రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధం

  నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అతి వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఎనిమిది మందీ సురక్షితంగా బయటపడ్డారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా పడిదగ్ధం కావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

మెట్రో స్టేషన్ సమీపంలో అగ్రిప్రమాదం.. పలువురికి గాయాలు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో  శుక్రవారం (నవంబర్ 7) అర్ధరాత్రి దాటిన తరువాత  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ కు సమీపంలోని బెంగాలీ బస్తీలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా మేల్కొని భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఎటు వెళ్లాలో అర్ధం కాక పలువురు మంటల్లో చిక్కుకుని గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో వందల గుడిసెలు దగ్ధమయ్యాయి.  సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది 29 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి కేసు.. కీలక నిందితుడి అరెస్టు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది.  ఈ కేసులో  ఏ16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ ను  సిట్ అదుపులోనికి తీసుకుంది. అజయ్ కుమార్ సుగంధ్‌  మోన్‌ గ్లిసరైడ్స్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లుగా  సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ రసాయనాలను పామాయిల్‌ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేశారనీ, ఆ కల్తీ నెయ్యినే లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ తమ దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందని సిట్ అధికారులు తెలిపారు.   లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్‌ ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. గత ఏడేళ్లు  బోలే బాబా కంపెనీ కి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్‌ కుమార్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం సేకరించి అజయ్ సుగంధ్ సుకుమార్ ను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంధ్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచగా కోర్టు అతడికి  ఈ నెల 21 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 

కర్నూలు బస్సు ప్రమాద సంఘటన- కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్ట్, విడుదల

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటనలో   కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను  జు పోలీసులు శుక్రవారం (నవంబర్ 7) అరెస్ట్ చేశారు. గత నెల 24న కర్నూలు సమీపంలో జాతీయ రహదారిపై   ఘోర ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.   దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి  బస్సు ప్రమాదానికి కారణమైన మొదటి ముద్దాయి మిర్యాల లక్ష్మయ్య ను గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేశారు.  రెండవ నిందితునిగా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను శుక్రవారం (నవంబర్ 7)   అరెస్ట్ చేశారు. అనంతరం  జే ఎఫ్ సి ఎం మొబైల్  కోర్టులో హాజరు పరిచారు. బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ కు పదివేల రూపాయలు సొంత పూచికత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

శ్రీచరణికి రూ. రెండున్నర కోట్లు ప్లస్ గ్రూప్ వన్ జాబ్

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో తన అద్భుత ఆటతీరులో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.  ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని   ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. అలాగే మంత్రి నారా లోకేష్ శ్రీచరణికి ప్రభుత్వం ప్రకటించిన వరాల జల్లును సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. శ్రీచరణి మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టును విజేతగా నిలబెట్టేందుకు ప్రదర్శించిన అంకిత భావం రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని కూడా గర్వపడేలా చేసిందని లోకేష్ పేర్కొన్నారు.  ఆమెను ప్రభుత్వం  గ్రూప్-1  ఉద్యోగం, రెండున్నర కోట్ల రూపాయల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  అంతకుముందు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో శ్రీచరణిని అభినందించిన చంద్రబాబు, ప్రపంచకప్‌ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంచించారు. శ్రీచరణి అద్భుత ఆట, ఆమె విజయం యువ మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.   ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ... ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి  సంతోషంగా ఉందని తెలిపారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు.  ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు.  ఇక‌, శుక్రవారం (నవంబర్ 7) సాయంత్రం కడపలో ఏసీఏ, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీ సన్మాన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించనుంది.

ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తానంటున్న ట్రంప్

అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరో సారి దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయగమని చెబుతున్నారు.   అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించిన ఆయన  ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో  మాట్లాడుతూ..  మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం. అయితే ఆ అవసరం లేదు. ప్రతిఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని అన్నారు.   ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ట్రంప్..  దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం అవి లేవన్నారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత   ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉందని చెప్పారు.  రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే  ఉన్నాయన్న హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేశారు. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానన్నారు. అయితే ఎక్కడ, ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ బయటపెట్టలేదు. 

