టెక్‌ ప్రపంచంలో ఏపీ చరిత్రాత్మక అడుగు

  టెక్‌ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రాత్మక అడుగులు వేసింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విశాఖపట్నం కేంద్రంగా రూ. 87 వేల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టేలా అనుబంధ సంస్థ రైడన్‌ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌  ఒప్పదం చేసుకున్నారు.  ఢిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లోకేశ్ ఈ మేరకు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఒప్పందంతో విశాఖను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నగరంగా రూపొందించడంలో తొలి అడుగు పడినట్లయింది.  గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కార్యకలాపాలు ఆరంభించే తరుణంలో భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు పొందుతుంది. అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో ఐటీ - ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీకి గూగుల్, టీసీఎస్, ఎసెంచర్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలన్నీ క్యూ కడుతూ యువతకు ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులపై ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పదోన్నతుల కల్పనపై  సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని  ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మొత్తం పది మంది తో   గ్రూప్‌ ఆఫ్‌  మినిస్టర్స్‌  ఏర్పాటుకు   ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ కమిటీలో  ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత,  నారాయణ, డీఎస్‌బీ.వి. స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్,  సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.  సచివాలయ సిబ్బంది పదోన్నతుల అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని  సబ్‌కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఇంటర్‌మీడియేటరీ  పోస్టులను  సృష్టించే అవకాశాన్ని పరిశీలించాలని  సూచించింది. అలాగే.. అటువంటి పోస్టులు సృష్టించినట్లయితే, వాటికి  అనుగుణంగా పే స్కేల్‌ను నిర్ణయించాలని పేర్కొంది. అదే విధంగా..  ఇతర శాఖల్లో అమలులో ఉన్న ప్రమోషన్‌ ఛానల్‌ వ్యవస్థను కూడా  పరిశీలించి తగిన మార్పులపై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. పదోన్నతుల  తర్వాత సచివాలయాల్లో ఏర్పడే ఖాళీల భర్తీ విధానంపై కూడా చర్చించి తగిన  సూచనలు ఇవ్వాలనీ,  ఈ అధ్యయనాన్ని వీలైనంత త్వరగా  పూర్తి చేసి  నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సబ్‌కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు

  ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో తిరుపతి లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి,  మిథున్ రెడ్డినివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ అధికారులు.. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఇక, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. సోదాల సమయంలో పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి లో ఉన్నట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కాం లో అరెస్టైన  మిథున్ రెడ్డి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. మొత్తం 71 రోజుల పాటు ఈ కేసులో మిధున్ జైలులో ఉన్నారు. మద్యలో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు అనుమతి కోరడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా మిథున్‌రెడ్డి ఉన్నారు. ఆయనపై త్వరలో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.

ఉపరితల ఆవర్తనం.. రుతుపవనాల ఉపసంహరణ.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు  ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వెనుదిరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతే కాకుండా ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుండటంతో.. ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇలా ఉండగా మంగళవారం (అక్టోబర్ 14)  మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   మరో వైపు  నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా  కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

మల్లోజుల లొంగుబాటు..మావోయిస్టు ఉద్యమానికి బిగ్ సెట్ బ్యాక్!

మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సీనియర్ నాయకుడు, మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ ఆయధాలను వీడి పోలీసులకు లొంగిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్లోజుల దాదాపు 60మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలను వీడి పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల లొంగు బాటును  కేంద్ర హోంశాఖ నుంచి కానీ, మహారాష్ట్ర పోలీసుల నుంచి కానీ అధికారికంగా ధృవీక రించలేదు. అయితే మల్లోజుల లొంగిపోయాన్న సమాచారం కేంద్ర హోంశాఖ వర్గాల నుంచే వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.   అయితే మల్లోజుల లొంగుబాటు వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలే మావోయిస్టు పార్టీ చేసిన శాంతి చర్చల ప్రతిపాదన వెనుక ఉన్నది మల్లోజుల వేణుగోపాలే అంటున్నారు. ఆ ప్రతిపాదనకు కేంద్రం ఆంగీకరించలేదు.. అది వేరే సంగతి, కానీ ఆ ప్రతిపాదన సమయంలోనే  సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి కేంద్రంలో చర్చలకు సిద్ధమని మల్లోజుల ప్రకటించారు. ఆ ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచీ మల్లోజులకు మావోయిస్టు కేంద్ర కమిటీతో దూరం పెరిగిందని అంటున్నారు. ఒక దశలో మల్లోజులను మావోయిస్టు పార్టీ ఉద్యమ ద్రోహిగా కూడా ప్రకటించింది.  ఈ నేపథ్యంలోనే మల్లోజుల లొంగుబాటు నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.   మల్లోజుల వేణుగోపాల్  మావోయిస్టు పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన స్వస్థలం పెద్దపల్లి. మల్లోజుల వేణుగోపాల్  సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు  అలియాస్ కిషన్ జీ గతంలో పార్టీలో రెండో స్థానంలో ఉండేవారు. ఆయన  2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. మల్లోజుల కోటేశ్వరరావు మరణం తరువాత మావోయిస్టు పార్టీలో మల్లోజుల వేణుగోపాల్ అత్యంత కీలక పాత్రపోషించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.  కిషన్ జీ భార్య, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కూడా అయిన పోతుల  అలియాస్ సుజాత కూడా గత నెలలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. అంతకు ముందే మల్లోజుల వేణుగోపాల్ భార్య తార కూడా పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు వార్త వాస్తవమే అయితే మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఇది కీలకమలుపు అవుతుందని అంటున్నారు.  

