యడ్యూరప్పపై కేసు కు గ్రీన్‌సిగ్నల్
posted on Mar 25, 2011 @ 10:21AM
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన భూకుంభకోణాలపై పోలీసుల విచారణకు ప్రత్యేక లోకాయుక్త కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు భూముల కేటాయింపుల్లో అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, డీనోటిఫై చేశారానే అభియోగంపై ఈ విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం కోర్టు మొత్తం 15 భూకుంభకోణాలకు సంబంధించిన కేసులను విచారిస్తోంది. రెండు నెలల క్రితం గవర్నర్ చ్.ఆర్.భరద్వాజ్ అనుమతిచ్చిన నేపథ్యంలో న్యాయవాదులు సిరంజన్ బాషా, కెన్ బాలరాజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక లోకాయుక్త పోలీసుల విచారణకు ఆదేశించింది. ఇదిలావుండగా స్వంత పార్టీలోనే అసమ్మతి మళ్లీ కుంపటి రాజుకుంది. దీంతో ఆయన గురువారం అత్యంవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం 27 మంది మంత్రుల్లో 21 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశం ద్వారా యడ్యూరప్ప తనకున్న బలంపై అధిష్టానానికి గట్టి సందేశమివ్వాలనుకున్నట్టు తెలుస్తోంది.