ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే కాల్చిపారేయండి
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం లో పోలింగ్ జరిగింది. ఇక ఈ నెల 7న తెలంగాణ, రాజస్థాన్ లో పోలింగ్ జరగనుంది. అయితే మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాంల ఫలితాలు కూడా ఈ నెల 11 నే వెలువడనున్నాయి. దాంతో ఈవీఎం ల వద్ద గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలను కౌంటింగ్ దాకా రక్షించడం కత్తిమీద సాము వంటిది. ప్రత్యర్థులు, సంఘవిద్రోహ శక్తులు ఇలా ఎంతోమంది ఈవీఎంలను ఎత్తుకెళ్లడమో లేదా వాటిని ధ్వంసం చేయడమో చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈవీఎంల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత, ఈవీఎంల భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలు జారీచేశారు. ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే కాల్చిపారేయాలని ఆదేశించారు.
భోపాల్ లోని ఓ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయక పోవడంపై ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేసాయి. ముఖ్యంగా ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ నేత అభయ్ మిశ్రాతో పాటు స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన ఆమె, ఈవీఎంలు భద్రంగానే ఉన్నాయని అన్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అపరిచితులు తిరిగినా, గందరగోళం జరిగినా, పరిమిషన్ లేకుండా ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, 11వ తేదీ వరకూ అనుక్షణం ఈవీఎంలను కాపాడతామని తెలిపారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లో రక్షణ సిబ్బందిని పెంచుతున్నామని అన్నారు. ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే వారిని కాల్చిపారేయాలని రక్షణ సిబ్బందిని ప్రీతి మైథిలి ఆదేశించారు.