భారీ వర్షాలు.. రేవంత్ సమీక్ష
posted on Sep 26, 2025 @ 2:12PM
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్, ఉన్నతాధికారులతో శుక్రవారం (సెప్టెబర్ 26) సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి విదితమే. శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ముసురుపట్టినట్లుగా వర్షం కురుస్తూనే ఉంది.
కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండు రోజులూ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని ఆదేశించారు.