నెల్లూరు ఎంపీ స్థానం ఖాళీ కానుందా?
posted on Apr 5, 2011 @ 10:04AM
నెల్లూరు: కాంగ్రెసు పార్టీ, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. ‘‘రెండు పడవల ప్రయాణం నాకు ఇష్టం లేదు. ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఏ క్షణమైనా రావొచ్చు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు రావొచ్చు’’ అని ఆయన చెప్పారు. సోమవారం నెల్లూరు పట్టణంలో నిర్వహించిన ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ జెండా ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కావొచ్చన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఇదే స్థానం నుంచి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ తరఫున ప్రజల ముందుకు వస్తానన్నారు. రాష్ట్రం సరైన దారిలో నడిచి అభివృద్ధి జరగాలన్నా, మహానేత వైఎస్‌ఆర్‌ఆశయాలు నెరవేరాలన్నా, జగన్ నాయకత్వం ఎంతైనా అవసరమన్నారు. ఈ కారణంగానే తాను జగన్ వెంట నడుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. యువనేత బలపరచిన అభ్యర్థులు.. పార్టీ పుట్టీపుట్టకనే మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారని మేకపాటి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ప్రభంజనం సృష్టిస్తారని, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఎంపీ మేకపాటి ధీమా వ్యక్తం చేశారు.