రెండో టెస్టులోనూ విండీస్ ఓటమి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆటలోని అన్ని విభాగాల్లోనూ పూర్తి సాధికారత ప్రదర్శించిన శుభమన్ గిల్ సేన విండీస్ ను రెండు టెస్టుల్లోనూ చిత్తుచిత్తుగా ఓడించింది. మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన రెండో టెస్టులో టీమ్ ఇండియా విండీస్ పై ఏడు వికెట్ల ఆధిక్యతతో గెలుపొందింది.  121 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా ఎక్కువ సమయం తీసుకోకుండానే లక్ష్యాన్ని ఛేదించేసింది. రాహుల్  58 నాటౌట్, జురేల్ 6 నాటౌట్ గా ఉన్నారు. చివరి రోజు ఆట ఆరంభమైన తరువాత సాయిసుదర్శన్ 39, శుభమన్ గిల్  13 ఔటైనా లక్ష్యం మరీ చిన్నది కావడంతో టీమ్ ఇండియా అలవోకగా దానిని ఛేదించి విజయం సాధించింది.   రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తరువాత విండీస్ తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల ధాటికి కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ కు121 పరుగుల సల్ప విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.  

ఐపీఎస్ సంజయ్ బెయిలు పిటిషన్ డిస్మిస్

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ మాజీ  అదనపు డైరెక్టర్‌ జనరల్‌,  అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేసిన ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ కుమార్‌కు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన   బెయిల్‌ పిటిషన్‌ను   ఏసీబీ ప్రత్యేక  కోర్టు సోమవారం (అక్టోబర్ 13) డిస్మిస్ చేసింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదికలో, సంజయ్‌ డీజీగా, సీఐడీ ఏడీజీగా ఉన్న సమయంలో సుమారు  15 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు  దుర్వినియోగమయ్యాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో టెండర్‌ నిబంధనలు ఉల్లంఘించడం, సొమ్ము దుర్వినియోగం చేయడం, పలు పనులు అసంపూర్తిగా వదిలేయడం  వంటి అంశాలపై కూడా ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా అగ్నిమాపకశాఖలో అమలు చేసిన   అగ్ని ఎన్వోసీ వెబ్ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. కాగా ఈ కేసులో  హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును సుప్రీంకోర్టు  రద్దు చేయడంతో, సంజయ్‌ స్వయంగా ఏసీబీ ఎదుట లొంగిపోయారు. అనంతరం  ఆయనను 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. తదుపరి విచారణలో సంజయ్‌పై మరిన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని ఏసీబీ  అధికారులు వెల్లడించారు. గత వారంలో ఏసీబీ బృందం ఆయనను మూడు  రోజులపాటు విచారించింది.   ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విచారణ కొనసాగుతున్నందున సంజయ్‌  సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగించింది. ఆయన ప్రస్తుతానికి విజయవాడ  సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. సంజయ్‌ కుమార్‌ 1996 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. సీఐడీ, ఫైర్‌  సర్వీసెస్‌, హ్యూమన్‌ రైట్స్‌, ఎసిసి, ఎస్టి కమిషన్‌ వంటి కీలక విభాగాల్లో ఆయన  సేవలందించారు.  జగన్ హయాంలో సీఐడీ అదనపు డీజీగా ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. 

