మానవత్వం నిలబడాలంటే.. దయ చూపించడానికి మించిన గొప్ప మార్గం ఉందా?

   ఈ సమాజం ప్రశాతంగా ఉండాలంటే ప్రతి మనిషికి కొన్ని గుణాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో ప్రేమ, క్షమ, దయ, జాలి అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కలిగి ఉన్నవారినే మానవత్వం కలిగిన మనుషులు అని కూడా అంటారు.  సమాజంలోని ప్రతి వ్యక్తిలో  దయ, మంచితనాన్ని ప్రోత్సహించడానికి, ఇతరుల పట్ల సానుభూతిని పెంపొందించడానికి, తద్వారా సమాజంలో మంచి  మార్పును తీసుకురావటానికి ఒక ప్రత్యేక రోజును కేటాయించారు.  నవంబర్ 13వ తేదీన వరల్డ్ కైండ్నెస్ డే గా జరుపుకుంటారు. దయ అనే గుణం ప్రతి మనిషిలో ఉన్న ప్రత్యేకమైన  లక్షణం. ఈ గుణం మనలో అభివృద్ధి చెందినంతగా  ఏ జీవిలోనూ వృద్ధి చెందకపోవచ్చు.  అందుకే ఇది మనల్ని  భూమి మీద ఉన్న ఇతర జీవులలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆ సమాజంలో అనుకరణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  పిల్లలు తల్లిదండ్రులను చూసి కొన్ని ఎలాగైతే అనుకరిస్తారో.. సమాజంలో కొందరి ప్రవర్తన చూసి మరికొందరు కూడా అనుకరిస్తారు.  ఈ విధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే గుణాలలో దయ గుణం కూడా ఉండాలన్నది వరల్ట్ కైండ్నెస్ డే ముఖ్య ఉద్దేశం.   దీని ఫలితంగా ప్రజల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి.  ఇతరుల పట్ల దయతో ఉండమని పిల్లలకి చిన్నప్పటినుంచే చెప్తూ ఉంటే, వారిలో ఇది బలంగా మారి మంచి సమాజ నిర్మాణానికి పునాది అవుతుంది. ఒక వైద్యుడు తన రోగుల పట్ల, ఒక అధికారి తన సిబ్బంది పట్ల, ఒక కుటుంబ పెద్ద తనపై ఆధారపడి ఉన్నవారి పట్ల  దయ చూపకపోతే పరిస్థితులు ఎలా  ఉంటాయో ఒక సారి ఊహిస్తే జీవితంలో ఇలాంటి పరిస్థితులు వద్దే వద్దు అనే భావన కలుగుతుంది. మనిషికి మరొక మనిషి మీద ఈ జీవకోటి మీద  దయ లేకపోవడం వల్ల కుటుంబం, వ్యవస్థ, సమాజం మీద చాలా చెడు ప్రభావం పడుతుంది. అదే మన చుట్టూ ఉన్నవారిపై దయతో ఉండటం, ఇతరుల పట్ల నిస్వార్థంగా దయను చూపించడం వల్ల సమాజంలో సామరస్యం పెరుగుతుంది. చిన్న సాయం కూడా ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక చిన్న  చిరునవ్వు కూడా ఎదుటి  వ్యక్తికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి కాస్త ధైర్యం పోగవుతుంది.  ఒకరు సహాయం చేసినప్పుడు, ఇతరులు సైతం దానిని ప్రేరణగా తీసుకుని మరిన్ని మంచిపనులు చేయాలని కోరుకుంటారు. ఈ దయాగుణం పెరగటం వల్ల మనుషులు కుల, మత, ప్రాంత, లింగ భేధాలతో ఒకరికొకరు వేరుపడకుండా..   వారిలో ‘నేను’, ‘మేము’ అనే భావాలు తొలగి, ‘మనం’ అనే విశాల భావం కలుగుతుంది. అప్పుడు ఈ  సమాజంలో అందరూ ఒకరికొకరు సాయంగా ఉంటూ  కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, ఈ భూమి మీద మనకెంత హక్కు ఉందో, మిగతా ప్రాణులకీ అంతే ఉందని గుర్తించి గౌరవిస్తారు. దాంతో  ఈ    ప్రపంచం మరింత అందంగా మారుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా దయ చూపించడానికి మించిన  గొప్ప మార్గం మరొకటి లేదని మర్చిపోకూడదు. చేసే సాయం  చిన్నదైనా , పెద్దదైనా దాని ప్రభావం కచ్చితంగా సమాజం మీద పడుతుంది. ప్రేమ, సహనం, సోదరభావం, పరస్పర గౌరవం, సహకారంతో కూడిన సౌమ్య వాతావరణాన్ని కల్పించడానికి మన రోజువారీ జీవితంలో ఇతరుల పట్ల, ఇబ్బందులలో ఉన్నవారి పట్ల,  జీవకోటి పట్ల దయ చూపించడాన్ని భాగం చేసుకోవాలి.  ఈ ప్రపంచంలో కూడా  బ్రతకడానికి పోరాటం చేస్తూ సహాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారు కోట్లాది మంది ఉన్నారు.  ఇలాంటి వారికి ఎల్లప్పుడూ ఓ అపన్న హస్తం కావాలి.  కేవలం దయా గుణం ఉన్నప్పుడే అపన్న హస్తం అందివ్వడం సాధ్యం అవుతుంది.  అందుకే  తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు,  ఇరుగు పొరుగు,   ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తాము దయా గుణాన్ని పలు సందర్భాలలో వ్యక్తం చేస్తూ పిల్లలకు కూడా దీన్ని అలవాటు చెయ్యాలి. అప్పుడే ఈ ప్రపంచం మానవత్వం కలిగిన మనుషులతో బలపడుతుంది.                            *రూపశ్రీ.

జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే జీవితం నాశనమే..!

  మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తుల్లో  సాధారణంగా  తల్లిదండ్రులు ఉంటారు.  తర్వాత జీవిత భాగస్వామి కూడా అంతే ప్రభావం చూపిస్తారు., వాస్తవానికి ఇంకా ఎక్కువనే చెప్పాలి. మూడొంతుల మీ జీవితం ఎలా ఉండబోతుందనేది   జీవిత భాగస్వామి మీదనే ఆధారపడి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం మీకుండదు,  కానీ మీ జీవిత భాగస్వామి ఎవరనే  నిర్ణయం తీసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది.  ఈ నిర్ణయం జీవితంలో ఎవరికయినా  చాలా ముఖ్యమైనదే అవుతుంది. అందులో ఏమాత్రం పొరపాటు జరిగినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించి మరీ    జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  కొంతమంది తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి, తర్వాత  జీవితాంతం బాధపడుతుంటారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో పొరపాటున కూడా  చేయకూడని కొన్ని తప్పులేంటంటే కుటుంబ సభ్యుల ఒత్తిడి.. సాధారణంగా  పెద్దవాళ్ళు జీవితాంతం తోడుండే మన భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో సహాయపడతారు. కానీ ఒక్కోసారి ఆ పెద్దవాళ్ళ ఒత్తిడివలనే ఒక అమ్మాయైనా లేక అబ్బాయైనా తమకి ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. తర్వాత జీవితాంతం ఇబ్బందిపడుతూ ఉంటారు. తొందరపడి నిర్ణయం తీసుకోవటం.. ఏ మనిషి గురించైనా అర్ధం కావాలంటే  సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి కలిసి మాట్లాడినంత మాత్రాన ఎవరి గురించి ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. కాబట్టి సమయం తీసుకుని ఆ వ్యక్తి మనకి సరిపోతారా? లేదా? అని నిర్ణయించుకోవాలి తప్ప తొందరపడకూడదు. వేర్వేరు సంస్కృతులు కావటం.. వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయిల సంస్కృతుల మధ్య పూర్తి బేధం ఉంటే, వారి వివాహం అయ్యాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంస్కృతి కేవలం వ్యక్తులతో కాకుండా  సమాజంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమాజంవలనే  ఇరువురూ కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని ప్రభావం వివాహ బంధం మీద కూడా పడుతుంది.  ముఖ్యంగా ప్రేమ వివాహాలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక ఆకర్షణ లేకపోవటం.. ఈ సృష్టి గమనానికి ఆడ, మగ మధ్య ఆకర్షణ ఎంత ముఖ్యమో, వివాహ బంధం మరింత బలపడి ముందుకి వెళ్ళటానికి కూడా  భౌతిక ఆకర్షణ ఉండటం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి భౌతిక ఆకర్షణ లేకపోతే ఆ ఆకర్షణ వేరేవైపుకి మళ్లి, జీవితాలు నాశనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఆర్థిక అవసరాల కోసం, పనులు చేసిపెట్టే మనిషి కావాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకునే వారి జీవితంలో ఇలాంటివి కనిపిస్తాయి. నమ్మకం లేకపోవటం.. సమాజంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం నిలబడాలన్నా నమ్మకం ఉండాలి. అదే భార్యాభర్తల మధ్యైతే  ఈ నమ్మకం ఇంకాస్త ఎక్కువే ఉండాలి. జీవిత భాగస్వామి మీద  నమ్మకం లేకపోతే ఆ వివాహబంధంలో ఎవరూ,  ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.   ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండకపోతే ఆ వివాహ  బంధం ఎక్కువ కాలం నిలబడదు.                                            *రూపశ్రీ 

పోలికల వల్ల కలిగే నష్టం ఏమిటి?

