రాహుల్ గాంధీ జోకర్‌లా మాట్లాడుతున్నారు
posted on Nov 30, 2018 @ 1:43PM
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని అన్నారు. ఎవరి వద్ద బిచ్చమెత్తుకోబోమన్నారు. అవసరమైతే సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ విషయంలో ఇవాళ మిగులు సాధించి ఇతర రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు చీకట్లు రాలేదు. రాజస్థాన్‌కు పరస్పర ఒప్పందం కింద విద్యుత్‌ను ఇస్తున్నాం. ఎవరూ ధర్నాలు చేయకుండా, అడ్డక్కుండానే అన్నీ చేశాం. గోదావరి నది ఖమ్మం గుండానే పోతోంది. అయినా గత పాలకులు జిల్లాను పట్టించుకోలేదు. పైగా మోసం చేశారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కాలువ ఇల్లెందు మీదుగా పోవాల్సింది. కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడంతో నీళ్లను ఆంధ్రకు తీసుకుపోయారు అని విమర్శించారు.
తెలంగాణకు ఈ గతి పట్టించింది కాంగ్రెస్ కాదా? ఇప్పుడు మళ్లీ ఓట్లడుగుతున్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలి. రాజ్యాంగం వీళ్లే రాశారు. దేశానికి ప్రణాళిక రూపొందించారు. వీళ్లే పరిపాలించారు. అయినా పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు. మేం అధికారంలోకి రాగానే ఒక్కో జిల్లాకు రెండు మూడు రోజులు అధికారులతో కలిసి వచ్చి సమస్యను పరిష్కరిస్తాం. సంవత్సరంలోపు పోడు భూముల సమస్యకు పరిష్కరిస్తాం అన్నారు.
కాంగ్రెస్‌కు సొంత వెన్నుముఖ లేదు. అన్నింటికీ ఢిల్లీ పోవాల్సిందే. రాహుల్ గాంధీ జోకర్‌లా మాట్లాడుతున్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు రీడిజైన్లు చేశామంటున్నారు. ‘మాది కమిషన్ల బతుకు కాదు, పోరాట బతుకులు. రాహుల్ నీకు దమ్ముంటే రుద్రమ్మకోటకు రా.. మీ తండ్రి పేరు మీద ఉన్న రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎలా ఉన్నాయో చూద్దామా’ అని సవాల్ విసిరారు.ప్రాజెక్టుల రిడిజైనింగ్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన అబద్ధాలనే రాహుల్ చెబుతున్నారు. ఇలాంటి వాళ్లంతా వస్తే మళ్లీ మన నెత్తిన టోపీ పెడతారు అని కేసీఆర్ విమర్శించారు.