రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఎస్పీపై వేటు

  తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది. ఓవైపు కోర్టు ఏకంగా డీజీపీ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మరోవైపు ఈసీ రేవంత్‌ అరెస్ట్‌ను పర్యవేక్షించిన వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై వేటు వేసింది. అన్నపూర్ణ స్థానంలో ఐపీఎస్‌ అధికారి అవినాష్‌ మహంతిని వికారాబాద్‌ ఎస్పీగా నియమించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ ప్రకటించింది. అన్నపూర్ణను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేయాలని ఈసీ సూచించింది. ఆమెకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కూడా ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో వికారాబాద్‌ ఎస్పీగా నియమితులైన అవినాష్‌ మహంతి ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందగానే.. ఆయన వికారాబాద్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అయితే రేవంత్‌ అరెస్ట్‌ వ్యవహారంలో ఐజీ శ్రీనివాసరావు మీద కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీని కోరారు. కానీ ఎస్పీ బదిలీకే ఈసీ పరిమితమైంది.

విజయ్‌ మాల్యా సంచలన నిర్ణయం

  పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయినట్లు విజయ్‌ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాలు నయా పైసాతో సహా తిరిగి చెల్లిస్తానని విజయ్ మాల్యా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2016లో మాల్యా దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు. అయితే అతడిపై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదవడంతో గతేడాది లండన్‌ పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మాల్యా.. భారత్‌లో కోర్టు అధీనంలో ఉన్న తన ఆస్తులను ఇచ్చేస్తే వాటిని విక్రయించి బకాయిలు చెల్లిస్తానని గతంలో పలుసార్లు చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థలు అందుకు అంగీకరించలేదు. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై అక్కడి వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా వరుస ట్వీట్లలో తెలిపారు. ‘బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పారిపోయానని, నేను ఓ ఎగవేతదారునని మీడియా, రాజకీయ నాయకులు పదేపదే చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు’ అని మాల్యా ట్వీట్‌ చేశారు.‘‘ఏటీఎఫ్ ధరలు అధికంగా ఉన్న కారణంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడినమాట వాస్తవమే. బ్యారెల్‌కు 140 డాలర్ల మేర అత్యధిక క్రూడాయిల్ ధరలు ఎదుర్కొన్న అద్భుతమైన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్. విపరీతమైన నష్టాల కారణంగా బ్యాంకుల సొమ్ము ఖర్చయిపోయింది. వాళ్లకు 100 శాతం అసలు మొత్తాన్ని ఇస్తానని చెప్పాను. దయచేసి తీసుకోండి..’’. "మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా పేరొంది దేశ ఖజానాకు రూ. వేల కోట్లు ఇచ్చాం. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్‌లైన్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. అయినా కూడా ఇప్పటికే నేను డబ్బు చెల్లిస్తాననే చెబుతున్నా. ఎందుకంటే అది ప్రజల డబ్బు. దయచేసి ఆ బకాయిలు తీసుకోవాలని బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరుతున్నా" అని మాల్యా మరికొన్ని ట్వీట్లు చేశారు.

'జగన్ పై దాడి' కేసు.. ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్

  వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని?.. కేసు విచారణను ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 3 ఈ కేసులో వర్తించదని.. వ్యక్తిగత దాడిగా దీన్ని పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందని ఏపీ సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే ఆయన వాదనతో ఏకీభవించని హైకోర్టు.. కేసును కేంద్రానికి పంపకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 14లోపు ఎన్ఐఏకు కేసును ఇవ్వాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకోమని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