మనల్ని ఇంకొక మనిషి నుండి వేరు చేసేవి, ప్రత్యేకంగా ఉంచేవి  ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలకు తగినట్టే వారు పనులు చేస్తారు,దానికి తగ్గట్టుగా జీవిస్తారు. కానీ ఎప్పుడూ మనం ఉన్న స్థితినీ ఉండవలసిన స్థితినీ పోల్చి చూసుకుంటున్నాం. ఉండవలసిన స్థితి అనేది మన మనసు రూప కల్పన చేసినదే. సరిపోల్చి చూసుకోవడం అనేది ఎదురైనప్పుడు వైరుధ్యం వస్తుంది. ఏదో పరాయివస్తువుతో కాదు, నిన్నటి మనతో ఉన్నది, ఈరోజు మనతో ఉన్నదీ రెండింటినీ తరచి చూసుకున్నా అవి మనిషిలో ఎప్పుడూ సంఘర్షణను వెంటబెట్టుకొస్తాయి. పోల్చి చూచుకోవడం అనేది లేనప్పుడు ఉన్నది ఒక్కటే వుంటుంది. అది మనలో మనమే అయినా లేక ఇతరులతో అయినా పోలిక అనేది లేనప్పుడు మనలో ఉన్నది ఒక్కటే మనతో ఉంటుంది.  ఉన్నదానితో జీవించడమే ప్రశాంతంగా వుండడం, అప్పుడు మీరు మీ అంతరంగ స్థితికి మరే పరధ్యాసా లేకుండా పరిపూర్ణ సావధానత యివ్వగలరు. అది నిరాశ అయినా, వికారమయినా, క్రౌర్యం అయినా, భయం అయినా, ఆదుర్దా అయినా, ఒంటరితనం అయినా… ఇట్లా ఏదైనా సరే... దానితోనే పూర్తిగా సహజీవనం చేస్తారు. అప్పుడు వైరుధ్యం లేదు. కనుక సంఘర్షణ కూడా లేదు. కాని, ఎంతసేపు మనం ఇతరులతో మనను పోల్చి చూసుకుంటున్నాం. మనకంటే శ్రీమంతులు, మేధావంతులు, మరింత అనురాగపరులు, ప్రసిద్దులు, ఇలా ఎన్నో రకాలుగా మిన్న అయిన వారితో, 'మిన్న' అవడం మనల్ని నడుపుతుంది. మన జీవితాలలో అది గొప్ప ప్రాధాన్యం అయిపోతుంది. ఏదో ఒకదానితోనో, మనష్యులతోనూ పోల్చి చూసుకోవడం అనేది మనకు సంఘర్షణను తెచ్చి పెడుతున్న  ప్రథమ కారణం. అసలు పోల్చి చూసుకోవడం అనేది ఎందుకు జరుగుతోంది? మరొకళ్ళతో మిమ్మల్ని ఎందుకు పోల్చుకుంటారు? ఈ పని చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నారు కదా... ప్రతి పాఠశాలలోను యిద్దరు పిల్లలకు పోలిక. రెండో వానిలాగ వుండటానికి మొదటివాడు తనను తాను నాశనం చేసుకుంటాడు. అసలు సరిపోల్చి చూసుకోవడం అనేది లేనప్పుడు, ఆదర్శం అంటూ లేనప్పుడు, అవతలి పక్షం అనేది లేనప్పుడు, ద్వంద్వప్రవృత్తి లేనప్పుడు, మీకంటే విభిన్నమయిన వారుగా మీరు కనిపించాలని ప్రయత్నం చేయనప్పుడు మీ మనసు ఏమవుతుంది? మీ మనసు వ్యతిరేకమైన దానిని నిర్మించడం, ఎదురుగా పెట్టడం మానివేస్తుంది. అప్పుడది చాల తెలివిగా, పదునుగా, లలితంగా, అమిత శక్తివంతగా తయారవుతుంది.  ఎందుకంటే ప్రయత్న ప్రయాసల వలన మన గాఢాసక్తి చెదరిపోయి పలచబడుతుంది. జీవసత్త్వమే శక్తివంతమైన లక్షణం. ఈ సత్యం లేకుండా ఏ పని చేయలేరు.  ఇతరులతో పోల్చి చూసుకోవడం అన్నపని లేనప్పుడు, మీరు మీరుగా వుండిపోతారు. పోలిక వల్ల, మీరు పరిణమించాలనుకుంటున్నారు. ఎదగాలనుకుంటున్నారు. మరింత తెలివి కలవారు, సుందరులు అవాలనుకుంటున్నారు. కాని నిజంగా అలా కాగలరా? వాస్తవం ఏమిటంటే  మీరు ఉన్న స్థితి పోల్చి చూచుకోవడం వల్ల మీరు వాస్తవాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు. అది శక్తిని దుర్వినియోగం చేసుకోవడం.  ఎటువంటి పోలికలు లేకుండా, మీ నిజస్థితిని మీరు చూచుకున్నందువల్ల మీకు ఎంతో శక్తి సంపద ఒనగూరుతుంది. పోలికలు లేకుండా మీవంక మీరు చూసుకున్నప్పుడు మనసు తృప్తితో స్తబ్ధమయిపోయిందని కాదు అర్ధం మీరు పోలికలకు అతీతులు అయిపోతారు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవసరమయిన శక్తి,  జీవసత్త్వం ఎలా వృధా అయిపోతుందో మనకు తెలిసివస్తుంది. పోలికలు పెట్టుకోవడం జీవితంలో ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని కుచించుకునేలా చేయడమే అవుతుంది. అందుకే పోలిక మంచిది కానే కాదు.                                       ◆నిశ్శబ్ద.

కుర్రవాళ్లకి నిద్ర ఎందుకు పట్టదు!

పిల్లలు చీకటిపడితే చాలు, బుద్ధిగా పడుకుంటారు. కానీ ఇలా టీనేజిలోకి అడుగుపెడతారే లేదో... రాత్రిళ్లు వీలైనంత మేలుకునే అలవాటు మొదలవుతుంది. ఇంతకీ కుర్రకారుకి రాత్రివేళలు ఎందుకు నిద్రపట్టదు. పగలు పుస్తకమే ముట్టుకోనివారు రాత్రిళ్లు నైట్‌ అవుట్ చేయాలనీ, బండి మీద చక్కర్లు కొట్టాలనీ ఎందుకు ఉవ్విళ్లూరుతారు... అంటే ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో జవాబు దొరికినట్లే కనిపిస్తుంది.   వేల సంవత్సరాల నుంచి వస్తున్న అలవాట్లే, మనం వేర్వేరు సమయాలలో నిద్రపోవడానికి కారణం అవుతున్నాయా! అనే అనుమానంతో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన మొదలుపెట్టారు. ఇందుకోసం టాంజానియాలో ఆటవిక జీవితాన్ని గడుపుతున్న హజ్డా అనే తెగలోని వారిని పరిశీలించారు. వీరు 20 లేదా 30 మంది కలిసి ఓ గుంపుగా ఉంటారు. ఉదయాన్నే లేచి ఆడామగా ఆహారం కోసం బయల్దేరతారు. కొందరు దుంపలు, కాయలు తీసుకువస్తే.... మరికొందరు జంతువులని వేటాడి తీసుకువస్తారు. సాయంత్రం వేళకి అందరూ ఒక చోటకి చేరి, తాము తెచ్చుకున్నది శుభ్రంగా తిని హాయిగా పడుకుంటారు. గడ్డి, కొమ్మలతో నేసిన గుడిసెలలో ఎలాంటి ఫ్యాన్లూ, లైట్లూ లేకుండా హాయిగా నిద్రపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే- వేల సంవత్సరాల క్రితం మప పూర్వీకులు ఎలా జీవించేవారో, హెజ్డా ప్రజలు అదే తీరున జీవిస్తున్నారు.   ఈ హెజ్డాతెగలో 20 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఓ 33 మందిని పరిశోధన కోసం ఎన్నుకొన్నారు. వారి నిద్రను గమనించేందుకు, అభ్యర్థులందరికీ ఓ వాచిలాంటి పరికరాన్ని అమర్చారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తల దిమ్మ తిరిగిపోయింది. వీళ్లలో రాత్రి ఒకో సమయంలో ఒకొక్కరు మెలకువగా ఉన్నారట! మొత్తమ్మీద 33 మందీ ఒకేసారి గాఢంగా నిద్రపోయిన సమయం పట్టుమని 20 నిమిషాలు కూడా లేదు. మెలకువగా ఉండటమో, పొగ తాగేందుకు లేవడమో, లేచి పిల్లలని చూసుకోవడమో, మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవడమో... ఇలా ఏదో ఒక చర్యతో గుంపులో ఎవరో ఒకరు జాగరూకతతో కనిపించారు.   అడవులలో జీవించేవారు రకరకాల ప్రమాదాలకి సిద్ధంగా ఉండాల్సిందే! ఏ వైపు నుంచి పులి వస్తుందో, ఏ దిక్కు నుంచి మబ్బులు కమ్ముకువస్తాయో, ఏ పొదలోంచి పాములు చొరబడతాయో తెలియదు. కాబట్టి.... ఎవరో ఒకరు అప్రమత్తంగా ఉండేందుకు ప్రకృతి ఈ ఏర్పాటు చేసిందన్నమాట. ఏ ఇద్దరి నిద్రతీరు ఒకేలా లేకపోవడంతో, గుంపు సురక్షితంగా ఉంటుంది. అది సరే! ఇంతకీ నిద్రకీ వయసుకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా! ఒక గుంపులో కుర్రవాళ్లు, వృద్ధులు సరిసమానంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుర్రవాళ్లు ఒక సమయంలో, వృద్ధులు మరో సమయంలో పడుకుంటే సరి! అందుకనే మీరు గమనించారో లేదో.... కుర్రవాళ్లకి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచే అలవాటు ఉంటే, ముసలివారు త్వరగా పడుకుని తెల్లవారేసరికల్లా లేస్తారు. కుర్రవాళ్లు ఆలస్యంగా పడుకున్నా వారి ఆరోగ్యం మీద అంతగా ప్రభావం చూపదు కదా! అలా మొదలైన అలవాటు ఇప్పటికీ కుర్రకారుని వదిలిపెట్టడం లేదన్నమాట! - నిర్జర.

క్షమాపణ మంచిదే.. కానీ ఎప్పుడూ మీరే క్షమాపణ చెబుతుంటే జరిగేది ఇదే..!