కంచి ఆలయంలో కలకలం.. బల్లుల విగ్రహాల తాపడాలు మార్చారా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు వస్తున్న ఆరోపణలను సంచలనం సృష్టిస్తున్నాయి.  కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటుచేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు.  దీంతో విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు   దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో  ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో, సిబ్బందిని పోలీసులు ఆదేశించినట్లు తెలిసింది. 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు విశిష్టమైనవి. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా  వచ్చే భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి బంగారు, వెండి బల్లులను తాకితే దోషనివారణ జరుగుతుందన్నది భక్తులు విశ్వాసం.  పురాణ గాథ ప్రకారం..  గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించలేదు. అది చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలోనే మీకు విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో వుండి స్వామి వారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బల్లుల బొమ్మలుగా వుండి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం అని చెబుతారు.

రాయల చెరువుకు గండి! జలదిగ్బంధంలో గ్రామాలు

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఓల్లూరులోని రాయల చెరువు రిజర్వాయర్ కట్టకు గండిపంది. దీంతో గురువారం (నవంబర్ 6)న పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం సంభవించలేదు కానీ, పశుసంపదకు అపార నష్టం వాటిల్లింది.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలచెరుకువు భారీగా నీరు చేరింది. గత  కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రమాదం లేదని జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే ఏమయ్యిందో తెలియదు కానీ చెరువుకు ఒక్కసారిగా గండి పడి నీరు  ఓల్లూరు, పాతపాలెం, రాజుల కండ్రిగ, కళత్తూరు, కళత్తూరు హరిజనవాడ గ్రామాలను మంచేసింది. వరద నీరు  పోటెత్తడంతో  జనం భయాందోళనలకు గురయ్యారు. కట్టుబట్టలతో ఎత్తైన భవనాలు, ప్రదేశాలను ఆశ్రయించారు. అయితే గ్రామంలో బయట కట్టేసిన ఆవులు, గేదెలు, పాకల్లో ఉన్న మేకలు గొర్రెలు కొట్టుకుపోయాయి. అదేవిధంగా మోటారు బైకులు, ఆటోలు సైతం వరద నీటిలో   కొట్టుకుపోయాయి.  వేలాది ఎకరాలలో పంట ధ్వంసమైంది. రాగిగుంట శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రోడ్డు మార్గం కూడా కోతకు గురవ్వడంతో ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  అలాగేఆదవరం, కాళంగి గ్రామాల మీదుగా కాళంగి రిజర్వాయర్ కు వరద నీరు చేరింది. దీంతో కాళంగి రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి నీటి నిల్వలు చేరడంతో అధికారులు  గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా కాళంగి రిజర్వాయర్ కు దిగువనున్న పంట పోలాలు ముంపునకు గురయ్యాయి. 

గ్రామ సచివాలయాలు కాదు.. విజన్ యూనిట్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరు మార్చింది. ఇక నుంచీ వాటిని విజన్ యూనిట్స్ గా పిలవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.  గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరుకు చేసి, మరింత మెరుగైన సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలనీ, అందుకే వాటి పేరు విజన్ యూనిట్స్ గా మారుస్తున్నామన్నారు.  భవిష్యత్ లో ప్రజా సేవలకు విజన్ యూనిట్సే కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు.   ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, సమర్థంగా అందించేలా టెక్నాలజీని వినియోగించుకోవాల్నారు.  ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికెట్టు ఇలా అన్నీ  ఒకే వేదిక నుంచి అందించేలా విజన్ యూనిట్స్ పని చేయనున్నాయని వివరించారు.   

ఎస్ఆర్ఎం కాలేజీ ఫుడ్ పాయిజినింగ్ ఘటనపై విచారణకు కమిటీ

  అమరావతిలోని ఎస్ఆర్ఎమ్  కాలేజీలో ఫుడ్ పాయిజన్(  కలకలం రేగింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అయితే విషయాన్ని బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం మేనేజ్ చేసింది. అంతేకాదు విద్యార్ధులను ఇంటికి పంపించారు. విషయం బయటకు రాకుండా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా కాలేజీలో విద్యార్థులు ఫుడ్ పాయిజినింగ్ తో అస్వస్థతకు గురి అయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఆర్ఎసం కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ పై గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన కమిటీ వేసింది. విచారణాధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ అంజనాసిన్హాను నియమించింది. ఆమె ఎస్ఆర్ఎం కాలేజీతో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఎస్ఆర్ఎం కాలేజీలో కలుషితాహారం తిని  300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధృవీకరించారు. ఈ కాలేజీలో ఆహారం నాణ్యతపై గత కొంత కాలంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఎస్ఆర్ఎమ్ కళాశాలలో తరచుగా ఇటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలను విచారిస్తున్నామని చెప్పిన అంజనా సిన్హా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.  కళాశాలలో ఆరువేల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపిన ఆమె విద్యార్థుల అస్వస్థతకు గురి కావడానికి కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.  

