ఎమ్మెల్సీగా బొత్స.. ఉపయోగమేంటి?
posted on Aug 22, 2024 @ 9:33AM
విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. వైసీపీ సీనియర్ నాయకుడ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్ వేశారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో బొత్స ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం (ఆగస్టు21)న మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాదు మండలిలో ఆయననే విపక్ష నేతగా జగన్ నియమించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అది వేరే సంగతి. తన ప్రమాణ స్వీకారం అనంతరం బొత్స సత్యనారాయణ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా, కూటమి ప్రభుత్వంపైనా వైసీపీ మార్కు విమర్శలు చేశారు. అంతే కాకుండా వైసీపీ ప్రతిష్టను మరింత దిగజార్చడానికి మాత్రమే ఉపయోగపడేలా వైసీపీ విధానం మూడు రాజధానులేనని కూడా ప్రకటించేశారు.
అలాగే తెలుగుదశం కూటమి ప్రభుత్వం అక్రమంగా తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి వేధిస్తోందనీ, అయినా భయపడమని గంభీరంగా చెప్పారు. మండలిలో ప్రజా సమస్యలపై నిలదీస్తానని చెప్పుకున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామనీ చెప్పుకున్నారు.
ఇంత వరకూ బాగానే ఉంది కానీ వాస్తవానికి అపార రాజకీయ అనుభవం, పలు మార్లు మంత్రిగా పదవులు వెలగబెట్టి, ఒక దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికకావడం గొప్ప విషయమేమీ కాదు, వాస్తవానికి ఎమ్మెల్సీగా బొత్స తనను తాను దిగజార్చుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బొత్సకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మండలికి పంపడం ద్వారా ఆయనను విశాఖలో పార్టీ నేతలకు దూరం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయ పరాభవాన్ని ఎదుర్కొన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. అదే విధంగా మండలి సమావేశాలకు కూడా వైసీపీ గైర్జాజర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి హాజరు కాలేదు. జగన్ అయితే అసెంబ్లీకి వెళ్లి తాము చేసేదీ చేయగలిగేదీ ఏమీ లేదని కుండబద్దలు కొట్టేశారు. విపక్ష హోదా ఇస్తే తప్ప సభలో అడుగు పెట్టనని తేల్చేశారు. విపక్ష హోదా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక మండలి సమావేశాలకు కూడా ఆ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. ఏదో ఇద్దరు ఎమ్మెల్సీలు మినహా మిగిలిన వారంతా జగన్ బాటలోనే నడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినా మండలిలో అడుగు పెడతారా? జగన్ అడుగు పెట్టనిస్తారా? అన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.