తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం.!!
posted on Oct 8, 2018 @ 12:56PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా ఏపీలో వ్యతిరేకత అయితే మూటకట్టుకుంది కానీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తెలంగాణలో మైలేజీ సాధించి 2014 లో అధికారాన్ని మాత్రం పొందలేకపోయింది. దీంతో రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అనే విషయాన్నీ ఈసారైనా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. తెరాసను ఓడించి తెలంగాణలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. దానికోసం టీడీపీ, టిజెఎస్, సిపిఐ లాంటి పార్టీలను కలుపుకొని పోతుంది. అంతేకాదు ప్రచారం విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నట్టు తెలుస్తోంది.
ఇందిరాగాంధీ అన్నా, ఇందిరాగాంధీ కుటుంబమన్నా కాంగ్రెస్ శ్రేణులకు మొదటినుండి విరీతమైన అభిమానం. ఈ అభిమానాన్ని తట్టి లేపాలని కాంగ్రెస్ భావిస్తోందట. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎలాగూ ప్రచారానికి వస్తారు. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రచారానికి వచ్చే అవకాశాలు తక్కువున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్, ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలని చూస్తోందట. రూపంలో అచ్చు తన నాయనమ్మ ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకకు.. యువతలో విశేష ఆదరణ ఉందనీ, ఆమె వాగ్దాటి, చరిష్మా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక రాకతో కొత్త ఉత్సాహం రావడమే గాక.. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు ఇందిరాగాంధీని గుర్తుచేసుకొని ఆమె మీద అభిమానంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారని కొందరు నేతల అభిప్రాయం. మరి ప్రియాంక గాంధీ నిజంగానే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో.