జనానికి కరెంట్ షాక్
posted on Mar 25, 2011 @ 9:51AM
హైదరాబాద్: గృహవినియోగదారులకు ఇది చేదువార్త. గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను పెంచాలన్న డిస్కాంల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) రెండు, మూడు రోజుల్లో పచ్చ జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. పెరిగిన విద్యుత్ చార్జీల మేరకు రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుందా లేక నేరుగా గృహ వినియోగదారుల నుంచే పెరిగిన చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వం డిస్కాంలకు అనుమతి ఇస్తుందా అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణం ఏపిఇఆర్‌సి నుంచి ఆదేశాలు వెలువడవచ్చునని సమాచారం. ఆ లోగా విద్యుత్ చార్జీల పెంపుదలకు అంగీకరిస్తే శాసనసభలో విపక్షాల నుంచి ఒత్తిడి రావడమేకాకుండా స్వపక్షం నుంచి కూడా నిరసనలు రావచ్చని భావిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత సబ్సిడీ వల్ల సాలీనా ఐదు వేల కోట్ల రూపాయల వరకు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఈ ఏడాదికి గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను పెంచి పది సంవత్సరాలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడడం, మధ్యతరగతి వర్గం వారు కూడా ఎసి యంత్రాలను వినియోగించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీసం రెండు వందల యూనిట్లు ఆ పైన విద్యుత్ వినిమయం చేసే వారికి మాత్రమే పెంచిన చార్జీలు వర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని భరిస్తానన్నా అంగీకరించే స్థితిలో డిస్కాంలు లేవు. ఎందుకంటే డిస్కాంలకు ప్రభుత్వం సబ్సిడీల బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించడం లేదు. ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగదారుల కేటగిరీ ఎల్‌టి 1లో ఐదు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఆరు శ్లాబ్‌లు చేయనున్నట్లు సమాచారం. నాల్గవ శ్లాబ్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచవచ్చు.