కేసీఆర్‌ నల్లత్రాచు

  కొడంగల్‌ నియోజకవర్గం బోమరాస్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. కేసీఆర్‌ నల్లత్రాచు లాంటి వారని, నల్లత్రాచును తొక్కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వికారాబాద్‌ జిల్లాకు తెరాస ప్రభుత్వం ఎందుకు డబుల్‌ రోడ్డు ఇవ్వలేదని ప్రశ్నించారు. బోమరాస్‌పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేయాలని కోరితే ఎందుకు చేయలేదని నిలదీశారు. తనను ఓడించాలని తెరాస నేతలు అంటున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడించాలా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల క్రితం కొడంగల్‌ ప్రజలు నాటిన మొక్కను తానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ నియోజకవర్గం అందరికీ తెలిసిందన్నారు. గల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డిని ఢిల్లీలో ఉన్న రాహుల్‌ గాంధీ గుర్తించారని చెప్పారు.  కూటమే అధికారంలోకి వస్తుందని తన సర్వేలో తేలినట్లు లగడపాటి చెప్పారని, పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రైతులు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టులో ఉన్న పాసు పుస్తకాలన్నీ రైతుల ఇళ్లకు తానే తీసుకొచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని, 58 ఏళ్లు నిండిన పేదలందరికీ పింఛన్‌ ఇస్తామని, పేదలకు రేషన్‌లో సన్నబియ్యం, ఇంటికి ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ 48 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌ సూచించారు. ఊర్లోకి కొత్తవాళ్లెవరైనా వస్తే పట్టుకోండని పిలుపునిచ్చారు.

హైకోర్టు ఆగ్రహం..నేడు కోర్టుకు డీజీపీ

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న పిటిషన్ పై విచారణ జరగ్గా హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ నేటికి వాయిదా వేసింది. తాజాగా ఈ రోజు మరో మారు  ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకే అరెస్ట్‌ చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. దీనిపై డీజీపీనే నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో డీజీపీ నిమగ్నమై ఉన్నారని ఏజీ సమాధానం చెప్పినప్పటికీ సంతృప్తి చెందని కోర్టు.. డీజీపీ వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన నేరుగా కోర్టుకు సమాధానం ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది. ఏ విధమైన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రేవంత్‌‌ను అరెస్ట్ చేశారనే దానిపై నివేదికను అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు.. బుద్ధి లేదా

  తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సహనం కోల్పోతున్నారు. ప్రచారంలో భాగంగా తీరిక లేకుండా నిర్వహిస్తున్న వరుస సభలు వల్లనో, లేక మరేదైనా కారణం వల్లనో తెలీదు కానీ.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏ చిన్న అంతరాయం కలిగినా ప్రజలు, కార్యకర్తలు పైన మండిపడుతున్నారు. అలంపూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతుండగా వందలమంది కార్యకర్తలు కేరింతలు కొడుతూ తోసుకొచ్చారు. దీంతో కేసీఆర్‌ ‘బాబూ లొల్లెందుకు చేస్తున్నావయ్యా? తిరుమలరెడ్డిగారూ ఎవరో ఒకరు పోండి. కూచోరాదు వయా బాబూ!. ఎందుకయ్యా అల్లరి!. కూర్చొండి!’ అంటూ వారించారు. తిరిగి ప్రసంగం ప్రారంభించారు. కొద్ది సేపటికే మళ్లీ గోల జరగడంతో ‘ఏఏ కూసోవయ్యా, వాలంటీర్లను కూర్చొమ్మని చెప్పండి’ అని హరీష్ రావు వైపు చూసి అన్నారు. అయినా గోల జరుగుతుండటంతో.. కొద్దిసేపటికి సముదాయింపు కాస్త ఆగ్రహంగా మారింది. ‘ఇలా అరిస్తే వేదిక దిగి పోతా. తుమ్మిళ్ల నీళ్లు బందయితయి. కామ్‌గ కూసోవలె కదా! నేనింకా ఐదారు సభలకు పోవాలె’ అని వ్యాఖ్యానించారు. అయినా అలజడి తగ్గక పోవడంతో మాట మరింత కఠినమైంది. ‘బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు. బుద్ధి లేదా. పిచ్చోళ్లయినట్లున్నారు' అని విరుచుకుపడ్డారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కలగజేసుకుని, ‘కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు సార్‌’ అనడంతో.. ‘అర్థం లేని ఉత్సాహం. ఈ ఉత్సాహమే కొంపలు ముంచుతుంది’ అని అన్నారు. వికారాబాద్‌ సభలోనూ కేసీఆర్‌ సహనం కోల్పోయారు. మాట్లాడుతున్న సమయంలో వాటర్‌ ప్యాకెట్లు ఉన్న క్రేట్లను పెద్ద ఎత్తున శబ్దం వచ్చేట్లు విసిరేస్తుంటే మండిపడ్డారు. ‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’ అంటూ వలంటీర్లను కేసీఆర్ తిట్టారు. కేసీఆర్ సహనం కోల్పోయి మాట్లాడిన మాటల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కేసీఆర్ సహనం కోల్పోయేలా చేస్తున్నది వరుస సభలో లేక సర్వేలో ఆయానికే తెలియాలి.