  క్షమాపణ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది.  అపార్థాలు తొలగిస్తుంది. ప్రేమ, స్నేహం,  కుటుంబ బంధాలు, వైవాహిక జీవితం ఇలా ఏదైనా కావచ్చు.  ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్థాలు ఏర్పడినప్పుడు ఇద్దరూ ఎడముఖం,  పెడముఖం పెట్టుకుని ఉంటారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మళ్లీ చిగురిస్తుంది.  బంధం కోసం ఇలా తగ్గడంలో తప్పులేదని పెద్దలు,  రిలేషన్షిప్ నిపుణులు కూడా చెబుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు వారిద్దరిలో ఎవరైతే తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తుంటారో వారు బంధం కోసం తమ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పేస్తుంటారు.  ఇది కూడా బంధం బలపడుతుందని తిరిగి తమ ఇద్దరి జీవితాలు ఒక్కటిగా సాగుతాయనే ఆలోచనతో అలా చేస్తుంటారు. అయితే గొడవ జరిగిన ప్రతి సారి ఒక్కరే ఇలా తగ్గుతూ క్షమాపణ చెప్పడం జరిగితే అది ఖచ్చితంగా తప్పే.. ఎందుకు? అలా క్షమాపణ చెబుతూ ఉండటం వల్ల జరిగే నష్టం ఏంటి? తెలుసుకుంటే.. క్షమాపణ చెబితే నీ తల మీద కిరీటం ఏమైనా పడిపోతుందా.. నీ ఆస్తులేమైనా కరిగిపోతాయా.. ఇలాంటి మాటలు తరచుగా వింటూ ఉంటాం.  క్షమాపణ చెప్పడం అనేది ముమ్మాటికి తప్పు కాదు. అది ఒక బంధాన్ని నిలబెట్టే ఆయుధం. అయితే ఎప్పుడూ ఒకరే క్షమాపణ చెబుతూ అది ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని,  ఆ వ్యక్తి విలువను రోజురోజుకూ తగ్గించేస్తుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. అసలు క్షమాపణ చెప్పడం తప్పు కాదని చెప్పినప్పుడు.. క్షమాపణ చెప్పడం వల్ల కలిగే ముప్పు ఏమిటో తెలుసుకుంటే.. క్షమాపణ చెప్పడం అన్నివేళలా సరైనది కాదు.. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు.. తన తప్పును ఆ వ్యక్తి గుర్తించినప్పుడు లేదా తన తప్పు గురించి ఇతరులు చెప్పినప్పుడు..  అది నిజంగా తప్పే అని అనిపిస్తే క్షమాపణ చెప్పడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు.  తను తప్పు చేశానని నిస్సంకోచంగా ఒప్పేసుకోవాలి.  తప్పు చేశానని,  బాధపెట్టానని చెప్పి క్షమించమని అడగడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ  తప్పు లేకపోయినా తప్పు చెబితే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.  విలువను తగ్గిస్తుంది.  ముఖ్యంగా ఎదుటివారి దృష్టిలో మర్యాద అనేది  లేకుండా పోతుంది. అందుకే తప్పు ఉంటేనే క్షమాపణ చెప్పాలి. విజయాలు సాధించడం అంటే అది వ్యక్తి అభివృద్దికి సూచన.  ఎప్పుడైనా ఏదైనా విజయం సాధించినప్పుడు దాని సందర్భంగా ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే అది మంచిది కాదు.. అలా సాధించిన విజయం గురించి ప్రస్తావించి ఇతరులకు క్షమాపణ చెబితే సాధించిన విజయానికి విలువ లేకుండా పోతుంది. ఏదైనా విషయం గురించి స్నేహితులు,  సన్నిహితులు,  సహోద్యోగులు, కుటుంబ సభ్యులు మొదలైన వారి ముందు ఆరోగ్యకరమైన చర్చ చేస్తున్నప్పుడు మధ్యలో  ఎవరికీ క్షమాపణ చెప్పకూడదు. మాట్లాడే విషయంలో స్పష్టత, నిజం ఉన్నప్పుడు ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా చెప్పవచ్చు.  అలా కాకుండా మధ్యలో క్షమాపణ చెప్పడం, చర్చ నుండి తప్పుకోవడం చేస్తే చర్చలో బలహీన వ్యక్తులుగా పరిగణింపబడతారు. అభిప్రాయాలను పంచుకునే హక్కు అందరికీ ఉంటుంది . అలాగే ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయాలు అనేవి ఉంటాయి.  అవన్నీ కాకుండా ఇతరులతో సొంత అబిప్రాయాలు చెప్పినప్పుడు వాటి గురించి క్షమాపణ కోరడం కూడా మంచిది కాదు.. అలాగే ఎదుటి వారు తమ అభిప్రాయాన్ని చెబుతున్నప్పుడు  వారికి సున్నితంగా క్షమాపణ చెప్పి వారు చెప్పే విషయాన్ని వినకుండా తప్పించుకోవడం కూడా మంచిది కాదు. ఎవరైనా సహాయం కోసం అర్థిస్తున్నప్పుడు వారికి సారీ చెప్పి తప్పించుకోవడం చాలా తప్పు.  అలాగే సహాయం అవసరమైనప్పుడు సారీ చెప్పి బంధాలు పునరుద్దించుకోవడం కూడా తప్పే.. తప్పును కప్పి పుచ్చుకుని ఆ తరువాత ఇలా చేయడం తప్పే..                                       పదే పదే క్షమాపణ చెప్పడం కొందరికి అలవాటుగా ఉంటుంది.  బలహీన మనస్కులు,  బంధాల విషయంలో భయపడేవారు.. ఎదుటివారి డ్యామినేషన్ ను భరించలేని వారు.. బంధం తప్పనిసరిగా కోరుకునే వారు.. ప్రేమ రాహిత్యంతో బాధపడేవారు తప్పు లేకపోయినా.. జరిగింది చిన్న తప్పు అయినా,  ఎదుటివారి తప్పు ఉన్నా తామే పదే పదే క్షమాపణ చెబుతుంటారు.  ఇలాంటి వారిని జోకర్ లు గా భావిస్తారు తప్ప.. వారి మనసును గుర్తించరు. అందుకే ఎవరికీ పదే పదే క్షమాపణ చెప్పకండి.                                                      *రూపశ్రీ.

మార్పు గురించి ప్లేటో ఏమి చెప్పాడు?

మార్పు అనేది ఎంతో సహజమైనది. తప్పనిసరి అయినది కూడా. మార్పు జరగనిది అంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కాలంతో పాటు ఒక దశ నుండి మరొక దశకు రూపాంతరం చెందుతూ, కొత్తగా ఆవిష్కరమవుతూ, ఒక రూపం పతనమవుతూ ఉంటుంది. అయితే ఈ మార్పు నిజంగానే అన్నింటిలో జరుగుతుందా?? ప్రపంచంలో ఉన్న ప్రముఖ తత్వవేత్తలలో ప్లేటో కూడా ఒకరు. ఈయన మార్పు గురించి పరిపరివిధాలుగా విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మార్పు గురించి ఈయన విశ్లేషణ ఎంతో లోతుగా సాగుతుంది. మార్పు చెందేవి, మార్పు చెందనివీ అంటూ మార్పు గురించి, అందులో ఉన్న లోతుపాతుల గురించి ప్లేటో చెప్పిన మాటలు... మనం మొట్టమొదటే స్పష్టంగా అడగవలసిన ప్రశ్న ఒకటుంది. ఎల్లప్పుడూ ఉంటూ మార్పు చెందనిదేది? ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఎప్పటికీ ఉండనిదేదీ? హేతువు వల్లా, ఆలోచన వల్లా గ్రహించబడేది ఏదో అదెప్పటికీ ఒక్క స్థితిలోనే ఉంటుంది. మనం దేని గురించి హేతువు సహాయం లేకుండా ఇంద్రియ సంవేదలనల ద్వారా మాత్రమే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటామో అది ఎల్లప్పుడూ మార్పు చెందుతూ, నశిస్తూ ఉండేదే. అదెప్పుడూ వాస్తవంగా ఉండేదే కాదు. మార్పు చెందే ప్రతీదీ సృష్టించబడి ఉండేదే అయిఉండాలి. దాన్ని ఏదో అవసరం కోసం ఏదో ఒక కారణం చేత సృష్టించి ఉండాలి. ఎందుకంటే  కారణం లేకుండా ఏదీ సృష్టించబడదు. సృష్టికర్త తన సృష్టిని మార్పు లేని తరహాలో చిత్రించి ఉంటే అది పరిపూర్ణంగా, సవ్యంగా ఉంటుంది. అలా కాక అతడు ఒక సృష్టి తరహాలోనే తన సృష్టి చేసి ఉంటే అది అపరిపూర్ణంగా, అపసవ్యంగా ఉంటుంది. అప్పుడు సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది. నిజానికి ఈ ప్రశ్న మొదటే అడగవలసిన ప్రశ్న.  అదేమంటే ఈ ప్రపంచం అనాదిగా ఎప్పుడూ ఉంటున్నదేనా? లేదా సృష్టించబడ్డదా? దీనికో అది అంటూ ఉందా? ఇది సృష్టించబడ్డదేనేమో, ఎందుకంటే ఇది దర్శనీయం, స్పృశనీయం, దీనికో దేహముంది.  కాబట్టి ఇంద్రియగ్రాహ్యం. ఇంద్రియాల ద్వారా గ్రహించబడేవీ, అభిప్రాయాల ద్వారా తెలియవచ్చేవీ తప్పకుండా ఒక సృష్టిక్రమంలో సృష్టించబడేవే. సరే సృష్టించబడ్డ ప్రతి దానికీ అవసరమూ, ఒక కారణమూ ఉండాలి కానీ ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరో మనకి తెలియదు. తెలిసినా దాన్ని తక్కినవాళ్ళకి వివరించలేం అయినా అతన్ని అడగడానికి ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. అతడు ఈ ప్రపంచాన్ని ఏ నమూనా ఆధారంగా నిర్మించి ఉంటాడు? మార్పులేని శాశ్వత వస్తువు ఆధారంగానా? లేక సృష్టించబడి మార్పు చెందే నమూనా ఆధారంగానా?  ఒకవేళ ప్రపంచం సవ్యంగానూ, ప్రణాళిక ఉత్తమంగానూ ఉండి ఉంటే మనం అతని నమూనా మార్పులేని శాశ్వత వస్తువని భావించవచ్చు. అలాకాక మరోలా అయిఉంటే (అటువంటి ఊహే దైవదూషణతో సమానమైనప్పటికి) ఆ నమూనా మరోలా ఉండి ఉంటే, అప్పుడతని నమూనా అశాశ్వత వస్తువని చెప్పవచ్చు. కానీ ఈ ప్రపంచాన్ని చూసి ఎవరేనా ఇట్టే గ్రహించవచ్చు. ఇది శాశ్వత వస్తువు నమూనా మీదనే నిర్మితమయ్యిందని. ఆ శాశ్వత వస్తువుని మనం హేతువు మీద నుండి, ఆలోచన మీద నుండీ మాత్రమే గ్రహించగలమని ప్లేటో చెబుతాడు.                                        ◆నిశ్శబ్ద.

