ట్రంప్ పబ్లిసిటీ స్టంట్స్... యూఎస్‌లో 12 అడుగులు బంగారు విగ్రహం

 

అమెరికా ప్రెసిడెంట్ రూటే సెపరేటు. సెల్ఫ్ పబ్లిసిటీ అంటే ఆయనకు ఎంత పిచ్చో వేరే చెప్పనవసరం లేదు. నోబెల్ శాంత బహుమతి కోసం ఆయన ఎంత హడావుడి చేశారో ఎవరూ మర్చిపోరు. తాజాగా ఆయన గోల్డెన్ స్టాట్యూ ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. గత నెల సెప్టెంబర్ లో ట్రంప్ గోల్డెన్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. అది కూడా అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా పెట్టారు. 12 అడుగుల ఎత్తైన ట్రంప్ బంగారు విగ్రహం అది. చేతిలో బిట్ కాయిన్ పట్టుకుని నిలబడ్డట్లు పెట్టిన ఆ విగ్రహాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తుండటం విశేషం.

ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల నిధులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ స్టాట్యూ  ఏర్పాటు చేశారు. ట్రంప్ కు ఇలాంటివంటే మహా ఇష్టం. 12 అడుగుల బంగారు విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తినా... ట్రంప్ మాత్రం పిచ్చ హ్యాపీ అయిపోయారు. జస్ట్ ఇదే కాదు.. ట్రంప్ మైండ్ సెట్ ఎవరికీ అంతుపట్టదన్న టాక్ ఉంది. చరిత్రలో నిలిచిపోయేందుకు ట్రంప్ తనను తానే ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. అది రివర్స్ అవుతుందా.. సక్సెస్ అవుతుందా అనేది పక్కన పెడితే... ప్రపంచంలోనే తాను బలమైన లీడర్ అని ట్రంప్ బలంగా విశ్వసిస్తుంటారు. అయితే చైనా, భారత్, రష్యా మాత్రం ఆయన్ను లెక్క చేయడం లేదు. ఎంత వరకైనా తేల్చుకుందాం అంటున్నాయి. 

ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలని ట్రంప్ అనుకుంటున్నారో ఏమోగానీ.. మొదట అమెరికాలో ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుల కంటే గొప్ప వ్యక్తిగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2026లో అమెరికా స్వాతంత్ర్యం 250 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక డాలర్ ప్రత్యేక నాణెం విడుదల చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ డాలర్ కాయిన్ పై డొనాల్డ్ ట్రంప్ ఫోటో పెట్టుకుంటున్నారు. ట్రంప్ పిడికిలి ఎత్తి ఉన్న ఫోటో పెట్టి.. పక్కన ఫైట్, ఫైట్, ఫైట్ అన్న నినాదాలతో ఉన్న నాణెం డిజైన్‌ డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. నిజానికి ఇది అమెరికన్ కరెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సంప్రదాయాలకు విరుద్ధం. బతికి ఉన్న వారి ఫోటోలు కాయిన్లు, నోట్లపై వేయకూడదు. కానీ ట్రంప్ కు ముందు చూపు ఎక్కువ కదా. ఫ్యూచర్ ప్లాన్ తో గతంలోనే చట్టం చేయించుకున్నారు. 
 

అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన మౌంట్‌ రష్మోర్‌ పై ట్రంప్ కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఆ కొండపై నేషనల్‌ మెమోరియల్‌లో తన ఫేస్ స్టాచ్యూను చెక్కించాలని తెగ ఆసక్తి చూపారు. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్ లో ఏఐ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అందులో అమెరికన్ లెజెండరీ ప్రెసిడెంట్ల పక్కనే తనది కూడా ఉన్నట్లు ఎలివేట్ చేసుకున్నారు. మౌంట్‌ రష్మోర్‌ నేషనల్‌ మెమోరియల్‌ సౌత్ డకోటాలోని కీస్టోన్‌ వద్ద ఉన్న బ్లాక్‌ హిల్‌పై ఉంది. ఇక్కడి భారీ గ్రానైట్‌ శిలలపై అధ్యక్షుల ముఖాల బొమ్మలను డిజైన్‌ చేశారు. ఏటా కొన్ని మిలియన్ల మంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. 

