూసింది. కిషన్ మోదుగుమూడి అనే మహాశయుడు సతీసమేతంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. అవకాశాలు రాని, లేని తారలకు వలవేసి అమెరికాకి రప్పించి వాళ్లకి నామమాత్రపు రుసుములు ఇప్పించి వ్యభిచార దందాని నిర్వహిస్తున్నట్లు బయటపడ్డాడు. ఈ వార్త వెలుగులోకి రాగానే మీడియా పులుల మరోసారి విజృంభించాయి. అక్కడి పోలీసులు ఐదుగురు హీరోయిన్ల పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్నారని గాండ్రించి మరీ చెప్పాయి. వాళ్లలో కన్నడ హీరోయిన్‌ ఒకరు, పెద్ద హీరో సరసన నటించిన హీరోయిన్‌ ఒకరు, మూడు అక్షరాల పేరు ఉన్న హీరోయిన్‌ ఒకరు, ప్రముఖ యాంకర్‌ ఒకరు... అంటూ రకరకాల క్లూస్‌ ఇచ్చి జనాలని ఊరించాయి. ఒక పత్రికతో మాట్లాడుతూ ‘కిషన్ మోదుగుమూడి’ మీద తమకి మొదటి నుంచే అనుమానం ఉన్నట్లు అసోసియేషన్ అధ్యక్షులవారు పేర్కొన్నారు. మరి అనుమానం ఉంటే ఇన్నాళ్ల నుంచి ఏం చేస్తున్నట్లు? పైగా ఇక మీదట విదేశాలకి వెళ్లేవారు జాగ్రత్తగా వ్యవహరించాలనీ సూచిస్తున్నారు. మరోవైపు కిషన్ మోదుగుమూడి తమని కూడా అప్రోచ్‌ అయినట్లు కొందరు నటీమణులు చెప్పుకొచ్చారు. మరి వాళ్లు ఇప్పటిదాకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే కిషన్ లీలలు అందరికీ తెలిసే జరుగుతున్నాయని అర్థమవుతోంది. కాకపోతే దీన్ని వ్యక్తిగత విషయంగా భావిస్తూ వచ్చి ఉంటారు. మన పరువు ఏకంగా అమెరికాలో పోయాక కానీ భుజాలు తడుముకుంటూ బయటకి రావడం లేదు. చివరగా చెప్పుకొనేదేంటయ్యా అంటే... టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా ఎదుర్కొనే స్థైర్యం కానీ, వాటికి పరిష్కరించే పరిణతి కానీ కనిపించడం లేదు. దాసరివంటి వారు లేని లోటు కనిపిస్తోందని పదిమందీ పదేపదే బాధపడుతున్న కారణం ఇదే! కుర్రవాడైనా కూడా తమిళనాట ఎలాంటి సమస్యనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న విశాల్‌ని చూసైనా మన పెద్దలు ఏమన్నా నేర్చుకుంటారేమో చూడాలి!

ఏపీలో ఎవరికెన్ని సీట్లో తేల్చిన సర్వే

  ఎన్నికలు ఏవైనా ఈమధ్య సర్వే చేయడం కామన్ అయిపోయింది.. ప్రజలు కూడా సర్వేల మీద ఆసక్తి కనబరుస్తున్నారు.. అసలే ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. ఒకవైపు అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి.. మరోవైపు జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతా అంటుంది.. బీజేపీ ఏపీ లో పాగా వేస్తాం అంటుంది.. మరి ఇలాంటి సమయంలో ఏపీలో సర్వే చేస్తే ఎలా ఉంటుంది?.. అందునా లగడపాటి టీంతో..సర్వేల్లో లగడపాటి & టీంకి మంచి పేరుంది.. వీరి సర్వే ఫలితాలు, ఎన్నికల ఫలితాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.. అందుకే లగడపాటిని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు.. అలాంటి లగడపాటి టీంతో ఒక తెలుగు న్యూస్ ఛానల్ సర్వే చేయించింది.. అందుకే ఈ సర్వే మీద అందరూ అంత ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఈ సర్వే ఏం తేల్చింది?.. అధికారం పక్షం టీడీపీకి మరోసారి అధికారం దక్కనుందా? లేక విపక్షాల ఆశ నెరవేరనుందా?.. కచ్చితంగా టీడీపీదే మళ్ళీ అధికారమని ఈ సర్వే తేల్చేసింది.. టీడీపీ 44 శాతం ఓట్లతో 110 స్థానాలు గెలుచుకుంటుందట.. ఇక ప్రతిపక్షం వైసీపీ 37 శాతం ఓట్లతో 60 స్థానాలు గెలుచుకొని మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందట.. అలానే జనసేన సుమారు 9 శాతం ఓట్లతో అక్కడక్కడా ప్రభావం చూపినా, చాలా తక్కువ స్థానాలే గెలుచుకునే అవకాశం ఉందట.. ఇక ఏపీలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, ఒక్క శాతం ఓట్లకే పరిమితం అవుతుందట.. మొత్తానికి ఈ సర్వేతో ఏపీలో మళ్ళీ టీడీపీదే అధికారమని తేలిపోయింది.  