బాలయ్య పై ఈసీకి ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సందీప్‌ మక్తాలా మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని బాలయ్య వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని ఈసీకి  అందజేశామన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఐటీ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు.  చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో ఒకరి కృషి వల్ల ఐటీ రంగం అభివృద్ధి సాధించలేదన్నారు. ఉద్యోగుల జోలికి రాకుండా ఎవరి ప్రచారం వారు చేసుకోవాలని చెప్పారు.

అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణం: వెంకయ్యనాయుడు

  అమరావతి స్వర్ణభారత్‌ ట్రస్టులో వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు ఆలస్యం చేయడం సరికాదని, సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని వెంకయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు చాలా విచిత్రంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలు గుప్పిస్తున్నారన్నారు. అమలు కాని హామీలు ఇవ్వడం పట్ల రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలని సూచించారు. కులం, మతం, ధనంతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. అభ్యర్థి గుణం, సామర్థ్యాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి అవసరమని.. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

మెసేజ్ లో ఒకటి.. ప్రెస్ మీట్ లో మరొకటి

  టీఆర్ఎస్ కంటే ప్రజాకూటమే ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందని, అయితే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైతే హంగ్‌ వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో తన సర్వే వివరాలు వెల్లడించారు. అయితే లగడపాటి సర్వే చిలక జోస్యమంటూ టీఆర్‌ఎస్‌ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ కొట్టిపారేశారు. అందుకు కారణాలు వెల్లడిస్తూ కేటీఆర్‌ వరుస ట్వీట్లు చేశారు. నవంబర్‌ 20వ తేదీన రాజగోపాల్‌ తనకు పంపిన మెస్సేజ్‌లో టీఆర్‌ఎస్‌ 65 నుంచి 70 సీట్లు, ప్రజా కూటమి 35-40 సీట్లు, బీజేపీ 2-3 సీట్లు, ఎంఐఎం 6 లేక 7 సీట్లు, ఇతరులు ఒకటి లేక రెండు స్థానాల్లో నెగ్గుతారని సర్వే వివరాలు వెల్లడించారని కేటీఆర్‌ స్క్రీన్‌ షాట్లు షేర్‌ చేశారు. మీరు చెప్పిన స్థానాలను మేం అధిగమించి మీకు సర్‌ప్రైజ్‌ ఇస్తామని కేటీఆర్‌ లగడపాటికి రిప్లై ఇచ్చారు. కేవలం 17 రోజులే ఉందని, మీ నైపుణ్యం, తెలివితేటలు తనకు తెలుసునని.. ఆశ్చర్యపోవడానికి ఏం లేదని జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని లగడపాటి మరో మెస్సేజ్‌ చేశారు. అప్పుడు టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధిస్తుందని చెప్పిన లగడపాటి.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావడంతో సర్వే వివరాలను తారుమారు చేసి చెప్పినట్లు ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. లగడపాటి తాజాగా చెప్పిన సర్వే వివరాలు తప్పు అని చెప్పేందుకు ఇటీవల ఆయన పంపిన సర్వే రిపోర్టును షేర్‌ చేయక తప్పడం లేదని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం..సర్వేల పేరుతో  గందరగోళం సృష్టించే లాస్ట్ మినిట్ ప్రయత్నం, లగడపాటి , బాబు పొలిటికల్ టూరిస్టులు..డిసెంబర్ 11 న తట్ట బుట్ట సర్దేస్తారు. వెయిట్ అండ్ వాచ్ అని మరో ట్వీట్ చేశారు.  

