నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున అందిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ పర్యటన చేస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హైకమిషనర్ మంత్రి లోకేష్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..  స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వరకూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్  అక్కడ  విశ్వవిద్యాలయాలను సందర్శించి అక్కడ అనుసరిస్తున్న  విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.  పర్యటనలో భాగంగా లోకేశ్ ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు.  అలాగే, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. అదే విధంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరపడంతో పాటు మెల్‌బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను పరిశీలిస్తారు. ఈ నెల‌ 19న సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో  కూడా లోకేష్ పాల్గొంటారు.  24 రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్రశాంతంగా తెలంగాణ బంద్.. ర్యాలీలో జారిపడిన వీహెచ్

బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) జరుగుతున్న తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలూ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా బంద్ లో పాల్గొన్నాయి. ఇక బంద్ సందర్భంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆమె తన నివాసం నుంచి ఆటోలో ఖైరతాబాద్ చౌరస్తా వరకూ వచ్చి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఇక అంబర్ పేటలో బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహననుమంతరావు జారి పడ్డారు.  బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో  పాల్గొన్న వీహెచ్ ఫెక్సీ పట్టుకుని నడుస్తుండగా అంబర్ పేట వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనను లేవదీసి సపర్యలు చేశారు. అనంతరం ఆయన యథావిధిగా ర్యాలీలో పాల్గొన్నారు.  

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పౌరులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని  తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను 2016లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల కారణంగా బాధితుడు ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ 2016లో ఫిర్యాదు చేస్తే, ఇన్నేళ్లయినా ఆ కేసులో తుది నివేదిక దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఉదహరిస్తూ న్యాయమూర్తి  ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడి చేశారు. మేము జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు నమోదు చేయలేదన్నారు.  జయపాల్ కేసులో కర్నూలు ఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన తర్వాతే, ఈ నెల 14న పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

      గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన పంజాబ్‌లో  సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో  శనివారం చోటుచేసుకుంది.  అమృత్‌సర్ నుంచి సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు   అంబాలాకు అర కిలోమీటరు దూరంలో ఉండగా, ఒక బోగీ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని సిబ్బంది, ప్రయాణికులు గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. ప్రయాణికులు వెంటనే కిందకి దిగిపోయారు. ఈ సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులను సకాలంలో రైలు నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.  అయితే మూడు బోగీలు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదకారణాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు.  ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది.  

బీసీ సంఘాల తెలంగాణ బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు

బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) తెలంగాణ బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్న తెలంగాణ బంద్ కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉదయం నుంచీ బస్సులన్నీ డీపోలకే పరిమితమైపోయాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.   కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము చేయాల్సినన్నీ చేస్తున్నామని ..బంద్‌కు మా మద్దతు ఉంటుందని ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ కూడా బంద్ కు మద్దతు తెలిపింది. ఇక ఈ బంద్ కు నేతృత్వం వహిస్తున్న బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ వేదికకు కన్వీర్ సాక్షాత్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్యే  కావడంతో బీజేపీ కూడా బంద్ ను సమర్శించినట్లే అయ్యింది.    

చిట్టీల పేరుతో రూ.150 కోట్లకు టోకరా.. డాక్టర్ దంపతుల నిర్వాకం

చిట్టీల పేరుతో జనాలను 150 కోట్ల రూపాయలకు మోసం చేసిన డాక్టర్ దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరుకు ఇద్దరూ వైద్యులే అయినా.. ఆ వృత్తితోనే నమ్మించి జనాలను నిలువునా ముంచేశారు. హైదరాబాద్ నిజాంపేట బండారీ కాలనీ లే ఔట్ లో క్లినిక్ ఏర్పాటు చేసిన డాక్టర్ రేష్మ, డాక్టర్ అలీ దంపతులు.. చిట్టీల పేరుతో దాదాపు వంద మందిని దగా చేసి 150 కోట్ల రూపాయలు దండుకుని బిచాణా ఎత్తేశారు.    చిట్టీల కాలపరిమితి పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు క్లినిక్ కు వచ్చారు. అయితే అప్పటికే ఈ కిలాడీ దంపతులు బిచాణా ఎత్తేశారు. దీంతో నిలువునా ముంచేశారని గ్రహించిన  బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వైద్య జంటపై ఇప్పటి వరకూ 42 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఈ కిలాడీ జంట బాధితుల సంఖ్య భారీగానే ఉంటుందని అంటున్నారు. చిట్టీల పేరుతో ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి పది లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలడుతుంటుంది. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పొటెత్తుతుంటారు. అటువంటి తిరుమల క్షేత్రంలో శనివారం (అక్టోబర్ 18) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం (అక్టోబర్ 17) శ్రీవారిని మొత్తం 66 వేల 675మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 681 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది.  

చరమాంకంలో మావోయిస్టు తీవ్రవాదం.. మోడీ

దేశంలో మావోయిస్టు తీవ్రవాదం చరమాంకంలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ముందుగా చెప్పినట్లుగానే వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ నక్సల్ విముక్త దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కు మావోయిస్టు తీవ్రవాద పీడ పూర్తిగా తొలగిపోతుందన్నారు.  ఢిల్లీలో శుక్రవారం (అక్టోబర్ 17) జరిగిన ఎన్డీటీవీ   వరల్డ్ సమ్మిట్‌లో మోడీ మాట్లాడారు.  దశాబ్దాలుగా దేశ అభివృద్ధికి మావోయిజం  శాపంగా మారిందన్న ఆయన.. గత కొన్నేళ్లుగా దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి శకం మొదలైందన్నారు. ఈ ఫలితమే.. కేవలం 72 గంటల వ్యవధిలో 303 మంది మావోయిస్టుల లొంగుబాటు అని మోడీ పేర్కొన్నారు.  వారంతా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని విశ్వసించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. గత కాంగ్రెస్ హయాంలో 'అర్బన్ నక్సల్స్  మావోయిస్టుల ఘోరాలను కప్పిపుచ్చారన్న ప్రధాని.. ఇటీవల మావోయిస్టు బాధితులు ఢిల్లీకి వచ్చి తమ గోడును వినిపించుకోవడానికి ఏడు రోజుల పాటు ప్రయత్నించారని, కొందరు కాళ్లు, చేతులు కోల్పోయిన పేద రైతులు, గిరిజనులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ గొంతును ప్రజలకు చేర్చమని వేడుకున్నారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా మావోయిస్టుల దాడుల వల్ల ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో 125 జిల్లాలలో  మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదనీ, ఇప్పుడు వారి ప్రాబల్యం కేవలం 11 జిల్లాలకు పరిమితమైందన్న మోడీ.. వాటిలో కూడా మావోయిస్టుల బలం ఎక్కువగా ఉన్న జిల్లాలు మూడంటే మూడేనని చెప్పారు.   అభివృద్ధి, భద్రతల తమ ప్రభుత్వానికి సమ ప్రాధాన్యతాంశాలన్న ప్రధాని మోడీ  మావోయిస్టుల కంచుకోట బస్తర్‌లో గిరిజనులు ఇప్పుడు 'బస్తర్ ఒలింపిక్స్' నిర్వహిస్తుండటమే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నిదర్శనంగా అభివర్ణించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈఏడాది  దీపావళిని ప్రజలు నిర్భయంగా, ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకుంటారని మోడీ అన్నారు.  

టీవీకే విజయ్ కరూర్ పర్యటన వాయిదా.. ఎందుకంటే?

తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్   కరూర్ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఆయన శుక్రవారం (అక్టోబర్ 17)న కరూర్ లో పర్యటించి గత నెల 27న టవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులను పరామర్శించాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో విజయ్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇంతకీ ఆయన పర్యటన వాయిదాకు కారణమేంటంటే.. 41 మంది మరణానికి కారణమైన కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేపట్టింది.  సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా శుక్రవారమే (అక్టోబర్ 17) కరూర్ చేరుకున్నారు.  ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్  సీబీఐ అదనపు డీఎస్పీలు ముఖేష్ కుమార్,  రామకృష్ణన్‌ దర్యాప్తులో భాగంగా  కరూర్ చేరుకున్నారు. వీరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తారు. అలాగే కరూర్ సభ సందర్భంగా భద్రత, రద్దీ నియంత్రణలో వైఫల్యాలు, తమిళనాడు పోలీసులు మంజూరు చేసిన అనుమతులను తొక్కిసలాటకు సంబంధించిన సీసీ ఫుటేజీలు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తునకు ఆటంకం కలిగించవద్దన్న ఉద్దేశంతో టీవీకే అధినేత విజయ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.  

