సిఎం కిరణ్‌పై హైకమాండ్ కు బొత్స ఫిర్యాదు
posted on Mar 25, 2011 @ 9:52AM
న్యూఢిల్లీ: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఓడిపోవటానికి దారి తీసిన పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీఆజాద్‌కు ఈ మేరకు ఒక నోట్ పంపించినట్లు తెలిసింది. కిరణ్‌కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని బొత్స ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఢిల్లీ వచ్చిన బొత్స సత్యనారాయణ గురువారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపారు. సత్యనారాయణ ఒకటి రెండు రోజుల్లో గులాంనబీ ఆజాద్‌ను కలిసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఆయన తన నోట్‌లో పేర్కొనట్లు చెబుతున్నారు. టిడిపితోనూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో లోపాయికారిగా చేతులు కలపడం వల్ల పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని మంత్రి బొత్స తన నోట్‌లో ఆరోపించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండే పార్టీ, ఈ నేపథ్యంలో తమ విధానాలు, సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీలతో లోపాయికారిగా ఎలా చేతులు కలుపుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ పరంగా రాష్ట్రంలో ఎలాంటి సమన్వయం లేదనీ, దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయటంపై పార్టీ అధినాయకత్వం ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించాలని బొత్స కోరినట్లు తెలిసింది.