తండ్రులకూ కావాలి సెలవు?

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ప్రతిరోజూ పెద్దలని తల్చుకునే సంప్రదాయంలో... వాళ్ల కోసం ప్రత్యేకమైన రోజులు పెట్టడం మూర్ఖత్వం అని తిట్టేవారు లేకపోలేదు. ఫాదర్స్ డే, మదర్స్‌డే వంటి సంప్రదాయాలు పాశ్చాత్య వ్యాపార ధోరణులకు మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. నిజమే! కానీ మనిషికీ మనిషికీ మధ్య దూరం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక్క రోజైనా ఆగి బంధాల విలువల గురించి ఆలోచించడంలో తప్పులేదుగా! సమాజం దృష్టిలో తల్లికి ఉన్నంత విలువ, గౌరవం తండ్రికి లభించదు. సాంస్కృతికంగా, సాహిత్యపరంగాను తల్లి ప్రేమ, త్యాగాల గురించే కనిపించే పొగడ్తలు, వర్ణనలు తండ్రికి మీద కనిపించవు. నిజానికి పిల్లల పెంపకంలో తండ్రి ఎవరికీ ఏమాత్రం తీసిపోడు. పిల్లల సుఖం కోసం తన కనీస అవసరాలను చంపుకునేందుకు వెనకాడడు. వాళ్ల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దడంలో దుర్మార్గుడు అన్న పేరుని సొంతం చేసుకునేందుకు జంకడు. కొన్ని పరిశోధనల ప్రకారం పసిపిల్లల మీద తల్లికంటే తండ్రి చూపించే అనురాగమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. యూనిసెఫ్‌ అంచనా ప్రకారమైతే తండ్రితో సరైన అనుబంధం కలిగిన పిల్లల్లో ఆత్మ విశ్వాసం, పరిణతి, జీవితం పట్ల సంతృప్తి పుష్కలంగా మెరుగ్గా ఉంటాయట. కానీ ఇంటిని నడిపే బాధ్యత తండ్రిది, పిల్లల్ని సాకే బాధ్యత తల్లిది అని భావించే సమాజంలో, తండ్రి పాత్రను ఎప్పుడూ తక్కువగానే అంచనా వేస్తుంటారు. అందుకనే బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి ఆఫీసులో ఎలాంటి వెసులుబాట్లూ ఉండవు. పిల్లవాడి దగ్గర తనివితీరా ఓ వారం రోజులు గడిపేందుకు సిక్‌లీవ్‌ పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం మన దేశపు తండ్రులది. కానీ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంట్లో పిల్లల మీద తండ్రుల ప్రభావం గురించి రోజు తర్వాత రోజు వస్తున్న నివేదికలు, వినిపిస్తున్న పరిశోధనల తర్వాత... తండ్రి పాత్రకి కొత్త గుర్తింపు వస్తున్నట్లు కనిపిస్తోంది. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి కూడా కొన్ని రోజుల పాటు ‘పెటర్నటీ లీవ్‌’ ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. పెటర్నటీ లీవ్‌ ఉండని 92 దేశాలలో భారతదేశం కూడా ఒకటంటూ యూనిసెఫ్‌ తరచూ గుర్తుచేస్తోంది. అందుకేనేమో ఇప్పుడు పెటర్నటీ లీవ్‌ని చట్టబద్ధం చేసేందుకు పార్లమెంటు కూడా సిద్ధమవుతోంది. అప్పుడే బిడ్డ పుట్టిన తండ్రులకు కనీసం మూడు నెలల సెలవు ప్రకటించేలా ఓ చట్టాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే పార్లమెంట సెషన్‌లో ఆ చట్టాన్ని సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారట. ఇదే కనుక జరిగితే తండ్రులకి మూడు నెలల పాటు ‘ఫాదర్స్ డే’నే!

