హత్యకు సూత్రధారి నయామ్
posted on Apr 6, 2011 9:13AM
నల్లగొండ: మావోయిస్టు మాజీ నేత, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొణపూరి అయిలయ్య అలియాస్ సాంబశివుడి హత్యకు మరో మాజీ నక్సలైట్ ఎండి నయీముద్దీన్ అలియాస్ నయామ్ సూత్రధారి అని జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సాంబశివుడి హత్యలో పాల్గొన్న మొత్తం 12మంది నిందితుల్లో ఐదుగురిని మీడియా ముందు హాజరుపరిచి అనంతరం కోర్టుకు రిమాండ్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు నల్లగొండవాసి చిలకరాజు సురేష్, హైదరాబాద్ జియాజి గూడకు చెందిన చకటోళ్ల అమర్, పురానాపూల్‌కు చెందిన గుండు రాకేష్, దర్శనపు శ్రీకాంత్, ధూద్‌బౌళికి చెందిన మారగోని శ్రీ్ధర్‌గౌడ్‌లు ఉన్నారు. పరారిలో ఉన్న నిందితుల్లో నయామ్‌తో పాటు అతని అనచరుడు రహీమ్, సర్వేల్ వాసి, ప్రధాన నిందితుడి కొడుకు చిలకరాజు అరుణ్, వీరమళ్ల రవి, మర్రిగూడెంకు చెందిన రాజుల నరేష్, ఇబ్రహీమ్‌పట్నంకు చెందిన పాశం లింగం, రంగారెడ్డి జిల్లా సింగారం వాసి ఎర్ర కృష్ణలు ఉన్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఎస్పీ కథనం మేరకు సాంబశివుడితో నయీంకు ఉన్న పాత కక్షల కారణంగా అతడిని చంపేందుకు తన అనుచరుడైన చిలకరాజు సురేష్‌ను పురమాయించాడు. మరో అనుచరుడు రహీమ్ ద్వారా సురేష్‌కు నయిమ్ 1.9 లక్షలు అందించాడు. సాంబశివుడి హత్యకు సురేష్ హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ అమర్ సహాయాన్ని కోరగా అతడు కేసులోని ఇతర నిందితులను భాగస్వాములుగా చేసి వారికి 10వేల చొప్పున అందించాడు. సాంబశివుడి హత్యకు వీరు రెండు పర్యాయాలు రెక్కి చేసి చివరకు సంగెం గ్రామం ధూంధాంలో పాల్గొని వెలుతుండగా దాడి చేసి హత్య చేశారు. హంతకులు వదిలి వెళ్లిన కారు సహాయంతో కేసు దర్యాప్తును కొనసాగించి ఐదుగురు నిందితులను పట్టుకున్నామని, పరారిలో ఉన్న మిగతా వారిని మూడు నాలుగు రోజుల్లో అరెస్టు చేస్తామని ఎస్పీ ప్రకటించారు.