శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు!
posted on Jul 29, 2024 @ 9:52AM
కృష్ణ నదీ పరివాహక ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి కిందకు నీరు విడుదల చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. మంగళవారం (జులై 30) శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి కళ రానుంది. శ్రీశైలం నుంచి వరద జలాలు సాగర్ కు చేరనున్నాయి. కర్నాటక నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండటంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
శనివారం(జులై 27) జూరాల నుంచి 3 లక్షల 12 వేల 544 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 99 వేల 736 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వదర పోటెత్తింది. శ్రీశైలం జలాశయం శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీంఎంసీలు కాగా, ప్రస్తుతం 127.5950 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే మంగళవారం (జులై 30) శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు.