టెక్ ప్రపంచంలో ఏపీ చరిత్రాత్మక అడుగు
posted on Oct 14, 2025 @ 3:20PM
టెక్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రాత్మక అడుగులు వేసింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విశాఖపట్నం కేంద్రంగా రూ. 87 వేల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టేలా అనుబంధ సంస్థ రైడన్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఒప్పదం చేసుకున్నారు.
ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లోకేశ్ ఈ మేరకు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఒప్పందంతో విశాఖను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపొందించడంలో తొలి అడుగు పడినట్లయింది.
గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కార్యకలాపాలు ఆరంభించే తరుణంలో భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు పొందుతుంది. అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో ఐటీ - ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీకి గూగుల్, టీసీఎస్, ఎసెంచర్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలన్నీ క్యూ కడుతూ యువతకు ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.