లగడపాటి సర్వే...కూటమికే అనుకూలం

  ఆంధ్ర ఆక్టోపస్ రాజగోపాల్ సర్వే కోసం అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు లగడపాటి సర్వే తో డైలమాలో పడుతున్నాయి. తన సర్వే పూర్తిగా వెల్లడించకుండా రోజుకో ప్రకటన చేసి మరింత ఆసక్తి రేవుతున్నారు లగడపాటి. మొన్న 8  నుంచి 10 స్థానాల్లో స్వతంత్రులు గెలుస్తారని చెప్పి సంచలనం రేపిన లగడపాటి.. తాజాగా మీడియా తో తన అభిప్రాయాలను, సర్వే వివరాలను పంచుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి హస్తం వైపే ఉందని లగడపాటి తెలిపారు. 2014లో పోలింగ్‌ శాతం 68.5గా నమోదైందని, అంతకుమించి నమోదైతే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు విజయావకాశాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. పోలింగ్‌ శాతం తగ్గితే మాత్రం హంగ్‌ రావొచ్చని జోస్యం చెప్పారు. పోలింగ్‌ శాతాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని, పోలింగ్‌ పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించాలన్నారు. గత ఎన్నికల్లోలాగానే 68.5 పోలింగ్‌ శాతం నమోదయితే ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఆ వివరాలను 7వ తేదీసాయంత్రం 5 గంటల తర్వాత వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు.  ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాఫ్రంట్‌ ఆధిక్యంలో ఉందని.. ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉందని.. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉందని లగడపాటి వివరించారు. గతంతో పోలిస్టే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, ఆ పార్టీ గ్రేటర్‌ పరిధిలోనే కాక, జిల్లాల్లోనూ కొన్ని స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంఐఎం బలంగా ఉందని, మొత్తం 14 స్థానాల్లో ఏడు చోట్ల ఆ పార్టీ గెలుస్తుందని, మిగతా సీట్లను బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పంచుకుంటాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్, మక్తల్‌ నుంచి జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలవబోతున్నారని చెప్పారు. అందరూ ముందు నుంచి అనుకున్నట్టుగా తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగా మాత్రం జరగడం లేదని తెలిపారు.   తెలంగాణలోని 119 స్థానాలకుగాను 100 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని లగడపాటి వివరించారు. రెండు నెలల క్రితంతో పొల్చితే తెలంగాణ ప్రజల ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందని లగడపాటి అభిప్రాయపడ్డారు. అందుకు ప్రజాకూటమి అభ్యర్థుల ప్రచారం, ఇచ్చిన వాగ్దానాలు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. 100కుపైగా స్థానాలు గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఎవరి అంచనాలు వారికి ఉంటాయని బదులిచ్చారు. గత నెల రోజులుగా తన పేరుతో సర్వే ఫలితాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని.. కానీ, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. పలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందనే విషయాన్ని ముందే ప్రకటించానని గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో సర్వేలన్నీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పగా.. తాను ముందుగా ప్రకటించినట్లుగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గెలుస్తారని స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. సర్వేలను నమ్మొద్దన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. రోజూ పలు సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, తన సర్వేను లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లు తాను భావించట్లేదని అన్నారు. సర్వేల విషయంలో రాజకీయ పార్టీలు, టీవీ చానళ్ల అంచనా వేరే ఉంటుందన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ మిజోరం సర్వే ఫలితాలనూ డిసెంబర్‌ 7నే వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు.

రేవంత్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్

  కొడంగల్ లో తెరాస అధినేత కేసిఆర్ సభను అడ్డుకుంటానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనే సుప్రీం. కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి ఆటంకం కలిగిస్తారనే ముందస్తు అరెస్టుకు ఎన్నికల కమిషనే ఆదేశించింది. మహాకూటమి తరపున ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయొచ్చు. కానీ, సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  

రేవంత్ రెడ్డి పేరెత్తని కేసీఆర్.. ఇదేం లెక్క?

  తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలిచినట్టే అని తనకు అర్థమైందని అన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్‌ను అభివృద్ధి చేసే పూచీ తనదంటూ భరోసా ఇచ్చారు. గతంలో గర్భిణుల ప్రసవానికి వెళ్తే పైసలు ఖర్చయ్యేవి. నేడు ప్రభుత్వమే గర్భిణులకు తిరిగి డబ్బులు ఇచ్చి ప్రసవాలు చేయించి బిడ్డలతో పాటు అమ్మ ఒడి వాహనంలో వారిని ఇంటికి చేరుస్తోంది. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నాం. వాస్తవాలను గమనించి ఈసారి టీఆర్ఎస్ గెలిపిస్తే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తాం. నిరుద్యోగ యువకులకు రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతులకు రైతుబంధుతో పాటు రైతు భీమా కల్పిస్తున్నాం. ప్రపంచమంతా రైతుబంధును చూసి ఆశ్చర్యపోతోంది. పేదలు, దళితులు, మైనార్టీల గురించి మేం పట్టించుకున్నాం అన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని, ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇలా ఎందుకు చేయలేకపోయాయని నిలదీశారు. కొడంగల్ 41 తండాలను గ్రామపంచాయతీలు చేశామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేం కష్టపడడం వల్లే కరెంట్‌ ఇవ్వగలుగుతున్నామని, కాంగ్రెస్‌, టీడీపీకి కరెంట్‌ ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదని కేసీఆర్ అన్నారు. మైనార్టీల కోసం రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశామని, వారి అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. పాలమూరుకు శత్రవులు బయట లేరు. ఈ జిల్లాలోనే ఉన్నారు. ఎంతమందితో కేసీఆర్‌ కొట్లాడాలి?. పాలమూరు కరవు జిల్లా. కొండలు, బండలు రాళ్లు.. ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును మొదలుపెట్టాం. రూ.35వేల కోట్లు మంజూరు చేశాం. అది పూర్తయితే 20లక్షల ఎకరాలకు నీరు అంది ఆకుపచ్చ పాలమూరుగా మారుతుంది. ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అలాంటి చంద్రబాబును కాంగ్రెస్‌ నెత్తిపై పెట్టుకొని తెలంగాణలోకి తెస్తోంది. పాలమూరు దరిద్రం పోవాలంటే అడ్డుపడేవాళ్లకు బుద్ధి చెప్పాలి. 14 ఏళ్లు మడమ తిప్పకుండా నిలబడి పోరాడితే.. చావు నోట్లో తలకాయి పెడితే తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను మళ్లీ ఆంధ్రాకు అప్పగిస్తారట. ప్రజాకూటమి గెలిస్తే పాలమూరు ప్రాజెక్టు నీళ్లు ఆపేస్తారు. కొడంగల్‌ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిని గెలిపించండి. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఇక్కడకి నేనే స్వయంగా వచ్చి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. సాగునీరు, విద్యా సంస్థలు తీసుకొస్తాం. సొంత ఆర్థికవనరులు కల్గిన రాష్ట్రం తెలంగాణ. సంపదకు కొదవలేదు. కొడంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలు నెలలోపు ఏర్పాటు చేస్తాం అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండానే కేసీఆర్ ప్రసంగం ముగించారు. కేసీఆర్ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొడంగల్ లో బంద్ కి పిలుపునివ్వడం.. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో ఈ రోజు రేవంత్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. కాసేపటి క్రితమే రేవంత్ ని విడుదల చేశారు. కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. అలాంటి రేవంత్ నియోజకవర్గంలో కేసీఆర్ సభ పెట్టడంతో.. కేసీఆర్ రేవంత్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే కేసీఆర్ మాత్రం కనీసం రేవంత్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మీద విమర్శలు చేసే కేసీఆర్.. రేవంత్ మీద విమర్శలు చేయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 20 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కొడంగల్ అభివృద్ధి, టీఆర్ఎస్ అభ్యర్థి గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. అనంతరం తనకు వేరే సభ ఉందంటూ ప్రసంగాన్ని ముగించారు.

ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ డైరెక్టర్

  తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా ఈ జాబితాలో నటుడు, డైరెక్టర్ రవి బాబు కూడా చేరిపోయారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణలోనే మంచి మనిషి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఓడిపోతే అంతుకు మించి దురదృష్టం మరోటి ఉండదని వ్యాఖ్యానించారు. ఆయనకు ఓటేసి గెలిపించండని ప్రజలను అభ్యర్థించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండలో ఇరవై ఏళ్ల నుంచి అభివృద్ది జరగలేదని కేసీఆర్‌ అన్నారని.. ఆయన అసలు ముఖ్యమంత్రేనా అనే అనుమానం వస్తుందన్నారు. వేలకోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి నిధులు ఎందుకు విడుదల చేయలేదో తన కొడుకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను అడిగి తెలుసుకోమన్నారు. నల్గొండ నుంచి పోటీచేద్దామనుకున్న కేసీఆర్‌కు ఓడిపోతానని తెలిసి పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాలని కోట్ల రూపాయలు గ్రామాల్లో పంచుతున్నారని,నల్గొండ ఆత్మగౌరవం గెలుస్తుందా? దోపిడీ చేసిన సొమ్ము గెలుస్తుందో డిసెంబర్‌ 11న తెలుస్తుందన్నారు.

రేవంత్ రెడ్డి విడుదల.. భారీ భద్రత మధ్య కొడంగల్‌కు

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎట్టకేలకు పోలీసులు దిగొచ్చారు. సీఈసీ రజత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్ రెడ్డిని  కొద్దిసేపటి క్రితమే భారీ భద్రత మధ్య కొడంగల్‌కు తరలించారు. ఇప్పటికే హైకోర్టు రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని, ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలు రేపు సమర్పిస్తామని పోలీసులు గడువు కోరగా.. పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజకుత్ కుమార్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండని ఆదేశించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతల వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న రజత్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు దిగొచ్చి రేవంత్ రెడ్డిని విడుదల చేశారు.

పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రేవంత్ రెడ్డి విడుదల

  తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసారంటూ కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో కొడంగల్‌ అభ్యర్థిగా ఉన్న రేవంత్‌ రెడ్డిని పోలీసులు ఎక్కడ ఉంచారో కూడా తమకు సమాచారం లేదని, ఆయన ఎక్కడ ఉన్నా కోర్టులో హాజరు పరచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని, ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని ప్రశ్నించింది. ఒకవేళ రేవంత్‌ను అరెస్టు చేయకపోతే శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏ విధంగా పోలీసులు అంచనాకు వచ్చారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్‌ సమాచారం నివేదిక ఆధారంగానే రేవంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. ఆ నివేదిక ఏంటో, దానిలో ఏముందో ఆ వివరాలను తమ ఎదుట ఉంచాలని ఆదేశిస్తూ అందుకు అరగంట సమయం ఇచ్చింది.  గడువు అనంతరం మరోసారి విచారణలో రేవంత్‌ను ఈ సాయంత్రం 4.30గంటల తర్వాత విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించేందుకు తమకు సమయం కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆధారాలు రేపు సమర్పిస్తామని పోలీసులు గడువు కోరగా.. పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయన అరెస్టు సక్రమంగా ఉంటే ఆధారాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. ఈ రోజే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కారణాలు తమకు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే మరో గంట సమయం ఇస్తామని పేర్కొంటూ.. విచారణను సాయంత్రం 4.30 గంటలకు వాయిదా వేసింది. పోలీసుల తరఫు న్యాయవాదిపై హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నేరుగా అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చి వాదనలు విన్పించాలని ఆదేశించింది. ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతున్న ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయండని ఆదేశించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతల వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న రజత్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

రేవంత్ అరెస్ట్ పై ఈసీ వివరణ

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కి అనుకూలంగా పోలీసులు, ఈసీ పని చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేశారని రజత్‌కుమార్ వెల్లడించారు. కేసీఆర్ కొడంగల్ ప్రచారసభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో టీఆర్ఎస్ నాయకులు నాకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై  కేంద్ర ఎన్నికల సంఘం కు నివేదిక పంపామని తెలిపారు. వారి ఆదేశాలతోనే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగా ఎన్నికల కమిషన్ పనిచేయదన్నారు. అన్ని పార్టీలను ఒకలాగే చూస్తామన్నారు.  నిబంధనల ప్రకారమే తాము వ్యవహారిస్తున్నామన్నారు. అరెస్టు వ్యవహారంపై డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారి నివేదికలు కోరినట్లు చెప్పారు. రేవంత్‌కు కూడా ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. 

