పది నెల్ల తర్వాత నదిలో దొరికిన ఐఫోన్!
posted on Jun 28, 2022 @ 11:28AM
తిరనాళ్లలో తప్పిపోయిన బిడ్డ పదేళ్ల తర్వాత అనూహ్యంగా కలవడం సినిమాల్లో, నిజ జీవితంలోనూ జరగవచ్చు. అలా జరుగుతుందా అన్నది కొందరి అనుమానం. జరిగినవి చూసినవారికి పెద్ద వింతేమీ కాదు. కానీ ఎవైన్ డేవిస్ కి మాత్రం జీవితాంతం ఆశ్చర్యకరమే! ఎందుకంటే ఎప్పుడో పది నెలల క్రితం పారేసుకున్న ఐఫోన్ హఠాత్తుగా మొన్నీ మధ్య దొరికింది. అదీ ఏ మాత్రం పాడవకుండా!
దాన్ని మిగ్యూల్ అనే వ్యక్తి నదిలో పడవలో ప్రయాణిస్తుంటే తెడ్డుకి ఐ ఫోన్ తగిలింది. దాన్ని బయటకు తీసి అసలు యజమానికి చేర్చాడు.
దీనికంటే మరీ వింతే మిటంటే, అసలా ఫోన్ యజమాని డేవిస్ ఇన్నాళ్లు ఎలా ప్రశాంతంగా వున్నాడా? అని. ఈ సంగతి విన్న నెటిజన్లు వీడెవడ్రా బాబూ! అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఐఫోన్ అనేది మూడో చేయిగా మారిపోయింది మరి! ఎందుకంటే, మిగ్యూల్ మొన్న నదిలో పడవలో తిరుగు తూంటే తెడ్డుకి ఈ ఫోన్ తగిలిందిట. దాన్ని జాగ్రత్తగా పైకి తీసేడు. అది బాగానే వుందని అనిపించింది. అందు లోకి నీళ్లు ఇంకలేదని గ్రహించాడు. ఇంటికి వెళ్లగానే దానికి ఛార్జి పెట్టి చూశాడు. అందులో చివ రగా ఉపయోగించినది ఆగస్టు 13 అని తేదీ కనపడింది. అతని ఆశ్చర్యానికి అంతేలేదు. కానీ అతను దాన్ని తను దాచుకోవాలనుకోలేదు. దాని అసలు యజమాని ఎవరా అని ఆరా తీసి మరీ అతనికి తీసికెళ్లి ఇచ్చాడు. ఇది మరీ హర్షణీయం!
తెల్లారుతూనే ఐఫోన్‌లో మెసేజ్‌లు, ఫోటోలు చూసుకుంటేనే గాని రోజు ఆరంభం కాని రోజులివి. ఐ ఫోన్ వుంటే లోకమంతా అరచేతిలో వున్నట్టే. స్నేహితులు, బంధువులు, సినిమాలు, సరదాలు, ఆటపాటలు ఒకటేమిటి యావత్ లోకమంతా ఒక్క క్లిక్ దూరంలో సందడి చేస్తాయి. ఫోన్ల కంపెనీవారికి ఎంత లాభార్జన జరుగుతోందో ఏమో గాని జనాలకు ముఖ్యంగా యువతకు మాత్రం ఐఫోన్‌తో బోల్డు కాలక్షేపం. చదువు, వుద్యోగాల మాట ఎలా వున్నా ఇపుడంతా ఆన్‌లైన్ వ్యవహారాలే గనుక ఐ ఫోన్ అనేది జీవిత భాగస్వామితో సమానంగా మారింది. ఇది భవిష్యత్తులో మరింత పిచ్చెక్కించే ఆనందం.
పది నెలల క్రితం పొరపాటున నదిలో పడిపోయిందని, అది దొరకదని ఆశలు వదులుకున్నానని డేవిస్ అన్నాడు. తర్వాత ఆ ఫోన్‌లోనే మిగ్యూల్‌తో సెల్ఫీ తీసుకుని డేవిస్ నెటిజన్లకు అసలు సమాచారం అం దించాడు. ఇలాంటివి జరగడం ఎక్కడా వినం. కానీ జరిగింది. అలాగని ఖరీదయిన ఫోన్‌లతో తిరిగేవారు జాగ్రత్తగానే వుండాలి. ఎందుకంటే పారేసుకున్నపుడల్లా అందరికీ మిగ్యూల్ లాంటివారు తెచ్చివ్వరు!