ఏపీలో 120 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

 

ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. 120 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం తదితర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా లంచాలు, అవినీతి లావాదేవీలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని సమాచారం. ప్రజలు న్యాయమైన సేవలు అందుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు

  జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరల గడువు  మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫీకేషన్‌పై దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశించింది.  పిటిషనర్ పునర్విభజనపై సమాచారం అందించలేదని జనాభ, సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. గ్రేటర్ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి  

మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం

  ఉమెన్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ‌ ఉండవల్లిలోని తన నివాసంలో  మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు. ఈ నగదు బహుమతితో పాటు విశాఖలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.  ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.

ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటే వాహనాలకు ఆయిల్

  దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూపోతోంది. జనం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అల్లాడిపోతున్నారు. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా రికార్డు అయింది. దీంతో ‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా బొగ్గు, వంట చెరుకుతో తయారు చేసే తందూరీ రోటీలపై బ్యాన్ విధించింది. డీపీసీసీ నిర్ణయం ప్రకారం సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు, తిను బండారాలు అమ్మే షాపులు తందూరీ రోటీలను తయారీ కోసం గ్యాస్ లేదా కరెంట్‌ను మాత్రమే వాడుకోవాలి. కాలుష్య నివారణలో భాగంగా వాహనాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు. పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్‌లలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అమ్మరని తేల్చి చెప్పారు. జీఆర్ఏపీ 3, 4 సందర్బంగా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ కలిగిన వాహనాలు ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ .. ఆన్ గ్రౌండ్ చెక్స్ ద్వారా వాహనాలకు సంబంధించిన పీయూసీసీ స్టాటస్, ఎమిషన్ క్యాటగిరీ చెక్ చేస్తాం. పీయూసీసీ సర్టిఫికేట్ లేని వారు.. బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ వాహనాలను వాడుతున్న వారు పెట్రోల్ బంకుల దగ్గర, సరిహద్దు అధికారులతో గొడవలకు దిగవద్దు. గురువారం నుంచి కొత్త రూల్ అమల్లో ఉంటుంది. గత నవంబర్ నెలలో ఏక్యూఐ 20 పాయింట్లు తగ్గింది. గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు. 9 నుంచి 10 నెలల్లో గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన పని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కాలుష్యమనే రోగం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రజలకు క్షమాపణ చెప్పారు.

బోండీ బీచ్‌ మృతులు అసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్ల సంతాపం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు  చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు బుధవారం (డిసెంబర్ 17) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆటలో పాల్గొన్నారు.  అలాగే స్టేడియంలోని ఇరు దేశాల జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు. సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో.. మూడో టెస్టు జరిగే ఆడిలైడ్ మైదానం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. బోండీ బీచ్ దుర్ఘటనపై ఇరు జట్ల ప్లేయర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి సమీపంలో నివసించే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. జరిగిన దుర్ఘటన తనను భయాందోళనకు గురి చేసిందన్నాడు. బోండీ బీచ్‌ తన ఇంటికి చాలా దగ్గర్లోనే ఉంటుందని, తరచూ తన పిల్లలను అక్కడికి తీసుకువెళుతుంటానని కమిన్స్ తెలిపాడు. క్రికెట్ ప్రపంచంలోని ప్రతిఒక్కరూ బోండీ బీచ్ బాధితులకు, వారి కుటుంబాలకు, స్నేహితులకు, యూదులకు మద్దతుగా ఉన్నారని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ అన్నారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఇది ఆస్ట్రేలియా, సిడ్నీ నగరంతో పాటు యూవత్తు ప్రపంచానికి కూడా చాలా విచారకరం అని అన్నాడు.  