రోడ్డు ప్రమాదంలో పది మంది మహిళలకు గాయాలు

 నెల్లూరు జిల్లా ఉలవలపాడు సమీపంలో గురువారం (నవంబర్ 6) జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మహిళలు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా   అలగాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వారే. వీరంతా లోకేష్ ప ర్యటన కోసం వచ్చి తిరిగి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను  కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిస్తామన్న భరోసా ఇచ్చారు.  ఇలా ఉండగా తన పర్యటనకు వచ్చి తిరగి వెడుతున్న మహిళలు ప్రమాదంలో గాయపడటం పట్ల మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

ఆ బ్యాగ్ ల నిండా డ్రోన్లే. ఎక్కడంటే?

ప్రతి విమానాశ్రయంలోనూ భద్రతా ఏర్పాట్లు అత్యంత పటిష్ఠంగా ఉంటాయి.  కస్టమ్స్, డి ఆర్ ఐ,సిఐఎస్ఎఫ్ ఇలా భద్రతాధికారులు అధికారులు విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే వారి కదలికలపై డేగకళ్లతో  నిఘా పెడతారు. ఎయిర్ పోర్టులో దిగే ప్రతి ప్రయాణీకుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. స్కాన్ చేస్తారు.  అయినా   స్మగ్లర్లు అంతకు మించి జాగ్రత్తలు తీసుకున్నామని భావిస్తూ, పట్టుబడబోమన్న నమ్మకంతో దర్జాగా అక్రమరవాణాకు  పాల్పడుతూ ఉంటారు.అయినా వారి జాగ్రత్త లకు మించి నిఘా నేత్రాలు ఉండటంతో దొరికిపోయి కటకటాల పాలౌతుంటారు. బంగారం, డ్రగ్స్, నగలు, ఇలా రకరకాల వస్తువుల అక్రమరవాణాకు ప్రయత్నించి దొరికిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం.   ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడు బ్యాగులో డ్రోన్లతో అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన  శంషాబాద్ ఎవిమానాశ్రయంలో జ రిగింది. ఈ సంఘటనలో అధికారులు 22 డ్రోన్లు, వాటికి సంబంధించిన 22 రిమోట్ లను స్వాధీనం చేసుకున్నారు.  సింగపూర్ ఎయిర్ లైన్స్ లో వచ్చిన ముత్తు కనపన్ సతీష్ కుమార్ అనే వ్యక్తి  కదలికలపై  సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడిని ఫాలో అయ్యారు.  ముత్తు కనపన్ సతీష్ కుమార్ తన బ్యాగులను షేక్ హైమద్ అష్‌రఫ్ అలి అనే వ్యక్తికి అందజేస్తుండగా  సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. బ్యాగ్ లు తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ బ్యాగులలో 22డ్రొన్ లతో పాటు 22 రిమోట్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, రిమోట్ ల విలువ 26 లక్షల 70 వేల రూపాయల వరకూ ఉండొచ్చన్నది అంచనా.  

వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.  కార్తీక పౌర్ణమి పర్వ దినాన క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు స్మశాన వాటిక  వద్దనిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేశారు.   పసుపు, కుంకుమ, పూలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో పెద్ద దీపాన్ని వెలిగించి పెట్టగా అది గురువారం (నబంబర్ 6) ఉదయం కూడా వెలుగుతూనే ఉండటం, ఆ ప్రాంతంలో జంతుబలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం ఇదే మొదటి సారి కాదని స్థానికులు చెబుతున్నారు. ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

విజయాడైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరాయ్య కన్నుమూత

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్‌ మండవ జానకిరామయ్య గురువారం (నవంబర్ 6)  కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషివాటిక వృద్ధుల నిలయంలో  గురువారం (నవంబర్ 5) ఉదయం తుదిశ్వాస విడిచారు.  జానకిరామయ్య 27 సంవత్సరాలపాటు  విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించారు. జానకిరామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డెయిరీ రంగానికి ఆయన అందించిన విశిష్ఠ సేవలకు గాను జానకిరామయ్యకు 2012లో డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మండవ జానకిరామయ్య అంత్యక్రియలు గురువారం (నవంబర్ 6) సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో జరుగుతాయి. 