నీరు నీరు నీరు... ఎండిపోతోంది

  ఖైదీ నెంబర్‌ 150లో నీటి గురించి ఆ పాట గుర్తుండే ఉంటుంది. భూగర్భజలాలను రక్షించుకోవడానికి ఓ నాయకుడు చేసే పోరాటం ఆ సినిమాకి బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించింది. కానీ రోజువారీ జీవితంలో భూగర్భజలాలను రక్షించుకునేందుకు ఏ నాయకుడూ సిద్ధంగా ఉన్నట్లు లేదు. ఫలితంగా మన జీవితాలే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నమ్మడం లేదు కదూ! నమ్మక తప్పదు మరి!!! జాతీయ ప్రణాళికా సంస్థ నీతి ఆయోగ్‌ ‘కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. పలు సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పైకి సాధారణంగా కనిపించే ఈ నివేదిక తెరిచి చూసిన వాళ్లకి దిమ్మతిరిగిపోయే వాస్తవాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని... - హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ సహా దేశంలోని 21 నగరాలలో 2020 నాటికి తీవ్ర మంచినీటి ఎద్దడి రానుంది. - దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం నీరు కలుషితం అయిపోయింది. 122 దేశాలలోని నీటి నాణ్యతని పరిశీలిస్తే... అందులో మన దేశానికి 120వ ర్యాంకు వచ్చింది. - దేశంలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలు, తాగేందుకు సురక్షితమైన నీరు లేక అల్లల్లాడిపోతున్నారు. - 2030 నాటికి మన దగ్గర దొరికే నీరు కంటే కొనుక్కోవల్సిన నీరే అధికంగా ఉండే ప్రమాదం ఉంది. దీని వల్ల జీడీపీకి 6 శాతం నష్టం వాటిల్లుతుంది. - సురక్షితమైన మంచినీరు దొరకక ఏటా రెండు లక్షల మంది వేర్వేరు వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. భూగర్భజలాలు ఎండిపోతున్నాయో అని ఏటా ఎవరో ఒక నిపుణుడు మొత్తుకుంటూనే ఉన్నారు. వాటిని పరిరక్షిస్తున్నాం అంటూ రాష్ట్రాలు కబుర్లు చెబుతూనే ఉన్నాయి. కానీ వాస్తవాలు ఇవిగో పైన చెప్పుకొన్నట్లే ఉన్నాయి. అందుకే దాదాపు 60 శాతం రాష్ట్రాలు భూగర్భ జాలాలని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని నీతిఆయోగ్‌ నివేదిక ఎత్తిచూపించింది. వీటిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలు ఉండటం గమనార్హం. దీనిబట్టి మిషన్‌ కాకతీయ వంటి ప్రతిష్ట్రత్మక ప్రాజెక్టులు ఇంకా సత్ఫలితాలు ఇవ్వలేదని అర్థమవుతోంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, హర్యాణా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో అయితే భూగర్భ జలాల పరిరక్షణ మరీ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను సరిగా వినియోగించుకోకపోవడం; నీళ్ల రీసైక్లింగ్‌ మీద ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ తగిన శ్రద్ధ లేకపోవడం; వందల అడుగుల లోతుకి వేసే బోర్ల మీద కూడా ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేకపోవడం; వరద నీటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం... వినేందుకు కాస్త బోర్‌ కొడుతుందే కానీ, భూగర్భజలాలను పరిరక్షించుకునేందుకు చాలా మార్గాలే ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వీటి మీద పూర్తి అవగాహన ఉండి ఉండాలి. కానీ ప్రస్తుత నివేదిక చూస్తే మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయం కలుగుతోంది. ఫలితం! నివేదికలో పేర్కొన్న భయాలు 2030 నాటికి నిజమయ్యే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆటలు సాగుతాయా?