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు మొత్తం 5 రోజులు పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.  18న రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్‌ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  రాష్ట్రపతి ముర్ము వెళ్లనున్నారు

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించి, ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ యాదవ్ ను మేయర్ చేయాలన్న  అధికార పార్టీ పెద్దల కోరిక నెరవేరింది. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ ను గద్దె దించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే.. గురువారం (డిసెంబర్ 18) మేయర్ పై అవిశ్వాస   తీర్మానం పెట్టేందుకు  వ్యూహాలు రచించి, క్యాంపు రాజకీయాలు చేపట్టిన అధికార పార్టీ నేతలకు మేయర్ స్రవంతి తన రాజీనామా ద్వారా షాక్ ఇచ్చారు.  అవిశ్వాస తీర్మానానికి ముందే తన పదవికి రాజీనామా చేసిన మేయర్  తన రాజీనామా లేఖనం జిల్లా కలెక్టర్ కు వాట్సప్ ద్వారా పంపారు.  దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం అటకెక్కింది.   ఇలా ఉంటే.. గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం    మేయర్ స్రవంతి పై గురువారం (డిసెంబర్ 18) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం   వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలో మైనార్టీ కార్పొరేటర్ కరిముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అది జరిగిన మూడు గంటల్లోనే.. వైసీపీ నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి.. సైకిల్ ఎక్కారు.   దీంతో 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ లో.. 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గి మెజారిటీ టిడిపికి ఉండగా.. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి తో పాటు తిరుమల, గోవా పాండిచ్చేరి వంటి ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశారు. వైసీపీలో ఉన్న 11 మందీ కూడా  తెలుగుదేశంకే మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు అంటూ అధికార పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.   2021 నవంబర్ 24న మేయర్ గా  ప్రమాణ స్వీకారం చేసిన స్రవంతి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తప్పడుగులు వేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి  రాజీనామా చేసి.. తెలుగుదేశం గూటికి చేరేందుకు మేయర్ స్రవంతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.   దీంతో ఆమె రెండు పార్టీలకూ దూరం పాటిస్తూ వచ్చారు.  ఈ క్రమంలో నవంబర్ 24న ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 25వ తేదీన వారందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసు అందజేశారు. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తమ పార్టీకి మేయర్ కి సంబంధం లేదని.. ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని వెల్లడించారు. దీంతో మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో తమకు పూర్తిగా మద్దతు ఉందని సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఐదుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం గట్టి షాక్ ఇచ్చింది.  దీనిపై మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీలో ఉండే కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా లాగేయడం మొదలుపెట్టారు. దీంతో వైసిపి షాక్ కు గురైంది. సిటీ నియోజకవర్గంలో ఉండే ముగ్గురు కార్పొరేటర్లను లాగేసేందుకు అధికార పార్టీ స్కెచ్ వేసిన సమయంలోనే  తాను మేయర్  పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు స్రవంతి.  

జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు : సీఎం చంద్రబాబు

  జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్రగా సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా... ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని... కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ నిమిషం తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిద్దుకుంటున్నాని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో బుధవారం వివిధ అంశాలపై సీఎం జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.  కొన్ని జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో చర్చలు మొక్కుబడిగా సాగకుండా... అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరపాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరారు.  ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం చూపాలి ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదామని ముఖ్యమంత్రి తెలిపారు.  పరిపాలనలో పవన్, లోకేష్ భేష్ ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా చర్చించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని, మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం... కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు.  5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందని సీఎం అన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే... అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ. 3.90 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా... పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని ప్రశంసించారు. గత పాలకుల నిర్వాకం వల్ల నిర్వీర్యం అయిపోయిన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ పునరుద్ధరించామని చెప్పారు.  సూపర్ సిక్స్‌... సూపర్ సక్సెస్ ‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. పేదలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకే  సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో ఒక్కో రైతుకు రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0,  స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నాం... అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించటమే లక్ష్యం. ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.   పీపీపీలో నిర్మిస్తే ప్రైవేట్ పరం కాదు జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలు మరింత మెరగవుతాయని అన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని... అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెప్పారు.  మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు.  70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లోనే అందుతున్నాయని, సీట్లు కూడా పెరిగినట్టు వివరించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, అవే డబ్బులతో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి ఉండేదని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని... అలాగని అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా అని సీఎం ప్రశ్నించారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని సీఎం అన్నారు. 

కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

  తెలంగాణలో  కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన 20న కాకుండా 22 తేదీకి  అపాయింట్‌మెంట్‌ డేను మారుస్తూ పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న అమావాస్య కావున 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.  దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.   

దేవాలయంలో చోరీ యత్నం.. పట్టుబడి చావుదెబ్బలు తిన్న దొంగ

ఓ దొంగ పక్కా ప్రణాళికతో  దేవాలయంలో దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ అనూహ్యంగా  స్థానికుల  చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్నాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని పోచమ్మ దేవాలయంలో దొంగతనానికి ఓ యువకుడు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఓ యువకుడు రాత్రి సమయం లో అత్తాపూర్ పరిధిలోని పోచమ్మ దేవాలయానికి వెళ్ళి, అమ్మవారి మెడలో ఉన్న బంగారు చైన్‌తో పాటు వెండి వస్తు వులు దొంగిలించి పారిపో తుండగా... అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి  దొంగను చూశాడు. దొంగను గమనించిన పూజారి వెంటనే గట్టి గట్టిగా కేకలు వేయడంతో అప్రమ త్తమైన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని పారిపో తున్న దొంగని పట్టుకున్నారు. అనంతరం  అతడిని ఆలయ ప్రాంగణం లోని స్తంభానికి తాళ్లతో కట్టేశారు. ఈ ఘటనలో కొందరు స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఆ దొంగ డొంకతిరుగుడు   సమాధా నాలు చెప్పాడు. దీంతో కొందరు   ఆగ్రహంతో దుండగుడిని చావగొట్టారు.  స్థానికులు  అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసా గుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన దొంగను ఆస్పత్రికి తరలించారు. 

బీబీసీ అస‌లు ఉద్దేశ‌మేంటి?

బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్. ఇది  వంద‌ల కోట్ల  రూపాయ‌ల నిధుల‌తో న‌డిచే ఒకానొక సంస్థ‌. ఈ సంస్థ‌లో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్ట్ కి జాబ్ అంటే అది  లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక్క‌డ చేరి  రిటైర్ అయిన  ఎంప్లాయి కోట్లాది రూపాయ‌ల‌ను ఇంటికి  తీసుకెళ్తారు. ఐదు రోజులు మాత్ర‌మే ప‌ని దినాలు. వీలైనంత  ఎక్కువ రిలాక్సేష‌న్ వంటి  ఎన్నో స‌దుపాయాల‌ను అందిస్తుంది బీబీసీ. ఒక రోజులో ఒక స్టోరీ రాసినా, చేసినా  ఆ ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుంది. సదరు ఉద్యోగిని నెత్తిన  పెట్టుకుని మరీ చూసుకుంటుంది ఈ ప్ర‌పంచ వార్తా  సంస్థ‌ బీబీసీ. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ లేబ‌ర్ లా ఫాలో అయ్యే కంపెనీ ఏదైనా ఉందంటే అది  బీబీసీయే. అయితే  బీబీసీ ఇటీవ‌ల  వ‌రుస వివాదాల‌ను ఎదుర్కొంటోంది. గ‌తంలో మోడీ గోద్రా అల్ల‌ర్ల  వ్య‌వ‌హారంపై ఒక డాక్యుమెంట‌రీ  రిలీజ్ చేసిన  బీబీసీ. ఆ త‌ర్వాత  ఇక్క‌డ ఈడీ రైడ్స్ ఫేస్ చేయాల్సి వ‌చ్చింది. అంతే కాదు త‌న అడ్రెస్ తో స‌హా అన్నీ మార్చుకోవ‌ల్సి వ‌చ్చింది. అంతేనా ప్ర‌స్తుతం  బీబీసీ  నుంచి క‌లెక్టివ్ న్యూస్ రూమ్ అనే పేరు మార్చుకోవ‌ల్సి  వ‌చ్చింది.  ప్ర‌భుత్వ తాకిడిని  ఎదుర్కునేందుకు మ‌రో దారి  వెతుక్కోవ‌డంలో భాగంగా  ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బీబీసీ  అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి కూడా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కుంటోంది. ట్రంప్ ప్ర‌సంగాన్ని వ‌క్రీక‌రిస్తూ బీబీసీ డాక్యుమెంట‌రీ త‌యారు చేసింద‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. దీంతో తీవ్రంగా స్పందించిన ట్రంప్ బీబీసీ పై ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని సందేశాలు పంపారు. త‌న లీగ‌ల్ టీమ్ ద్వారా ఆ సంస్థ‌కు పెద్ద ఎత్తున తాఖీదులు పంపారు. దీంతో బీబీసీ  ఇద్ద‌రు ఉద్యోగుల‌కు ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికింది. క‌ట్ చేస్తే 5 బిలియ‌న్ డాల‌ర్ల ప‌రువు న‌ష్టం  ప‌రిహారం  చెల్లించ‌మ‌ని డిమాండ్ చేశారు ట్రంప్. అది వీలు కాద‌ని.. కావాలంటే ఎన్ని క్ష‌మాప‌ణ‌లైనా చెబుతామ‌ని రిప్లై ఇచ్చింది. బీబీసీ. అయితే ఈ విష‌ యం మీ ప్ర‌ధానితో మాట్లాడ‌తాన‌ని బెదిరించారు ట్రంప్. వారి నుంచి ఇద్ద‌రు టాప్ ఎంప్లాయిస్ తొల‌గింపు అన్న చ‌ర్య త‌ప్ప మ‌రెలాంటి  రియాక్ష‌న్ లేదు. దీంతో ట్రంప్ బీబీసీపై భారీ  ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ దావా విలువ ఇండియ‌న్ క‌రెన్సీలో  అక్షరాలా 90 వేల కోట్లు.  భారీ మొత్తంలో బీబీసీకి చారిటీ నిధులున్న మాట వాస్త‌వ‌మే  కానీ ఇంత మొత్తంలో న‌ష్ట‌ప‌రిహారం క‌ట్ట‌డం మాత్రం క‌ష్ట‌మే. ఎందుకంటే ఉద్యోగులు తెలిసీ తెలియ‌క చేసిన త‌ప్పుల‌కు ఇంత మొత్తం చెల్లించ‌డం అంటే అది  బీబీసీకి అయ్యే ప‌ని కాదని అంటున్నారు చాలా మంది.. ఇంత‌కీ బ్రిట‌న్ కి చెందిన ఈ వార్తా వ్య‌వ‌స్థ భార‌త్, యూఎస్ వంటి దేశాల‌ను ఎందుకు టార్గెట్ చేసింది? ఈ సంస్థ అస‌లు ఉద్దేశ‌మేంటి? ఇందులో ఏదైనా మ‌ర్మం దాగి ఉందా? అన్న‌ది ఒక డిబేట్ కాగా, బీబీసీ ఇప్ప‌టి  నుంచే కాదు ఎప్ప‌టి నుంచో ఇలాగే ఉంది. కాకుంటే ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత బీబీసీ కంటెంట్ మ‌రింత వైల్డ్ గా  డిస్ట్రిబ్యూట్ అవుతోంది. దీంతో బీబీసీని టార్గెట్ చేస్తున్నారు ట్రంప్, మోడీ వంటి  వారు. గ‌తంలో బీబీసీ చేసిన డాక్యుమెంట‌రీలెన్నో ఇలాంటి ఎన్నో వ‌క్రీక‌ర‌ణ‌ల‌తోనే ఉంటా యి కావాలంటే చూసుకోవ‌చ్చంటారు కొంద‌రు. కార‌ణం బీబీసీకి వ‌క్రీక‌ర‌ణ అన్న‌ది  దాని  డీఎన్ఏలోనే ఉందంటారు.