వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.  కార్తీక పౌర్ణమి పర్వ దినాన క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు స్మశాన వాటిక  వద్దనిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేశారు.   పసుపు, కుంకుమ, పూలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో పెద్ద దీపాన్ని వెలిగించి పెట్టగా అది గురువారం (నబంబర్ 6) ఉదయం కూడా వెలుగుతూనే ఉండటం, ఆ ప్రాంతంలో జంతుబలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం ఇదే మొదటి సారి కాదని స్థానికులు చెబుతున్నారు. ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

విజయాడైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరాయ్య కన్నుమూత

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్‌ మండవ జానకిరామయ్య గురువారం (నవంబర్ 6)  కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషివాటిక వృద్ధుల నిలయంలో  గురువారం (నవంబర్ 5) ఉదయం తుదిశ్వాస విడిచారు.  జానకిరామయ్య 27 సంవత్సరాలపాటు  విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించారు. జానకిరామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డెయిరీ రంగానికి ఆయన అందించిన విశిష్ఠ సేవలకు గాను జానకిరామయ్యకు 2012లో డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మండవ జానకిరామయ్య అంత్యక్రియలు గురువారం (నవంబర్ 6) సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో జరుగుతాయి. 

కడప దర్గాలో ఏఆర్ రెహ్మాన్

  ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్  కడపలోని అమీన్‌పీర్ దర్గాలో   సందడి చేశారు.  దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా  తొలి రోజు గురువారం (నవంబర్ 6) ప్రధాన ముజావర్ అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి  గంధం ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  మతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు వెళ్లి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు హాజరవుతుంటారు.  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దర్గా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ఇంటి నుండి బుధవారం (నవంబర్ 5)రాత్రి మేళ తాళాల నడుమ గంథాన్ని పీఠాధిపతి ఊరేగింపుగా తీసుకుని వచ్చి దర్గాలోని మజర్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్  ఏటా ఈ  ఉరుసు ఉత్సవాలలో గంధం రోజు తప్పకుండా పాల్గొంటారు .ఈ ఏడాది జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కుడా మొదటి రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్  కడప పెద్ద దర్గా లో పీఠాధిపతి తో అరీఫుల్లా హుస్సేనితో కలిసి ప్రార్ధనలు  చేశారు. 

ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్ టూర్..మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ జిల్లాకు ఇద్దరు చొప్పున ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి హస్తినకు విద్యాయాత్రకు పంపిన లోకేష్.. అదే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అధునాతన విద్యా విధానాలు, బోధనపై అవగాహన కలిగేలా, అధ్యయనం కోసం సింగపూర్ పంపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 78 మంది టీచర్లను ఈ నెల 27న సింగపూర్ పంపించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం (నవంంబర్ 5)  విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో లోకేష్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ వారం రోజుల పర్యటనలో ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించి,  అక్కడి బోధనాపద్ధతులు, అనుసరిస్తున్న సాంకేతితక, పాఠశాల తరగతి గదులలో వాతావరణంఅక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయగలం అన్న అంశాలపై నివేదిక అందజేస్తారని తెలిపారు.

హస్తినకు విమానంలో విద్యాయాత్ర.. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లోకేష్ కానుక

ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు  బుధవారం (నవంబర్ 5) ఢిల్లీకి వెళ్లారు. వీరందరినీ ప్రభుత్వం హస్తినకు పింపించింది.   నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్కల్చర్‌  సహా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ రెండు రోజుల విద్యా యాత్ర ద్వారా విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలపై అవగాహన  పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.  ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతానంటూ విద్యామంత్రి లోకేష్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన వంద మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్  విద్యాశాఖ ఈ అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో 'సైన్స్‌ ఎక్స్‌పోజర్‌ టూర్' పేరిట విద్యార్థులను విమానంలో ఢిల్లీ యాత్రకు పంపింది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది విద్యార్థులను ఢిల్లీకి విజ్ఞాన యాత్రకు పంపింది.   ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాల్లోని  నిపుణులతో సమావేశమై వారి అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఈ పర్యటనలో  తొలి  రోజు ఢిల్లీలోని రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్‌ను   సందర్శిస్తారు. అక్కడ ఇండో-రష్యన్‌ అంతరిక్ష సహకారంపై జరిగే ప్రత్యేక సెషన్‌లో పాల్గొంటారు. స్పుత్నిక్‌పై లఘుచిత్ర ప్రదర్శనతో పాటు ఇండో-రష్యన్‌ స్పేస్‌ ఫ్రెండ్‌షిప్‌పై పోటీలు నిర్వహిస్తారు. ఇక పర్యటనలో రెండో రోజు  విద్యార్థులు నేషనల్‌ సైన్స్‌ మ్యూజియం సందర్శించి, రాకెట్రీ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. రాకెట్‌ డిజైన్‌, ప్రొపల్షన్‌, శాటిలైట్‌ లాంచ్‌ వంటి క్లిష్టమైన అంశాలపై నిపుణులు వీరికి అవగాహన కల్పిస్తారు. అనంతరం మోడల్‌ రాకెట్‌ లాంచ్‌ సెషన్‌లో కూడా విద్యార్థులు భాగస్వాములవుతారు. అలాగే  నెహ్రూ ప్లానిటోరియం, ప్రధానమంత్రి సంగ్రహాలయను కూడా వీరు సందర్శిస్తారు.  ఈ విజ్ఞాన యాత్రకు ఎంపికైన విద్యార్థులను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు.  క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలి  అంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా   శుభాకాంక్షలు తెలిపారు.  