కడప దర్గాలో ఏఆర్ రెహ్మాన్

  ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్  కడపలోని అమీన్‌పీర్ దర్గాలో   సందడి చేశారు.  దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా  తొలి రోజు గురువారం (నవంబర్ 6) ప్రధాన ముజావర్ అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి  గంధం ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  మతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు వెళ్లి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు హాజరవుతుంటారు.  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దర్గా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ఇంటి నుండి బుధవారం (నవంబర్ 5)రాత్రి మేళ తాళాల నడుమ గంథాన్ని పీఠాధిపతి ఊరేగింపుగా తీసుకుని వచ్చి దర్గాలోని మజర్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్  ఏటా ఈ  ఉరుసు ఉత్సవాలలో గంధం రోజు తప్పకుండా పాల్గొంటారు .ఈ ఏడాది జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కుడా మొదటి రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్  కడప పెద్ద దర్గా లో పీఠాధిపతి తో అరీఫుల్లా హుస్సేనితో కలిసి ప్రార్ధనలు  చేశారు. 

ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్ టూర్..మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ జిల్లాకు ఇద్దరు చొప్పున ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి హస్తినకు విద్యాయాత్రకు పంపిన లోకేష్.. అదే విధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అధునాతన విద్యా విధానాలు, బోధనపై అవగాహన కలిగేలా, అధ్యయనం కోసం సింగపూర్ పంపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 78 మంది టీచర్లను ఈ నెల 27న సింగపూర్ పంపించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం (నవంంబర్ 5)  విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో లోకేష్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ వారం రోజుల పర్యటనలో ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించి,  అక్కడి బోధనాపద్ధతులు, అనుసరిస్తున్న సాంకేతితక, పాఠశాల తరగతి గదులలో వాతావరణంఅక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయగలం అన్న అంశాలపై నివేదిక అందజేస్తారని తెలిపారు.

హస్తినకు విమానంలో విద్యాయాత్ర.. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లోకేష్ కానుక

ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు  బుధవారం (నవంబర్ 5) ఢిల్లీకి వెళ్లారు. వీరందరినీ ప్రభుత్వం హస్తినకు పింపించింది.   నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్కల్చర్‌  సహా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ రెండు రోజుల విద్యా యాత్ర ద్వారా విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలపై అవగాహన  పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.  ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతానంటూ విద్యామంత్రి లోకేష్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన వంద మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్  విద్యాశాఖ ఈ అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో 'సైన్స్‌ ఎక్స్‌పోజర్‌ టూర్' పేరిట విద్యార్థులను విమానంలో ఢిల్లీ యాత్రకు పంపింది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది విద్యార్థులను ఢిల్లీకి విజ్ఞాన యాత్రకు పంపింది.   ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాల్లోని  నిపుణులతో సమావేశమై వారి అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఈ పర్యటనలో  తొలి  రోజు ఢిల్లీలోని రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్‌ను   సందర్శిస్తారు. అక్కడ ఇండో-రష్యన్‌ అంతరిక్ష సహకారంపై జరిగే ప్రత్యేక సెషన్‌లో పాల్గొంటారు. స్పుత్నిక్‌పై లఘుచిత్ర ప్రదర్శనతో పాటు ఇండో-రష్యన్‌ స్పేస్‌ ఫ్రెండ్‌షిప్‌పై పోటీలు నిర్వహిస్తారు. ఇక పర్యటనలో రెండో రోజు  విద్యార్థులు నేషనల్‌ సైన్స్‌ మ్యూజియం సందర్శించి, రాకెట్రీ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. రాకెట్‌ డిజైన్‌, ప్రొపల్షన్‌, శాటిలైట్‌ లాంచ్‌ వంటి క్లిష్టమైన అంశాలపై నిపుణులు వీరికి అవగాహన కల్పిస్తారు. అనంతరం మోడల్‌ రాకెట్‌ లాంచ్‌ సెషన్‌లో కూడా విద్యార్థులు భాగస్వాములవుతారు. అలాగే  నెహ్రూ ప్లానిటోరియం, ప్రధానమంత్రి సంగ్రహాలయను కూడా వీరు సందర్శిస్తారు.  ఈ విజ్ఞాన యాత్రకు ఎంపికైన విద్యార్థులను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు.  క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలి  అంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా   శుభాకాంక్షలు తెలిపారు.  

శ్రీశైలంలో కన్నులపండువగా జ్వాలా తోరణం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.   కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం అధికారులు నిర్వహించారు. ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు  జ్వాలాతోరణాలను దివిటీలతో వెలిగించగా, భక్తులు ఓం నమః శివాయ, హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ చేసిన శివ నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునీతులైయ్యారు. ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో  వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ తమ భక్తిని   చాటుకున్నారు. జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.