ఆరులేన్లుగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ
posted on Oct 9, 2025 9:02AM
ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా విస్తరించేందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ ముగించి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణ జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తంలో నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ తదితర అవసరాలకు రూ.3,616.06 కోట్లుగా చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా 162 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.1,414 కోట్లు అవసరమని అధికారులు అంచనావేశారు. భూసేకరణ, ఇతర అడ్డంకులపై చర్చించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. డీపీఆర్‌ను ఖరారు చేసేందుకు వీలుగా రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను ఈ నెలాఖరు నాటికి సేకరించి.. తుది డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.