అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు
అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం (డిసెంబర్ 22) ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
అండర్-19 ఆసియా కప్ టైటిల్ ఫైట్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 172 పరుగులు చేశాడు. అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్ హుస్సేన్ 56 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్, ఖిలన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది. భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్. కెప్టెన్ ఆయుష్ మాత్రే (2), వైభవ్ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.
పాక్ పేసర్ల షార్ట్ పిచ్ బంతులకు భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు. సుభాన్, ఎహ్‌సాన్, సయ్యమ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్లతో నో హ్యాండ్ షేక్ విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.
కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు భారత జట్టు కెప్టెన్ ఆయుష్ అవునప్పుడు కూడా అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.
ఆసియా క్రికెట్ మండలి ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్ చెక్‌ను అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మిర్వాసి అష్రఫ్ చేతుల మీదుగా భారత కెప్టెన్ ఆయుష్ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.