టిఆర్ఎస్, జగన్ లవే మ్యాచ్ ఫిక్సింగ్
posted on Apr 6, 2011 9:14AM
హైదరాబాద్: రాష్ట్రంలో కుమ్మక్కైంది కాంగ్రెస్, జగన్ పార్టీలేననీ, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకే టీడీపీ కాంగ్రెస్ తో కుమ్మక్కైందని విమర్శిస్తున్నారని తెలుగు దేశం పార్టీ దుయ్యబట్టింది. మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఐటి నోటీసులు ఇస్తే తిరిగి కాంగ్రెసు పార్టీలోకి చేరతారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా త్వరలో కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలను పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. టిఆర్ఎస్, జగన్ వర్గం నేతలు రాజకీయ స్వార్థంతోనే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్న వారే త్వరలో అదే పార్టీలో చేరతారన్నారు. ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసుతో టిడిపి పోరు చేస్తుందన్నారు. కాంగ్రెసు పార్టీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. టిడిపి ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టిందన్నారు.