జయలలిత అంత్యక్రియలకైన ఖర్చు కోటి.!!
posted on Oct 22, 2018 @ 12:07PM
'పుట్టినప్పుడు ఏం తీసుకురాము.. పోయేటప్పుడు ఏం తీసుకుపోము' అంటారు. అవును నిజమే. ఎంత డబ్బున్న కుటుంబంలో పుట్టినా.. ఎంత డబ్బు సంపాదించినా పోయేటప్పుడు ఏం తీసుకుపోము. కానీ డబ్బున్నోళ్ళు, గొప్పోళ్ళు పోయినప్పుడు మాత్రం అంత్యక్రియలకు భారీగా ఖర్చవుతుంది. అది లక్షలు, కోట్లు కూడా అవొచ్చు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అంత్యక్రియలకు కూడా సుమారు రూ. కోటి ఖర్చయిందట. మదురై కేకే నగర్‌కు చెందిన సయ్యద్ తమీమ్ అనే సంఘ సేవకుడు జయలలిత మరణంపై పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతూ సీఎం ప్రత్యేక విభాగం, ప్రజా సమాచార విభాగానికి.. సమాచార హక్కుల చట్టం కింద దరఖాస్తు సమర్పించారు. అందులో జయలలిత ఎప్పుడు మరణించారు? అన్న ప్రశ్నకు 2016 డిసెంబర్ 5వ తేదీ అని ఉంది. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందినందుకు రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న ప్రశ్నకు ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఉంది. జయలలిత అంత్యక్రియల కోసం రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అన్న ప్రశ్నకు రూ.99 లక్షల 33 వేల 586 అని ఉంది. ఇక, మాజీ శాసనసభ్యులకులాగే జయలలితకు కూడా కుటుంబ పింఛన్ పంపిణీ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. పింఛన్‌కు సంబంధించిన వ్యవహారంలో నిర్ణయం తీసుకొనే అధికారం అసెంబ్లీ కార్యదర్శికి మాత్రమే ఉందని, దీనిపై ఆయనే సమాధానం చెప్పాలని అందులో వివరించారు.