శ్రీశైలంలో కన్నులపండువగా జ్వాలా తోరణం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.   కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం అధికారులు నిర్వహించారు. ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు  జ్వాలాతోరణాలను దివిటీలతో వెలిగించగా, భక్తులు ఓం నమః శివాయ, హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ చేసిన శివ నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునీతులైయ్యారు. ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో  వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ తమ భక్తిని   చాటుకున్నారు. జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో  కార్తీకపౌర్ణమి గరుడసేవ బుధవారం (నవంబర్ 5) రాత్రి వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి  గరుడవాహనంపై  మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరిం చుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ గరుడవాహన సేవలో  పెద్ద జీయర్ స్వామి,   చిన జీయర్ స్వామి, ఆలయ పేష్కార్  రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీని కలిసిన భారత్‌ మహిళా క్రికెట్‌ జట్టు

  ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఉమెన్ క్రికెట్ జట్టు సభ్యులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులు దిల్లీలోని ఈ సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రపంచ కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా 'నమో' అని సంతకం చేసిన టీమిండియా జెర్సీని ప్రధానికి మహిళా జట్టు బహూకరించింది. 2017 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. నాడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అప్పుడు మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు ప్రధానిని కలిసింది. ఈ విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీకి ప్రపంచ కప్‌ను జట్టు సభ్యులు అందించారు.  

పరకామణి చోరీపై అన్ని కోణాల్లో దర్యాప్తు : సీఐడీ డీజీ

  తిరుమల పరకామణి అవకతవకలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. డిసెంబర్ 2 వ లోపు దర్యాప్తు పూర్తి చేసి సంబంధించిన నివేదికను  హైకోర్టులో సమర్పిస్తామని డీజీ  రవిశంకర్ స్పష్టం చేశారు. నిందితుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నాడని తెల్సింది, ఆయనను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. భక్తులు, ఇతరుల వద్ద చోరీ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే 9440700921 నంబర్‌కు adgcid@ap.gov.in మెయిల్ ద్వారా మాకు తెలియజేయండని  వారి వివరాలను గోప్యంగా ఉంచుతమని సీఐడీ చీఫ్ తెలిపారు. 5 టీములుగా ఈ పరకామణి కేసును దర్యాప్తు చేపడుతుమన్నారు. పరకామణి ఆఫీసర్స్, పరకామణిలో అధికారుల బాధ్యత,  జీయర్ వ్యవస్థ బాధ్యత ఎంటి అనే అంశంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 1980 నుంచి రవికుమార్ జీయర్ మఠంలో గుమస్తాగా ఉన్నారు, అప్పటి నుంచి ఆయన వ్యవహారాలపై ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. ఆదాయం, ఆదాయానికి మించిన ఆస్తులు, బ్యాంకు ట్రాన్సక్షన్, సీసీ కెమెరాలు, ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతుందని రవిశంకర్ తెలిపారు.  

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే గూడెం అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వెతలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  మనసుతో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిసేలా చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు... గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.       ఉప ముఖ్యమంత్రివర్యులకు వినతులు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి  50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు.  అయిదు నెలల కిందట రాష్ట్ర డిప్యూటీ సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు. తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి స్పష్టం చేశారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.  దీంతో వారికో దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గొట్టిపాటి రవి కుమార్‌కి, ఏపీ జెన్కో సీఎండీలకు తెలియచేశారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రిగారి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది.  9.6 కి.మీ... 217 స్తంభాలు  రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు. గూడెం గ్రామానికి విద్యుత్ లైను వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. మానవ వనరులను ఉపయోగించి స్తంభాలు రవాణా చేయడం, రాతి కొండలను తవ్వేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొదలు పెట్టిన 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు.  పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజలు నివసించే శిఖర ప్రాంతంలో విద్యుత్ వెలుగులను నింపేలా నిధులు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి  పవన్  తెలియచేశారు.  సీఎం చంద్రబాబు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికి గూడెం గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనం అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని గూడెం గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపడానికి సహకరించిన విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్ కీ, ఏపీసీపీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్  పృథ్వి తేజకీ, విద్యుత్ శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  అభినందనలు తెలిపారు. •     గూడెం గ్రామంలో హర్షాతిరేకాలు కనీసం సౌకర్యాలు లేని, విద్యుత్ కాంతులు లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వేడుకగా ఉన్నారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ గ్రామానికి విద్యుత్ లైను వేయించి, తమ ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన  పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ గ్రామాన్ని యలమంచిలి శాసన సభ్యులు  సుందరపు విజయ్ కుమార్ , అరకు నియోజక వర్గం జనసేన నాయకులు, జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు.  ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల్లో భాగమయ్యారు.  

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు నోటిఫికేషన్

  హైదరాబాద్-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి. మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను పలువురు అధికారులకు అప్పగించారు. తెలంగాణ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో 9 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో భూసేకరణ పనులను జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ మండలంలో 4 గ్రామాలు భూసేకరణ చేయనున్నారు. 

అయ్య బాబోయ్ ఇన్ని మద్యం బాటిల్స్

  మందుబాబులకు మన సరుకు కంటే విదేశీ సరుకు మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆ సరుకు తక్కువ దొరుకు దొరుకుతుంటే... ఇక ఊరుకుంటారా... కొందరైతే దాన్నే వ్యాపారంగా సాగి స్తున్నారు. కొంతమంది వివిధ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాల నుండి గుట్టు చప్పుడు కాకుండా  మద్యం బాటిల్స్ లను హైదరాబాద్‌కు రవాణా చేసి యదేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు.  ఈ క్రమంలోనే రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం కు గోవా, ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాల నుండి మద్యం తీసుకువచ్చి తెలంగాణలో అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం షరీఫ్ పహాడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు.. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన కార్లను తనిఖీ చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా ఓ 20 మంది వద్ద అత్యధికంగా మద్యం బాటిల్స్ ఉండడం గమనించారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ టీం వారందరికీ నోటీసులు ఇచ్చి పంపించారు. అనంతరం వారి వద్ద ఉన్న 192 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసు కున్నట్లుగా ఏఈ ఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ 5.76 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.  

దక్షిణాఫ్రికాతో సిరీస్‌‌కు భారత్ జట్టు ప్రకటన

  దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులోకి రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు.  సౌత్‌ప్రికాతో టీమ్ఇండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. పేసర్ ఆకాశ్‌ దీప్ కూడా జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు.  టీమిండియా జట్టు  శుభ్‌మన్‌ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్  

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ముగ్గురు మవోలు మృతి

  తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు ఘటన స్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గరియాబంద్‌లో రూ.కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. గరియాబంద్ జిల్లాలోని మెయిన్‌పూర్ అడవుల్లో భద్రతా దళాల కాల్పుల్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ ప్రాంత అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు  సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.  

ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

  హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి మోసగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ట్రేడింగ్ యాప్స్, డాష్‌ బోర్డులు సృష్టించి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.  మొదట చిన్న మొత్తంతో పెట్టుబడి చేయమని ప్రోత్సహించి, తర్వాత నకిలీ లాభాలు చూపించి మరిన్ని డబ్బులు పెట్టమని ఒత్తిడి పెడతారని. లాభాలను విత్డ్రా చేయాలనగానే టాక్స్‌లు, ఫీజులు, కరెన్సీ కన్వర్షన్ ఛార్జీల పేరుతో మరిన్ని డబ్బులు అడుగుతారు. చివరికి బాధితులు తమ డబ్బు కోల్పోతారని పోలీసులు తెలిపారు.సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు సూచించారు.  సేబీ లైసెన్స్ ఉన్న సంస్థలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని పోలీసులు పేర్కొన్నారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు, యూపీఐ పిన్‌లు ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దని వారు తెలిపారు. ఎవరైనా లీగల్ యాక్షన్ లేదా అకౌంట్ ఫ్రీజ్ చేస్తామని భయపెడితే డబ్బులు చెల్లించకండని పేర్కొన్నారు. మోసపోయిన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రుషికొండ ప్యాలెస్ లో గూగుల్ !?

వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వ్యయం చేసి మరీ రుషికొండపై జగన్ హయాంలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలస్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. జగన్ తన సొంతం కోసం ప్రజాధనంతో నిర్మించిన ఈ అత్యాధునిక విలాసవంతమైన భవనాన్ని ఎలా ఉపయోగించాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.   ఈ నేపథ్యంలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో గూగుల్ ఇక్కడ డేటా సర్వేను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కంపెనీకి అప్పగిస్తే.. ఆ కంపెనీ తన డేటా సెంటర్ కు శాశ్వత నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునే వరకూ రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కార్యాలయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం మేధావులు, విద్యావేత్తల నుంచి వస్తున్నది.    ప్రపంచ ప్రఖ్యాత పొందిన గూగుల్ కి ఇస్తే డేటా సెంటర్ కార్యకలాపాలు జాప్యం లేకుండా ప్రారం భమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.  ఈ అంశాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలంటున్నారు. డేటా సెంటర్ ఏర్పాటుకు  ప్రభుత్వం భూమి కేటాయింపు, ఆ కేటాయించిన భూమిలో కంపెనీ నిర్మాణాలు చేపట్టడం వంటివన్నీ పూర్తి కావడానికి ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పడుతుంది. అంత వరకూ రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కు అప్పగిస్తే.. ప్రభుత్వానికి ఆ ప్యాలెస్ మెయిన్ టెయినెన్స్ ఖర్చు కలిసిరావడమే కాకుండా ఆదాయం కూడా వస్తుందని అంటున్నారు.  అమెరికా తరువాత ఆ స్థాయిలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అమెరికా వెలుపల ఇంత భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి మంత్రి లోకేష్ చోరవే కారణమనడంలో సందేహం లేదు.విశాఖ ఐటీ  హబ్ గా మారడానికి ఇది తొలి అడుగు అని చెప్పాల్సి ఉంటుంది.  జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంస్థలు రావడం మాట అటుంచి.. ఉన్నవి తరలిపోయే పరిస్థితి ఉండేది. అభివృద్ధి ఆనవాలే కనిపించని పరిస్థితి. అరకొర సంక్షేమం అమలు చేయడమే పాలన అనుకున్న జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది. మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి సుమాలు విరియడం మొదలైంది.. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి భారీ ఆధిక్యతతో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టిన తరువాతే. జగన్ హయాంలో  రాష్ట్రం రాజధాని అనేదే లేకుండా అనాథగా మారింది. జగన్ మూడు రాజధానులంటూ.. అసలు రాజధానే లేని పరిస్థితిని తీసుకువచ్చారు. ఆర్థిక రాజధానిగా విశాఖ అన్న జగన్.. విశాఖలో ప్రజాధనంతో ప్రజలను ఉపయోగం లేని రుషికొండ ప్యాలెస్ నిర్మించడం తప్ప చేసినదేమీ లేదు.  ఇప్పుడు ఆ ప్యాలెస్ నిర్వహణే ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. అందుకే  రుషికొండ ప్యాలెస్ ను  గూగుల్ డేటా సెంటర్ కు అప్పగిస్తే సద్వినియోగం అవుతుందని అంటున్నారు.  

ట్రంప్ వార్నింగ్‌లు... లెక్క చేయని అమెరికా ఓటర్లు

  భారత్ మూలాలు ఉన్న నేతలు అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. భారత సంతతికి చెందిన డెమాక్రెటిక్ నేత జొహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రాట్‌ నాయకురాలు గజాల హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె హైదరాబాద్‌ మూలాలున్న మహిళ కావడం విశేషం.   ఆ క్రమంలో అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. ఆఫ్రికాలో జన్మించిన మమ్దానీకి ప్రజలు నగర పగ్గాలు అందించడం ఈ ఎన్నికల్లో ఆవిష్కృతమైన మరో విశేషం. కేవలం 34 ఏళ్ల వయసులోనే జొహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత వందేళ్లల్లో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్‌ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. ‘సలామ్‌ బాంబే’, ‘మాన్‌సూడ్‌ వెడ్డింగ్‌’ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహ్మద్‌ మమ్‌దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్‌ మమ్‌దానీ ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.  మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రాట్‌ నాయకురాలిగా ఎన్నికైన  గజాల హష్మీ  హైదరాబాద్‌ మూలాలున్న మహిళ కావడం విశేషం. గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో మలక్‌పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు. నాలుగేళ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా.. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు.

మహా పడిపూజలో మంత్రి లోకేష్

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో  మంగళవారం (అక్టోబర్ 4)నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా పడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక బాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అతడితో ముచ్చటించడం ఆకట్టుకుంది.