పుస్తకం ప్రియం ప్రియం!!

రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు మనం. అలాగే గొప్పవాళ్లను, దీనావస్థలో ఉన్న వారి జీవితాల్ని చూడలేకపోవచ్చు. కానీ ఆ అనుభవాన్ని కలిగించే అద్బుతాలు కొన్ని ఉన్నాయి. ఈమధ్య కాలంలో ట్రావెల్ vlogs అలాంటి అసంతృప్తిని కొంతవరకు తీరుస్తున్నా వారి విశ్లేషణ సమయానికి తగ్గట్టు చాలా క్లుప్తంగా ఉండటం వల్ల ఎక్కువ విషయలు తెలియకపోవచ్చు. ఇది కేవలం ఈ ట్రావెల్ గురించి మాత్రమే కాదు. ఎన్నో  విషయాలలో ఇదే వర్తిస్తుంది. అయితే ప్రతి వస్తువు నుండి, వ్యక్తి వరకు, పరిస్థితి నుండి ప్రకృతి వరకు జీవితాల నుండి సంఘటనల వరకు అన్నిటినీ ఎంతో వివరంగా ఆవిష్కరించేవి పుస్తకాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటారు కందుకూరి విరేశలింగం పంతులు గారు. పుస్తకం ఇచ్చే జ్ఞానం అలాంటిది అని అర్థం. ఏ గొప్ప వ్యక్తిని కదిలించినా అలలు అలలుగా పుస్తక జ్ఞానం ప్రవాహంలా బయటకు వస్తుంది. పుస్తకాలు చదివి చెడిపోయిన వాడు ఎవరూ లేరు అనేది వాస్తవం. బహుశా ఆలోచనా పరిణితి ఎక్కువై అంతర్ముఖులుగా మారిపోయి అందరి దృష్టిలో మానసిక రోగులుగా ముద్రపడిన వాళ్ళు ఉంటారేమో కానీ వాళ్ళను సరిగా అర్థం చేసుకుని ఉండరు అనేది నిజం. ఇక విషయానికి వస్తే పుస్తకాన్ని ఒక మంచి స్నేహితుడిగా చేసుకున్నవాళ్ళు ప్రపంచంలో చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకు పుస్తకం ఇంత గొప్పది అంటే…. జ్ఞానానికి కేంద్ర బిందువు!! బిందువు బిందువు కలసి సింధువు అయినట్టు పుస్తకంలో పేజీ పేజీ కలసి ఒక గొప్ప జ్ఞాన తరంగం అవుతుంది. పుస్తకాలు చదివేవాళ్ళు గొప్పవాళ్ళు, పుస్తకాలను రాసేవాళ్ళు అద్బుతాలు అని చెప్పుకోవచ్చు. ఒక పుస్తకం అందులో ఉన్న విషయ సారాంశాన్ని మనిషి మెదడులోకి పాదరసంలా ప్రవహించి మనిషిని చైతన్య వంతుడిని, ఉత్తేజవంతుడిని చేస్తుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఆ ఆలోచనల నుండి మనిషి పెంపొందించుకునేదే జ్ఞానం. " జ్ఞానం అంటే పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలలో విషయాలను తెలుసుకుని, వాటిని తరచి చూసుకుని తమని తాము సరిచేసుకోవడం. ఓ కొత్త పుస్తకంలా మళ్లీ పుట్టడం"   మంచి అలవాటు!! నిజానికి పది మందితో వ్యర్థమైన విషయాలు మాట్లాడటం కంటే ఒక పుస్తకాన్ని ప్రశాంతంగా చదవడం మంచిదని అనిపిస్తుంది. చిన్నతనం నుండి పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఎడిగేకొద్ది పిల్లలకు తాము ఎలాంటి దారిలో వెళ్ళాలి అనే విషయం పెద్దలు ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకు నీతి కథలు, పద్యాలు వంటివి చిన్నప్పటి నుండి పుస్తకాలలో చదివిస్తూ  ఉంటే గొప్ప వాక్పటిమ పెంపొందుతుంది.  నడవడిక న్యాయబద్ద జీవితం!! వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే వినసొంపైన మాటలు ఆభరణాల్లాంటివి అని అర్థం. అలా మాట్లాడే గుణం కూడా పుస్తకాలు చదవడం వల్ల వస్తుంది. నిజం చెప్పాలంటే ప్రాంతీయతను వివరించే పుస్తకాల ద్వారా ప్రజల జీవన స్థితి గతులు స్పష్టం అవుతుంటాయి.   ఒంటరితనానికి వీడ్కోలు!! పుస్తకం తోడు ఉంటే ఒంటరితనం అనే ఫీలింగ్ ఎప్పుడూ, ఎవరినీ వెంటాడదు. అందుకే ఎప్పుడూ ఓ మంచి పుస్తకాన్ని వెంట ఉంచుకుంటే అంతకు మించి పెద్ద ఊరట ఉండదు కూడా. పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారు చక్కగా పుస్తకాలతో రిలాక్స్ అవ్వచ్చు. వ్యక్తుల అభిరుచులను బట్టి ఎన్నో వర్గాల పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి చేరే పుస్తకాలతో జతకట్టడమే అందరూ చెయ్యాల్సిన పని. కాబట్టి పుస్తకాలతో ప్రియం ప్రియంగా మాట్లాడండి. అవి మిమ్మల్ని మాట్లాడిస్తాయి మీరు ఎలా కావాలంటే అలా!!                               ◆వెంకటేష్ పువ్వాడ.  

హ్యాపీ హోమ్!! స్వీట్ హోమ్!!

ఇదేమి కొత్త సినిమాలో పాట కాదు. అంతకు మించి ఏదో ప్రత్యేక దినానికి సంబంధించి స్లోగన్ కూడా కాదు. మరింకేమిటి అంటున్నారా?? ప్రతి ఇంట్లో సాధారణంగా ఇద్దరు అంతకు మించిన మనుషులు ఉండటం కామన్. ఇప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు లేవు కానీ ఒకప్పుడు అబ్బో దాదాపు ఒకే ఇంట్లో పది నుండి  ముప్పై మంది, ఇంకా ఎక్కువే ఉన్న కుటుంబాలు బోలెడు ఉండేవి. ఇదంతా ఎందుకు అంటే అదే విషయమే ఇప్పుడు చెప్పేసుకుందాం. ప్రస్తుతం కుటుంబ నియంత్రణలో భార్య, భర్త, ఒకరు లేద ఇద్దరు పిల్లలతో ముచ్చటైన కుటుంబాలే ఎక్కడ చూసినా. అయితే ఉన్న నలుగురి మధ్యనో, లేదా ఐదుగురి మధ్యనో కూడా నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇవేమీ కత్తులు, కటార్లు పట్టుకుని చేయకపోయినా మనసుల మనసుల మధ్య జరిగే మాటల యుద్ధాలే. ఫలితంగా మాటా మాటా పెరిగి అవన్నీ తూటాల్లా మారి, ముచ్చటైన కుటుంబాలు బీటలు వారే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటివేమి జరగకుండా ఉండటానికి కొన్ని చిన్న జాగ్రత్తలు చాలు. కాసింత కాంప్రమైజ్    భార్యా భర్తలు అన్నాక సర్దుకుపోవడం కామన్. అయితే అమ్మాయిలకె దీన్ని ఎక్కువగా ఆపాదించేసి పెళ్ళవ్వగానే తన ఇష్టాలను తగ్గించుకుని భర్తకు తాగినట్టు ఉండటమే సమాజ ఆమోదమనే వేదంతాలు చెప్పేసి వాళ్ళను కంట్రోల్ లో పెడతారు చాలా మంది. అయితే ఇలాంటివి వాటి వల్ల జరిగేది ఏమిటంటే బయటకు సరేనని చెప్పినా మనస్ఫూర్తిగా మార్చుకోలేని ఇష్టాల వల్ల మానసికంగా కుంగిపోతారు అమ్మాయిలు. అలాంటి వాళ్ళు ఏదైనా కాస్త  ఎమోషనల్ సంఘటన జరగగానే ఒక్కసారిగా విస్ఫోటనం అయినట్టు తన బాధ తాలూకూ సంఘటనలు తాను చంపేసుకున్న ఇష్టాలు ఇలా అన్ని ఒక్కసారి గుర్తొచ్చి పెద్ద గొడవకు దారి తీస్తాయి. కాబట్టి అమ్మాయిలు మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలనే నియామాన్ని పక్కన పెట్టి సందర్భానుసారంగా భార్యాభర్తలు ఇద్దరూ సర్దుకుపోవడం మంచిది. అలాగే పిల్లలు కూడా దీనికి అనుగుణంగానే నడుచుకుంటే కుటుంబంలో కలకలం ఏర్పడదు.  కాసింత అండర్స్టాండింగ్  చాలా మంది విషయాన్ని అర్థం చేసుకోవడం కంటే అర్థతరంగా అట్లాగే వదిలేసి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్ళిపోతారు. అయితే అసలు విషయంలో సమస్య ఏమిటి?? దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి. దాని వల్ల ప్రయోజనాలు, నష్టాలు ఇలాంటివన్నీ అందరూ కలసి మాట్లాడుకుంటే సమస్య తాలూకూ ప్రభావం ఎవరి మీద ఉండదు. తప్పుకోకుండా ఒప్పేసుకోండి ఏదైనా మీవైపు నుండి తప్పు జరిగితే దాన్ని నేరుగా ఇంట్లో వాళ్ళ ముందు ఒప్పేసుకుని, దాని వెనుక కారణాన్ని విడమరిచి చెప్పాలి. అప్పుడే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నాది కాదు అందరిదీ  ప్రతి ఒక్కరికి నాది అనే భావన ఉంటుంది. అయితే అన్ని విషయాల్లోనూ అదే పనికిరాదు. కొన్ని విషయాల్లో మన అనే భావన కుటుంబం మొత్తానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఇలాంటి బలమే అందరూ వాటిని అధిగమించేలా చేస్తుంది. మీకు మీకు మధ్య మీ ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఇంట్లో ఉంటున్న వాళ్ళు అంటే అందరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఎంతో మంచిది. అంతే కానీ ఇరుగు పొరుగులను న్యాయం చెప్పే పెద్దలుగా మార్చేసి, చుట్టాలకు, స్నేహితులకు ఇంటి గొడవ గురించి చెప్పి తప్పెవరిది వంటి విషయాలు అడగకూడదు.  ఫ్రెండ్లీ హోమ్ ట్రెండీ హోమ్  ప్రస్తుత తరాలకు తగ్గట్టు ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య పేరెంట్స్, చిల్డ్రన్స్ అనే బంధం కంటే ఫ్రెండ్స్ అనే బంధమే ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా ఉంటేనే పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోగలరు. అంతే కాదు పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండే కుటుంబంలో అర్థం చేసుకునే వాతావరణం మరియు ఒకరికోసం ఒకరం అనే భావన  ఎక్కువగా ఉంటుంది.  ఆల్ ఈజ్ వెల్  పైన చెప్పుకున్నవి అన్ని మీ మీ కుటుంబాల్లో ఉన్నాయో లేదో సరిచూసుకుని లేకపోతే కుటుంబంలో అందరూ కలసి మాట్లాడుకుని మెల్లగా వాటిని ఫాలో అయితే ఆల్ ఈజ్ వెల్ అని హ్యాపీ గా స్లోగన్ చెప్పుకోవచ్చు.                                                                                                                             ◆ వెంకటేష్ పువ్వాడ

