నవ్యాంధ్రలో నవశకం.. మోడీ చేతుల మీదుగా 13429 కోట్ల పనులకు శ్రీకారం

నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకం మొదలైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రూ. 13, 429 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. . కర్నూలులో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ వేదికపై నుంచి పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ గురువారం వర్చువల్ గా ప్రారంభించారు.  నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలలో పనులకూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడితో వీటిని చేపడుతున్నారు. ఇవి భవిష్యత్తులో మరో రూ.21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, దాదాపు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయన్నది అంచనా.  రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 960 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్బవరం నుంచి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కూడా మోడీ ఈ సందర్భంగా  శంకుస్థాపన చేశారు. అలాగే   రూ. 1,140 కోట్లతో చేపట్టనున్న ఆరు రోడ్డు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అందులో పీలేరు –కల్లూరు సెక్షన్‌ నాలుగు వరుసల రహదారి,  కడప-నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్ పురం వరకు విస్తరణ, జాతీయ రహదారి-165పై గుడివాడ - నూజెల్ల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు వరుసల రైల్ ఓవర్ బ్రిడ్జి, జాతీయ రహదారి -716 పై కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై  వంతెన, జాతీయ రహదారి -565పై నిర్మించిన కనిగిరి బైపాస్, జాతీయ రహదారి -544డీడీలోని ఎన్ గుండ్లపల్లి పట్టణంలో నిర్మించిన బైపాస్ ఉన్నాయి. అదే విధంగా రూ. 1,200 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో కొత్తవలస–విజయనగరం నాల్గో రైల్వే లైన్, పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్‌లు  ఉన్నాయి. కొత్తవలస-బొద్దవర,సిమిలిగుడ- గోరాపూర్‌ డబ్లింగ్‌ విభాగాల పనులు పూర్తి కావడంతో  మోడీ వాటిని  జాతికి అంకితం చేశారు.   అదే విధంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన శ్రీకాకుళం–అంగుల్ నేచురల్ గ్యాస్  పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ. 1,730 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ 422 కిలోమీటర్ల పైప్‌లైన్ ఆంధ్రప్రదేశ్‌లో 124 ఒడిశాలో 298 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇక చిత్తూరులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన 60 వేల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటును కూడా మోదీ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పారు. అదే విధంగా కృష్ణా జిల్లా నిమ్మలూరులో  రూ. 360 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  నెలకొల్పిన అధునాతన నైట్ విజన్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. 

శ్రీశైలంలో మోడీ ప్రత్యేక పూజలు

 ప్రధాని నరేంద్రమోడీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి శ్రీశైలం ఆలయానికి విచ్చేసిన ఆయనకు   వేద పండితులు, పూర్ణకుంభ స్వాగతం పలికారు.  మొదటిగా  స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని మోడీ అనంతరం  అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు.   పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య  మోడీకి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు  ఆశీర్వాదం అందజేశారు.  అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను, అలాగే చిత్రపటాన్ని  మోడీకి అందించారు. అలాగే  చంద్రబాబు నాయుడు  పవన్ కళ్యాణ్  కూడా  శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోడీకి బహూకరించారు. ఆలయ విశేషాలను తెలిపారు.  ప్రధాని మోడీ దాదాపు గంట సేపు శ్రీశైలం ఆలయంలో గడిపారు.    అనంతరం శ్రీశైలంలోని  ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్నిమోడీ సందర్శించారు.  కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ  జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు శ్రీ మోదీ గారికి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూజ చేశారు.  కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.

మోడీ నిలువెత్తు తెలుగుదనం..

ప్రధాని నరేంద్రమోడీ ఏపీ పర్యటనలో ఆయన శ్రీశైలం సందర్శన హైలైట్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సంప్రదాయ దుస్తులను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. ముగ్గురుకి ముగ్గరూ నిలువెత్తు తెలుగుతనాన్ని ప్రతిబించించేలా ఉన్నారని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీనికి ఫైనల్ టచ్ అన్నట్లుగా ప్రధాని తన శ్రీశైలం ఆలయ సందర్శనపై అచ్చ తెలుగులో చేసిన ట్వీట్ మరింత పాపులర్ అయ్యింది. ‘నా తోటి భారతీయుల కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను, అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకున్నా’నని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మొత్తం మీద సంప్రదాయ దుస్తులతో ఉన్న మోడీ, బాబు, పవన్ ల ఫొటోను పిక్చర్ ఆఫ్ ది డే అంటూ నెటిజనులు షేర్ చేస్తున్నారు. 

సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నో

కర్నాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్ వ్వవస్థాపకుడు నారాయణ మూర్తి నిరాకరించారు. ఆయనతో పపాటు ఆయన సతీమణి, రచయిత్రి, సామాజిక ఉద్యమ కారిణి సుధామూర్తి కూడా ఈ సర్వేలో పాల్గొనేది లేదని కుండబద్దలు కొట్టారు. తాము ఏ వెనుకబడిన వర్గానికీ చెందిన వారం కాదనీ, అందుకే ఈ సర్వే వల్ల ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనీ పేర్కొన్న వారు అందుకే సర్వే కోసం తమ ఇంటికి వచ్చిన అధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చి మరీ తమ అనంగీకారాన్ని తెలిపారు. సర్వే ఫారంపై కూడా వారీ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.   ఇలా ఉండగా ఈ సర్వే ప్రారంభమైన తొలి వారంలోనే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సర్వేలో పాల్గొనాలని అధికారులు, ఉపాధ్యాయులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.   సర్వేలో పాల్గొనబోనని చెప్పినా పర్వే చేయడానికి వచ్చిన వ్యక్తి బెదరింపులకు దిగుతున్నారని పలువురు ఆరోపణలు గుప్పించారు. అన్నిటికీ మించి సర్వే పట్ల ప్రజల విముఖతకు ప్రధాన కారణంగా   ప్రశ్నలు చాలా ఎక్కువగా, విసుగు తెప్పించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి డీకేశివకుమార్ కూడా సర్వే కోసం ఉద్దేశిచిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉందనీ, విసుగుతెప్పించేవిగా ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా.. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, సర్వే ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.   నగరాల్లో నివశించే ప్రజలకు అన్నేసి ప్రశ్నలకు అంతంత సేపు సమాధానం చెప్పే ఓపిక, తీరిక ఉండదని డీకే అన్నారు.  ఇక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు సర్వేలో పాల్గొనడానికి   నిరాకరించడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమన్న డీకే శివకుమార్  సర్వేలో పాల్గొని తీరాలని తాము ఎవరిపైనా ఒత్తిడి తేబోమని స్పష్టం చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85.89 శాతం సర్వే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా, గ్రేటర్ బెంగళూరు పరిధిలో మాత్రం కేవలం 19.62 శాతమే పూర్తి కావడం గమనార్హం. ఇది నగరంలో సర్వే ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.

రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అమెరికాలో అరెస్ట్

ప్రముఖ విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్‌ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యూఎస్‌కు చెందిన రక్షణ రహస్యాలను కలిగిఉండటంతో పాటు చైనా అధికారులతో రహస్య సమావేశాలు జరిపినట్లు  ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ  నేపథ్యంలోనే అమెరికా   అధికారులు ఆయన్ను అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.   విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ రంగ వ్యూహాకర్త, భారతీయ మూలాలున్న ఆష్లే టెల్లీస్‌ ను  ప్రస్తుతం ఫెడరల్ అధికారులు ప్రశ్నిస్తున్నారని  వర్జినియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.  ఇక ఆయన  నివాసంలో సైతం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో రహస్య పత్రాలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆష్లే టెల్లీస్‌ వద్ద రక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారం ఉంచుకోవడం ద్వారా  నిబంధనలు అతిక్రమించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అమెరికా న్యాయవాది లిండ్సే హాలిగన్‌  ఆష్లేపై ఉన్న అభియోగాలను ప్రకటించారు. వాటి ప్రకారం.. 64 ఏళ్ల ఆష్లే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌లో కాంట్రాక్టర్‌గా పని చేశారు.  2001 నుంచి ఇందులో పనిచేస్తున్న ఆయన దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొందినట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇళ్లల్లో అధికారులు సోదాలు చేయగా.. ‘సీక్రెట్‌’,  ‘టాప్‌ సీక్రెట్‌’ అని ఉన్న వెయ్యికి పైగా పత్రాలు లభ్యమయ్యాయి. ఇటీవల ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న తన సహ ఉద్యోగిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్‌లు తనకివ్వమని ఆష్లే అడిగినట్లు ఫెడరల్‌ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్‌ చేసినట్లు తెలిపారు. మరోవైపు.. గత కొన్ని సంవత్సరాలుగా ఆష్లే చైనా ప్రతినిధులతో రహస్య సమావేశాలు జరిపాడని పేర్కొన్నారు. అలా 2022లోనూ  2023 ఏప్రిల్‌ 11న బీజింగ్‌ అధికారులతో జరిగిన విందులోను ఆష్లే పాల్గొన్నట్లు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.  ఇటీవల కూడా ఇలాంటి భేటీయే జరగ్గా... చైనా అధికారుల నుంచి ఆష్లేకు గిఫ్ట్‌గా బ్యాగు లభించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నదని ఫెడరల్‌ అధికారులు తెలిపారు.  వీటిల్లో ఆయన దోషి అని తేలితే.. 10 ఏళ్ల వరకూ  జైలు  2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 

బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు

సుప్రీం కోర్టులో రేవంత్ సర్కార్ కు చుక్కెదురైంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల  వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.  జీవో నంబర్.9పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను  జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం (అక్టోబర్ 16) విచారించింది.  తెలంగాణ సర్కార్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది.  దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్

ట్రాఫిక్ నియంత్రణ మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ తోడుగా నిలుస్తామని నిరూపించాడు ఓ ట్రాఫిక్ మార్షల్.  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాఫిక్ మార్షల్ ఓ  ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించి జనం ప్రశంసలు అందుకున్న ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఇద్దరు వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్ క్షణాల్లో మృత్యువు నుండి బయట పడేసాడు. ఒక విధంగా చెప్పా లంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తు న్నంత సేపు పై నుండి దేవుడు దిగివచ్చి బస్సు కింద పడిపోయిన వాహనదారుడిని మృత్యువు నుండి రక్షించాడా అనిపిస్తుంది. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై   సూరారం సిగ్నల్ వద్ద బస్సు పక్కన నుండి వెళ్తుండగా... ఒక్కసారిగా ద్విచక్ర వాహన దారుడు అదుపుతప్పి బస్సు కింద పడిపో యాడు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్ శివకుమార్  వెంటనే స్పందించి పరుగు పరుగున వచ్చి బస్సు ఆపి... బస్సు కిందపడిన ద్విచక్ర వాహన దారుడిని రక్షిం చాడు. క్ష ణాల్లో ఆ వాహనదారుడికి మృత్యు వాత తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శివకుమార్ సమ యస్ఫూర్తితో స్పందించి అతని రక్షించిన తీరును చూసి వాహనదా రులు శివకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మిస్టర్ టీ బ్రాండ్ నవీన్ రెడ్డికి నగరబహిష్కరణ

మిస్టర్ టీ బ్రాండ్ యజమాని నవీన్ రెడ్డిని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ రాచకొండ పీసీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.  మిస్టర్ టీ బ్రాండ్ యజమాని నవీన్ రెడ్డి ఆదిభట్ల పోలీస్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్న పోసులున నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.  నవీన్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు అయ్యాయి.  అంతే కాకుండా  సాక్షులను బెదిరిస్తూ, నగరంలో భయాందోళనలను సృష్టిస్తున్నట్లు పోలీసుల నివేదికలు పేర్కొన్నాయి. ఆదిబట్ల ఇన్స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీ నివేదికల ఆధారంగా నవీన్ రెడ్డికి నగర బహిష్కరణ విధిస్తూ చర్య తీసుకున్నట్లు సుధీర్ బాబు తెలిపారు.  2022లో డెంటల్ విద్యార్థిని నిశ్చితార్థ వేడుకలో తన గ్యాంగ్‌తో కిడ్నాప్ చేసిన ఘటన, అలాగే డెంటల్ డాక్టర్ ఇంట్లో హంగామా చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి నవీన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే బాధిత విద్యార్థిని, ఆమె కుటుంబాన్ని బెదరిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ ఉంది. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలడుతుంటుంది. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో గురువారం (అక్టోబర్ 16) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడుగంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక బుధవారం (అక్టోబర్ 15) శ్రీవారిని మొత్తం 75 వేల 919 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 218 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 79 లక్షల రూపాయలు వచ్చింది.  

