ఫోన్లో మాట్లాడే పద్ధతి
posted on Sep 26, 2024 @ 9:30AM
సుదూర ప్రాంతాలలో ఉన్నవారు క్షేమ సమాచారాలు తెలుసుకుని, వారితో కనెక్ట్ అవుతారని గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టారు . అయితే ఫోన్ మాట్లాడేటప్పుడు, ఎటిక్వెట్టే పాటించాలి. Etiquette అంటే సామాజంలో ఒక సమూహంలో మనం ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు. "పో బోడి నియమాలు పాటించడం అంత అవసరమా"అంటే అవసరమే. ఎందుకంటే మీరు ప్రవర్తించే తీరు అటువైపు మీతో మాట్లాడేవారు మీ పట్ల ప్రతికూల దృక్పథంతో చూసే అవకాశం ఉంది. మీ బంధాలు వీగిపోతాయి. ఏంట్రా బాబు ఈ సోది అని మీతో మాట్లాడాలంటే విసుగు చెందే అవకాశం ఉంది. నిజానికి కొన్ని దేశాల్లో చిన్న వయసు నుండే ఇటువంటి మర్యాదలను నేర్పిస్తారు. అందుకే మా అక్క లాంటివారీ కన్నా అక్కడి చిన్నపిల్లలు ఎంతో మెరుగ్గా, మర్యాదగా మాట్లాడుతారు.
ముందుగా ప్రాథమిక మర్యాదల గురించి తెలుసుకుందాం.
1. మొదటి రింగ్ అయినప్పుడే ఫోన్ ఆన్సర్ చెయ్యడానికి ప్రయత్నించండి.
2. నంబర్స్ జాగ్రత్తగా చూసి డయల్ చేయండి.
3. ఒకవేళ రాంగ్ నెంబర్ కు డయల్ చేసినట్టు అయితే, సున్నితంగా మన్నించమని కోరండి.
4. స్పష్టంగా మాట్లాడండి
కొందరు ఫోన్లో సరైన సమాధానం ఇవ్వరు. ఆ.. ఊ ల వరకే పరిమితం అవుతారు. వాళ్ళు అవునన్నారో.. కాదన్నారో తెలియక కన్ఫ్యూజన్.
మరికొందరు అసలు సమాధానమే ఇవ్వరు. మనం ఎంత సేపు మాట్లాడుతున్నా మౌనంగా వింటూ ఉంటారే కానీ బదులు ఇవ్వరు.
5. ఎంత వీలు అయితే అంత తక్కువ సమయం మాట్లాడడానికి ట్రై చేయండి.
6. అవతలి వ్యక్తి అందుబాటులో, ఫ్రీగా ఉన్నారా లేదా అని తరచి చూసి మాట్లాడండి.
మీరు ఖాళీగా ఉన్నారని, అందరూ పని పాటా లేకుండా ఉండరు కదా. వారు తమ నిస్సహాయత ను తెలియజేస్తే, నిండు మనస్సుతో అంగీకరించండి.
7. కాన్ఫరెన్స్ కాల్ చేసేటప్పుడు, అవతలి వ్యక్తి నుండి ముందుగా అనుమతి లేకుండా వేరే వ్యక్తులను కలపకండి. అలాగే మీరు కలపబోయే వ్యక్తికి కూడా కాన్ఫరెన్స్ లో ఎవరెవరు ఉన్నారో సూచించండి.
8. రాంగ్ నెంబర్ లకు మొరటుగా సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ సున్నితంగా చెప్పండి. కొన్ని సార్లు పెద్దవారు, చదువుకోని వారు, ఫోన్ ఎలా వినియోగించాలి అని తెలియని వారు, తప్పు నెంబర్లను అనుకోకుండా డయల్ చేస్తారు. ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వస్తె సున్నితంగా సమాధానం ఇచ్చి, సాధ్యమైతే వారికి సహాయం చెయ్యండి.
9. కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మాట్లాడండి.
మన వాయిస్ గుర్తుపడతారులే అని మీరేదో మాట్లాడితే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక నాలంటోల్లు జుట్టు పీక్కుంటారు.
10. మీరెందుకు ఫోన్ చేశారో గ్రహించి, క్లుప్తంగా, సరళంగా మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పండి.
అంతేగానీ మీకు బోర్ కొడుతుందని ఫోన్ చేసి, గంటలు గంటలు అవతలి వ్యక్తి సమయాన్ని తినకండి. వారు ఫ్రీగా ఉంటే మాట్లాడవచ్చు. అదీ వారి అనుమతితో మాత్రమే. ఇంకొందరు వారు చెప్పాలనుకున్న విషయం కాకుండా అన్నీ చెప్పేసి, అసలు విషయం మర్చిపోతారు. వారికోసం ఈ సలహా.
11. ఒక రెండు సార్లు డయల్ చేశాక ఎదుటివారు ఆన్సర్ ఇవ్వకపోతే, మళ్లీ మళ్లీ అదేపనిగా కాల్ చేయకండి. (అత్యవసరం అయితే తప్పదు)
ఇది నేను ఎక్కువగా ఎదుర్కునే సమస్య. నేను ఫోన్ do not disturb mode పెట్టుకున్నా , ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి, డిస్టర్బ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. అదీ పనికిమాలిన కబుర్లు కోసం.
12. చివరగా.. కాస్త బిగ్గరగా, స్పష్టంగా మాట్లాడండి.
మీలో మీరు గొణుక్కుంటూ మాట్లాడితే అవతలి వ్యక్తి మరోలా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు మీరు తర్టీన్ అని చిన్నగా చెప్పారు అది అవతలి వ్యక్తి కి తర్టి అని అర్థం అవ్వొచ్చు.. మీరు సింధు అని చెప్తే వారు హిందూ అనుకోవచ్చు.. అందుకే స్పష్టత అవసరం.
కొన్ని రకాల ఫోన్ ముచ్చట్లు..ఇది చదివాక నేను చెప్పిన మర్యాదలు మీకే అర్థమవుతుంది.
X: హెల్లో అండి! రాజు గారు ఉన్నారా?
Y: లేరు (డబ్ మని వెంటనే ఫోన్ పెట్టేశారు)
A: అత్తతో నాకు గొడవ అయ్యింది. రెండు రోజుల నుండి మాట్లాడటం లేదు
B: అవునా ఎప్పుడు వెళ్లావ్. నాకూ చెప్తే నేనూ వస్తాగా
A: నేను చెప్పింది విన్నావా?
B: sorry!! ఏం చెప్పావు??!
X: Hello ఎవరూ?
Y: సమత నిద్ర పోయావా?
X: నేను గ్రీష్మ.. ఈ టైంలో ఎవరైనా పడుకుంటారు కదా అండి.. 🥱
A: Hello రాహుల్ మీతో మాట్లాడవచ్చా?
B: ఆ చెప్పండి..
A: మొన్న మీరు రాసిన కథ చదివాను..
B: అది బాలేదు వేరేది తీసుకో (గుసగుసగా).. హా కథల పోటీ ఫలితాలా.. ఎప్పుడు??(గట్టిగా)
ఇలా ఉంటాయి అండి..కొన్ని సంభాషణలు..
అందుకే సభ్యత పాటించి, మన ఫోన్ సంభాషణ మర్యాదగా ఉంచడానికి ప్రయత్నిద్దాం.
◆ వెంకటేష్ పువ్వాడ