సరి సమానం..కాంగ్రెస్కు 3-జగన్కు 3-టీడీపీకు 3
posted on Mar 23, 2011 @ 6:01PM
హైదరాబాద్: రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా కింద జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (జగన్ వర్గం)లు సమానంగా పంచుకున్నాయి. పార్టీలోని లుకలుకలు మాత్రమే కాకుండా మంత్రుల్లోని అసంతృప్తి జ్వాలలు కూడా మరోసారి పైకెగశాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను సమర్థంగా ఎదుర్కంటున్నారని ఇంత కాలం భావించారు. కానీ, అది అంత సులభం కాదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది.
పార్టీలోని అంతర్గత విభేదాలను కూడా ఆయన పరిష్కరించకలేక పోయారు. సమయం వస్తే దెబ్బ తీయడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఎన్నికల ఫలితాల వల్ల తేలిపోయింది. అనంతపురం జిల్లాలో శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మొదటి నుంచి తాను కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని సమర్థించబోనని చెబుతూ వస్తున్నారు. సమయం చాలానే ఉన్నా ఆయనను దారికి తేవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు.
అలాగే, తన సొెత జిల్లా చిత్తూరులో కూడా అసమ్మతి కుంపటి రగులుతున్న విషయం ఆయనకు తెలియంది కాదు. తనకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పని చేస్తారని ఆయనకు తెలుసు. అయినా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని, మరో శాసనసభ్యురాలు కుతూహలమ్మను బుజ్జగించడంలో ఆయన విఫలమయ్యారనే చెప్పవచ్చు. అలాగే, జగన్ వర్గం అభ్యర్థిని ఓడించడానికి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఎత్తులేవీ పారలేదు.
కొద్దిపాటి ఓట్లతోనే తాము ఓడిపోయామని కిరణ్ కుమార్ రెడ్డి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నైతికంగా వైయస్ జగన్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఇకపోతే, పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద దెబ్బనే. ఇక్కడ జగన్ వర్గం రాజకీయాల కన్నా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలే కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను దెబ్బ తీసింది. స్థానిక నాయకుల మాటలను ఖాతరు చేయకుండా ఆయన అభ్యర్థులను ఖరారు చేశారు.
ఈ సమయాన్ని చూసి మంత్రులు వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ తమ అసంతృప్తిని బయట పెట్టారు. వట్టి వసంతకుమార్ రాజీనామా చేయడానికి సిద్ధపడగా, బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి చురకలంటించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రాంగం, యంత్రాంగం బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఇది అదనుగా తీసుకుని - వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటే కాంగ్రెసుకు ఈ పరిస్థితి ఉండేది కాదని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అంటున్నారు.