బిగ్ బాస్ షో పై ఫిర్యాదు.. హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక

టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, షోకు ఎంపిక అయిన వారిలో కొందరికి సమాజంలో విలువ లేదనీ వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   బిగ్ బాస్ బృందం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటోందని  ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని   అభ్యంతరాలు లేవనెత్తారు. సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ బ్యాన్ చెయ్యాలన్నారు.  

బంద్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం.. డీజీపీ హెచ్చరిక

బీసీ సంఘాలు శనివారం నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గానీ పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షణ చేస్తాయన్నారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలు  ఎదురవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

శ్రీవారికి కొప్పెర హుండీ కానుక

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు అనేక రకాలుగా కానుకలు సమర్పించుకుంటారు.   ధనం.. బంగారం.. వెండి.. ఇంకా అనేకంగా ముడుపులు కట్టి భక్తితో సమర్పించుకుంటారు. అయితే తిరపతి సమీపంలోని కొప్పెర‌వాండ్లప‌ల్లె కొప్పెర వంశస్థలు మాత్రం శ్రీవారికి హుండీ సమర్పించడం  వంశపారపర్యంగా వస్తున్న ఆచారం.  అందులో భాగంగానే శ్రీవారికి శుక్రవారం (అక్టోబర్ 17) కొప్పెర హుండీ విరాళంగా అందించారు.   కొప్పెర‌వాండ్లప‌ల్లెకు చెందిన  కొప్పెర సాయిసురేష్‌ ఈ   హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందజేశారు. రాగి, ఇత్తడితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 70 కిలోలు ఉంటుంది.  దీని విలువ రెండున్నర లక్షల రూపాయలు ఉంటుంది. 1821 నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి తమ వంశస్థులు కొప్పెరహుండీలను కానుకగా సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఈ కొప్పెర హుండీ తయారీకి 20 రోజులు పడుతుంది.  

లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలవడం : మావోయిస్టు అగ్రనేత ఆశన్న

చతిస్ గఢ్  సీఎం ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు,   చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో  జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో  పాల్పడ్డ కీలక పాత్రధారి, సూత్రధారి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నఅలియాస్ రూపేష్  లొంగిపోయాడు.  ఆయనతో పాటు 208 మంది లొంగిపోయినట్లు  అధికారులు ప్రకటించారు.  మావోయిస్టు అగ్రనేత ఆశన్న అలియాస్ రూపేష్ లొంగుబాటు చరిత్రలోనే అతిపెద్ద  లొంగుబాటుగా చెప్పవచ్చు.  దేశ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో  ఇదో కీలక మలుపు అంటున్నారు విశ్లేషకులు.  దశాబ్దాలుగా అడవుల్లో ఆయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్..  తన అనుచరులతో కలిసి చత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయాడు. గన్ను వదిలి రాజ్యాంగాన్ని చేపట్టడానికి మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న నిర్ణయించుకోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. వనం వదిలి ఆయన జనం బాట పట్టారు.  ఆయనతో కలిసి  మొత్తం 208 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో మహిళలు 110 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. లొంగిపోయిన వారు 153 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వీరందరిపై కలిపి  సుమారు 8 కోట్ల రూపాయల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఇలా ఉండగా తన లొంగుబాటు సందర్భంగా ప్రసంగించిన ఆశన్న.. తమది లొంగుబాటు కాదని చెప్పారు. తాము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన  తన సహచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగం హృద్యంగా ఉంది.  అనివార్య పరిస్థితుల్లో   ఆయుధాలను వదిలిపెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. ఎవరికి వారే తమ తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం కానీ మన పంథాను మరచిపోవడం లేదు, జనజీవన స్రవంతిలో కలిసి  ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆశన్న ఉద్ఘాటించారు. సహచరులంతా ఎక్కడ ఉన్నారో అక్కడే లొంగిపోవడం మంచిదని సూచించారు. ఎవరైనా లొంగిపోదామని భావిస్తే తనను సంప్రదించాలన్నారు.  ఇది లొంగుబాటు కాదు, జనజీవన స్రవంతిలో కలవడమన్న మాటను  ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పిన ఆశన్న.. ఉద్యమంలో అమరులైన సహచరులకు ఆయన ఈ సందర్భంగా జోహార్లు చెప్పారు.  ఆయన ప్రసంగం విన్న మావోయిస్టు క్యాడర్ కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉన్నారనీ, ఆ తరువాత వారి కళ్లు చెమ్మగిల్లాయని అక్కడున్న అధికారులు తెలిపారు. ఆయన మాటలు విన్న మావోయిస్టు కేడర్లు క్షణకాలం నిశ్శబ్దంగా నిలబడి కంటతడి పెట్టారని అక్కడున్న అధికారులు తెలిపారు. ఇలా ఉండగా శుక్రవారం ఛత్తీస్ గఢ్ సీఎం సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులలో  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ రూపేష్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజ్ మాన్ మండవి, సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు రాజు సలాం,  వెట్టి అలియాస్ సంతు, సీనియర్ డివిజనల్ కమాండర్‌ రతన్ ఇలాం, రీజనల్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.   ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి కేంద్ర, జోన్, రీజనల్ స్థాయి నాయకులు లొంగిపోవడం భారత మావోయిస్టు చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఇది శాంతి పథకానికి గొప్ప విజయంగా అభివర్ణించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.  భారత మావోయిస్టు ఉద్యమంలో ఒకే సారి రెండు వందల మందికి పైగా లొంగిపోవడం ఇదే మొదటిసారన్న ఆయన..  ఇది కేవలం ఒక సాంఘిక పరిణామం మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న  హింసా మార్గానికి ముగింపు సంకేతమని చెప్పారు.  రూపేష్ లొంగుబాటు దేశ మావోయిస్టు ఉద్యమానికి కొత్త దశను తెరిచింది. “ఇది లొంగుబాటు కాదు — ప్రజలతో కలిసిపోవడం” అనే రూపేష్ మాటలు ప్రస్తుతం చత్తీస్‌గఢ్ అడవుల్లో మారుమ్రోగు తున్నాయి.ఈ పరిణామం శాంతి వైపు మావోయిస్టు ఉద్యమం మెల్లగా మలుపు తీసుకుం టున్న సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంస్కరణలు భవిష్యత్ ను మారుస్తాయి.. చంద్రబాబు

భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.   ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించి వారితో కొద్ది సేపు ముచ్చటించారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయనీ,  దీని వల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇచ్చినట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని చంద్రబాబు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై వ్యాసరచన. పెయింటింగ్,  వక్తృత్వ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి నందుకు ఆయన వారినిఅభినందించారు. 

బ‌రితెగించ‌డ‌మే బిగ్ బాస్ ఎంట్రీకి అర్హతా!?

ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రైతే సోష‌ల్ మీడియా మీద ఏదో ఒక చెడు వ్య‌వ‌హారంలో బ‌రితెగిస్తారో.. వారికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల‌భిస్తోంది.. అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఈ విష‌యంపై సీపీఐ నారాయ‌ణ ఎప్ప‌టి నుంచో కామెంట్లు చేస్తున్నారు. ఇదొక చెత్త ప్రొగ్రాం దీన్ని బ‌హిష్క‌రించాల‌న్నట్టుగా ఆయ‌న మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాదా సీదా మ‌నుషుల నుంచి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయ్. అదేంటో చూస్తే.. ఒక మాధురి, మ‌రో ప‌చ్చ‌ళ్ల అలేఖ్య చిట్టీ.. వంటి వారి  ఎంట్రీలో అస‌లు అర్ధ‌మే లేదంటున్నారు వీరంతా.  మాధురి ఎవ‌రు? ఆమె ఒక బ‌రితెగించిన మ‌హిళ‌. భ‌ర్త‌ ముగ్గురు పిల్లలు ఉండగా,  మ‌రొకరితో సహజీవనం చేస్తూ ఆధునిక ఆద‌ర్శ దాంప‌త్యానికి అస‌లైన కేరాఫ్ అడ్రెస్ అన్న‌ట్టు పోజులు కొడుతున్నారు. అలాంటి ఆమెను బిగ్ బాస్ లోకి పిల‌వ‌డం ద్వారా ఈ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్న‌ట్టు? అని నిల‌దీస్తున్నారు కొంద‌రు. ఇక అలేఖ్య చిట్టీ.. వ్య‌వ‌హారం. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌మంతా చూసింది అ పికిల్ సిస్ట‌ర్స్ పిచ్చి చేష్ట‌లు. వీరు క‌స్ట‌మ‌ర్స్ తో బిహేవ్ చేసే విధానం ఎంత ఫాల్తు లాంగ్వేజీలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అలాంటి వీరిని బిగ్ బాస్ లోకి పంప‌డం వ‌ల్ల ఏం తెలుస్తుందంటే.. ఇలాగే వ‌ల్గ‌ర్ గా బిహేవ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చు క‌దాని. ఇత‌రులు కూడా ఇలాగే చేయ‌డం మొద‌లు పెడతారు.. దీని ద్వారా ఒక్కోసారి కాపురాలు కూలిపోవ‌చ్చు. ఆపై వారి వారి ఉద్యోగ వ్యాపారాలు నాశ‌న‌మై పోవ‌చ్చ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు. కొంద‌రిచ్చే స‌ల‌హా సూచ‌న‌లేంటంటే.. ఇలాంటి వారితో హౌస్  నింప‌డం క‌న్నా ఆయా వ‌ర్గాల్లోని మేథావులను.. హౌస్ కి సెలెక్ట్ చేయ‌డం వ‌ల్ల‌.. వారి మ‌ధ్య సాగే విష‌య పరిజ్ఞానంతో కూడిన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగేలాంటి వాతావ‌ర‌ణం ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ఎంతో మేలు. దీని ద్వారా కొత్త విష‌యాలు మ‌రింతగా తెలుస్తాయి. మ‌రి కొంద‌రికి ఆయా విష‌యాల ప‌ట్ల ఒక అవ‌గాహ‌న అంటూ ఏర్ప‌డుతుంది. ఫ‌ర్ స‌పోజ్ ఒక మాదురి ద్వారా ఏం తెలుస్తుంది? పెళ్ల‌యినా స‌రే, ఇత‌ర పెళ్లైన మ‌గాళ్ల‌తో సహజీవనం చేయడం ఎలా? అన్న‌ది నేర్పించ‌గ‌ల‌రామె. అంతే, అంత‌క‌న్నా మించి ఆమెకు ఏదైనా తెలుసా? ఇక ప‌చ్చ‌ళ్ల అలేఖ్య చిట్టి ప‌రిస్థితి కూడా అంతే. ఆ మాట‌కొస్తే హౌసులో ఉన్న ఇత‌ర‌త్రా కంటెస్టెంట్లు కూడా మేథో సంప‌న్నులేం కాదు.. గాలి వాటానికి కొట్టుకొచ్చిన బాప‌తు. కాబ‌ట్టి వీరు, వీరి మాట‌లు, చేత‌ల‌ను చూసే వారు ఏం నేర్చుకుంటారు? అన్న ప్ర‌శ్న‌కు తలెత్తుతోంది. మ‌రి చూడాలి బిగ్ బాస్ ఈ దిశ‌గా ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

కొడిగడుతున్న నక్సలైట్ ఉద్యమం

దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంత్య దశకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. వరుస ఎన్ కౌంటర్ లలో కీలక నేతలు సహా  వందల మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురు అగ్రనేతల సహా వందల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మావోయిస్టు ఉద్యమానికి ఆయువుపట్టులాంటి ఛత్తీస్ గఢ్ నుంచే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతుండటంతో మావోయిస్టు ఉద్యమం ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లలో కీలక నేతలు హతమవ్వడం,  అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఆయుధాలు అప్పగించి లొంగుబాట పడుతున్నారు. బుధ గురు (అక్టోబర్ 15, 16) వారాలలో ఛత్తీస్ గఢ్ లో మొత్తం  258 మంది మావోలు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చిన వారు సమాజంలో గౌరవంగా బతికేలా సౌకర్యాలు కల్పించి అన్నివిధాలుగా సహకారం అందిస్తామనీ, అలా కాకుండా ఆయుధాలు విసర్జించకుండా పోరాటమే బాట అనే వారిపై చర్యలు తప్పవనీ అమిత్ షా హెచ్చరించారు. ఇలా ఉండగా శుక్రవారం (అక్టోబర్ 17)న   దండకారణ్యం ప్రాంతానికి చెందిన సీనియర్ మావోయిస్టు నేతలు సహా రెండు వందల మంది  ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు.  బస్తర్ లో సీఎం ఛత్తీస్ గఢ్ సమక్షంలో ఆ లొంగుబాటు కార్యక్రమం జరగనుంది. అర్ధ శతాబ్దంగా ప్రభుత్వాలకు పెను సవాల్ గా నిలిచిన మావోయిస్టు  ఉద్యమం ఇప్పుడు కొడిగట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.  ఉద్యమంలోని అంతర్గత విభేదాలు, స్థానిక ప్రజల నుంచి మద్దతు కరువవడం, ప్రభుత్వ నిర్బంధం కూడా మావోయిస్టులు లొంగుబాట పట్టడానికి కారణమని అంటున్నారు.

జగమంత కుటుంబం.. జగమేలిన ఆనందం

తోపుడుబండిపై తిరుగుతూ గ్రామాన్ని పలకరించి పులకరించిన వృద్ధురాలు పూర్తిగా మంచానికే పరిమితమై బతుకు బండి నడిపిస్తున్న ఓ వృద్ధురాలికి.. తన ఊరంతా ఒక సారి చూడాలన్న కోరిక కలిగింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలోనూ ఆమెలో తన ఊరంతటినీ కళ్లారా చూసుకోవాలన్న తపన రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వృద్ధాప్యంలోనూ ఆమెకు ఆ ఊరిపట్ల ఉన్న మమకారానికి ముగ్ధులైన వారు ఆమె కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. అంతే ఓ తోపుడు బండిలో ఆమెను కూర్చోపెట్టి ఊరంతా తిప్పారు. ఇక ఊరు ఊరంతా ఆమెను పలకరిస్తూ, ఆప్యాయంగా మాట్లాడారు. దారి పొడవునా ఆమెను పలకరిస్తూ వెంటనడిచారు. కొన్ని ఇళ్ల ముందు ఆమె తోపుడుబండిని ఆపించి మరీ తన పరిచయస్తులను, ఆత్మీయులను పలకరించారు. ఇక ఊరిలో అందరూ ఆమె దగ్గరకు వచ్చి పలకరించారు. ఇలా దారంతా ఆనందభాష్పాలు రాలుస్తూ ఆమె మధురానుభూతి పొందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపల్లిలో జరిగింది. ఊరిపట్ల అంతులేని మమకారాన్ని పెంచుకుని ముదిమి వయస్సు లోనూ ఊరంతా తోపుడుబండిపై కలియదిరిగిన ఆమె పేరు శ్రీరాముల నర్సమ్మ. ఆమె వయస్సు 90 ఏళ్లు. కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్లు ఇలా ఆత్మీయులంతా వెంటరాగా ఆమె తోపుడుబండిపై కూర్చుని గ్రామమంతా కలియదిరిగి, స్నేహుతులు, బంధువుల ఇళ్ల ముందు ఆగుతూ ఆత్మీయ పలకరింపులు, మధురానుభూతుల నెమరవేతలకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకోవడానికీ, ఆమె కోరిక ఈడేర్చడానికి కుటుంబ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.  గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.