సురక్షా యాప్‌తో స్కాన్ చేశాకే మద్యం విక్రయాలు : సీఎం చంద్రబాబు

  రాష్ట్రంలో ఏపీ ఎక్సైజ్ శాఖ రూపోందించిన సురక్షా యాప్ ద్వారా బార్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వినియోగదారులు మద్యం బాటిళ్లపై బార్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాతే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం ఆర్టీజీఎస్ లో నిర్వహించిన సమీక్షలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతంలో మద్యం దుకాణాలను డిజిటలైజ్ చేయలేదని అందుకే క్రిమినల్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని సీఎం అన్నారు.  నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నించారని అన్నారు. బిచ్చగాడు చనిపోయినా దానిని మద్యం కేసుగా మలిచే ప్రయత్నం చేశారని సీఎం ఆక్షేపించారు. మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తులు దీనిని రాజకీయం చేసి గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడ్డారని అన్నారు. గతంలో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారించారన్నారు. రాష్ట్రంలో బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు చేసేందుకు ప్రయత్నిస్తే పీడీ యాక్టు ద్వారా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అవసరమైతే దీని కోసం చట్టాన్ని కూడా సవరించడానికి సిద్ధం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బెల్టు దుకాణాల నిర్వహణలో ఏ పార్టీ వారున్నా వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు.  రాష్ట్రవ్యాప్తంగా బార్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేసేలా అవగాహన పెంచాలని సీఎం సూచించారు. స్కాన్ చేసిన వెంటనే వివరాలు తెలిసేలా డిజిటల్ బోర్డును కూడా మద్యం దుకాణంలో  వద్ద ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. బాటిల్ ధర, నాణ్యత, తయారీ వివరాలు తెలిసేలా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి తావులేకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.  త్వరలో బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తో స్కాన్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెల 13 తేదీ నుంచి సురక్షాయాప్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను ఇప్పటి వరకూ 27 వేల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ యాప్ ద్వారా 53,430 మంది మద్యం బాటిల్లను స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేశారని తెలిపారు.  ఇందులో 50,394 బాటిళ్లకు సంబంధించిన వివరాలు అక్కడికక్కడే కొనుగోలుదారులకు తెలిశాయని వివరించారు. 1348 మంది సరైన సమాచారాన్ని ఎంటర్ చేయకపోవటంతో ఇబ్బందులు వచ్చాయని పేర్కోన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని  1248 మంది స్కాన్ చేసినట్టు అధికారులు వివరించారు. లొకేషన్ ఆధారంగా వీటిని గుర్తించామని సీఎంకు తెలిపారు.  యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో  ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదని అధికారులు సీఎంకు వివరించారు.  దీనిపై స్పందించిన సీఎం మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే బీర్ బాటిళ్లకు కూడా బార్ కోడ్ ను పెట్టాలని సూచించారు. ఈ యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఎక్కడా నకిలీ మద్యం లేకుండా చేయాలన్నారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.  

భారత్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్

  కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్‌ ఎంపికైంది. 2030లో భారత్ వేదికగా జరిగే ఈ క్రీడాలు గుజరాత్‌లోని  అహ్మదాబాద్ నగరాన్ని ఎంపిక చేస్తూ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. నవంబర్‌ 26న జరిగే బోర్డు జనరల్‌ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.2030 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబుజా సైతం పోటీ పడుతోంది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మాత్రం అహ్మదాబాద్‌ను సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది. 2010లో భారత్ తొలిసారిగా కామన్‌వెల్త్ గేమ్స్‌కు అతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఇటీవల ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషా, గుజరాత్‌ ప్రభుత్వంతో కలిసి కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌  చీఫ్‌ క్రిస్‌ జెంకిన్స్‌కు ప్రతిపాదనలు పంపారు.ఆ ప్రతిపాదనల్లో అహ్మదాబాద్‌ను  ప్రధాన హోస్ట్‌ సిటీగా, భువనేశ్వర్‌ మరియు న్యూఢిల్లీని సపోర్టింగ్‌ సిటీలుగా సూచించారు. ఆగస్ట్‌ 13న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక జనరల్‌ మీటింగ్‌ లో ఏకగ్రీవంగా కామన్‌వెల్త్‌ బిడ్‌కి ఆమోదం తెలిపింది. అనంతరం ఆగస్ట్‌ 27న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కూడా బిడ్‌ సమర్పణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.యూత్‌ అఫైర్స్‌, స్పోర్ట్స్‌ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు, ఆగస్ట్‌ 31 చివరి తేదీకి ముందు ఐఓఏ అధికారికంగా బిడ్‌ దాఖలు చేసింది.  

పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

   రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. బుధవారం  సచివాలయంలో  ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్   పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని భారీ బహిరంగ సభకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు

  జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. జీఎస్టీ సంస్కరణల నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని పండుగలా జరుపుతోంది. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు రూ. 8 వేల కోట్ల మేర భారం తగ్గుతుందని ఓ అంచనా. ఈ క్రమంలో ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు.  అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్లి జ్యోతిర్లింగ మూర్తి శివుణ్ణి, శక్తిపీఠంలో కొలువైన భ్రమరాంబిక దేవిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 2024 ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏపీలో ప్రధాని విశాఖ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. గురువారం రాయలసీమ ప్రాంతంలో ప్రధాని పర్యటన జరగనుంది. జీఎస్టీ సంస్కరణలపై భారీ ప్రచారం... సభకు భారీ ఏర్పాట్లు జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ప్రచారంలో భాగమైంది. మండల స్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణలపై కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ విద్యా సంస్థల్లో కూడా జీఎస్టీ సంస్కరణలపై రకరకాల పోటీలు నిర్వహించారు.  వినియోగదారులకు జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లబ్దిని ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా... కూటమికి చెందిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. యోగా డే సందర్భంగా ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రచారం చేపట్టిందో... ఇప్పుడు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.  మండలాల వారీగా, జిల్లాల వారీగా జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని మరీ జీఎస్టీ సంస్కరణలపై ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమికి చెందిన మూడు పార్టీలు చేపట్టాయి. ప్రస్తుతానికి 90 వేలకు పైగా ఈవెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన క్రమంలో కర్నూలులో ప్రధాని హజరు కానున్న భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.  వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. గత 15 రోజుల నుంచి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిరంతరం కర్నూలు సభను మానిటర్ చేస్తున్నారు.  సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం మొదులుకుని... పార్కింగ్, సభలో సీటింగ్ ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా... అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా. లక్షలాది సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గ ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు.  సభకు వచ్చే వారికి ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే భారీ బందోబస్తు చేశారు. సుమారు 1800 మంది బలగాలతో ప్రధాని సభకు బందోబస్తు పెడుతున్నారు. ఇక ట్రాఫిక్ జాంలు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టారు. ముఖ్యమంత్రి మానిటరింగ్... మంత్రుల మకాం ఇక ప్రధాని పర్యటనను సూపర్ సక్సెస్ చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు.  సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు శ్రీశైల క్షేత్రాన్ని ప్రధాని సందర్శిస్తుండటంతో ఆ దేవాలయంలో ఏర్పాట్లను.. ప్రధాని దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాలో మంత్రులు దాదాపు వారం రోజుల నుంచి మకాం వేశారు. సభ ఏర్పాట్లపై దగ్గరుండి పర్యవేక్షించారు. శాఖల వారీగా బాధ్యతలు పంచుకుంటూ.. సమిష్టిగా సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించుకుంటూ వారం రోజుల నుంచి కర్నూలులోనే ఉన్నారు మంత్రులు. రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ. 13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా.. ఓ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు ప్రధాని. రూ. 9449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తుండగా... రూ. 1704 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇక రూ. 2276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల వివరాలివి: విద్యుత్ ట్రాన్సమిషన్ వ్యవస్థకు – శంకుస్థాపన – రూ. 2886 కోట్లు ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ – శంకుస్థాపన - రూ. 4922 కోట్లు కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – శంకుస్థాపన - రూ. 493 కోట్లు పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ – శంకుస్థాపన - రూ. 184 కోట్లు సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి -శంకుస్థాపన - రూ. 964 కోట్లు రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు ప్రారంభం - రూ. 82 కోట్లు కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు ప్రారంభం – రూ. 286 కోట్లు కనిగిరి బైపాస్ రోడ్ ప్రారంభం - రూ. 70 కోట్లు గుడివాడ-నూజెండ్ల వద్ద 4-లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రారంభం – రూ. 98 కోట్లు కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు ప్రారంభం – రూ. 13 కోట్లు పీలేరు నుండి కలసూర్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రోడ్ ప్రారంభం - రూ. 593 కోట్లు నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రారంభం - రూ. 362 కోట్లు చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం – రూ. 200 కోట్లు కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులను జాతికి అంకితం – రూ. 546 కోట్లు శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ జాతికి అంకితం - రూ. 1730 కోట్లు ప్రధాని పర్యటన ఇలా... ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుని అక్కడి నుంచి శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభకు చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని హెలీకాప్టర్ ద్వారా కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.  