బీజేపీ అధినేత అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని విజయవంతం చేసే బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. కన్నా కూడా ఇలాంటి కార్యక్రమం కోసం మంచి హుషారుగా ఎదురుచూస్తున్నారు. అసలు కన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన దగ్గర్నుంచే, ఆయన చంద్రబాబు మీద విరుచుకుపడిపోతున్నారు. మాటిమాటికీ మాట మార్చే చంద్రబాబులో తనకి ఓ అపరిచితుడు కనిపిస్తున్నాడనీ, రాజధాని నిర్మాణం కోసం దేశాలన్నీ తిరిగి చివరికి రాజమౌళి చెంతకు చేరుకున్నాడనీ దూకుడుగా విమర్శలు చేశారు. మరోవైపు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా బీజేపీ మీద చీమ కూడా వాలనివ్వడం లేదు. నిజానికి ఒకప్పటి బీజేపీ వేరు ఇప్పటి బీజేపీ వేరు. ఒకప్పుడు బీజేపీ దృష్టి కేవలం ఉత్తరాది మీద ఉండేది. ఆ ఉత్తరాది సాయంతో ఎలాగొలా దిల్లీ పీఠాన్ని దక్కించుకుంటే చాలనుకునేది. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఏకంగా 80 పార్లమెంటు సీట్లు ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చిన అంశం. కానీ మోదీ- అమిత్‌షాల ద్వయం అధికారంలోకి వచ్చాక ఈ తీరు మారిపోయింది. దేశంలో ఎంత మారుమూల ప్రదేశమైనా సరే.. దాన్ని కూడా బీజేపీ ఖాతాలోకి చేర్చుకోవాలనే పంతం వారిది. అందుకే మోదీగారు అయితే విదేశీ పర్యటనల్లోనో లేకపోతే ఎన్నికల ప్రచారంలోనో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి మోదీ-అమిత్‌షాలకు దక్షిణాది కొరకరాని కొయ్యగా మారింది. అటుచూస్తే కేరళలో కమ్యూనిస్టులు పాగా వేశారు. ఇటుచూస్తే కర్ణాటకతో దారుణమైన గర్వభంగం జరిగింది. అక్కడ బీజేపీ ఎత్తుని పారనివ్వకుండా ఏకంగా సుప్రీం కోర్టే జోక్యం చేసుకుంది. ఇక తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే ఉంది. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి వంటి బలమైన నేతలు ఇక్కడ ఉన్నా, కాంగ్రెస్‌తో సమానంగా ప్రతిపక్ష పాత్రని నిర్వహించలేకపోతున్నారు. క్రితం ఏడు ఏకంగా అమిత్‌షానే తెలంగాణకి వచ్చి ఇక్కడి శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ మీద విమర్శలు ఎక్కుపెట్టి, సొంత లాభం కొంత పొందాలనుకున్నారు. కానీ ఆ విమర్శలని తీవ్రంగా తిప్పికొట్టిన కేసీఆర్‌ ‘అమిత్‌షా గిమిత్‌షా’ల ఎత్తులు ఇక్కడ పారవని ఎద్దేవా చేశారు. దీంతో తటస్థంగా ఉన్న తెరాసతో అనవసరంగా తలంటుకోకూడదన్న ఆలోచనతో బీజేపీ మరింత మెత్తబడింది. ఇక మిగిలిందల్లా ఆంధ్రప్రదేశ్‌! ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆంధ్రాలో బీజేపీ నేతలు టీడీపీని దీటుగానే ఎదుర్కొంటున్నారు. ఇక జాతీయ కార్యవర్గం కూడా ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగువారైనా రాంమాధవ్‌, మురళీధరరావు, జీవీఎల్‌ నరసింహరావు ప్రభుతులు ఆంధ్రాలో బీజేపీ విజయాన్ని బలంగా కోరుకుంటున్నారు. తమ ఆశలను ఒక అడుగు ముందుకు వేయించేందుకే వారు కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. కాపు సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణను ఎంపిక చేయడం ద్వారా, చంద్రబాబు మీద కాస్త గుర్రుగా ఉన్న ఆ వర్గాన్ని తమవైపుగా తిప్పుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. కన్నా లక్ష్మీనారాయణ... పదీ ఇరవై కాదు, ఏకంగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవాడు. కాంగ్రెస్‌లో పలు మంత్రిత్వశాఖలను నిర్వహించినవాడు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఇప్పుడప్పుడే మంచిరోజులు లేవని భావించి తెలివిగా బీజేపీ వైపు చేరాడు. ఆయనను తక్కువగా అంచనా వేయడానికి లేదు. కన్నా, విష్ణువర్ధన్‌, సోము వీర్రాజు వంటి నేతలు బలపడుతున్నంత మాత్రాన ఆంధ్రాలో బీజేపీ అచ్ఛేదిన్‌ వచ్చేస్తాయని భావించలేం. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న అక్కసు ఆంధ్రాలో ప్రతి పౌరుడికీ ఉంది. దానికి తోడు పెరిగిపోతున్న నిరుద్యోగం, బ్యాంక్‌ స్కాంలు, జీఎస్టీ లోపాలు, పెట్రోలు ధరలు... లాంటి సవాలక్ష సమస్యలు మోదీ పరువును ఈపాటికే సగానికి సగం తగ్గించేశాయి. ఒకవేళ చంద్రబాబు మీద ఓటర్లకు అసంతృప్తి ఉంటే దాన్ని ఓట్ల కిందకి మార్చుకునేందుకు వైకాపా, జనసేన సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఓట్లని రాబట్టుకోవాలంటే ఏదో ఒక బ్రహ్మాస్త్రంతో బీజేపీ ముందుకు రావల్సిందే! అంతవరకు ఆంధ్రాలో బీజేపీ అద్భుతాలు సాధిస్తుందని ఊహించలేం!!!

పాపం వెంకయ్య నాయుడు

  వెంకయ్య నాయుడు ఇప్పుడంటే ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి సైలెంట్ గా ఉన్నారు కాని, ఒకప్పుడు అలా కాదు.. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిరోజూ ప్రజలు ఆయన పేరు వింటూనే ఉంటారు.. ఆయనికి అప్పట్లోనే కేంద్రంలో మంచి పేరు ఉండేది.. తెలుగు ప్రజల కోసం ఆలోచించే ఆయన.. విభజన సమయంలో, ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని కోరారు.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పదేళ్ల  ప్రత్యేకహోదాకి ఒప్పుకుంది.. తర్వాత ఎన్నికలు రావడం, బీజేపీ అధికారంలోకి రావడం అలా జరిగిపోయాయి.. బీజేపీ కూడా ప్రత్యేకహోదా ఇస్తా అనడంతో.. తన రాష్ట్రానికి సొంత పార్టీ ప్రత్యేకహోదా ఇస్తుందంటూ వెంకయ్య నాయుడు తెగ సంబరపడిపోయారు.. కానీ బీజేపీ యూ టర్న్ తీస్కొని ప్రత్యేక ప్యాకేజీ అంది.. ప్రస్తుతానికి ప్యాకేజీనే మహా ప్రసాదం అనుకొని వెంకయ్య దానికి కూడా ఒప్పుకున్నారు.. కానీ ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి.. ఏపీ ప్రజలు, ప్రభుత్వం ప్రత్యేకహోదా కావాల్సిందే అంటున్నారు.. ఇంత జరుగుతున్నా, ఒకప్పుడు రాష్ట్రానికి, కేంద్రానికి వారధిలా వ్యవహరించిన వెంకయ్య, ఇప్పుడు మౌనంగా ఉండిపోతున్నారు. దానికి కారణం ఆయన ఇప్పుడు ఉప రాష్ట్రపతి.. దక్షిణాది నుండి బీజేపీ లో యాక్టీవ్ గా ఉండే లీడర్స్ లో ముందుగా  వెంకయ్య పేరు చెప్పేవారు.. అలాంటి వెంకయ్యను మోడీ కావాలనే సైలెంట్ చేయడానికి ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చాడని ఆరోపణలు వినిపించాయి.. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోరిక బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వెంకయ్య నాయుడు పేరు తెరమీదకి వచ్చింది.. ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, వెంకయ్య నాయుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. వెంకయ్య నాయుడు ప్రస్తుతం బంగారు పంజరంలో ఉన్న చిలుక అని, ఏపీ కి సాయం చేయలేక కన్నీరు పెట్టుకుంటున్నారని, ఈ పరిస్థితికి మోడీనే కారణమని చలసాని అన్నారు.. ఇదంతా చూసి.. పాపం ప్రాసలు, ప్రత్యక్ష రాజకీయాలు ఇష్టపడే వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అనే పంజరంలో బందీ అయి మౌనంగా ఉండిపోతున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కిమ్‌, ట్రంప్‌లు కలిస్తే మనకేంటి లాభం?