జాగ్రత్త.. ఈ అలవాట్లు జీవితాన్ని  నాశనం చేస్తాయ్..!

  జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో సంతోషం, సామరస్యం, సానుకూలత ఉన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ కొన్ని అలవాట్లు జీవితాన్ని దెబ్బతీస్తాయి.  సంతోషంగా సాగాల్సిన జీవితాన్ని  నాశనం చేస్తాయి.  ఇంతకీ జీవితాన్ని నాశనం చేసే ఆ అలవాట్లు ఏమిటో.. అవి ఎందుకు జీవితాన్ని నాశనం చేస్తాయో తెలుసుకుంటే.. సెల్ఫ్ డబ్బా.. ఎవరూ ఇతరుల ముందు  తమను తాము తక్కువ చేసుకుని చెప్పుకోవాలని అనుకోరు. కానీ తమ గురించి తాము ఇతరుల ముందు అదే పనిగా పొగుడుకోవడం మంచి అలవాటు కాదు. తమను తాము పొడుగుకునేవారు, తమలో లోపాలను సమర్థించుకుని,  కవర్ చేసుకునేవారు ఎప్పటికీ తమలో లోపాలను తెలుసుకోలేరు. తమ తప్పులను తాము తెలుసుకోలేరు. దీని వల్ల వారు వ్యక్తిగతంగా వెనుకబడతారు.   కోపం.. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు.. కానీ కోపాన్ని ఎక్కువగా ప్రదర్మించేవారు , చిన్న విషయాలకు కోపం తెచ్చుకునేవారు  ఇతరులు చెప్పే మంచిని వినలేరు.. ఇతరులు చెప్పిన మంచి వెనుక దాగిన భవిష్యత్తును అర్థం చేసుకోలేరు. కోప స్వభావులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా చాలా నష్టపోతారు. సహాయ గుణం లేకపోవడం.. మనుషులు, జంతువులు మాత్రమే కాదు.. సకల ప్రాణి కోటి పట్ల భూత దయ ఉండాలని అంటారు.  నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడం,  ఇబ్బందులలో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల అందరితో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి.  కానీ ఎవరికీ ఎలాంటి సహాయం చేయకుండా ఉండటం వల్ల జీవితంలో తమకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవారు ఉండరు. ఇది జీవితాలను సంకటంలోకి నెట్టివేస్తుంది. హింస గుణం.. ఇతరులకు సహాయం చేయడానికి బదులుగా ఇతరులు బాధపడితే చూసి సంతోషించే శాడిస్ట్ గుణం ఉన్నవారు జీవితంలో చాలా కష్టాలపాలవుతారు. ఒక మనిషిలో ఉండే హింస గుణం ఆ మనిషి జీవితాన్ని ఎప్పటికైనా  వినాశనం వైపుకు తీసుకువెళుతుంది. బలం.. ప్రతి వ్యక్తిలో ఉండే బలం ఆ వ్యక్తికి మంచి చేసేది.. కొన్ని పరిస్థితులలో సహాయంగా ఉండేది కావచ్చు. కానీ ఇతరులు సహాయం కోసం వచ్చినప్పుడు,  ఇతరులు ఇబ్బందులలో ఉన్నప్పుడు తమకున్న బలాన్ని ప్రయోగించి ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇది ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని దెబ్బతీస్తుంది. చెడు ప్రవర్తన.. ఇతరులతో, స్నేహితులతో చెడుగా ప్రవర్తించడం వల్ల  మంచి సలహాలు ఇచ్చేవారు, మంచి చెప్పే వారు దూరం అవుతారు. అందుకే ఎవరితోనూ చెడుగా ప్రవర్తించకుండా సంతోషంగా ఉంటే  వారి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే వినాశనమే. అత్యుత్సాహం జీవితంలో పనులు చక్కబెట్టాలంటే ఉత్సాహం మంచిదే.. కానీ అత్యుత్సాహం మాత్రం మంచిది కాదు.. దీని వల్ల జీవితం గందరగోళంలో పడిపోతుంది. కొన్ని సార్లు ఈ అత్యుత్సాహం వల్ల జీవితంలో ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.                                      *రూపశ్రీ. 

ఆందోళనను గుర్తించాల్సిన సమయమిదే!

మనిషికి శారీరక రుగ్మతలు ఎన్ని ఉన్నా.. వాటిని ఔషధాలతో తగ్గించుకోవచ్చు. కానీ శరీరానికి నొప్పి లేకుండా మనిషిని వేధించే సమస్యలు మానసిక సమస్యలు. మానసిక సమస్యలలో ఆందోళన ఒకటి. ప్రతి నిమిషం మనిషిని భయానికి, సంఘర్షణకు లోను చేసి జీవితంలో అల్లకల్లోలం పుట్టించే ఈ ఆందోళన మనిషి పాలిట పెద్ద శాపమే అని చెప్పవచ్చు. కానీ దురదృష్ట వశాత్తు తాము అనుభవిస్తున్నది మానసిక సమస్య అని, దాని పేరు ఆందోళన అని చాలామందికి తెలియదు. తెలుసుకోకుండానే ఎంతోమంది జీవితంలో నలిగిపోతూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంటారు.  చాలామంది మానసిక సమస్య అంటే పిచ్చి అనే ఒకానొక భావనతో ఉంటారు. అందుకే తమకు మానసిక సమస్య ఉందని బయటకు చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ ఈ సమస్యను గుర్తించడం చాలా అవసరం, దీనికి సరైన పరిష్కారాలు వెతకడం, దీని ప్రభావాన్ని తగ్గించడం, నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయడం ఎంతో అవసరం.  చరిత్రలోకి చూస్తే.. 19వ శతాబ్దం చివరలో ఆందోళన అనేది ఒక ప్రత్యేక అనారోగ్యంగా వర్గీకరించబడలేదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని వేర్వేరు పేర్లతో పిలిచారు. మానసిక రుగ్మతల గురించి సగటు మనిషికి అవగాహన లేని కాలంలో దీని దీని ప్రభావం ఇప్పుడున్న ప్రభావవంతంగా లేదు.  18వ శతాబ్దంలో, బోయిసియర్ డి సావేజెస్ పానిక్ అటాక్స్, సాధారణీకరించిన యాంగ్జయిటీ డిజార్డర్‌ని 'పనోఫోబియాస్'గా గుర్తించిన నోసోలజీని ప్రచురించారు. తర్వాత 19వ శతాబ్దంలో, అలసట, తలనొప్పి, చిరాకుతో కూడిన వైద్య పరిస్థితిని లక్షణాలుగా వర్ణించి 'న్యూరాస్తెనియా' అనే పదాన్ని రూపొందించారు. ఈ ఆందోళన లక్షణాలు కొత్త వ్యాధి నిర్మాణాలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.  ఇక భారతదేశంలో ప్రజలు ఆందోళన అనేది పూర్తిగా మనసుకు సంబంధించిన రుగ్మతగా భావించారు. మనస్సును శాంతపరచడానికి మానసిక స్థితిని సానుకూలంగా మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా అనేక ఆయుర్వేద మూలికలను ఉపయోగించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి బ్రాహ్మి, అశ్వగంధ. వైద్యశాస్త్రంలో పురోగతికి సాధించడానికి ముందు, పురాతన చికిత్సలలో వైద్యం అందించేవారు. వీటిలో  మూలికలు, ఔషధతైలం మధ్యయుగ కాలంలో సాగింది. హైడ్రోపతి విధానంలో చికిత్స అందించడం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇందులో  శరీరాన్ని విపరీతమైన ఉష్ణోగ్రతలకు గురిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా..  అత్యంత చల్లని ప్రవాహాలు, నదులలో స్నానం చేయడం, హెల్త్ స్పాలు, జలగలను ఉపయోగించి రక్తాన్ని తీయడం వంటివి ఉన్నాయి. అయితే మనోవిశ్లేషణలో క్రమంగా  ఫ్రాయిడ్ పరిశోధనల ఆధారంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు.  అన్నిటిలోకీ.. ఈమధ్య కాలంలోనే మానసిక సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిమీద దృష్టి పెట్టడం, వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేయడం సగటు వ్యక్తులలో కూడా కనబడుతోంది.  మానసిక సమస్యలు కూడా ఈమధ్య కాలంలో చాలా దారుణంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా కాలం మనుషుల్లో ఆందోళనను పెంచిందని చెప్పాలి. మానసిక సమస్యలున్నవారితో సామరస్యంగా మాట్లాడటం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా ఇప్పించడం, వారి ఆందోళనను పోగొట్టడానికి చేయూత ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఆందోళన అనే సమస్య దూదిపింజలా ఎగిరిపోతుంది.                                       ◆నిశ్శబ్ద.

