ఎన్నికల వాయిదాకు, నా హత్యకు కుట్ర: రేవంత్ రెడ్డి
posted on Nov 30, 2018 @ 11:37AM
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమీప బంధువు ఫామ్ హౌస్‌లో సోదాలు చేసిన ఐటీ అధికారులకు రూ.55 లక్షల నగదు లభించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కువ మొత్తంలో నగదు దొరికినా కావాలనే అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. నరేందర్ రెడ్డి ఇంటిపై జరిగిన సోదాల్లో రూ. 17.51 కోట్లు దొరికాయని, కేవలం రూ.50లక్షలు మాత్రమే దొరికాయని అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసిన 50 కోట్ల లావాదేవీల వివరాలున్న డైరీ ఐటీ అధికారుకు దొరికిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ముడుపుల వివరాలు బయటకు రాకుండా రహస్య నివేదికను తొక్కిపెట్టారని ఆరోపించారు. ఇది బయటపడితే కేసీఆర్ వ్యవహారం బయటపడుతుందని ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేసారు. అధికారులు ఎందుకు నివేదికను బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులోని ఆర్కే నగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసినట్టుగా, కొడంగల్ నియోజకవర్గ ఎన్నికలు కూడా వాయిదా వేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా తన హత్యకు కూడా కుట్ర జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్ధలకు చెందిన సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని ఆదేశాలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తనకు భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని, అందుకే తన భద్రతను పెంచడంలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.