కర్నూల్‌ పర్యటనపై ప్రధాని స్పెషల్ ట్వీట్

  భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు కర్నూల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  అచ్చమైన తెలుగులో ఈ ట్వీట్ పెట్టడం విశేషం.ఆంధ్రప్రదేశ్‌లో ‘రేపు(అక్టోబర్ 16)వ తేదీన పర్యటిస్తాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.  కాగా రేపు ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ విమానశ్రయం నుంచి బయల్దేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలంకు చేరుకుంటారు.  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా నంద్యాల ఎస్సీ సునిల్ షెరాన్ ఆధ్వర్యంలో శ్రీశైలం మొత్తం గ్రేహౌండ్స్ పోలీస్ పార్టీలు శ్రీశైలం అడవులను జల్లెడ పట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  దర్శనం అనంతరం కర్నూలుకు ప్రధాని చేరుకుని నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.13,429 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిఎస్టి 2.0 సంస్కరణలు,వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు.   

గూగుల్‌లో జగన్ గుట్టు...అందుకే అసూయ : సోమిరెడ్డి

  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు గూగూల్ రావడాన్ని వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు .విశాఖలో గూగుల్‌  ఏఐ హబ్‌ స్థాపనను అందరూ స్వాగతిస్తుంటే, వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. గూగుల్‌పై జగన్, ఆయన బృందానికి ఎందుకింత కడుపుమంట అని ప్రశ్నించారు.  నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, “గూగుల్‌లో 6093 అని టైప్ చేస్తే జగన్ రెడ్డి జైలు చరిత్ర బయటపడుతుంది” అంటూ సెటైర్లు గుప్పించారు. గూగుల్ టేకవుట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుకున్న వారిని సీబీఐ గుర్తించిందని పేర్కొన్నారు.“జగన్ అండ్ కో చేసిన అవినీతి గుట్టు గూగుల్‌ రట్టు చేసింది కాబట్టే, ఇప్పుడు వాళ్లకు గూగుల్‌పై కోపం పెరిగింది. రాజా ఆఫ్ కరప్షన్ అని సెర్చ్‌ చేస్తే కూడా గూగుల్ జగన్ చరిత్రనే చూపిస్తుంది” అంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. తండ్రి పేరును వాడుకుని వేల కోట్ల అవినీతి చేసిన చరిత్ర బయటపడుతుందనే భయంతో వైసీపీ నేతలు మండిపోతున్నారని విమర్శించారు.  రూ.1.33 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ ఏఐ హబ్‌ రావడం గొప్ప విషయం అని, ఇది రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు కృషితోనే కొత్త రాష్ట్రమైన ఏపీ ఈ ఘనతను సాధించిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తుంటే జగన్ మీడియాలో ఒక్క వార్త లేకపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. ఇంత కడుపుమంటతో రగిలిపోయే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకోవాల్సివచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని కలలు కనడం మరింత దుర్మార్గమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.  

రేపు అగ్రనేత ఆశన్న టీం లొంగుబాటు

  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు @రూ పేశ్ @తక్కళ్లపల్లి వాసుదేవరావు నేతృత్వంలో వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లు జగ్గల్పూర్ నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. తమ ఆయుధాలను సైతం అప్పగించేం దుకు సిద్ధమయ్యారు. ఈ బృందం లో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే జగ్దల్ పూర్ చేరుకున్నా రని, రేపు నిర్వ హించే లొంగుబాటు సభకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలి లో జరిగిన ఒక సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో పాలిట్బ్యూరో సభ్యుడు అభయ్ @సోనూ @భూపతి @మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో 60 మంది మావోయి స్టులు తమ ఆయు ధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇక రేపు ఆశలతో పాటు మరి కొంతమంది మావోయిస్టులు లొంగిపోనున్నారు వరుసగా మావో యిస్టులు లొంగిపోతూ ఉండడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేగింది... ఇది ఏమైనాప్పటికీ మావోయిస్టులు అందులో అగ్ర నేతలు.... ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోతూ జనజీవనంలో కలిసిపోయేందుకు ముందుకు వస్తున్నారు.  

బీసీ బంద్‌కు మద్దతు ప్రకటించిన కేటీఆర్

  అక్టోబర్ 18న బీసీ సంఘాలు నిర్వహించే రాష్ట్రబంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ భ‌వ‌న్‌లో బీసీ జేఏసీ అధ్య‌క్షుడు ఆర్ కృష్ణ‌య్య‌ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మాదిరే సమస్యను ఢిల్లీ  దాకా తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఓటు వేసేది తమ ఎంపీలేనన్నారు. ‘‘ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే చాయ్ తాగినంతసేపట్లో రిజర్వేషన్లు వస్తాయి. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుంది.లోక్ సభలో బిల్లు పెడితే కచ్చితంగా అనుకూలంగా పాస్ అవుతుంది.  బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తాం. ప్రధాని స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి ఉంటే మంచిది’’ అని కేటీఆర్‌ వెల్లడించారు. మరోవైపు బీసీ సంఘాల బంద్‌కు పెరుగుతుంది. బీజేపీ చీఫ్ రామ్‌చందర్‌రావు మద్దతు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బీసీల బంద్‌కు మద్దతు తెలిపారు.

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ

  దేశ ప్రధాని నరేంద్ర మోడీ  ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో మొదటిసారి  శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శించుకోనున్నారు. ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన సంబంధించి కర్నూలు నంద్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.  జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోడీ పాల్గొన్ననున్నారు. కర్నూల్ నగర శివారులోని నన్నూరు టోల్గేట్ వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సభలో ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్, రాష్ట్ర మంత్రులు పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 7300 మంది పోలీసులతో పాటు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 7.50 గంటలకు డిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలంకు చేరుకుంటారు.  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా నంద్యాల ఎస్సీ సునిల్ షెరాన్ ఆధ్వర్యంలో శ్రీశైలం మొత్తం గ్రేహౌండ్స్ పోలీస్ పార్టీలు శ్రీశైలం అడవులను జల్లెడ పట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  దర్శనం అనంతరం కర్నూలుకు ప్రధాని చేరుకుని నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 13,429 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిఎస్టి 2.0 సంస్కరణలు,వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశం నిర్వహించారు.  మోడీ పర్యటనను సక్సెస్ చేసేందుకు జిల్లా టిడిపి నాయకులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మోడీ సభకు మూడు లక్షల మందిని తరలించేందుకు జిల్లా టిడిపి నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటిసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా కూటమి నాయకులు, జిల్లా యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోడీ పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పారిశ్రామికంగా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందినందుకు ప్రధాని మోడీ ఎలాంటి వరాలు ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి కన్నుమూత

  తెలుగు తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి అనారోగ్యంతో కన్నుమూత మూశారు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆరేళ్ల వయసులోనే పాటల ప్రపంచంలో అడుగుపెట్టిన బాల సరస్వతి, తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2,000కి పైగా పాటలు పాడారు.1939లో విడుదలైన ‘మహానంద’ చిత్రంతో తెలుగులో తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితమయ్యారు.  సతీ అనసూయ’ చిత్రంలోని తొలి పాటతో తెరపైన సువర్ణ అధ్యాయం ప్రారంభించిన బాల సరస్వతి, 1930 నుంచి 1960 దశకాల వరకూ ఎన్నో మధుర గీతాలు ఆలపించి, కొన్ని చిత్రాల్లో నటించి కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె స్వరాలు తెలుగు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగులో షావుకారు, పిచ్చి పుల్లయ్య వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. బాలసరస్వతి దేవి  మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన చెందారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.