భాగస్వామిని వదిలేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లలో ఈ లక్షణాలు ఉంటాయి..!

  పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను చాలా మార్చేస్తుంది.  ఇద్దరు వేర్వేరు వ్యక్తులు భార్యాభర్తలు అయ్యాక  వారిద్దరి జీవితాలు, వారి సంతోషాలు ఒకరి పట్ల మరొకరు ప్రవర్తన,  ఒకరితో మరొకరు నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటాయి. పెళ్లైన కొత్తలో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. కానీ భాగస్వామి కాలక్రమేణా మారుతూ ఉంటే.. అది అతను మీ నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నాడని అర్థం  కావచ్చు.  అతని ప్రవర్తనలో ఏదో తేడాను గమనించడం ప్రారంభిస్తే, అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ప్రేమ, గౌరవం,  నమ్మకం అనే పునాదిపై ఆధారపడిన సంబంధం వైవాహిక బంధం. భాగస్వాములిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకున్నంత కాలం మాత్రమే ఈ బంధం బలంగా ఉంటుంది. కానీ వీటిలో ఏవైనా బలహీనపడటం మొదలైతే ఆ సంబంధం విచ్ఛిన్నం అంచుకు చేరుకుంటుంది. భాగస్వామిని వదిలేసే ఉద్దేశ్యం ఉండేవారిలో కొన్ని లక్షణాలు,  ప్రవర్తనా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. ఇంటరెస్ట్ లేకపోవడం..  భాగస్వామి మీతో ఇంతకు ముందులాగా ఓపెన్ గా మాట్లాడకపోతే లేదా మీరు చెప్పే దానిపై ఆసక్తి చూపకపోతే అది వారికి మీ మీద ఆసక్తి పోయిందని చెప్పడానికి ఒక  సంకేతం. ఎప్పుడూ భార్యతో మాట్లాడటానికి లేదా భార్యతో సమయం గడపడానికి వాయిదాలు వేయడం,  తప్పించుకోవడం,  బిజీగా ఉన్నానని సాకులు చెప్పడం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం,  మునుపటిలాగా మాట్లాడటానికి, ప్రేమగా ఉండటానికి  ఆసక్తి చూపడం లేదని తెలుపుతుంది. శారీరక,  భావోద్వేగాలు..  భాగస్వామి మునుపటిలాగా శ్రద్ధ వహించడం లేదని ఎప్పుడైనా అనిపించిందా?  అతను భార్యకు  దగ్గరగా రావడానికి,  చేయి పట్టుకోవడానికి శారీరకంగా దగ్గరగా ఉండటానికి ఇష్టపడకుండా సంకోచంతో ఉంటున్నాడా?  వీటికి అవును అనే సమాధానం వస్తే..  అతను   మానసికంగా,  శారీరకంగా దూరం అవుతున్నాడనడానికి ఇది సంకేతం. గొడవ.. ప్రేమ,  పరస్పర అవగాహన సంబంధంలో ముఖ్యమైనవి. కానీ  భాగస్వామి ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం చేస్తుంటే.. అది అతను లోలోపల ఇబ్బంది పడుతున్నారని సూచిస్తుంది. కొన్నిసార్లు ఈ గొడవల  ద్వారా అతను  వేరు వెళ్లిపోవాలని ప్రయత్నించడం కూడా జరగవచ్చు. భవిష్యత్తు ప్రణాళిక..  భాగస్వామి తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో భార్యను చేర్చకపోతే అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు. అతను అకస్మాత్తుగా తన కెరీర్, ప్రయాణ ప్రణాళికలు లేదా ఇతర విషయాలకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటే అతను ఈ సంబంధాన్ని కొనసాగించే మూడ్‌లో లేడని అర్థం చేసుకోవచ్చు. సామాజిక జీవితంలో దూరం..  భాగస్వామి గతంలో మిమ్మల్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపి, ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతూ  తన స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే ఇది కూడా ఒక వార్నింగ్ సిగ్నల్  కావచ్చు.  అతను తన జీవితంలో మీ ఉనికిని నెమ్మదిగా తగ్గించుకుంటున్నాడని సూచిస్తుంది.  ఏమి చేయాలి?  సంబంధంలో పైన చెప్పుకున్న మార్పులను  గమనించినట్లయితే, ఆందోళన చెందడానికి బదులుగా, ఇద్దరూ కలిసి మాట్లాడటానికి మార్గాన్ని వెతకాలి.  భాగస్వామితో ఓపెన్ గా  మాట్లాడాలి.   అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా అడిగినప్పుడు అతను  ఒత్తిడికి లోనవ్వవచ్చు.   పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్టు అనిపిస్తే రిలేషన్ షిప్ కౌన్సెలర్ నుండి సహాయం తీసుకోవడం కూడా మంచి ఎంపిక కావచ్చు. సంబంధాన్ని కాపాడుకోవడానికి భాగస్వాములిద్దరి ప్రయత్నాలు చేయడం అవసరం. ఇరిద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సంబంధం మళ్ళీ బలపడుతుంది.                                             *రూపశ్రీ.  

దీపమంత ఆశ!! 

తాను వెలుగుతూ చుట్టూ వెలుగును అందిస్తూ ఆశను పెంచి, ఆశావహ జీవితానికి ప్రేరణగా నిలిచేది దీపం. ప్రతి ఇంట్లో దీపం తప్పనిసరి. అది ఏ కులం అయినా హిందువులు దేవతా విగ్రహాలు పటాల ముందు, ఇస్లాం మతస్తులు దర్గాలలో, వారి ఇళ్లలో వారి దేవుడి ముందు, క్రిస్టియన్స్ వారి యేసు ప్రభువు దగ్గర కాండీల్స్ వెలిగించడం అన్ని చోట్లా కనబడుతుంది. దీపారాధన మనిషిలో కొన్ని కల్మషాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుందని చెప్పుకుంటారు. ఇక హిందూ మతంలో దీపావళి ముగిసి ప్రారంభమయ్యే కార్తీకమాసం మొదలు నుండి మాసం ముగింపు దాకా దీపాల సందడి కొనసాగుతూనే వుంటుంది. మనుషులందరూ సుమారు పట్టణాలకు తరలిపోయినపుడు, పల్లెలు పట్టణాల రంగులోకి మారుతున్నపుడు కొన్ని సాంప్రదాయాలు తగ్గిపోతున్నా దాన్ని కాపాడుకుంటున్నామంటూ పలుచోట్ల దీపాల మిణుకులు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇకపోతే మునుపు దీపాలు వెలిగించడంలోనూ ఇప్పుడూ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా చోట్ల కాండీల్స్ పెదుతుంటారు. కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ ప్రయోజనం అంటే దేవుడి పుణ్యమో మరేదో కాదు.  దీపాలు వెలిగించడం వెనుక శాస్త్రీయత!! కార్తీకమాసం నవంబర్ డిసెంబర్ నెలల్లో సాగుతుంది. ఆ సమయంలో వర్షాలు సరేసరి, చలి మొదలవుతుంది. ప్రతి ఇంట్లో ముందు నూనె వేసి, వత్తితో, మట్టి ప్రమిధల్లో దీపాలు వెలిగించడం వల్ల ఆ దీపం కాలుతున్నపుడు వచ్చే వాసనే క్రిమికీటకాలను ఇంట్లోకి వెళ్లకుండా చేస్తుంది. కానీ ఇప్పట్లో అంతా కృత్రిమంగా తయారైపోయారు. నూనె ముట్టుకుంటే చేతికి జిడ్డు అంటారు, వత్తులు చేయడం చాలమందికి రానే రాదు. మట్టి ప్రమిధలు కొనాలంటే నామోషీ!! పెద్దవాళ్లే ఇట్లా ఉంటే ఇక పిల్లలకు ఏమి వస్తాయి ఈ అలవాట్లు హిందుత్వాన్ని సంప్రదాయాలను కాపాడుకోవడానికి కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తే సమాజంలోని బీదరికం, వెనుకబడిన వాళ్ళ ఆకలి గుర్తొస్తాయి నాస్తికులకు, వైజ్ఞానిక వేత్తలకు. కానీ వేలంటైన్స్డే, న్యూ ఇయర్ లకు మాత్రం పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు గుర్తుకురారు. ఎందుకంటే వీళ్ళందరూ పాశ్చాత్య సంస్కృతిని దాని విశిష్టత. దాని గొప్పదనాన్ని ఎప్పుడూ మైక్ పట్టుకుని చెబుతుంటారు మరి!! ఇంకొక శాస్త్రీయ కారణం ఏమిటంటే కార్తీక మాసం మొదలైనపుడు పగటి కాలం తక్కువగానూ చీకటి కాలం ఎక్కువగానూ గడుస్తూ ఉంటుంది. ఇంటి ముందు దీపాలు వెలిగించడం వల్ల చీకటిని దీపాల వెలుగుతో తరిమినట్టే. దీపాలు ఉపయోగించే నూనె, పత్తి కాలడం వల్ల వచ్చే పొగ, వాసన ఎంతో గొప్ప పలితాన్ని చేకూర్చుతాయని ఆయుర్వేదంలో పేర్కొంటారు. అలాంటి గొప్ప సంప్రదాయం, ఆరోగ్య విశిష్టత నిండి ఉన్న మన వారసత్వాన్ని చేతులారా నిర్లక్ష్యం చేస్తే మనం నష్టపోవడం మాత్రమే కాకుండా పరోక్షంగా నాటి బ్రిటిష్ బానిస బతుకులు మొదలవుతాయి. నాడు ప్రత్యక్షంగా అయితే నేడు వ్యాపారమనే వలయంలో వాళ్ళ గుప్పట్లో భారతాన్ని బంధించే ప్రయత్నాలు ఎన్నో!! అందుకే మన సంప్రదాయంలో ఉన్న అన్నిటినీ పిల్లలకు వివరిస్తూ, మనమూ పాటిస్తూ ఉంటే చిన్ని చిన్ని చేతులు వెలిగించే దీపాలు రేపటి కొండంత జీవితానికి ఆశావహ దృక్పథాన్ని ఎంతో ఉన్నతంగా మారుస్తాయి. ఆలోచనా విధానాన్ని విస్తృతం చేస్తాయి. చిన్ని చిన్ని ఆశ, ఈ దీపమంత ఆశ అని పాడుకుంటూ దీపాల సందడిలో మునిగిపోండి. ◆వెంకటేష్ పువ్వాడ  

దీపావళి పండుగ రోజు ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకూడదు..!