రేవంత్ అరెస్ట్..భార్య ఫిర్యాదు..కూతురు కామెంట్స్

  రేవంత్ రెడ్డి అరెస్ట్ తో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అరెస్ట్ పై ఆయన భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కొడంగల్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గీత ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి మూడు గంటలకు తమ ఇంట్లోని బెడ్రూమ్‌లోకి చొరబడి పోలీసులు దాడులు చేయడాన్ని, రేవంత్‌ను అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ రిటర్నింగ్ అధికారికి లేఖ సమర్పించారు. కుటుంబసభ్యులతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని లేఖలో ప్రస్తావించారు. తన భర్తను ఏ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు?...ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలి అంటూ లేఖలో డిమాండ్ చేశారు. ఇన్ని గంటలైనా ఇప్పటి వరకు పోలీసులు సమాధానం చెప్పలేదని గీత ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఫాంహౌజ్‌లో గత నెల 27న అధికారులు దాడి చేసినప్పుడు భారీగా నగదు లభ్యమైనా అతని అభ్యర్థిత్వంపై చర్యలు తీసుకోకపోవడాన్ని రేవంత్ ప్రశ్నిస్తే, ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. అధికార యంత్రాంగం చర్యలను నిరసిస్తూ శాంతియుత నిరసనకు రేవంత్‌ పిలుపునిస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటి అని లేఖలో ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?..ప్రశ్నించే హక్కు లేదా? అని రిటర్నింగ్ అధికారిని గీత ప్రశ్నించారు. పోలీసులు తమ ఇంటి బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించడం ఎంత వరకు సబబు అంటూ ఓ మహిళగా ఆలోచించాలి అని అధికారినికి విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగానే తాము ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. మరోవైపు రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌పై ఆయన కూతురు నైమిషా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రిని ఎక్కడ ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి తమ ఇంటి తలుపులను బద్దలు కొట్టి బెడ్రూమ్‌లోకి వచ్చి తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. ఒక టెర్రరిస్టును ఈడ్చుకెళ్లినట్లు తన తండ్రిని పోలీసులు తీసుకువెళ్లారని అన్నారు. తన తండ్రితో పాటు ఆయన సోదరులు, అనచురులు, ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తన తండ్రిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన వారు పోలీసులేనా అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లారో ప్రశ్నించే హక్కు తమకు ఉందని, తన తండ్రి ఎక్కడ ఉన్నారో చెప్పాలని నైమిషా రెడ్డి డిమాండ్ చేశారు.

కారులో 5 కోట్లు..ప్రజకూటమి అభ్యర్థులకే

  ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్టు కారులో ఈరోజు వేకువజామున రూ.5,80,65,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ సొమ్ము హవాలా సొమ్మని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నగదు గోషామహల్‌కు చెందిన వ్యాపారి కీర్తి కుమార్‌ జైన్‌కు చెందినదిగా గుర్తించామన్నారు. కీర్తి కుమార్‌ జైన్‌తోపాటు అతడి ఇద్దరు కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం నగదును ప్రజకూటమి అభ్యర్థులకు తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు రూ.1.50 కోట్లు, వరంగల్ తూర్పు అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు రూ.2 కోట్లు, కాంగ్రెస్‌ నేత కొండా మురళికి రూ.2.30 కోట్లు కారులో తీసుకెళ్తున్నట్లు సీపీ వెల్లడించారు. పట్టుబడిన నగదును కోర్టు ముందు ఉంచుతామన్నారు.