వాటిని చూసి వెళ్తుంటారు. ఈ మెమోరియల్‌పై అమెరికా మాజీ అధ్యక్షులైన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫర్సన్‌, రూజ్ వెల్ట్‌, అబ్రహం లింకన్‌ ముఖాలు ఉన్నాయి. వీరంతా అమెరికాను వివిధ అంశాల్లో బలోపేతం చేసిన వారే. ఒక్కో శిల్పం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. వీటిల్లో తన ముఖం కూడా ఉండాలని ట్రంప్‌ కోరుకుంటున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ పర్వతంపై ఐదో ముఖం చెక్కడానికి చోటు సరిపోదు. మౌంట్‌ రష్మోర్‌ను నిర్వహించే నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ కూడా అక్కడ ఐదో తల ఏర్పాటుకు సేఫ్టీ కాదని, మొత్తం కూలిపోతాయని స్పష్టం చేసింది

అసలు ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. ఆ క్రమంలోనే ది అప్రెంటిస్ అనే రియాల్టీ టీవీ షో హోస్ట్ చేశారు. 2004 నుంచి 2017 వరకు NBC నెట్‌వర్క్‌లో 15 సీజన్‌లు రన్ అయింది. 14-18 మంది బిజినెస్ కంటెస్టెంట్లు పోటీ పడ్డారు.  ఈ షోలు ట్రంప్‌ని టఫ్ బిజినెస్‌మ్యాన్ గా బ్రాండ్ చేశాయి. అయితే ఈ షోలు ప్లీప్లాన్ అని, ట్రంప్ ఇమేజ్ మాస్క్ అని కొందరు అంటారు. ఇప్పుడు అధ్యక్షుడు అయినప్పటికీ అదే కథ నడుస్తోంది. అందుకే ట్రంప్ రూటే సపరేటు.

సామ్రాజ్యవాద విస్తరణ.. అమెరికా పెడధోరణులపై ప్రపంచ దేశాల ఆగ్రహం

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విపరీత పోకడలు పోతున్నారు. తాను ఒక్క అమెరికాకే కాదనీ, ప్రపంచదేశాలకూ అధినేతనేనన్న అహంకారంతో విర్రవీగుతున్నట్లు కనిపిస్తున్నది. సామ్రాజ్యవాద, ఆక్రమణ  ధోరణులను  ఇష్టారీతిగా ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడాయన చూపు గ్రీన్ ల్యాండ్ పై పడింది. ఇప్పటికే వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనని తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్  ఇక గ్రీన్ ల్యాండ్ కు కూడా తానే అధిపతిని అని ప్రకటించడానికి రెడీ అయిపోతున్నారు.   ఇది మన్రో సిద్ధాంతానికి అనుగుణంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం  రెండు అమెరికా ఖండాల పై ఏ దేశం కూడా తమ వలసలను విస్తరించడానికి అనుమతించబోదు. ఈ సిద్ధాంతాన్ని  1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో ప్రకటించి అమలు చేశారు. కాలం చెల్లిన ఆ సిద్ధాంతాన్నే ఇప్పుడు ట్రంప్ మన్రో సిద్ధింతం కాదు.. ట్రనో సిద్ధింతం అంటూ ఆక్రమణ కు తెరతీశారు.  గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించి తీరుతామని ట్రంప్ చేసిన ప్రకటనపై  డెన్మార్క్,గ్రీన్ ల్యాండ్ లు రగిలిపోతున్నాయి. డెన్మార్క్ ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ఇప్పుడు డెన్మార్ పాక్షిక ఏలుబడిలో ఉంది.   ఇలా ఉండగా అమెరికా తాటాకు చప్పుళ్లకు బెదరమని, పోరాటానికి సిద్ధమని గ్రీన్ లాండ్ తెగేసి చెప్పింది.  తాముగ్రీన్ లాండర్లు..డానిష్ పౌరులుగా నే  కొనసాగుతామని కుండబద్దలు కొట్టేసింది.   అది పక్కన పెడితే నాటో కూటమి లో భాగమైన డెన్మార్క్ అమెరికా దాడిచేస్తే నాటో నాశనం ఖాయమని తేల్చిచెప్పింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన రక్షణ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని హెచ్చరించింది. 500 ఏళ్లుగా డెన్మార్క్ గ్రీన్ లాండ్ లు కలిసి ఉంటున్నాయి. అయితే అంత మాత్రాన గ్రీన్ లాండ్ డెన్మార్క్ భూ భాగం ఎలా అవుతుందని ట్రంప్ అంటున్నారు.   అమెరికా రక్షణ కోసం తమకు గ్రీన్ ల్యాండ్ అవసరమని ట్రంప్ చెబుతున్నారు.  ట్రంప్ ఏం చెప్పినా ఆయా దేశాలలోని సహజ వనరులపై గుత్తాధిపత్యం కోసమే అమెరికా తన సామ్రాజ్య విస్తరణకు మన్రో, టన్రో అంటూ కొత్త కొత్త పేర్లు, ఎత్తుగడలతో సాగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.  ప్రచ్ఛన్న యుద్ధం తరువాత సోవియట్ పతనంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యం గా ఆవిర్భవించింది. ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు  పుతిన్ వ్యూహాత్మక అడుగుల కారణంగా రష్యా కూడా శక్తిమంతమైన దేశంగా ఏర్పడింది. అలాగే బలీయమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఇప్పుడు రష్యా, చైనాలు కలిస్తే.. తన ఆధిపత్యానికి గండి పడటం ఖాయమన్న భయంతోనే అమెరికా అడ్డగోలుగా దేశాలలో అశాంతిని రగిల్చి ఆక్రమణల బాట పట్టిందంటున్నారు.  అత్యధిక వనరులున్న ప్రాంతాలను, దేశాలను  కైవసం చేసుకుని తిరుగులేని శక్తి అమెరికా అని చాటాలని చూస్తోంది. అయితే అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ధోరణులను ప్రపంచదేశాలు గర్హిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే అమెరికాకు పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో పలు జిల్లాలకు కొత్త జేసీలు.. ఐఏఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు  కొత్త జాయింట్ కలెక్టర్లను  నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా కొత్త జేసీలు నియమితులైన జిల్లాలలో  ఇటీవలే కొత్తగా ఏర్పాటైన   మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే  చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గానూ, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్న గోవిందరావును  టుడా  వైస్ చైర్మన్‌గా నియమించింది. ఆయనకు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.   పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది.   రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. 