  దీపావళి అంటే వెలుగుల పండుగ. దీన్ని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా దేశాలలో ఎంతో సంబరంగా జరుపురుకుంటారు.  దీపావళి పండుగ అంటే చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తు.  భారతదేశంలో చాలామంది ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడమే కాకుండా పండుగ రోజు తమ ఆత్మీయులకు, సన్నిహితులకు బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు.  అయితే కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. అవేంటంటే.. దుస్తులు.. నచ్చిన వారికి, స్నేహితులకు, ఆత్మీయులకు దుస్తులను బహుమతిగా ఇవ్వడం చాలామంది చేస్తారు. అయితే నలుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వడం,  వాటిని బహుమతిగా స్వీకరించడం కూడా మంచిది కాదు.  ఇది అరిష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. బంగారు, వెండి.. దీపావళి పండుగ రోజున బంగారం, వెండి నాణేలను కొలుగోలు చేయడం చాలామంది చేసే పని. ఆ రోజు లక్ష్మి పూజ కూడా చేసుకుంటారు. అయితే దీపావళి సందర్భంగా బంగారం, వెండి కొనే వారు వారు మాత్రమే కొనుగోలు చేయవచ్చట.  బంగారం, వెండిని ఇతరులకు బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదట. పదునైన వస్తువులు.. పదునైన పస్తువులు రోజువారీ చాలా ఉపయోగిస్తుంటారు.  వంటగదిలోనూ, ఇంటి ఉపయోగం కోసం ఉపయోగించేవే అయినా దీపావళి రోజు అలాంటి వస్తువులను అస్సలు బహుమతిగా ఇవ్వడం,  వాటిని బహుమతిగా అందుకోవడం అస్సలు మంచిది కాదట. పాద రక్షలు.. దీపావళి కానుకగా చెప్పులు, బూట్లు వంటివి బహుమతిగా ఇవ్వడం కూడా మంచిది కాదని అంటున్నారు. గడియారం.. కాలమానాన్ని సూచించే గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం మంచిది కాదట.  ఆప్తులకు,  తెలిసిన వారికి చాలామంది ఇచ్చే బహుమతులలో చేతి గడియారం,  గోడ గడియారం వంటివి ఉంటాయి.  వీటిని అస్సలు బహుమతిగా ఇవ్వకూడదని అంటున్నారు.  ఇలా గడియారాన్ని ఇతరులకు బహుమతిగా ఇస్తే మన మంచి కాలం ముగిసిపోయినట్టే అని కూడా అంటున్నారు.                                                     *రూపశ్రీ.

మాట్లాడకుండానే ఇతరులకు మీ తెలివి తేటలు నిరూపించాలంటే.. ఇలా చేయండి..!

  ట్యాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఇది ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉపయోగించే వాక్యం.  ట్యాలెంట్ చాలామందికి ఉంటుంది.  కానీ దీన్ని గుర్తించుకుని సరైన విధంగా సద్వినియోగం చేసుకునేవారు తక్కువేనని చెప్పాలి.  నాకేం వచ్చు అనుకునే వారు ఎక్కువ. నీకేం తెలుసు నువ్వు ఊరుకో అని కుటుంబం నుండి స్నేహితులు, కొలీగ్స్ వరకు చాలామంది అంటుంటారు. ఈ కారణంగా కాస్తో కూస్తూ తెలివి తేటలు ఉన్నా అవి బయట పడవు. అయితే  ట్యాలెంట్ ఉన్నా సరే.. కొందరు రాణించలేరు.. ముఖ్యంగా నాకు ట్యాలెంట్ ఉంది కానీ నేను వెనుకబడ్డాను అని వాపోయేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మాట్లాడకుండా తెలివి తేటలు నిరూపించడం పెద్ద టాస్క్. కానీ కింది విషయాలు తెలుసుకుంటే మాట్లాడకుండా ప్రతిభను నిరూపించుకోవడం కష్టం కాదు అనిపిస్తుంది. స్మార్ట్ వర్క్.. కష్టపడి పని చేయడం అనేది ఒక మనిషిని ఒక మెట్టు పైన నిలబెడుతుంది. అయితే నేటి కాలంలో కష్టపడటం అనే మాట కంటే ఎంత తెలివిగా వర్క్ చేస్తాం అనేదే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు. అందుకే స్మార్ట్ వర్క్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. అలాగని స్మార్ట్ వర్క్ అనేది ఎంపిక చేసుకునే ఒక మార్గం కాదు.. కానీ అది కొన్ని సందర్భాలలో అవసరం.  అవసరమైనప్పుడు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల తెలివి తేటలను ప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ మాట్లాడే వారు అంతే తెలివిగా పని చేయలేకపోవచ్చు. కానీ తక్కువ మాట్లాడే వారు  చేసే పని చాలా సైలెంట్ గా ఉన్న ప్రదేశంలో విస్పోటనం చెందినట్టే ఉంటుంది.  ఇది చాలామందిని ఆశ్చర్యానికి,  విస్మయానికి గురిచేస్తుంది. ఇలా చేయాలంటే కొన్ని పనులు చేయాలియ.. లక్ష్యాలు.. ఎప్పుడూ లక్ష్యాలు పెట్టుకుని పని చేయాలి.  ఏదో ఒక విధంగా అలా పని చేస్తూ పోవడం అనే కాన్సెప్ట్ వదిలి ఒక టార్గెట్ పెట్టుకోవాలి.  దీని వల్ల  చేయవలసిన పనుల మీద అవగాహన,  స్పష్టత పెరుగుతుంది.  అలాగే పనులను ఒకే టాస్క్ లో కాకుండా చిన్న చిన్న టార్గెట్లలో విభజించుకొని వాటిని పూర్తీ చేయాలి.   టాస్క్.. ఒకేసారి రెండు పనులను డీల్ చేయడం వల్ల మానసికంగా అలసిపోతారు.  రెండు పనుల మీద పూర్తీ స్థాయి ఫోకస్ పెట్టలేరు.  ఒక వేళ పెట్టినా అది మీ ప్రతిభకు,  సామర్థ్యానికంటే తక్కువగానే ఉంటుంది. అందుకే స్మార్ట్ వర్క్ చేసే వారు ఒకసారి ఒక పని మీదనే దృష్టి పెడతారు. దాన్ని వీలైనంత తొందరగా,  పూర్తీ స్థాయిలో  పూర్తీ చేయగలరు. ఇది ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామంచి మార్గం. ప్లానింగ్.. రేపు ఏం చేయాలి అనే విషయాన్ని ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం ఉదయం లేచిన తరువాత అయినా ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవాలి. దీని  వల్ల చాలా వరకు పనులను సరైన సమయానికి పూర్తీ చేయగలుగుతారు. దీని వల్ల సమయం సేవ్ అవుతుంది.  మానసికంగా ఒత్తిడి ఉండదు. సమయం.. ప్లానింగ్ చేసుకున్నంత మాత్రాన టాస్క్ లు సులభంగా పూర్తీ కావు.  దీనికి సమయాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సమయాన్ని సరైన విధంగా మెయింటైన్ చేసుకునే వారు ఫెయిల్ కావడం అంటూ ఉండదు. పనులతో వ్యవహరించడం.. కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. మరికొన్ని సాధారణ పనులు ఉంటాయి.  ముఖ్యమైన పనులు పూర్తీ కావడంలో సాధారణ పనులు అడ్డంకి గా ఉంటాయి. ఇలాంటి సాధారణ పనులు,  అంతగా ప్రాముఖ్యత లేని పనులను ఇతరులకు అప్పగించడం వల్ల పూర్తీ స్థాయి ఏకాగ్రతను పని మీద ఉంచవచ్చు. ఇది పనిలో వందశాతం ఫలితం రాబట్టడంలో సహాయపడుతుంది. నేర్చుకోవాలి.. నాకు అంతా తెలుసు అనే అహం మనిషిని అట్టడుగుకు తొక్కేస్తుంది.  పని చేస్తున్నప్పుడ ఏవైనా పొరపాట్లున్నా, ఇతరులు మీ పొరపాటును చెప్పినా నాకు తెలియదా ఏంటి అని వారిని నిందించవద్దు.. నాకే చెప్తావా అని కోప్పడవద్దు. వారు చెప్పిన విషయాన్ని ఆలోచించి అందులో నిజం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. దీని వల్ల ఆయా విషయాలను మరింత సమర్థవంతంగా నేర్చుకునే వెలుసుబాటు కలుగుతుంది. విరామం.. స్మార్ట్ వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద పోకస్ ఎక్కువ ఉండటానికి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి. ఇది తిరిగి పని మొదలు పెట్టినప్పుడు ఏకాగ్రతగా పని చేయడంలో సహాయపడుతుంది.                                          *రూపశ్రీ.

సంపాదనా స్వరం ఏమి చెబుతోంది??