గూగుల్ లో ఏపీ సర్కార్ హిస్టారికల్ అగ్రిమెంట్

సీబీఎన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ డీల్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసే గేమ్  చేంజర్ లాంటి చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంగళవారం (అక్టోబర్ 14) ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఆ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటేనే అభివృద్ధి.. ఆయన హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ   ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ వరకూ ఎన్నో పెట్టుబడులు తీసుకువచ్చారు. ఎన్నో సంస్థలు, పరిశ్రమల రాకకు కారకుడయ్యారు. అయితే  ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆయన సమక్షంలో గూగుల్ తో ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందం మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ లోనే అత్యంత భారీ ఒప్పందంగా చెప్పవచ్చు.   గూగుల్ సహ సంస్థ అయిన రైడైన్ లో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఈ  ఒప్పందం విలువ రమారమి 90 వేల కోట్ల రూపాయలు. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన అతి పెద్ద పెట్టుబడి ఇదే. గూగుల్ విశాఖలో  దేశంలోనే  అతిపెద్ద డేటా కేంద్రం ప్రారంభంచనుంది.  ఇంకో విశేషమేంటంటే.. గూగుల్ హిస్టరీలో కూడా భారత్ లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. అంటే ఎలా చూసుకున్నా.. ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఇన్వెస్ట్ మెంట్ ఒక కొత్త రికార్డు అని చెప్పారు. కాగా గూగుల్    డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖ‌ప‌ట్నం  డేటాసెంటర్‌ హబ్‌ గా మారుతుంది.  ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్  ల సహకారం ఉందని చంద్రబాబు తెలిపారు.   ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం (అక్టోబర్ 14) ఉదయం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇదే అతిపెద్దది.  ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబర్‌లో అమెరికా పర్యటనలో బీజం వేశారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గూగుల్ రాబోయే ఐదేళ్లలో (2026-2030 మధ్య) ఈ పెట్టుబడి పెట్టనుంది.  

మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే!

ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగనున్న ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16 ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.20 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. కొద్ది సేపు విశ్రాంతి తరువాత 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం 12.45 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు తిరిగి చేరుకుని, 1.25 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కి బయల్దేరతారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌లో   శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నున్నూరు హెలిప్యాడ్ కు చేరుకుని అక్డ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెడతారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. మంగళవారం  (అక్టోబర్ 134 తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 23 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా సోమవారం  (అక్టోబర్ 13) శ్రీవారిని మొత్తం 78,569 మంది దర్శించుకున్నారు. వారిలో 27,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93  లక్షల రూపాయలు వచ్చింది.  

పోలీసు శాఖను మూసివేయడం మంచిది.. పరకామణి కేసులో హైకోర్టు సీరియస్

తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీసుశాఖపై తీవ్ర సీరియస్ అయ్యింది. ఈ అక్రమాలకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్‌ చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీసు శాఖ నిద్రపోతోందని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తోందని హైకోర్టు పేర్కొంది.  తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన కేసులో గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ బేఖాతరు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని హైకోర్టు గత నెల 19న ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసు శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను పట్టించుకోలేదంటూ సీరియస్ అయ్యింది. ఇలా అయితే పోలీసు శాఖను క్లోజ్ చేయడమే మంచిదని హెకోర్టు వ్యాఖ్యానించింది. రికార్డులు సీజ్‌ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీఐజీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.  

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌

  తెలంగాణ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ వేసి, ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల ఫీజు విధించడం అన్యాయమని వాదించారు. లాటరీలో షాప్‌ రాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా ఎక్సైజ్‌ శాఖకు జమచేస్తున్నారని ఆరోపించారు. లాటరీలో దుకాణం దక్కని వారికి, వారు చెల్లించిన దరఖాస్తు ఫీజును తిరిగి చెల్లించాలని కోర్టును అభ్యర్థించారు. అలాగే, లిక్కర్‌ షాప్‌ పొందిన దరఖాస్తుదారుల నుంచి ఇప్పటికే రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, స్పెషల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, టర్నోవర్‌ పన్ను వసూలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. లిక్కర్‌ పాలసీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కూడా పిటిషనర్‌ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆబ్కారీశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ, కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

జూబ్లీ ఉప ఎన్నికకు తొలిరోజు ఎన్ని నామినేషన్లంటే?

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్ల స్వీకరించారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.  తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అలాగే నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.  రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారిజూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల  ముందు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంను జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించారు. సన్నద్ధతను RO , ARO లతో సమీక్షించారు.నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ECI నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నామినేషన్ ల స్వీకరణకు సర్వ సన్నద్ధం గా ఉండాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాం కు సూచించారు.   

డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోపై అనుమానం ఉంది : ఎమ్మెల్యే బొజ్జల

  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్య చేయబడ్డ రాయుడు సెల్ఫీ వీడియో పై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.. తన ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని అన్నారు.. రాయుడు సెల్ఫీ వీడియో పై అనుమానం వ్యక్తం చేశారు.. హత్య చేసే ముందు వినుత దంపతులు రాయుడుని బెదిరించి ఇలా చెప్పించేరా లేక ఏఐ వీడియోనా అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు.. ఎన్నికలు సందర్భంగా అప్పటి జనసేన నాయకురాలు వినుత తన విజయానికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు..  ఆమె మద్దతు కోరుతూ తన  తల్లి వినుత ఇంటికి వెళ్లిన కనీసం గేటు తీయలేదని అన్నారు. అయినా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏనాడు తాను వినుతపైన ఆరోపణలు చేయలేదని అన్నారు. హత్య జరిగిన తర్వాత కూడా ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు.. అయినా ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఢిల్లీలో వ్యాఖ్యానించారు.. తనపై జరుగుతున్న దుష్ప్రచారం తెరదించేందుకే ఈ అంశంపై తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు  

చర్లపల్లి జైలుకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  కేంద్ర ఉప మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు చర్లపల్లి జైలును సందర్శించారు. సందర్శన సందర్భంగా డీజీపీ సౌమ్య మిశ్రా, జైలు శాఖ ఉన్నతాధికారులు మంత్రిని ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం మంత్రి జైలులో జరుగు తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి, వారు తయారు చేస్తున్న ఉత్పత్తు లను పరిశీలించారు. గోశాలలో పశువు లకు స్వయంగా మేత వేశారు.ఒక దూడకు “కృష్ణ” అని పేరు పెట్టారు. తరువాత జైలులో ఏర్పాటు చేసిన వినోద క్లబ్‌, చెమట గులాబీ తోటలను కూడా సందర్శిం చారు.  ఖైదీలు నిర్వహి స్తున్న తేనె ఉత్పత్తి విధానాన్ని కూడా గమనించారు. అధికారులు జైలు సంస్కరణలు, ఖైదీ సంక్షేమ కార్యక్రమా లపై పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ఇచ్చారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, మహిళా ఖైదీల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అందిస్తు న్నారని అధికారులు వివరించారు.చర్లపల్లి జైలు 25 ఏళ్ల క్రితం నిర్మించబ డిందని, అప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్టు తెలిపారు.ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ₹11.60 కోట్లు మంజూరు చేసిం దని, అందులో ₹11.30 కోట్లు వినియోగించబడినట్టు వివరించారు. డీజీపీ సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జైలు శాఖలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అధికారులు చెప్పారు. ఖైదీల కుటుంబ సభ్యులు వీడియో లింక్ ద్వారా “ములా ఖాత్” చేసుకునే సౌకర్యం కల్పించా రని, ఖైదీలకు ఇన్సూరెన్స్ సదుపాయం అందించారని తెలిపారు. ఖైదీలకు విద్యా అవకాశాలు కల్పించి, కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీలు ప్రదానం చేస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతిరోజూ సగటున 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహి స్తున్నారని, ప్రతి ఖైదీకి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అదనం గా ప్రతిరోజు  యోగా, ధ్యానం, శారీరక వ్యాయామ శిక్షణ తరగతులు  నిర్వహిస్తున్నారని చెప్పారు. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్టు వివరించారు. జైలు నుండి విడుదలైన తర్వాత కొందరు ఖైదీలు పెట్రోల్ బంక్‌లలో పనిచేస్తూ కనీసం రూ.18,000 జీతం పొందుతు న్నారని తెలిపారు. అలాగే జైలు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, క్రీడా కార్యక్రమాల కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తెలంగాణ జైలు సిబ్బంది వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కూడా ఇస్తున్నారని, జైలు శాఖకు SKOCH అవార్డు లభించిందని పేర్కొన్నారు. అనంతరం బండి సంజయ్  మాట్లాడుతూ... చర్లపల్లి జైలులో అమలు చేస్తున్న ఖైదీ సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఖైదీలకు బీమా సదుపాయం కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వంటి చర్యలు ఎంతో ప్రశంసనీయం అన్నారు. మహిళా ఖైదీల పిల్లల విద్యా ఫీజులు చెల్లించే నిర్ణయం జైలు శాఖ తీసుకోవడం ఒక మానవతా దృక్పథం అని అభినందించారు. జైలు విభాగం డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా దూరదృష్టి ప్రశంసనీయమని, ఆమె కస్టడీ, కేర్, కరెక్షన్ అనే మూలసూత్రాలను కార్యరూపంలోకి తీసుకువచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్ గారు డీజీపీ సౌమ్య మిశ్రా యొక్క విజన్ మరియు చర్లపల్లి జైలును అభివృద్ధి చేసిన విధానాన్ని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల జైలు శాఖలు కూడా ఇక్కడి మాదిరి సంస్కరణలు చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యమైనవని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం జైలు శాఖకు అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.  