లక్ష వీసాలు రద్దు.. అమెరికా సంచలన నిర్ణయం

దేశ భద్రతకు ప్రథమ తాంబూలం అన్న విధానంలో భాగంగానే ట్రంప్ సర్కార్ కఠినాతి కఠినమైన వలస విధానాలను అనుసరిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.   అమెరికా పౌరుల భద్రత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది.  జాతీయ,   ప్రజా భద్రతకు ముప్పు కలిగించే విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ.. రద్దు చేసిన వీసాలలో 8 వేలవిద్యార్థి వీసాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే స్పెషల్ టాలెంట్ వీసాలు పాతిక వందలు ఉన్నాయని వివరించింది.   వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడటం వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.  అమెరికాలో ఉంటున్న విదేశీయులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండేలా  కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్ అనే కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.  

పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 2023, జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026 జనవరి మాసంలో తీసుకునే జీతంతో కలిపి ఈ డీఏ చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు సైతం ఈ డీఏను వర్తింప చేయనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ డీఏ కింద నిధులు చెల్లించనున్నారు. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి ఈ డీఏను ప్రభుత్వం సవరించిన విషయం విదితమే. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు భారాన్ని మాపై మోపి వెళ్లినా, ఉద్యోగులకు మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోంది. సంక్రాంతి కానుకగా డీఎ ఫైల్ పై సంతకం చేసి డైరీ ఆవిష్కరణకు వచ్చామని  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ& క్యాలెండర్‌ను ఆవిష్కరణ సందర్బంగా  సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ప్రతి ప్రభుత్వం ఉద్యోగీ ఇందులో భాగస్వామ సీఎం స్ఫష్టం చేశారు. మీరే మా సారధులు, మా వారధులు. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్  సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

టీడీపీ నేత అప్పల సూర్యనారాయణ మృతి పట్ల లోకేష్ సంతాపం

   శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియశారు. తెలుగుదేశం పార్టీకి వారు లేని లోటు తీరనిదని. ముక్కుసూటి, నిజాయితీకి మారుపేరైన గుండ అప్పల సూర్యనారాయణ గారు నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. వారి సేవలు చిరస్మరణీయం. గుండ అప్పల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాని లోకేష్ పేర్కొన్నారు.  అప్పల సూర్యనారాయణ  ఇంట్లో కాలు జారి కిందపడటంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందారు. నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సూర్యనారాయణ సేవలు అందించారు. టీడీపీ నుంచి 1985 నుంచి 2004 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

చలాన్లు పడ్డ వెంటనే అకౌంట్ నుండి డబ్బులు కట్ కావాలి : సీఎం రేవంత్‌

  ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచన చేశారు. వాహన చలానా పడితే ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీ వాడండి అని ముఖ్యమంత్రి తెలిపారు.హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేడియంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని తెలిపారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.  చలాన్లు విధిస్తే డిస్కౌంట్ ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు అవసరమైన ప్రణాళికను చేపట్టిన పోలీస్ శాఖను అభినందిస్తున్నాని తెలిపారు.   దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నామని... ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది.. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.  రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని..సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయిని తెలిపారు.  సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్ఫష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