  ఉత్తర కొరియా నియంత కిమ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు ఇవాళ సింగపూర్‌లో కలుస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా... ఉత్తర కొరియా, అణ్వాయుధాలని టపాసులు పేల్చినంత తేలికగా పరీక్షిస్తోంది. తమ అణ్వాస్త్రాలు అమెరికా వరకు వెళ్తాయని కాలు రువ్వుతోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికాలు చేసిన హెచ్చరికలను కానీ విధించిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కిమ్‌ ప్రపంచానికే పక్కలో బల్లెంలా తయారయ్యారు. అలాంటి కిమ్‌ ఇప్పుడు అకస్మాత్తుగా తెల్లజెండా ఊపడం, ప్రపంచ రాజ్యాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సహజంగానే అమెరికా ఈ చర్యతో తబ్బిబ్బైపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడెప్పుడు కిమ్‌ని కలిసి శాంతి మంత్రాలు పఠిద్దామా అని తొందరలో ఉన్నారు. ఆ ముహూర్తాన్ని సింగపూర్‌లో ఇవాళ నిర్ణయించారు. నిజానికి పైకి శాంతి ఒప్పందంలా కనిపించే ఈ చర్య వెనుక ఎవరి ఉద్దేశాలు వాళ్లకి ఉన్నాయి. తమ దేశం ఇక మీదట అణ్వస్త్రాల జోలికి పోదని కిమ్‌ ఒప్పుకోవడం అంటే... ‘మాకు కావల్సిన ఆర్థిక లాభాలు మాకు అందచేస్తే, మేము ప్రశాంతంగా ఉంటాం’ అని చెప్పడం. మరోవైపు ఉత్తర కొరియా అణ్వస్త్రాల జోలికి పోకూడదని అమెరికా కోరుతోందంటే, ఆ దేశానికి ఉన్న శాంతికాముకత్వంతో కాదు- ‘ఉత్తర కొరియా ఎక్కడ ఎప్పుడు తమ మీద ముంచుకు వస్తుందో! తమ ఆయుధ వ్యాపారానికి ఎక్కడ గండి కొడుతుందో’ అన్న అనుమానంతోనే! అంటే శాంతి ముసుగులో ఈ రెండు దేశాలూ తమకి కావల్సిన లాభాన్ని ఆశిస్తున్నాయన్నమాట! కిమ్‌, ట్రంప్‌లు కలుస్తున్నారన్న వార్తని మన పత్రికలు పతాక శీర్షికలలో ప్రచురించాయి. ఆ కలయిక వెనుక ఉన్న ఉద్దేశాన్ని చాలా కొద్ది పత్రికలు మాత్రమే ప్రస్తావించాయి. ఇక ఈ కలయిక వల్ల మన దేశానికి ఎలాంటి లాభం అన్న విషయం జోలికి చాలా పత్రికలు పోనేపోలేదు. కిమ్‌ వాడే టాయిలెట్‌, ఆయన కోసం వండే ఆహారం, ఆయన భద్రతలను దాటి చాలా పత్రికలు ఆలోచించనేలేదు. ఈ రోజున ఉత్తరకొరియా అణ్వస్త్ర బూచిన చూపించి ప్రపంచాన్నే వణికిస్తోందంటే దానికి కారణం పాకిస్థానే! పెద్దగా అణు విజ్ఞానం లేని ఉత్తర కొరియాకు కావల్సిన సాంకేతిక సమాచారాన్ని ఇచ్చింది పాకిస్థానే అని రక్షణ నిపుణులు చెబుతారు. కేవలం సాంకేతికతే కాదు, ఆ సాంకేతికతను పరీక్షించేందుకు కావల్సిన ముడిసామాగ్రిని కూడా పాకిస్థానే సమకూర్చిందని ఏకంగా అమెరికానే ఆరోపిస్తోంది. పాకిస్థాన్‌ అణుపితామహుడిగా పేరొందిన ఏ.