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో  సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వైజాగ్‌లో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించారు. అలాగే నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీని కలవడం చాలా గౌరవంగా ఉందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు.  ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు చెప్పాని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల విషయంలో ప్రధాని నాయకత్వాన్ని ప్రశంచాని సీఎ తెలిపారు. కర్నూల్ జరిగే సూపర్ జీఎస్టీ సేవింగ్స్ కార్యక్రమానికి ఆహ్వానించాని పేర్కొన్నారు. రేపు(మంగళవారం) గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు.

జోగి రమేష్ ఆధ్వర్యంలో కల్తీ మద్యం...జనార్దన్‌రావు షాకింగ్ కామెంట్స్

  నకిలీ మద్యం కేసులో అరెస్టైన ఏ-1 జనార్దన్ రావు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెంచడంతో నిలిపివేశామని కానీ ఏప్రిల్‌లో రమేష్ ఫోన్ చేసి మళ్లీ తయారు చేయాలన్నారని జనార్దన్ రావు పేర్కొన్నారు. కల్తీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేశ్‌ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుడు దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా కూటమి సర్కార్‌కి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు.' అని జనార్థన్ రావు ఇవాళ సంచలన విషయాలు బయటపెట్టారు.అంతేకాదు, 'తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. ఇబ్రహీంపట్నంలో కూడా సోదాలు చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని అన్నారు. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు, జగన్ మీడియా కూడా ముందే ఉంది. అనుకున్నది జరిగింది..  ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. నువ్వు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని జోగి రమేష్ అన్నారు. అంతా చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడిని కూడా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇరికించాడు. జై చంద్రారెడ్డికి కల్తీ లిక్కర్‌తో అసలు సంబంధం లేదు'. అని జనార్దన్ రావు తెలిపారు జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేశ్‌ నమ్మించారు. రమేశ్‌తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నమ్మించి మోసం చేశారు. అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా’’ అని జనార్దన్‌రావు పేర్కొన్నాడు  

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో మరో అరెస్టు

  అన్నమయ్య జిల్లా  ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ 22 నిందితుడిగా ఉన్న చైతన్య బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 15కి చేరింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరి కొంతమందిపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం ఈ కేసుని సిట్‌‌కి అప్పగించన సంగతి తెలిసిందే.  నకిలీ లిక్కర్ తయారీతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో టెన్షన్ పెరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ (17) నిందితునిగా కేసు నమోదైన టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్థి గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ట్రంప్ పబ్లిసిటీ స్టంట్స్... యూఎస్‌లో 12 అడుగులు బంగారు విగ్రహం