నారావారిపల్లె‌కు చేరుకున్నా సీఎం చంద్రబాబు

  సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. రంగంపేట వద్ద చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు  గ్రామస్తులు పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఘనస్వాగతం పలికికారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు...ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకున్నారు.  సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మంగళవారం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.  ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలు మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు.  నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.    మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.  నాగాలమ్మకు ప్రత్యేక పూజలు 15వ తేదీన తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.    

వచ్చే నెలలో పెళ్లి...యూఎస్ అదుపులో భారత్ నేవీ ఆఫీసర్

  వెనిజులాపై దాడి నేపధ్యంలో యూఎస్ ప్రభుతం ఆ దేశానికి రష్యా జెండాతో వెళ్తున్న మ్యారినెరా నౌకతో పాటు మరో దాన్ని సీజ్ చేసింది. మ్యారినెరా నౌకా సిబ్బందిలో ముగ్గురు ఇండియన్స్ ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది. వారు హిమాచల్ ప్రదేశ్, కేరళ, గోవాకు చెందిన వారు కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు చెందిన రక్షిత్ చౌహాన్ అనే మర్చంట్ నేవీ ఆఫీసర్‌కు వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది.  చౌహాన్‌ను రష్యా సంస్థ తొలిసారి సముద్రం విధులకు.. అది కూడా వెనిజులాకు పంపింది. ఆ క్రమంలో జనవరి 7న చివరిసారి చౌహాన్‌తో మాట్లాడామని ఆయన కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా దళాలు నౌకను అదుపులోకి తీసుకున్నాయి. అది తెలిసి రక్షిత్ చౌహాన్ తల్లి రీతాదేవి తన కొడుకు వివాహాన్ని ఫిబ్రవరి 19న నిశ్చయించామని, అతను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడండని ప్రధాని మోడీని అభ్యర్ధించింది. ఈ పరిణామాలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పందించి చర్యలు చేపడుతోంది.

రూ.547 కోట్ల సైబర్ మోసాలు... చేధించిన ఖమ్మం పోలీసులు

  ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల మాయలో పడి రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతేడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.372 కోట్లు కాజేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. అయినా కూడా కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు.  ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేయగా కేవలం ఆరుగురి ఖాతాల్లోనే రూ.547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.   సైబర్ క్రైమ్ ద్వారా వీళ్లంతా రూ. 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు తేల్చారు. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌కళ్యాణ్, ఉడతనేని వికాస్ ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడిచిందని గుర్తించారు.కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అలాగే.. మాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్.. ఇలా పలు రకాలుగా బాధితుల నుంచి ఈ డబ్బును కొల్లగొట్టినట్టు స్పష్టం అవుతోంది.  గతేడాది డిసెంబర్ లో విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి .. తాను సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. దాంతో వీరి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అలాగే నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీళ్లంతా అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇక ఇటీవల హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్‌ భార్యకు సైబర్‌ నేరగాళ్ల టోకరా వేసిన సంగతి తెలిసిందే. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పేరుతో కేవలం పది రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కొట్టేశారు సైబర్‌ కేటుగాళ్లు. 

జిల్లాల పునర్విభజనపై కమిటీ : సీఎం రేవంత్‌రెడ్డి

  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని...6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు. గతంలో నాయకులు నచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.  మండలాలు, రెవెన్యూ డివిజన్లనూ పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం తెలిపారు. మల్కాజ్‌గిరి మేం పెట్టలేదు. తీయలేదు. రాచకొండ ఒక్కటే రాజులను తలపించేలా ఉందన్నారు. సికింద్రాబాద్ పేరు ఎక్కడ ఉంది? తీసేసింది ఎక్కడ? జీహెచ్‌ఎంసీలో భాగంగా సికింద్రాబాద్ ఉంది అని రేవంత్‌రెడ్డి అన్నారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారు. మనమంతా ఒకే కుటుంబం… కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయిని సీఎం స్పష్టం చేశారు.  ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేని తెలిపారు.  మీరే మా సారధులు, మా వారధులు.. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండని ఉద్యోగులను ప్రశ్నించారు.  సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా.. మీ ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్  సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం..ఇదొక బాధ్యత.. అందరం కలిసికట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపాలన పరుగులు పెడుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు.