నీరుకొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం
posted on Sep 26, 2025 @ 2:47PM
అమరావతిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అమరావతి సమీపంలోని నీరుకొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. నీరుకొండ 300 అడుగుల ఎత్తు కలిగి ఉంది. విగ్రహ నిర్మాణం కోసం 100 అడుగుల ఎత్తున్న బేస్ నిర్మించి, ఈ బేస్ పై 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అంటే మొత్తం 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందన్న మాట. ఇక ఈ విగ్రహం బేస్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు, మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది.
విగ్రహం వద్దకు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహ నిర్మాణం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇలా ఉండగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపొందిం చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆకాంక్షకు అనుగుణంగా.. నీరుకొండ ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు ఏర్పాటు కానుంది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్నిఏర్పాటు చేయనున్నారు.