Read more!

హెపటైటిస్ పై అవగాహన చాలా అవసరం!

మానవజీవితాన్ని ప్రస్తుతకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం అనారోగ్యం. ఎన్నో సమస్యలు మనిషిని ఒకపట్టాన ఊపిరితీసుకొనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటిలో కాలేయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. కాలేయానికి వచ్చే సమస్యలలో చివరి వరకు బయటపడకుండా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సమస్య హెపటైటిస్. ప్రపంచ హెపటైటిస్ అవగాహన దినోత్సవంను ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన జరుపుతారు. దాని సందర్భంగా ఈ హెపటైటిస్ గురించి వివరంగా అందరి కోసం.

అసలు హెపటైటిస్ అంటే ఏంటి?

కాలేయం వాపుకు గురయ్యి దాని పరిమాణం పెరిగిపోవడమే హెపటైటిస్ గా వైద్య శాస్త్రంలో చెబుతారు.

మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

దీర్ఘకాలిక మందులు వాడటం వల్ల కాలేయానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అన్నిటికంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు హెపటైటిస్ సమస్యకు కారణమయ్యే అత్యంత సాధారణ సమస్య.

హెపటైటిస్ సమస్యలో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా ఒకటి. ఈ సమస్య కాలేయ కణజాల నిర్మాణానికి ప్రతిరోధకాలను తయారుచేసేటప్పుడు ఎదురయ్యే సమస్య.

హెపటైటిస్ సమస్యను దాని ప్రభావాన్ని, లక్షణాలను అనుసరించి  ఆరోగ్య నిపుణులు అయిదు వర్గాలుగా విభజించారు. వాటిలో హెపటైటిస్ A, B, C, D మరియు E అని ఉన్నాయి. వీటిలో ఒక్కో హెపటైటిస్ సమస్యకు ఒకో వైరస్ కారణమవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా 354 మిలియన్ల ప్రజలు హెపటైటిస్ B, మరియు హెపటైటిస్ C తో బాధపడుతున్నారు. ఇది చాలా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది.

హెపటైటిస్ A అనేది హెపటైటిస్ A అనే వైరస్ వల్ల వస్తుంది. ఇధి తీవ్రమైన సమస్య అయినా చాలా తక్కువకాలం మాత్రమే ఉంటుంది.

హెపటైటిస్ B అనే వైరస్ కారణంగా హెపటైటిస్ B సమస్య వస్తుంది. ఇది చాలా దీర్ఘకాలిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ ప్రజలు దీనివల్ల బాధపడుతున్నారు.

హెపటైటిస్ C అనే వైరస్ వల్ల హెపటైటిస్ సమస్య వస్తుంది. ఇది సాధారణంగా రక్తసంబంధ సమస్యలలో ఒకటి. అయితే దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది.

హెపటైటిస్ D అనేది హెపటైటిస్ B సమస్యతో కలసి వచ్చే సమస్య. ఇది కాలేయ మంటను ఎక్కువగా కలిగిస్తుంది.

హెపటైటిస్ E అనేది హెపటైటిస్ E వైరస్ వల్ల వస్తుంది. ఇది పారిశుద్ధ్యం సరైన విధంగా లేకపోవడం వల్ల అంటే కాలుష్య ప్రాంతాలలో నివసించేవారిలో కనిపిస్తుంది. ఇది సాధారణమైన సమస్యగా అనిపించినా గర్భిణీలలో చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

హెపటైటిస్ లక్షణాలు!

హెపటైటిస్ B మరియు C ఉన్నవాళ్ళలో లక్షణాలు బయటకు కనిపించవు. మిగిలినవి వెంటనే లక్షణాలను కలిగి ఉంటాయి.

అలసట,

జ్వరం,

జలుబు,

మూత్రం రంగు మారటం,

మలం పలుచగా ఉండటం అంటే విరేచనాలు అవుతున్నట్టు.

ఆకలి లేకపోవడం,

పొత్తికడుపు నొప్పి,

చెప్పలేనంతగా బరువు తగ్గిపోవడం,

చర్మం రంగు మారడం (కొందరు ఈ లక్షణం చూసి పచ్చకామెర్లు అనుకుంటారు).


హెపటైటిస్ నిర్ధారణ చేయడానికి వైద్యులు చాలా రకాల పరీక్షలు చేస్తారు.

శారీరక పరీక్ష

రక్త పరీక్షలు

కాలేయ సమస్య పరీక్షలు

బయప్సి 

అల్ట్రా సౌండ్ పరీక్ష 

పైన చెప్పుకున్న పరీక్షల ద్వారా హెపటైటిస్ సమస్యను వైద్యులు నిర్ధారిస్తారు.

హెపటైటిస్ కు దూరంగా ఉండటం ఇలా!

హెపటైటిస్ A కు దూరంగా ఉండటానికి వ్యాక్సిన్ తీసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళవరకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.

వ్యాప్తిని తగ్గించుకోవడం మరొక ముఖ్యమైన జాగ్రత్త. తీసుకునే ద్రవపదార్థాలు, నీరు ఇతర ద్రవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశాన్ని రానివ్వకూడదు.

హెపటైటిస్ A మరియు E సంక్రమించకుండా ఉండటానికి పరిశుభ్రత చాలా ముఖ్యం.

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ నీరు, ఆహారం, చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. హెపటైటిస్ B,C,E వైరస్ లు వీటి ద్వారా ఇన్ఫెక్షన్ సృష్టిస్తాయి.

పైన చెప్పుకున్నట్టు హెపటైటిస్ అనేది బయటకు తెలియకుండా ప్రమాదంగా మారే సమస్య. దాని నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.