క్యూ.ఖాన్‌, ఉత్తరకొరియాకి వెళ్లిమరీ వాళ్లకి అణు విధ్వంసం మీద పాఠాలు నేర్పించారు. ఆ సలహాలు, సాంకేతికత, సామగ్రిలతోనే 2006లో ఉత్తర కొరియా తొలిసారి అణుబాంబుని పరీక్షించింది. ఇప్పుడు ఉత్తరకొరియా ఏకంగా హైడ్రోజన్‌ బాంబునే పరీక్షించే స్థాయికి చేరుకుంది. తనకి ఒకప్పుడు సాయం చేసిన పాకిస్థాన్‌కు తిరిగి సాయం చేసే స్థాయిలో ఉంది. ఏకంగా అమెరికానే భయపెట్టే పరిస్థితికి వచ్చింది. ట్రంప్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కి కాస్త ప్రతికూలంగా మారేందుకు ఉత్తరకొరియా వెనుక ఆ దేశం ఉండటం కూడా ఓ కారణమే! కిమ్‌, ట్రంప్‌ల మధ్య జరిగే చర్చల తర్వాత ఉత్తర కొరియా అణ్వస్త్ర దూకుడు చాలా వరకు తగ్గవచ్చు. అది పాకిస్థాన్ అణువ్యాపారాల మీద కూడా ప్రభావం చూపుతుంది. తన అణు సాంకేతితను అమ్ముకుని ఆర్థికంగా లాభపడేందుకు, హైడ్రోజన్‌ బాంబు వంటి సాంకేతికతను అందుకుని రక్షణపరంగా బలపడేందుకు పాకిస్థాన్‌కి కుదరదు. ప్రపంచదేశాల మధ్య ఏకాకికగా ఉంటున్న పాకిస్థాన్‌కు ఇప్పటివరకు చైనా, ఉత్తర కొరియాలు కాస్త మద్దతుగా నిలిచేవి. ఇక మీదట ఉత్తర కొరియా కూడా కాస్త లౌక్యంగా వ్యవహరించవచ్చు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను ప్రపంచం మీదకు ఉసిగొల్పినట్లుగానే, ఉత్తరకొరియాని అడ్డుపెట్టుకుని ప్రపంచదేశాలని ఆడిద్దామనుకునే వ్యూహం ఇకపై సాగదు. ఒక్కమాటలో పాకిస్థాన్‌ చదరంగంలోంచి ఒక పావు ఎగిరిపోయినట్లే! 2010లో ఉత్తరకొరియా కరువుతో అల్లాడుతుంటే మన దేశం ఒక్కటే సాయపడేందుకు సిద్ధమైంది. టన్నుల కొద్దీ ఆహారధాన్యాలు పంపి ఆ దేశాన్ని ఆదుకొంది. అధికారంగా ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని అంగీకరించిన దేశాలలో మన దేశం కూడా ఒకటి. మన దేశం చొరవతోనే ఉత్తరకొరియా, ఐక్యరాజ్యసమితిలో చోటు సంపాదించుకొంది. ఈ విషయాలన్నీ ఉత్తర కొరియా జ్ఞాపకాలలో ఉంటే కనుక ఇక మీదట పాకిస్థాన్‌కంటే మనవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.