ఎలాంటి పుకార్లు నమ్మద్దు: రఘువీరా
posted on Apr 5, 2011 @ 12:12PM
హైదరాబాద్: బాబా ఆరోగ్యంపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని రాష్ట్ర మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు.బాబా కళ్లు తెరిచి చూస్తున్నారని బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ చెప్పారన్నారు. విదేశాలనుండి కూడా వైద్యులు బాబా ఆరోగ్యం కోసం వచ్చారన్నారు. బాబా ఆరోగ్యం విషయంలో పారదర్శకత ఉండాల్సిందే నన్నారు. మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ రమేష్ పుట్టపర్తి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారన్నారు. బాబా ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమన్వయ లోపం ఉండరాదన్నారు. ప్రభుత్వం తరఫున పుట్టపర్తిలో అన్నింటిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని పంపిస్తుందన్నారు.
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగానే పని చేస్తున్నాయని ఒక్క కిడ్నీ సమస్యనే ఉందని చెప్పారు. కిడ్నీ నుండి రెస్పాన్స్ రావడానికి సమయం ఎంతని చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారన్నారు. ఇప్పటికే మంత్రి గీతారెడ్డి పుట్టపర్తిలో ఉన్నారన్నారు. ఆమె ఓ భక్తురాలిగా, ప్రభుత్వం అధినేతగా అక్కడ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. బాబా కోలుకోవడానికి భక్తులు ఆవేశాలకు లోనుకావద్దని కోరారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంను అక్కడి పరిస్థితులు కుదుట పడే వరకు అక్కడే ఉండమని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. బాబా ఆరోగ్యం త్వరగా బాగుపడాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. బాబా ఆరోగ్యం విషయం ప్రజలకు, భక్తులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రోజుకు రెండుసార్లు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు.