జగన్ అడ్డగోలు విమర్శలు.. విస్తుపోతున్న వైసీపీ శ్రేణులు!
posted on Jul 29, 2024 7:10AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ సీఎం జగన్ తెలుగుదేశం కూటమి సర్కార్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా సీఎం చంద్రబాబు జగన్ ప్రస్తావించిన అంశాలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటన్నిటినీ అసెంబ్లీ వేదికగా వివరించారు. జగన్ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి బయట ఆరోపణలు చేయడం పిరికిపంద లక్షణమనీ, అసెంబ్లీకి హాజరై.. ఆ ఆరోపణలు చేసి ఉంటే నిజాలు నిగ్గు తేల్చేవాళ్లమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ధైర్యం లేకే, నిజాలను విని తట్టుకునే దమ్ము లేకపోవడం వల్లే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు.
జగన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తరువాతనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్దికి బాటలు పరుచుకున్నాయి, జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని చూసిన జనం.. చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి కోసం వేస్తున్న అడుగులను స్వాగతిస్తున్నారు. జగన్ శాంతి భద్రతల పరిస్థితిపై చేస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. 52రోజుల కూటమి పాలన దాడులు,అత్యాచారాలు,హింసాకాండ నడుస్తోందంటూ జగన్ హస్తిన వెళ్లి ధర్నా చేయడాన్ని చూసి నవ్వుకుంటున్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారం టూ జగన్ చేస్తున్న ఆరోపణలను ప్రజలే తిప్పి కొడుతున్నారు. మదనపల్లి సబ్ కలక్టరేట్ లో కీలక ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్నది ఎవరని నిలదీస్తున్నారు. రషీద్ హత్యపై జగన్ చేస్తున్న ఆరోపణలను సొంత పార్టీ వారే నమ్మడం లేదు. హంతకుడూ, హతుడూ కూడా నిన్నమొన్నటి వరకూ వైసీపీలోనే ఉన్న సంగతిని వైసీపీ వర్గాలే గుర్తు చేసుకుంటున్నారు.
చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తే, అసెంబ్లీలో వాటిపై మాట్లాడాల్సింది పోయి, సభకు డుమ్మా కొట్టి బయట నుంచి విమర్శలేమిటని నిలదీస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 36హత్యలు జరిగాయంటూ విమర్శలు చేస్తున్న జగన్.. హతుల పేర్లు ఎందుకు చెప్పడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 36 మంది హత్యకు గురైతే ఒక్క రషీద్ కుటుంబాన్నే పరామర్శించడానికి కారణమేమిటన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. మొత్తం మీద జగన్ తీరు పట్ల వైసీపీలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడతారన్న విస్మయం వ్యక్తం అవుతోంది.