జీవితంలో రూపాయి కూడా ఎంతో విలువైనదే.ఆ రూపాయి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే చేతులు, జేబులు ఖాళీగా ఉన్నపుడు. కానీ ఇప్పటి తరానికి ఆ రూపాయి విలువ పెద్దగా తెలియదు. ఏ కొందరికో తప్ప రూపాయి విశ్వరూపం కూడా తెలీదు. విశ్వరూపం అంటే పుట్టుక పూర్వోత్తరాలు కాదు. కొందరి దృష్టిలో రూపాయి అంటే పెద్దగా లెక్కలేనిది. కారణం ఏమిటని చూస్తే ఇప్పటి కాలంలో డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు వచ్చి పడ్డాయి.  ఆ మార్గాల ద్వారా డబ్బు సంపాదన ఎంతో సులభం. కొన్ని దారులు సులభ పద్దతిలో నిజాయితీగా  ఉన్నా ఎక్కువ భాగం వక్రమార్గంలో సంపాదిస్తుండటమే నేటి యువత పెడదారిలో వెళ్ళడానికి కూడా కారణం. ఈజీ మని లేజీ యూత్ ఎందుకు కష్టపడాలి సులువైన మార్గాలు ఉండగా. హాయిగా మొబైల్ చేతిలో ఉంటేనో, లాప్టాప్ లేదా సిస్టం దగ్గర ఉంటేనో కాలు కదపకుండా, కండ కరగకుండా హాయిగా సంపాదించేయచ్చు. అది తప్పు దారి అని ఎవరైనా అంటే ప్రపంచంలో ఎన్నో తప్పులు జరుగుతుంటే మేము చేసేది తప్పు ఎలా అవుతుందనే సమర్థింపు కూడా చాలామందిలో కనబడుతుంది.  చూడటానికి జులయిగానూ, పని పాట లేక ఉండేవాళ్ళు చాలామంది ఇలాంటి ఈసీ మనికి జై కొడుతూ ఉంటారు. అయితే వీళ్ళలో సగం వరకు యువత సరైన ఉద్యోగ అవకాశాలు లేవనే ఆలోచనతో కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. పలితంగా ఒక సరైన దిశ లేక సాగుతుంది వీరి జీవితం. ఇలా ఈసీ మనీ సంపాదన తాత్కాలిక పరిష్కారమే తప్ప జీవితంలో సంపాదన అనే విషయంలో ఒక దీర్ఘకాలిక మార్గాన్ని చూపించదు అది. కానీ యువతకు ఇది అర్థం కాదు. తప్పేం కాదనే వాధన ఒకవైపు అయితే, ప్రస్తుతం హాయిగా గడిచిపోతోందనే మూర్ఖపు ఆలోచన మరొకవైపు. ఫ్యూచర్ గురించి ఒకప్పటి తరం ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచించడం లేదనేది ఒప్పుకోవలసిన వాస్తవం. ఫలితంగా కలుగుతున్నదే భారతదేశంలో నిరుద్యోగ వ్యవస్థ. చాలా చోట్ల ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ ఇంకా పలువిధాలైన కారణాలు చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటల్లో సమర్థింపే ఎక్కువ.  కష్టపడి తత్వం గురించి అర్థం చేసుకుంటే దాని ద్వారా వచ్చే సంపాదన రుచి తెలిస్తే భారతదేశంలో యువత ఎంతో మెరుగవుతుంది. లాటరీలు, క్రికెట్ బెట్టింగ్ లు, అకౌంట్స్ హాక్ చేసి అకౌంట్స్ లో డబ్బులు కాజేయడం, స్మగ్లింగ్ వంటి పనులలో పాల్గొనడం. దొంగతనాలు, బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజడాలు. ఇలాంటివన్నీ చేస్తున్నది యువతే అంటే ఆశ్చర్యం వేస్తుంది అలాగే భారతదేశ యువత ఏ పరిస్థితిలోకి దిగజారిపోతోందో అని విచారం కలుగుతుంది.  పైగా ఇలాంటి పనులన్నీ చేయడం అవి బయటపడతాయేమో అని నేరాలు చేయడం, బెదిరించడం వంటివి  ఇంకా ఉబిలోకి నెడుతూ జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎలా సంపాదిస్తున్నాం, అందులో నిజాయితీ ఎంత అనే విషయాలపైన ఆ వ్యక్తి జీవితం ఎంత బాగుంటుంది అనేది ఆధారపడి ఉంటుంది.  దీనిగురించి జాగ్రత్తలు తీసుకోవలసింది ఖచ్చితంగా పెద్దలే. ఎందుకంటే పిల్లల అవసరాలు ఏమిటి?? వాళ్ళు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్లకు డబ్బు ఎక్కడినుండి వస్తోంది, వాళ్లెం చేస్తున్నారు వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతేతప్ప పిల్లలు అవసరాల కోసం డబ్బు అడగడం లేదు మిగిలిపోతోందిలే అనుకుంటే వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయి ఏమి మిగలకుండా తయారవుతారు. అందుకే సంపాదించే ప్రతి రూపాయి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. అది కష్టం విలువో, అవినీతి తాలూకూ గుణపాఠమో, చివరి పలితమో.  అనుభవించాల్సింది దాన్ని సంపాదించే వాళ్లే కాబట్టి ఆ సంపాదనా స్వరాన్ని కాస్త వింటూ ఉండండి. ◆ వెంకటేష్ పువ్వాడ

ఎలా బతకాలని అనుకుంటున్నారు!

  పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే! దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే! ‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది. రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు. రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది. ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు. రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు. స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా!  

వేడి టీ వల్ల క్యాన్సర్!

        చికాగుగా ఉన్నప్పుడు వేడి వేడి టీ తాగితే హాయిగా వుంటుంది అనుకునే వాళ్ళకి " జాగ్రత్త ఎక్కువ వేడి మంచిది కాదు" అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే మరీ పొగలు కక్కే టీ తాగే అలవాటు ఉన్నవారికి ఆహార నాళా క్యాన్సర్ వచ్చే అవకాశం వుందిట. చాలా వేడిగా అంటే 70 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉషోగ్రత గల టీ తాగే అలవాటు ఉన్నవారికి ఈ ప్రమాదం పొంచి వుందట. ఇరాన్ అధ్యయన బృందం తమ అధ్యాయనంలో భాగంగా ఆహారనాళా క్యాన్సర్ బారినపడిన వారితో పాటు ఆరోగ్యవంతులైన వారి టీ తాగే అలవాట్లనూ పరిశీలించారు. గోరు వెచ్చగా ఉండే టీ తాగే వారితో పోలిస్తే వేడి టీ తాగే వారిలో ఆహార నాళా క్యాన్సర్ ముప్పు రెండింతలు పెరుగుతున్నట్టు తేలిందిట. కాబట్టి మరి పొగలు కక్కే టీ కాకుండా కాస్త వేడిగా వుండే టీ తాగడం అలవాటుగా చేసుకోండి. ....రమ

లైఫ్ స్టైల్ ను ఇబ్బందిపెట్టే షుగర్ ను గుర్తించండి ఇలా!

  ఒకప్పటి కాలంలో శారీరకకష్టం ఎక్కువగా ఉండేది. అందుకే తీసుకునే ఆహారం ఎలాంటిది అయినా, ఆ ఆహారం ద్వారా శరీరానికి అందే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఏమాత్రం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శరీరంలో శక్తిని రిలీజ్ చేస్తూ కరిగిపోయేవి. అయితే శారీరక కష్టం తగ్గిపోయి కేవలం మానసికంగా మనుషులు ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో తినే ప్రతి ఆహారం చూసుకొని తినాల్సి వస్తోంది.  మనం సాధారణంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు  కలిగిన ఆహారం తిన్నప్పుడు అవి శరీరంలో చెక్కెరలుగా మారతాయి. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ఆ చెక్కెరలను క్రమబద్దం చేస్తుంది. అదే శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే శరీరంలో చెక్కరలు మెల్లిగా పెరుగుతూ పోతాయి. అదే షుగర్ సమస్యకు దారితీస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువ ఉండటం చాలా ప్రమాదకరం. షుగర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?? షుగర్ లెవల్స్ ఎక్కువ ఉండటం మొదట్లో పెద్దగా సమస్యగా ఉండకపోవచ్చు కానీ అది దీర్ఘకాలం కొనసాగితే  శరీరంలో అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. అవి క్రమంగా తమ పనితీరును మందగింపజేస్తాయి. మెదడు పనితీరు తగ్గిపోతుంది. శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ వ్యవస్థ తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న చిన్న సమస్యలకే అనారోగ్యానికి గురవడం, వాటి నుండి కోలుకోలేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు షుగర్ స్థాయిలు చాలా ఎక్కువైపోయినప్పుడు కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆ షుగర్ స్థాయిలను సులభంగా గుర్తించే కొన్ని మార్గాలు అందరికోసం.  ◆ షుగర్ స్థాయిలు అధికంగా ఉన్న వాళ్లలో అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి. మెట్లు ఎక్కగానే అలసిపోవడం, తక్కువ దూరం నడవగానే చెమటలు పట్టడం, పని ఎక్కువగా చేయలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ◆ చాలామందిలో చిరాకు కనిపించినప్పుడు మనుషుల్ని అపార్థాలు చేసుకుంటారు. అయితే చిరాకు అనేది మానసిక మరియు శారీరక అనారోగ్య సమస్య.  చక్కెర స్థాయిలు ఎక్కువైనప్పుడు కలిగే మార్పుల వల్ల మానసిక ఒత్తిడి పెరిగి చిరాకుకు దారితీస్తుంది. ◆ అతిగా దాహం వేయడం షుగర్ స్థాయిలు ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపించే మరొక లక్షణం. ఈ అతిదాహం వల్ల నీరు ఎక్కువగా టాగుతూ ఉంటారు. ◆ ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్లడం షుగర్ సమస్యకు సూచన. అతిగా దాహం వేయడం వల్ల మూత్రవిసర్జనకు వెళ్లడం కూడా అధికం అవుతుంది.  ◆ చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చూపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణం కంటే షుగర్ స్థాయిలు ఎక్కువున్నపుడు దృష్టి మందగిస్తుంది. ◆ ఆహారం విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోకపోయినా బరువు విషయంలో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ◆ జననేంద్రియం చుట్టూ విపరీతమైన దురద ఉంటుంది.  ◆ ఆయాసంగా అనిపించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ◆ అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ లకు తొందరగా గురవుతుంది.  పలితంగాఏమైనా సమస్యలు వస్తే తొందరగా తగ్గవు. ఈవిధంగా సాధారణ లైఫ్ స్టైల్ లో మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే చక్కెర స్థాయిలు మెల్లిగా పేరుకుపోయి అది జబ్బుగా మారి బోలెడు సమస్యలను సృష్టిస్తుంది.                                ◆ వెంకటేష్ పువ్వాడ.