జగన్ వర్గానికి అధికారవర్గం ప్రశంసలజల్లు
posted on Mar 25, 2011 @ 11:44AM
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం చిత్తూరు జిల్లా శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శుక్రవారం ప్రతిపక్ష పార్టీ సభ్యులతో పాటు అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే షాక్ ఇవ్వడాన్ని కొందరు అభినందించినట్లుగా తెలుస్తోంది. కిరణ్ నిలబెట్టిన పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని అన్నమాటను పెద్దిరెడ్డి నెగ్గించుకున్నారు.
చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ సభ్యుడు నరేష్ కుమార్ పెద్దిరెడ్డి నిలబెట్టిన తిప్పారెడ్డి చేతిలో ఒక ఓటు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెసు సభ్యులు పెద్దిరెడ్డి తన అభ్యర్థిని గెలిపించుకోవడంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఆయనను మెచ్చుకున్నాయి. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి పెద్దిరెడ్డిని హీరో ఆఫ్ ది డేగా అభివర్ణించినట్లుగా సమాచారం. డిఎల్ జగన్‌కు బద్ద వ్యతిరేకి కావడం విశేషం.