  అమెరికా ప్రెసిడెంట్ రూటే సెపరేటు. సెల్ఫ్ పబ్లిసిటీ అంటే ఆయనకు ఎంత పిచ్చో వేరే చెప్పనవసరం లేదు. నోబెల్ శాంత బహుమతి కోసం ఆయన ఎంత హడావుడి చేశారో ఎవరూ మర్చిపోరు. తాజాగా ఆయన గోల్డెన్ స్టాట్యూ ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. గత నెల సెప్టెంబర్ లో ట్రంప్ గోల్డెన్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అది కూడా అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా పెట్టారు. 12 అడుగుల ఎత్తైన ట్రంప్ బంగారు విగ్రహం అది. చేతిలో బిట్ కాయిన్ పట్టుకుని నిలబడ్డట్లు పెట్టిన ఆ విగ్రహాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తుండటం విశేషం. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల నిధులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ స్టాట్యూ  ఏర్పాటు చేశారు. ట్రంప్ కు ఇలాంటివంటే మహా ఇష్టం. 12 అడుగుల బంగారు విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తినా... ట్రంప్ మాత్రం పిచ్చ హ్యాపీ అయిపోయారు. జస్ట్ ఇదే కాదు.. ట్రంప్ మైండ్ సెట్ ఎవరికీ అంతుపట్టదన్న టాక్ ఉంది. చరిత్రలో నిలిచిపోయేందుకు ట్రంప్ తనను తానే ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. అది రివర్స్ అవుతుందా.. సక్సెస్ అవుతుందా అనేది పక్కన పెడితే... ప్రపంచంలోనే తాను బలమైన లీడర్ అని ట్రంప్ బలంగా విశ్వసిస్తుంటారు. అయితే చైనా, భారత్, రష్యా మాత్రం ఆయన్ను లెక్క చేయడం లేదు. ఎంత వరకైనా తేల్చుకుందాం అంటున్నాయి.  ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలని ట్రంప్ అనుకుంటున్నారో ఏమోగానీ.. మొదట అమెరికాలో ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుల కంటే గొప్ప వ్యక్తిగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2026లో అమెరికా స్వాతంత్ర్యం 250 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక డాలర్ ప్రత్యేక నాణెం విడుదల చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ డాలర్ కాయిన్ పై డొనాల్డ్ ట్రంప్ ఫోటో పెట్టుకుంటున్నారు. ట్రంప్ పిడికిలి ఎత్తి ఉన్న ఫోటో పెట్టి.. పక్కన ఫైట్, ఫైట్, ఫైట్ అన్న నినాదాలతో ఉన్న నాణెం డిజైన్‌ డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. నిజానికి ఇది అమెరికన్ కరెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సంప్రదాయాలకు విరుద్ధం. బతికి ఉన్న వారి ఫోటోలు కాయిన్లు, నోట్లపై వేయకూడదు. కానీ ట్రంప్ కు ముందు చూపు ఎక్కువ కదా. ఫ్యూచర్ ప్లాన్ తో గతంలోనే చట్టం చేయించుకున్నారు.    అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన మౌంట్‌ రష్మోర్‌ పై ట్రంప్ కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండపై నేషనల్‌ మెమోరియల్‌లో తన ఫేస్ స్టాచ్యూను చెక్కించాలని తెగ ఆసక్తి చూపారు. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లో ఏఐ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అందులో అమెరికన్ లెజెండరీ ప్రెసిడెంట్ల పక్కనే తనది కూడా ఉన్నట్లు ఎలివేట్ చేసుకున్నారు. మౌంట్‌ రష్మోర్‌ నేషనల్‌ మెమోరియల్‌ సౌత్ డకోటాలోని కీస్టోన్‌ వద్ద ఉన్న బ్లాక్‌ హిల్‌పై ఉంది. ఇక్కడి భారీ గ్రానైట్‌ శిలలపై అధ్యక్షుల ముఖాల బొమ్మలను డిజైన్‌ చేశారు. ఏటా కొన్ని మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.  వాటిని చూసి వెళ్తుంటారు. ఈ మెమోరియల్‌పై అమెరికా మాజీ అధ్యక్షులైన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫర్సన్‌, రూజ్ వెల్ట్‌, అబ్రహం లింకన్‌ ముఖాలు ఉన్నాయి. వీరంతా అమెరికాను వివిధ అంశాల్లో బలోపేతం చేసిన వారే. ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిల్లో తన ముఖం కూడా ఉండాలని ట్రంప్‌ కోరుకుంటున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ పర్వతంపై ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదు. మౌంట్‌ రష్మోర్‌ను నిర్వహించే నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సేఫ్టీ కాదని, మొత్తం కూలిపోతాయని స్పష్టం చేసింది అసలు ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. ఆ క్రమంలోనే ది అప్రెంటిస్ అనే రియాల్టీ టీవీ షో హోస్ట్ చేశారు. 2004 నుంచి 2017 వరకు NBC నెట్‌వర్క్‌లో 15 సీజన్‌లు రన్ అయింది. 14-18 మంది బిజినెస్ కంటెస్టెంట్లు పోటీ పడ్డారు.  ఈ షోలు ట్రంప్‌ని టఫ్ బిజినెస్‌మ్యాన్ గా బ్రాండ్ చేశాయి. అయితే ఈ షోలు ప్లీప్లాన్ అని, ట్రంప్ ఇమేజ్ మాస్క్ అని కొందరు అంటారు. ఇప్పుడు అధ్యక్షుడు అయినప్పటికీ అదే కథ నడుస్తోంది. అందుకే ట్రంప్ రూటే సపరేటు.