డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
posted on Oct 8, 2018 @ 6:17PM
షాపూర్‌నగర్‌లో నిర్వహించిన ‘కాంగ్రెస్ మహిళా గర్జన’ సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చేరగటంతో పాటు,హామీల జడివాన కురిపించారు.ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌కు మహిళలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.ముదునష్టపు కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో మహిళలు, మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపు మహిళలందరికి అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు.మహిళల బతుకులు బాగుపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందన్నారు.
డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు రూ. లక్ష చొప్పున గ్రాంట్ ఇస్తామని, ఒక్కో సంఘానికి వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాలు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ వడ్డీ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.మోదీ పరిపాలనలో వంటగ్యాస్ రూ.970కి చేరిందని.. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబసభ్యుల్లోని ప్రతి మనిషికి నెలకు ఏడు కిలోల సన్నబియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చక్కెర సహా 9 రకాల వస్తువులు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.డబుల్ బెడ్ రూం పథకాన్ని మార్చి రూ.5 లక్షలు ఇస్తామని, 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.